ఇప్పటిదాకా నేను ప్రధానమైన వేదాంతోపనిషత్తులను, యోగోపనిషత్తులను వ్యాఖ్యానించి మా సంస్థనుండి పుస్తకములుగా ప్రకటించాను. కానీ శక్తిప్రధానములైన ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును వ్రాయలేదు. ఆ పనిని ఇప్పుడు చేశాను. ఆ వివరమంతా ఈ గ్రంధపు ముందుమాటలో చర్చించాను.
దీనిలో 1. కౌలోపనిషత్తు 2. త్రిపురా మహోపనిషత్తు 3. భావనోపనిషత్తు 4. అరుణోపనిషత్తు 5. బహ్వృచోపనిషత్తు 6. కాళికోపనిషత్తు 7. తారోపనిషత్తు 8. సరస్వతీ రహస్యోపనిషత్తు 9. త్రిపురాతాపినీ ఉపనిషత్తు 10. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులకు నా వ్యాఖ్యానం మీకు లభిస్తుంది.
ఇవి, నాలుగువేదములనుండి తీసుకున్నవి అయినప్పటికీ, అధర్వణవేదం నుండి ఎక్కువగా ఉన్నాయి. తంత్రప్రధానములైన ఉపనిషత్తులు దానిలోనే మనకు కనిపిస్తాయి.
బ్లాగులో వ్రాతలను నేను బాగా తగ్గించినప్పటికీ, రచనావ్యాసంగానికి మాత్రం చుక్కపెట్టలేదు. ఉన్నతభావ సంప్రేరితములైన ప్రాచీనగ్రంథముల అధ్యయనము, వ్యాఖ్యానము, సాధన మరియు బోధనలు నిరాఘాటంగా మా ఆశ్రమంలో కొనసాగుతూనే ఉన్నాయి. అవే లేకపోతే, ఈ చెత్తలోకంలో చెత్తమనుషుల మధ్యన మనం మనుగడ సాగించేదెలా మరి?
నేను సమాజానికి దూరంగా ఉంటున్నప్పటికీ, నిజమైన సాధకులకు మా ఆశ్రమం తలుపులు మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.
ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. యధావిధిగా ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
ఆగస్టు 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవం సమయానికి దీనితోబాటు మరికొన్ని మా అముద్రిత గ్రంధాలను ముద్రించి, మా స్టాల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.
మా మిగతా గ్రంధాలలాగా దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.