నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, ఏప్రిల్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 20 (కారు తాళాలను కనిపెట్టిన ప్రశ్న తంత్రం)

Prashna Chart at 10.29 AM. Auburn Hills, MI, USA
రేపే గాంగేస్ రిట్రీట్. అందుకని బట్టలు సర్దుకునే పనిలో ఉండగా ఒక శిష్యురాలు ఆఫీసు నుంచి హడావుడిగా వెనక్కు వచ్చింది. ఉదయం నేను లేచేసరికి కొంచం ఆలస్యం అయ్యింది. అప్పటికే తను లేచి పనులన్నీ ముగించుకుని ఆఫీస్ కు వెళ్ళిపోయింది. కానీ తన కారు తాళాలు ఎక్కడ ఉన్నాయో అర్ధం కాక ఇంకొక కారేసుకుని ఆఫీసుకు వెళ్ళింది.నిన్న మామూలుగా ఉంచే చోటే వాటిని ఉంచానని అనుకుంది.కానీ అవి అక్కడ కనిపించలేదు. ఇల్లంతా వెదికినా ఎక్కడా అవి దొరకలేదు. ఒక పక్క ఆఫీసుకు లేటౌతుంది. అందుకని ఇంకో శిష్యురాలి కారేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ పదిన్నర ప్రాంతంలో వెనక్కు వచ్చి మళ్ళీ ఇల్లంతా వెదుకుతోంది. ఏంటి అనడగితే ఈ స్టోరీ చెప్పింది. ఇప్పుడా కారు తాళాలు దొరికితే సరే సరి లేదా ఇన్స్యూరెన్స్ వారికి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి డూప్లికేట్ కీస్ ఇస్తారు. అదొక పెద్ద తతంగం.

తాళాలు దొరికిన వాయవ్య దిక్కులోని పేము బుట్ట
ఇలాంటి సమయాల లోనే మనం ప్రశ్నశాస్త్రపు సహాయం తీసుకోవాలి. నిత్యజీవితంలో మనకు దిక్సూచిగా ఉపయోగపడటమే కదా జ్యోతిశ్శాస్త్రపు ఉపయోగం? లేదంటే ఇంత కష్టపడి నేర్చుకున్నది ఎందుకు?

వెంటనే మనస్సులో గ్రహచక్రం వేసి చూచాను. ఇలా చెయ్యాలంటే, ప్రతిరోజూ గ్రహచలనాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఆకాశంలో ఏ గ్రహం ఎక్కడ ఉన్నదో మనకు పంచాగం చూడకుండానే తెలిసిపోతూ ఉంటుంది.

ప్రస్తుతం బుధుడు వక్రస్తితిలో ఉన్నాడు. ఇలాంటి సమయాలలో చాలామంది అనేక విషయాలు మర్చిపోతూ ఉంటారు. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చెయ్యవలసి రావడం, వెనక్కూ ముందుకూ తిరగడం, వస్తువులు పెట్టిన చోటు మరచిపోయి వెదుక్కోవడం, పనులు త్వరగా కాక చికాకు పెట్టడం మొదలైన పనులు ఇప్పుడు అనేక మంది జీవితాలలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇది సహజమే. పైగా ప్రస్తుతం అమావాస్య నీడలో మనం ఉన్నాము. ఇంకేం కావాలి?

ప్రశ్నచక్రాన్ని పైన ఇచ్చాను.

మిధున లగ్నం ఉదయిస్తూ జాతకురాలి యొక్క మానసిక ద్వైదీభావాన్ని సూచిస్తున్నది. రవాణాసంబంధమైన ప్రశ్న అని చంద్రుడు లాభస్తానంలో వక్రబుధునితో కూడి ఉండి సూచిస్తున్నాడు. ఆయనకు వచ్చిన ద్వితీయాధిపత్యం కూడా దీనినే సూచిస్తున్నది. ఎలా? ఇది తృతీయానికి ద్వాదశం అవుతూ రవాణా సంబంధమైన వస్తువులు పోయాయని సూచిస్తున్నది.

కానీ తృతీయాదిపతి అయిన సూర్యుడు లాభంలో ఉచ్చస్థితిలో ఉంటూ వస్తువు దొరుకుతుంది అని సూచిస్తున్నాడు. ఒక శుభగ్రహం గురువుగారు కేంద్రంలో ఉండి వెంటనే దొరుకుతుంది అని చెబుతున్నాడు.ఇంకొక శుభగ్రహమైన శుక్రుడు దశమ కేంద్రంలో ఉచ్చస్థితిలో బలంగా ఉంటూ మళ్ళీ ఇదే చెబుతున్నాడు. తృతీయంలో రాహువు ఉంటూ, మరపునూ మాయనూ సూచిస్తున్నాడు.

ఇప్పుడు ఆ తాళాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి.

లగ్నం రెండవ ద్రేక్కాణంలో ఉంటూ అవి ఇంట్లోనే ఉన్నాయని చెబుతున్నది.కనుక ఏ దిక్కులో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.

