“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

4, ఏప్రిల్ 2016, సోమవారం

FACEBOOK అంటే శనీశ్వరుడే - Part 2

అసలు ఇంటర్ నెట్ అనేదే రాహువుకు సూచిక.రాహువు చేతిలో చిక్కుకున్న మామూలు మనిషి ఇక బయటకు పోవడం అసాధ్యం.అది జరిగే పనే కాదు.ఆధ్యాత్మికంగా దైవానుగ్రహం ఉంటే మాత్రమే అలా తప్పుకోగలగడం సాధ్యమౌతుంది.మిగతా వారికి సాధ్యం కాదు.

ఒకరి జాతకంలో రాహుకేతువులు వికటిస్తే (ఈ వికటించడం అనేది రకరకాలుగా,ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది) వారు ఆ జాతకుడిని పెట్టే ముప్పుతిప్పలు మామూలుగా ఉండవు.ప్రత్యక్షనరకం అంటే ఎలా ఉంటుందో ఈ లోకంలోనే వాళ్ళు మనిషికి రుచి చూపిస్తారు.ఈ ఇంటర్ నెట్ మాయాజాలంలో చిక్కుకున్న వాడు పడే బాధలు కూడా అలాగే మహా ఘోరంగా ఉంటాయి.

ప్రతి మాయాజాలానికీ రాహువే కారకుడు.ప్రతిబింబాలకూ, ఉన్నది లేనట్లు భ్రమింపజేసే భ్రమలకూ రాహువే కారకుడు.రాహువుకు మాయావి అని పేరు కూడా ఉన్నది.ఇంటర్ నెట్ అనేది 'వర్చువల్ రియాలిటీ' అంటే 'మాయా ప్రపంచం'.ఈ మాట రాహువుకు చాలా ఖచ్చితంగా సరిపోతుంది.ఎందుకంటే మాయా ప్రపంచాధినేత రాహువే.

"శనివత్ రాహు:" అనే సూత్రం గురించి నేను చాలాసార్లు పాత పోస్టులలో వ్రాశాను.రాహువూ శనీ మంచి స్నేహితులు.వారు ఒకరి పనిని ఇంకొకరు చక్కగా పంచుకుంటూ ఈ లోకాన్నీ లోకంలోని మనుషుల్నీ నడిపిస్తూ ఉంటారు.మాయలో పడేస్తూ ఉంటారు.కొన్ని ఉదాహరణలు చూస్తె ఈ సూత్రం ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఫేస్ బుక్ నేపధ్యంలో ఎంత నిజమో అర్ధమౌతుంది.

ఫేస్ బుక్ సృష్టి కర్త అయిన మార్క్ జుకర్ బర్గ్ జాతకం చూద్దాం.ఈయన 14-5-1984 న white plains New York లో జన్మించాడు.జనన సమయం తెలియదు.తెలియాల్సిన అవసరం కూడా లేదు.ఎందుకంటే నేను నిజంగా చూడాలని భావిస్తే జనన సమయం లేకుండా కూడా ఒకరి జాతకం చూడగలను.అర్ధం చేసుకోగలను. కానీ ప్రస్తుతం మనం ఈయన జాతకాన్ని విశ్లేషణ చేయ్యబోవడం లేదు.ఈయన జాతకంలో శని రాహువుల బలం మాత్రమే గమనిస్తాం.

రాహువు ఈ జాతకంలో ఉచ్ఛస్థితిలో అందులోనూ భావమధ్యంలో చాలా బలంగా ఉండటం గమనించవచ్చు.నవాంశలో కూడా ఈయన ఉచ్చస్తితిలోనే ఉండి వర్గోత్తమాంశలో ఉన్నాడు.కనుక చాలా బలంగా ఉన్నాడు.ఇక శనీశ్వరుడిని చూస్తే, ఆయన ఉచ్ఛ స్థితిలో వక్రించి ఉండి చాలా బలంగా ఉన్నాడు.పైగా దశాంశలో ఈయన నీచస్థితిలో ఉంటూ లోకంతోనూ లోకులతోనూ ఈయనకున్న బలమైన కర్మఋణాన్ని సూచిస్తున్నాడు. కనుక శనిరాహువులు ఈయన జాతకంలో చాలా బలంగా ఉన్నారు.

కనుకనే వారిద్దరి ఆయుధమైన FACEBOOK ను మొదలు పెట్టి కోట్లాది మనుషులను ప్రపంచవ్యాప్తంగా మాయతో కట్టిపడేశాడు.నేడు అమెరికాతో సహా ప్రతి దేశంలోనూ మనుషులు FACEBOOK అనే వ్యసనానికి రోజు రోజుకీ బానిసలుగా మారుతున్నారు.నేడు ప్రపంచవ్యాప్తంగా ముదురుతున్న వ్యసనం త్రాగుడూ,జూదమూ,డ్రగ్సూ కాదు.FACEBOOK మాత్రమే అంటే అతిశయోక్తి కాబోదు.

