Happy World Meditation Day అంటూ నిన్న ఒక శిష్యురాలు మెసేజి పంపింది.
Meditation has no special day అని తనకు రిప్లై ఇచ్చాను.
అది హైలెవల్ యోగుల స్థాయి. మనలాంటి మామూలు మనుషులకు అలా కుదరదు కదా !
ఇలా ఏదో ఒక రోజును అనుకోవడం ఆరోజున గ్రీటింగ్స్ చెప్పుకోవడం లోకుల అలవాటు. సరే మనమెందుకు కాదనడం, ఎంతో కొంత మంచిదేగా !
జూన్ 21 న వరల్డ్ యోగా డే అన్నారు. డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే అంటున్నారు. లోకాచారం ప్రకారం అలాగే కానిద్దాం. మొదటిదేమో వేసవి అయనాంతం. రెండవది శీతాకాలపు అయనాంతం. అయితే ఈ వర్గీకరణ ఉత్తరార్ధగోళానికి మాత్రమే వర్తిస్తుంది. దక్షిణార్ధగోళానికి వ్యతిరేకం అవుతుంది.
డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే గా మన దేశం సూచించింది. అనేక దేశాలు ఒప్పుకున్నాయి. UNGA (United Nations General Assembly) ఆమోదముద్ర వేసింది.
డిసెంబర్ 21, మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 21 - ఈ నాలుగూ భూగోళానికి ముఖ్యమైన రోజులు. ఏమంటే, ఈ రోజులనుంచీ ఋతువులు మారుతాయి. వ్యవసాయపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా అనుకూల/ప్రతికూల మార్పులు భూవాతావారణంలో వస్తాయి. అతిప్రాచీనకాలం నుండీ ఈరోజులను పండుగలుగా చేసుకోవడం భూమిపైన అనేక దేశాలలో అనేక సంస్కృతులలో ఆచారంగా ఉన్నది.
భూమ్మీద అందరూ చేసుకుంటున్న క్రిస్మస్ పండుగ కూడా అంతకంటే ఎంతో ప్రాచీనమైన డిసెంబర్ 21 ని క్రైస్తవం కబ్జా చేసినదే. ఆ రోజున జీసస్ పుట్టాడనడానికి ఏ విధమైన ఆధారాలూ లేవు.
అయితే, ఈ తేదీలలో పుట్టిన మహనీయులు, జ్ఞానోదయాన్ని పొందిన మహనీయులు చాలామంది చరిత్రలో ఉన్నారు. ఉదాహరణకు శారదామాత డిసెంబర్ 22 న, అంటే ఈరోజున, జన్మించారు.
మహనీయులు జన్మిస్తూనే ఉంటారు. కొన్నాళ్ళుండి పోతూనే ఉంటారు. మనమూ అంతే. కాకపోతే, పండుగలూ పార్టీలూ చేసుకోవడం కాకుండా, ఈ తేదీలవల్ల మనకు సత్యమైన ఉపయోగమేమిటి అన్నది ప్రశ్న !
ఏమీ లేదు.
ఆయా తేదీలను తమ వ్యాపారానికి అనుగుణంగా వాడుకోవడం తప్ప మనుషులు నిజంగా చేస్తున్నదేమీ లేదు. కారణం? వారిలో చిత్తశుద్ధి లేకపోవడమే. దేనినైనా, పార్టీ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవడం వారికి తెలిసిన విద్య.
మెడిటేషన్ డే కూడా అంతే !
జూన్ 21 ఒక్కరోజున కాసేపు మొక్కుబడిగా యోగా చేసి 'మనం కూడా ఏదో ఉద్ధరించాం' అనుకోవడం ఎంతటి భ్రమో, డిసెంబర్ 21 ఒక్కరోజున కాసేపు కళ్ళుమూసుకుని కూచోడం కూడా అంతే. యోగాభ్యాసమైనా, ధ్యానమైనా నీ జీవితవిధానంగా మారిపోవాలి. లేదంటే, ఊరకే మెసేజిలు పంపుకోవడం, పార్టీలు చేసుకోవడం తప్ప శరీరానికైనా మనస్సుకైనా వేరే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
జీవనవిధానమూ, ఆలోచించే తీరూ మారితే తప్ప యోగమైనా, ధ్యానమైనా శాశ్వతఫలితాలు చూపించవు. చాలామంది మనుషులకు చేతకానిదే అది !
పోనీలే ఇన్నాళ్ళకైనా అంతర్జాతీయంగా కనీసం ఒక గుర్తింపు వచ్చింది. చీమయాత్రలో ఒక అడుగు ముందుకు పడింది.
సంతోషం !
వాస్తవాలెలా ఉన్నా, కాస్త పాజిటివ్ గా నటిద్దాం !