“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఏప్రిల్ 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - 18 (Ganges spiritual retreat)

ఈ నెల 28,29,30 తేదీలలో మిషిగన్ గాంగెస్ లో మూడు రోజులపాటు స్పిరిట్యువల్ రిట్రీట్ జరుపబోతున్నాను. దీనికి అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి నా శిష్యులు రాబోతున్నారు.

ఈ మూడు రోజులూ చాలా పవిత్రమైన రోజులు. అక్షయ తృతీయ (పరశురామ జయంతి), శంకర జయంతి, రామానుజ జయంతి ఈ మూడురోజులలో వరుసగా వచ్చాయి.

ఈ మూడు రోజులూ నా శిష్యులందరికీ నాతో కలసి నివసించే అవకాశం, నాతో పర్సనల్ గా మాట్లాడి వారి సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతున్నాయి. అంతేగాక నా "ఆరా" ను డైరెక్ట్ గా ఫీల్ అయ్యే అవకాశం వీరికి లభిస్తున్నది. ఎందుకంటే నా వ్రాతలు చదివి నన్ను అర్ధం చేసుకోవడం సాధ్యం కాని పని. అసలైన "నేను" ఏమిటో తెలియాలంటే నాతో కలసి కొన్నాళ్ళైనా జీవించడమే మార్గం, వేరే దారి లేదు.

ఈ మూడు రోజులూ వేరే ఆలోచనలూ వేరే సంభాషణలూ లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జప ధ్యాన యోగ సాధనలను వీరికి నేర్పించ బోతున్నాను. ఈ సాధనలు చాలా అరుదైనవి. దాదాపుగా నలభై ఏళ్ళ నా సాధననూ అనుభవాన్నీ అమ్మవారి కృపనూ నా గురువుల అనుగ్రహాన్నీ క్రోడీకరించి నేను తయారు చేసుకున్న నా పర్సనల్ యోగసాధనా మార్గాన్ని వీరికి అరచేతిలో పెట్టి ఇవ్వబోతున్నాను.

వీరందరూ గత మూడు నాలుగు అయిదేళ్లుగా నన్ను గమనిస్తూ నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నవాళ్ళు. నేనేంటో తెలిసినవాళ్ళు. నాతో నడవడానికి సిద్ధపడి నా దగ్గరకు వచ్చినవాళ్ళు. అందుకే వీరిని ఈ సారి ఈ రిట్రీట్ కు స్వీకరించాను. వీళ్ళంతా చాలా అదృష్టవంతులని వేరే చెప్పనవసరం లేదుకదా !!

ఇకపోతే, దగ్గరలోనే ఉండి కూడా నన్ను కలవలేక పోయినవాళ్ళు, నాతో నడవలేక పోయినవాళ్ళు చాలా దురదృష్ట వంతులు.వాళ్ళొక గోల్డెన్ చాన్స్ మిస్ అవుతున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల వారా విషయాన్ని గ్రహించ లేకపోతున్నారు. ఆ కారణాలు అహం కావచ్చు, భయం కావచ్చు, సంకోచం కావచ్చు, చులకన భావం కావచ్చు, లేదా కోపం కావచ్చు ఇంకేదైనా కావచ్చు. వీటిలో ఏదైనప్పటికీ రిజల్ట్ మాత్రం ఒకటే. వాళ్ళు ఒక సువర్ణ అవకాశాన్ని చేజేతులా వదులుకుంటున్నారు. ఎందుకంటే - నా దగ్గర దొరికే ఆధ్యాత్మికత వారికి ప్రపంచంలో ఇంకే గురువు దగ్గరా దొరకదని నేను ఘంటాపధంగా చెప్పగలను.

పైన చెప్పిన నెగటివ్ ఫీలింగ్స్ ను వదుల్చుకోనిదే ఎవరూ కూడా నా దగ్గరకు రాలేరు. నా శిష్యులు కాలేరు. వారి జీవితాలను నిజమైన దివ్యత్వం లోకి వికసింప చేసుకోలేరు. ఎప్పటికైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళంతట వాళ్ళు తగ్గి నా దగ్గరకు రావలసిందే గాని నా అంతట నేను వారిని దగ్గరకు తీసుకోను. అది జరిగే పని కాదు.

మనుషులకు చెరువుతో అవసరం ఉన్నది గాని చెరువుకు మనుషుల అవసరం లేదు. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం?

వినేవారికి కొంచం సెల్ఫ్ డబ్బాలా అనిపించినా సత్యాన్ని చెప్పక తప్పదుకదా మరి. వినేవారు చెవిటి వారైనప్పుడు శంఖాన్ని చాలా గట్టిగా ఊదవలసి ఉంటుంది. ఎదుటివారు మొండి వారైనప్పుడు అవసరమైతే కొట్టి మరీ నేర్పించవలసి ఉంటుంది. అదే ప్రస్తుతం నేను చేస్తున్న పని.

గాంగెస్ స్పిరిట్యువల్ రిట్రీట్ కు వస్తున్న నా శిష్యులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ భగవద్గీత నుంచి ఈ శ్లోకాన్ని వారికి గుర్తు చేస్తున్నాను.

"నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యాస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్" 
(భగవద్గీత 2-40)

"ఈ సాధనలో క్రమనాశము, ప్రత్యవాయము మొదలైన దోషములు లేవు. కొద్దిగానైనా ఈ సాధనను చెయ్యి. మహా భయాన్నించి కూడా ఇది నిన్ను రక్షించగలదని నీవే తెలుసుకుంటావు."