ఇకపోతే దీనితో సమానమైన ఇంకొక వ్యసనం WHATSAPP ను పరిశీలిద్దాం.దీనికి కూడా 8 అక్షరాలే ఉన్నాయి.కనుక ఇది కూడా శనీశ్వరునికి బలమైన ఆయుధమే.ప్రస్తుతం ప్రపంచ జనాభా అంతా శనిరాహువుల ఈ రెండు పాశాలకే కట్టుబడిపోయి ఉన్నది.

WHATSAPP సృష్టి కర్త అయిన బ్రయాన్ యాక్టన్ జాతకాన్ని గమనిద్దాం.ఈయన 24-2-1972 న మిచిగన్ లో జన్మించాడు.ఈయన జాతకంలో కూడా శని చాలా బలంగా వృషభరాశిలో ఉన్నాడు. వృషభరాశికి శని యోగకారకుడు. నవమాధిపతి.అయితే అదే నవమంలో రాహువు మకరంలో ఉంటూ శనిని సూచిస్తూ ఆయనకు బలాన్ని ఆపాదిస్తున్నాడు.రాహువు మకరంలో ఉండటం వల్ల ఈయన జాతకంలో వీరిద్దరికీ విపరీతమైన బలం వచ్చింది. దశాంశలో రాహుకేతువులు నీచలో ఉంటూ కర్మ (వృత్తి) పరంగా ఈయనకు లోకంతో గల గట్టి అనుబంధాన్ని సూచిస్తున్నారు.వెరసి ఈయన జాతకంలో కూడా శనిరాహువులు బలంగా ఉన్నారు.

ఇప్పుడు WHATSAPP ఇంకొక సృష్టికర్త అయిన జాన్ కోమ్ జాతకాన్ని పరిశీలిద్దాం.ఈయన 24-2-1976 న ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో జన్మించాడు.ఈయన జాతకంలో కూడా శని రాహువులు బలంగానే ఉన్నప్పటికీ, బ్రయాన్ యాక్టన్ జాతకంలో ఉన్నంత బలంగా లేరు.అందుకనే బ్రయాన్ యాక్టన్ కు వచ్చినంత పేరు ఇతనికి రాలేదు.ఇతని రాశిచక్రం కంటే దశాంశ చక్రం బలంగా ఉన్నది.అంటే వృత్తికి చాలా బలం వచ్చింది.అందులో శని నీచలో వక్రించి ఉన్నాడు. రాహుకేతువులు ఉచ్చస్థితిలో ఉన్నారు.కనుక వృత్తిపరంగా మళ్ళీ లోకంతోనూ ప్రజలతోనూ చాలా గట్టి సంబంధాన్ని ఇచ్చారు.కోట్లాది జనంతో పరోక్షంగా సంబంధాన్ని కలిగించారు.


ఈయన దశాంశకూ మార్క్ జుకర్ బర్గ్ దశాంశకూ గల సంబంధం ఎంత ఆశ్చర్యంగా ఉందో గమనించండి.ఇద్దరికీ దశాంశలో శని నీచలోనూ రాహుకేతువులు ఉచ్చలోనూ ఉన్నారు.పైగా ఇద్దరికీ శని వక్రించి ఉన్నాడు.కనుకనే కోట్లాది మందికి ఉపయోగపడే రెండు యాప్స్ ను సృష్టించగలిగారు.ఎనిమిదేళ్ళ తేడాతో పుట్టిన వారి జాతకాలలో కూడా గ్రహాలు ఒకే పొజిషన్ లో ఉండటం ఎంత విచిత్రమో జ్య్తోతిష్య విద్యార్ధులు మాత్రమే అర్ధం చేసుకోగలరు.

ఇప్పుడు ప్రాక్టికల్ గా చూచారు కదా, ఫేస్ బుక్, వాట్స్ అప్ ల సృష్టికర్తల జాతకాలలో శనిరాహువులు ఎంత బలంగా ఉన్నారో? కనుక వీటికీ శనిరాహువులకూ గల సంబంధం ఏమిటో ఇప్పుడు అర్ధమైంది కదా?

ఇందులో ఉన్న ఇంకొక మర్మాన్ని ఇప్పుడు చెబుతాను వినండి.వాటిని సృష్టించిన వారిని అలా ఉంచి, ఆ యాప్స్ ను వాడే వారి మీద వీరి ప్రభావం ఎలా ఉంటుందో చెబుతాను వినండి.

ఎవరి జాతకంలో అయితే శనిరాహువులు బలంగా ఉంటారో వాళ్ళు ఫేస్ బుక్ వాట్స్ అప్ మొదలైన ఇంటర్ నెట్ వ్యసనాలకు బానిసలు కారు.అదే శనిరాహువులు వీరిని ఆ వ్యసనాల బారిన పడకుండా రక్షిస్తారు.ఎందుకంటే వారి జాతకాలలో వీరిద్దరూ బలంగా ఉన్నారు గనుక వారి దుష్ప్రభావాల నుంచి రక్షిస్తారు.సొంతమనుషులను ఎవరూ పాడు చేసుకోరు కదా. అలాగన్నమాట.ఒకవేళ ఇలాంటి శనివర్గ జాతకులు వీటిని వాడినా కూడా, వాటిని ఎంతవరకో అంతవరకే వాడుకుని లాభపడతారే గాని నష్టపోరు.