'అన్ని చోట్లా వెదికారా?' అడిగాను.

'మామూలుగా వాటిని పెట్టే అన్ని చోట్లా వెదికాము' అని జవాబు వచ్చింది.

ఒకసారి మన ఫ్రెండ్ కర్ణపిశాచి సహాయం తీసుకుందామని దాన్ని స్మరించాను.

వెంటనే మనో ఫలకం ముందు అది నవ్వుతూ కనిపించింది.

'తాళాలు ఎక్కడున్నాయి?' అడిగాను.

'ఏమో నాకేం తెలుసు? ప్రశ్నతంత్రం చూస్తున్నావుగా. చూడు.' అని కొంటెగా నవ్వుతూ అది మాయమై పోయింది.

'నీ పని ఇలా ఉందా? సరే నీ సంగతి తర్వాత చెప్తా ఉండు.' అనుకుంటూ మళ్ళీ ప్రశ్న చక్రం మీద దృష్టి సారించాను.

లాభస్థానంలో మూడు గ్రహాలున్నాయి - చంద్రుడు సూర్యుడు బుధుడు. వీరిలో బుధుడు బాల్యావస్థలో ఉంటూ మెంటల్ కన్ఫ్యూజన్ ను సూచిస్తున్నాడు. సూర్యుడు బలంగా యువావస్థలో ఉంటూ వెంటనే తాళాలు దొరుకుతాయని చెబుతున్నాడు. చంద్రుడు వృద్ధావస్థలో అమావాస్య చాయలో ఉండి మళ్ళీ మెంటల్ షాడో ను సూచిస్తున్నాడు.

సూర్య చంద్ర బుధులు వరుసగా తూర్పు, వాయవ్య, ఉత్తర దిక్కులకు సూచకులు. ఈ మూడూ ఒకే గీతమీద ఉంటాయి కనుక పని సులభం అయింది. ఇంటికి తూర్పున గోడ ఉంది. అక్కడ ఒక టీవీ స్టాండ్ ఉంది దానిమీద తాళాలు లేవు.

ఇకపోతే ఉత్తరాన సోఫా ఉన్నది. అక్కడ తాళాలను ఉంచే చాన్స్ లేదు. అయినా సరే, సోపాలో ఒకసారి వెదికాను. అక్కడ లేవు. ఇక మిగిలింది వాయవ్య దిక్కు. ఆ దిక్కులో ఒక పేముతో అల్లిన బుట్ట ఒకటి ఉన్నది. అందులో కొన్ని పుస్తకాలు కాగితాలు పెట్టి ఉన్నాయి. బుధుడు పుస్తకాలకు కాగితాలకు సూచకుడు కనుక ఇందులో ఉండాలి.

పైనున్న కాగితాలను కొంచం తొలగించి చూడగా ఆ బుట్టలో ఒక మూల తాళాలు కనిపించాయి. వెంటనే వాటిని తీసుకుని వెళ్లి మేడమీద అంతా కంగారుగా వెదుకుతున్న శిష్యురాలికి అందించాను.

'థాంక్యూ వెరీమచ్ ! ఎక్కడున్నాయి. ఎలా దొరికాయి?' అడిగింది తను సంతోషంగా.

'కొన్ని కొన్ని మీరు అడక్కూడదు నేను చెప్పకూడదు అంతే' అన్నాను నవ్వుతూ.

'వీటికోసం పొద్దుట నుంచీ ఇల్లంతా వెదుకుతున్నాం. భలే తిప్పలు పెట్టాయి. సరే వస్తా. ఆఫీస్ కి వెళ్ళాలి.' అంటూ తన కారేసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయింది తను.

తాళాలు దొరికాయి సరే ! అసలు ఏ టీపాయ్ మీదనో, ఇంకెక్కడో వాటిని మామూలుగా ఉంచే చోటనుంచి ఆ తాళాలు మూలనున్న పేముబుట్టలోకి ఎలా వెళ్ళాయి అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వెశ్చన్ !!

ఆలోచిస్తున్న నాకు కర్ణపిశాచి చిలిపి నవ్వు చెవులలో వినిపించింది. అమ్మ దొంగా ఇది నీ పనా అనుకున్నా !

అమావాస్య చాయలో వాటికి బలం పెరుగుతుంది అంటే ఇదేనేమో ! దీని దుంప తెగ ! దీనికి కూడా ప్రాక్టికల్ జోక్సా? అదికూడా నామీదా, నా చుట్టూ ఉన్న వాళ్ళ మీదనా??

'ఏం మీకేనా సెన్సాఫ్ హ్యూమర్? మాకుండకూడదా?' అంటూ దాని నవ్వు మళ్ళీ చెవుల్లో వినిపించింది.

నవ్వొచ్చింది. దాన్ని క్షమించేశాను.

ఏదేమైతేనేం? ప్రశ్నతంత్రం మళ్ళీ ఇలా ఉపయోగపడింది.ఈ విధంగా నిత్యజీవితంలో దిక్సూచిగా జ్యోతిష్య శాస్త్రాన్ని వాడుకోవాలి.