“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఏప్రిల్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర - 6 (ఓంకారం లేనేలేదు)

ప్రతి శనివారం పంచవటి సభ్యులకు ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది. నిన్న అమెరికానుంచి ఆ మీటింగ్ లో మాట్లాడుతూ ఉండగా ఒక సభ్యుడు చెప్పిన విషయం నన్ను నిర్ఘాంతపరిచింది.

ఈ మధ్యన బాగా ప్రచారం లోకి వస్తున్న ఒక గురువుగారు తన శిష్యులతో అసలు ఓంకారమే లేదనీ ఆ శబ్దం ఓంకారం కాదనీ అది 'అం' అనీ దానిని అలాగే జపం చేయాలనీ చెప్పి ఉపదేశాలు చేసేస్తున్నాడట. ఆ గొర్రెలు అలాగే ఫాలో అవుతున్నాయట. ఇది నిజమేనా అని నాకు ప్రశ్న సంధించ బడింది.

నాకు ఆ గురువు మీద పిచ్ఛ కోపమూ, ఆయన శిష్యులమీద విపరీతమైన జాలీ, వెరసి ఈ గోల మొత్తం మీద మహా అసహ్యమూ ఒకే సారి కలిగాయి. 

మహనీయులైన ప్రాచీనులందరూ ఓంకారాన్ని ' ఓమ్' అనే శబ్దంగానే చెప్పారు. అంతేగాని దాన్ని 'అం' అని పలకమని ఎక్కడా చెప్పలేదు.ధ్యానపు లోతులలో వినవచ్చే దాని శబ్దస్పందన అలా ఉండదు కూడా.

ఓంకారం లోని మూడు మాత్రలనూ విడివిడిగా ఉపాసించే విధానం మాండూక్యోపనిషత్తులో నిర్దేశించబడింది. కానీ ఓం శబ్దం అసలు లేనే లేదనీ అది 'అం' అనీ ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు.

ఈనాటి రోజుల్లో ఇలాంటి పిచ్చి గురువులు తయారై జనాలను తప్పుదోవ పట్టిస్తూ మన సాంప్రదాయానికీ, ధర్మానికి విరుద్ధమైన పిచ్చి దారులలో వారిని తీసుకెళుతున్నారు. ఆ ఊబిలో పడేవాళ్ళు పడుతున్నారు. వాళ్ళ ఖర్మ అలా ఉంది. మనమేం చెయ్యగలం?

ఈ గురువుగారు రజనీష్ బోధనలను పక్కాగా కాపీ కొడుతూ ఎక్కడా రజనీష్ పేరు చెప్పకుండా వాటికి తన  బ్రాండు ముద్ర వేసి జనాన్ని బాగా బోల్తా కొట్టిస్తున్న ఘనాపాటీ. అసలు రజనీషే ఒక ఓడిపోయిన గురువు (failed guru). రజనీష్ స్వయానా జైన్ అయి ఉండీ, మొదట్లో జైన మహావీరుని బోధనలను కాపీ కొట్టి జనానికి బోధించిన వాడై ఉండీ తర్వాత్తర్వాత బుద్ధుని బోధనలను కాపీ కొట్టడం మొదలు పెట్టినవాడు. అందుకే ఒకవిధమైన నాస్తిక అవైదిక వాదాన్ని ఆయన బోధనలలో మనం గమనించవచ్చు.

ఇక పోతే ఈ గురువుగారేమో, రజనీష్ ను కాపీ కొడుతూ, రామాయణమూ భాగవతమూ చదవొద్దు, ఓంకారం అసలు లేనేలేదు మొదలైన చెత్త బోధనలను తన శిష్యులకు చెబుతున్నాడు.ఇదంతా ఎంత మహా పాపమో చెబుతున్న ఆయనకూ స్పృహ లేదు, గుడ్డిగా అనుసరిస్తున్న ఆయన శిష్యులకూ లేదు.

ఈజిప్ట్ పిరమిడ్ సమాధులను ఊరూరా కట్టించిన ఇంకో గురువుగారు అసలు దేవుడనేవాడు లేనేలేడని, శ్వాసే దేవుడని, అనాపానసతి అనే బుద్ధుని సాధనను, చెత్త బోధనలను నిన్నటిదాకా ప్రచారం చేసాడు.కొంతమంది పీఠాధిపతులూ, నిజమైన గురువులూ బాగా గడ్డి పెట్టాక ఇప్పుడు ఆ బోధనలు మార్చుకుని దేవుడున్నాడని అంటున్నాడు. ఇలా రోజుకొక బోధనలు మార్చుకుంటూ పొయ్యేవాళ్ళకు అసలు సత్యం తెలుసనుకోవాలా తెలియదనుకోవాలా? వీళ్ళు లోకానికి గురువులా? ఎంత ఖర్మరా బాబూ?