దీనికి రివర్స్ గా, ఎవరి జాతకాలలో అయితే శనిరాహువులు బలంగా లేరో, అంటే నీచస్థితిలోనూ ఇంకా ఇతర రకరకాల బలహీన స్థితులలోనూ ఉన్నారో,లేదా ఎవరికైతే వీరిద్దరూ పాపులో(అంటే చెడు చేస్తారో) వాళ్ళు ఈ రెంటికీ చాలా తేలికగా లొంగిపోతారు.వాటినుంచి బయట పడలేరు.డ్రగ్స్ కంటే భయంకరంగా వీటిలో కూరుకుపోతారు.పొద్దున్న లేవడం లేవడం ముఖం కూడా కడుక్కోకుండా ముందు మొబైల్ చూచుకోవడం, లేదా ఇంటర్ నెట్ ఓపన్ చెయ్యడం,కదిలిస్తే ఇంట్లో వాళ్ళమీద కూడా విసుక్కోవడం,ఒంటికి వ్యాయామం లేకుండా కంప్యూటర్ తెరకు అతుక్కుపోయి కూచోవడం,పొట్ట పెంచడం - ఇలా చేసేవాళ్ళ జాతకాలలో శనిరాహువుల దుష్ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది గమనించండి మరి.

ఈ శని రాహువుల చెడు ప్రభావం ఇంకా ఎక్కువైతే - ఇరవై నాలుగ్గంటలూ చెవులలో యియర్ ప్లగ్స్ పెట్టుకోవడం,మొబైల్లో చార్జ్ అయిపోతే హార్ట్ ఎటాక్ వచ్చినంత కంగారు పడిపోవడం,చార్జింగ్ ప్లగ్గుల కోసం ఇంట్లో కొట్టుకోవడం, ఎదురుగా ఉన్నవాళ్ళను వదిలేసి ఎక్కడో ఉన్నవాళ్ళతో గంటలు గంటలు మాట్లాడటం (చాలా సార్లు భార్యాభర్తలు పక్కపక్కనే కూచునికూడా ఎవరి మొబైల్లో వాళ్ళు ఎవరో ఇతర వ్యక్తులతో చాటింగ్ లో ఉండటం నేటి విడ్డూరాలలో ఒకటి), రోడ్డుమీద నడుస్తూ కూడా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ చేతులు తిప్పుతూ తమలో తాము మాట్లాడుకుంటూ గాలిలో హావభావాలు ప్రదర్శిస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉండే జీవులుగా మారిపోతారు.

చెబితే బాగుండదు గాని చాలామంది మగవారు ఒంటేలు పోసుకునేటప్పుడు కూడా భుజం మీద మొబైల్ ఉంచుకుని సపోర్టు కోసం తలను దానిమీదకు వంచి దాంట్లో మాట్లాడుతూ,ఈలోపల పని కానివ్వడం గమనించవచ్చు. ఇంతకు ముందు ఇలా తమలో తాము మాట్లాడుకుంటుంటే ,లేదా ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళను పిచ్చివాళ్ళని చూచేవారు నవ్వుకునేవారు. ఇప్పుడూ అలాగే నవ్వుకుంటున్నారు.అయితే విషయమూ విధానమూ వేరు.అంతే తేడా!!

చివరకు రియాలిటీని మరచిపోయి ఊహాప్రపంచంలో బ్రతుకుతూ కనిపించని గాలితో మాట్లాడుకుంటూ గాలికి తిరిగే పిచ్చివాళ్ళుగా ఇలాంటి వారంతా రూపాంతరం చెందుతారు.

పాతకాలంలో 'గాలి' సోకిన వాళ్ళు చేసే వింత చేష్టలను ఇప్పుడు ఫేస్ బుక్, వాట్స్ యాప్ బాధితులు చేస్తున్నారు.గమనించండి.అది గాలిబాధ అయితే ఇది గ్రహబాధ.పాతకాలంలో అయితే -'ఏరా శని పట్టిందా అలా ఉన్నావ్?' అని అడిగేవాళ్ళు.ఇప్పుడు అడగవలసిన పని లేదు.అది పట్టినట్టు ఒక మనిషి చేస్తున్న చేష్టలను బట్టి తేలికగా మనమే గ్రహించవచ్చు.

శనిరాహువుల చెడు ప్రభావాలు మనుషులమీద ఎన్నెన్ని వింత వింత రకాలుగా ఉంటాయో అనడానికి ఫేస్ బుక్కూ వాట్స్ అప్ లే ప్రత్యక్ష నిదర్శనాలు.