అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

21, డిసెంబర్ 2025, ఆదివారం

ఊరకే చూచిపోదామని

నిన్న  మా సెక్రటరీ మూర్తి ఫోన్ చేశాడు. తనేదో పనిమీద గుంటూరు వెళ్ళాడు. అక్కడ నుండి ఫోన్.

'ఒకాయన మిమ్మల్ని కలవాలంటున్నాడు' అన్నాడు.

'ఎవరాయన?' అడిగాను.

'తెలీదు. మీగురించి తన ఫ్రెండ్ చెప్పాట్ట. ఏదో పనిమీద ఒంగోలుకు వస్తున్నాడట. పనిలో పనిగా ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని చూచిపోతాడుట' అన్నాడు.

'మన పుస్తకాలు ఏవైనా చదివాడా? మన భావజాలం తెలుసా?' అడిగాను.

'పెద్దగా చదవలేదన్నాడు' అన్నాడు.

'మరెందుకు రావడం?' అడిగాను.

'ఊరకే మిమ్మల్ని ఒకసారి చూచిపోదామని వస్తున్నాట్ట' అన్నాడు.  

'రావద్దని చెప్పు. ఊరకే చూచిపోవడానికి ఇది పబ్లిక్ పార్కు కాదు. నేనేమీ దేవుణ్ణీ కాదు.  అలా ఊరకే చూచిపోవడం వల్ల తనకేమీ ఒరగదు. నాకేమో టైం వేస్టు. దానిబదులు, వచ్చినపని చూచుకొని, ఒంగోల్లో గుళ్ళూ గోపురాలూ చూచి వెనక్కు వెళ్ళడం మంచిది' అన్నాను.

'అతనికేం చెప్పమంటారు?' అడిగాడు.

'ఏముంది? గురువుగారు కలవరు. మీరు వచ్చినా ఉపయోగం లేదు. రావద్దు. అని సూటిగా చెప్పు' అన్నాను.

'బాగుండదేమో?' అన్నాడు.

' బాగున్నా బాగుండకపోయినా ఉన్న సత్యాన్ని చెప్పడం మంచిది' అన్నాను.

'సరే' అని మూర్తి ఫోన్ పెట్టేశాడు.

తీవ్రమైన జిజ్ఞాసతో సరియైన ఆధ్యాత్మికమార్గంకోసం ప్రయత్నం చేసేవారికి మాత్రమే ఇక్కడకు వచ్చినా, నన్ను కలిసినా ఉపయోగం ఉంటుంది. ఊరకే చూచిపోదామని వచ్చేవారికి, పుణ్యంకోసం వచ్చేవారికి, కాలక్షేపంకోసం వచ్చేవారికి,  కబుర్లకోసం చర్చలకోసం వచ్చేవారికి ఏమాత్రమూ ఉపయోగం ఉండకపోగా, నా టైము వారి టైము రెండూ వేస్టు అవుతాయి.

ఆశ్రమం ఇటువంటివారికోసం కాదు.

ఊరకే చూచిపోయేవారు మాకక్కర్లేదు. ఇక్కడే ఉండిపోయేవారు, సాధనామార్గంలో నడిచేవారు మాక్కావాలి.  అప్పుడే వారి జీవితానికి సార్ధకత ఉంటుంది. నిజమైన సాధకులకు దారిని చూపించి, వారిని సత్యమార్గంలో నడిపించానన్న సంతృప్తి నాకూ ఉంటుంది. ఈ రెండూ లేనపుడు వృధాకాలక్షేపం తప్ప ఇంకేమీ జరగదు.

అందుకే అటువంటివారిని ఆశ్రమానికి రావద్దని చెబుతూ ఉంటాను. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు కదూ !