అవైదిక మార్గాన్నీ అనాత్మవాదాన్నీ ప్రచారం చేసి భారతదేశం నుంచి కనుమరుగై పోయిన బుద్ధుని బోధనలను వీళ్ళు కాపీ కొట్టి తమ బ్రాండు ముద్ర వేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. లోతుగా చూస్తే వీళ్ళు ఏమి మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియదు. వీళ్ళను నమ్మిన అనుచరులు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారో వాళ్లకూ తెలియదు.

ఇలాంటి గురువులనూ శిష్యులనూ ఉద్దేశించి వేదం ఇలా చెప్పింది.

'తమకే అంతా తెలుసునన్న భ్రమలో మునిగిన వీరు (రోజుకొక పనికిమాలిన బోధనను ప్రచారం చేస్తూ) వారి శిష్యులను తప్పుదారిన నడిపిస్తూ ఉంటారు. గ్రుడ్డివారు నడిపితే నడచి గ్రుడ్డివారి వలె చివరకు వీరిద్దరూ కలసి గుంటలో పడతారు.'

ఇలాంటి వారిని ఉద్దేశించెనేమో బ్రహ్మంగారు - 'కలియుగంలో వీధికి పదిమంది నకిలీ గురువులు తామర తంపరలుగా పుట్టుకొస్తారు గాని వీరిలో ఎవరిదగ్గరా సత్యజ్ఞానం ఉండదు. వీరిని నమ్మినవారు నట్టేట్లో మునుగుతారు.' అని స్పష్టంగా తన కాలజ్ఞానంలో చెప్పాడు.

అంతా కలిప్రభావం !!

ఈ విషయం నాకు చెప్పినాయన ఇంకా ఇలా అన్నాడు.

' మా ఫ్రెండ్ ఒకాయన ఈ గురువు చెప్పిన 'అం' కార జపసాధన చేస్తున్నాడు. అతన్ని మీదగ్గరకు తెస్తాను. మా గురువుగారి దగ్గర దీక్ష తీసుకుని సాధన చెయ్యి ఎంత త్వరగా నీకు రిజల్ట్స్ కనిపిస్తాయో నువ్వే చూడు అని అతనితో చెప్పాను.'

నేనిలా అన్నాను.

"వద్దు. అలాంటివాళ్లను నాదగ్గరకు తేవద్దు. ఆ గురువుల బోధనల కంటే నా సాధనలు ప్రభావవంతములని ఒకరికి నిరూపించవలసిన అవసరం నాకు లేనేలేదు. నా మార్గాన్ని నేను ప్రూవ్ చేసుకోవలసిన ఖర్మ నాకు లేదు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అలా రారు. వాళ్లకు సత్కర్మ పరిపాకం ఉంటే అమ్మే వాళ్ళను నాదగ్గరకు తీసుకొస్తుంది. అంతేగాని ప్రచారం వల్ల ఇది జరగదు.అతన్ని బలవంతంగా నా దగ్గరకు తేవద్దు. అతని తప్పుదారిలోనే అతన్ని పోనీ. గుంటలో పడనీ. అది అతని ఖర్మ. మనకు సంబంధం లేదు. ఎవరుబడితే వాళ్లకు నేను దీక్షలూ ఇవ్వను. అందర్నీ ఉద్దరించాలని నాకు దురదగానూ లేదు.నాశనం అయ్యేవాళ్ళను అవ్వనీ. సత్యమార్గాన్ని చూపించి వాళ్ళను రక్షించాల్సిన పని మనకు లేదు."

హంసల గుంపులోకి ఒక కాకో కొంగో పొరపాటున దూరినా అది ఎంతకాలం ఉండగలుగుతుంది? ఇదీ అంతే !

కాకులు కాకుల గుంపులోనూ, కొంగలు కొంగల గుంపులోనూ, హంసలు హంసల గుంపులోనూ కలుస్తాయని నేను తరచూ చెప్పే మాట అక్షరసత్యం అని ఇలాంటి ఉదంతాలు మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తున్నాయి కదూ !!