“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

మా అమెరికా యాత్ర -1

   
 





































మొదటి సారి అమెరికాలో అడుగు పెట్టాము.

విమానంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి చాలా చాలా విషయాలు గమనిస్తూ వస్తున్నాను.వాటన్నిటినీ ఈ సీరీస్ లో అక్షరబద్ధం గావిస్తాను.

మొట్టమొదట విషయం విమానం గాల్లోకి లేచినప్పుడు గమనించాను. బయలుదేరింది రాత్రి కావడంతో పైనుంచి చూస్తే హైద్రాబాద్ గందరగోళపు లైట్ల సమాహారంగా కనిపించింది.దూరంనుంచి చూచిన గెలాక్సీ లాగా అనిపించింది. కానీ అసలు సంగతి అది కాదు.కొద్ది గంటలలో అబూదాబి వచ్చినపుడు దాన్ని చూస్తే అసలు విషయం అర్ధమైంది.హైదరాబాద్ కు భిన్నంగా అబూదాబి లైట్లు చాలా పొందికగా ప్లాన్ గా కనిపించాయి.స్కేల్ తో గీతలు గీచినట్లు, రోడ్లు గాని, భవనాలు గాని ఎంతో ఆర్డర్లీగా కనిపించి, అబూదాబీతో పోలిస్తే మన హైదరాబాద్ ఎంత దరిద్రంగా ఉందో అర్ధమైంది. దుబాయ్ అయితే ఇంకా ఎంతో ఆర్దర్లీగా ప్లాన్డ్ గా ఉంటుందని కొందరు చెప్పారు.

మన దేశంలో ఎంత పెద్ద సిటీ అయినా టౌన్ ప్లానింగ్ అనేది అస్సలు ఉండదు. ఏదో హాఫజార్డ్ గా గందరగోళంగా ఉంటాయి మన నగరాలు.సిటీలో తిరిగినా అదే అనిపిస్తుంది.ఆకాశంలోంచి రాత్రిపూట చూసినప్పుడు ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అబూదాబీలోనే యూ.ఎస్ కౌంటర్లో ఇమ్మిగ్రేషన్ పూర్తయింది. అక్కడున్నప్పుడే ఈక్విడార్ భూకంపం సంగతి టీవీలో చూచాము.సరే పౌర్ణమి ఘడియలలో ఉన్నాము కదా ఇలాంటివి జరగడం సహజమే అని అనుకున్నాము.

అబూదాబీ నుంచి చికాగో కు దాదాపు 14 గంటల పైనే ప్రయాణం.కొంతసేపు ప్రయాణం అయ్యాక, చాలామంది తోటి ప్రయాణీకులను గమనిస్తే కొద్దిసేపు బాగానే ఉన్నప్పటికీ కాలం గడిచేకొద్దీ రెస్ట్ లెస్ గా ఉన్నట్లు కనిపించారు. అయితే సినిమాలు చూడటం, లేదా మ్యూజిక్ వినడం, ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందా అని విసుగ్గా ఎదురుచూడటం, లేదా వాళ్ళలో వాళ్ళు సోదికబుర్లు మాట్లాడుకోవడం - ఇవే కనిపించాయి.అంతకంటే ఔన్నత్యం ఎవరిలోనూ కనిపించలేదు.

విమానం ఎక్కబోయేముందు హైదరాబాదు ఎయిర్ పోర్టు కు దాదాపుగా 25 మంది నా శిష్యులు వచ్చి మాకు సెండాఫ్ ఇచ్చారు.అంతకు ముందు నాతో చాలామంది స్నేహితులు అభిమానులు అన్నారు - 15 గంటల విమాన ప్రయాణం చాలా బోరు కొడుతుంది.మీరు ఆ సమయంలో ఏం చేస్తారు? అని. నాకు నవ్వొంచ్చింది.

ధ్యానంలో మాస్టరీ ఉన్నవాడికి బోరు అనేది ఉండనే ఉండదు.జనంలో ఉన్నా ఒక్కడే ఉన్నా అతనికి బోరు అనేది అస్సలు అనిపించదు.ధ్యాని కానివాడికే అన్ని అవలక్షణాలూ ఉంటాయి.ధ్యానంలో మంచి పట్టు ఉంటే, అది మనకు ఎన్నో వరాలను ఇస్తుంది.ఇతరులు ఊహించను కూడా ఊహించలేని అనేక Inner advantages అప్పుడు మనకు కలుగుతాయి.Mastery in meditation అనేది జీవితాన్ని ఊహించలేనంత qualitative గా ఎలివేట్ చేస్తుంది.ఈ స్కిల్ లేని మామూలు మనుషులు వారి వారి జీవితాలలో ఎన్నో సున్నితమైన ఆనందాలను కోల్పోతూ ఉంటారు.వారికి తెలిసినవే అసలైన ఆనందాలు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు.కానీ వారికి తెలిసినవి చాలా చిన్నవైన స్వల్పమైన చీప్ ఆనందాలు.అసలైన ఆనందం అనేది ఒక ధ్యానికే తెలుస్తుంది.సమయాన్ని సరిగా ఎలా గడపాలనే time management కూడా అతనికి చాలా సహజంగా అలవడుతుంది.

భూమికి చాలా ఎత్తులో ప్రయాణం చేస్తున్నపుడు భూ సంబంధమైన మిగతా ఆలోచనలు మనసుకు రాకపోవడం గమనించాను.ఇది సహజమే.ఎందుకంటే భూమికి దూరం అయ్యేకొద్దీ మనిషికి భౌతికమైన ఆలోచనలు దూరం అవుతాయి.భూమి యొక్క గ్రావిటీ మనమీద తగ్గడమే దీనికి కారణం.ఈ ఎఫెక్ట్ ను సహజంగా రాబట్టుకోవడం కోసమే యోగులు ఋషులు ఎత్తైన కొండ ప్రాంతాలలో నివాసం ఉంటూ ఉంటారు.వారి సాధనా ఫలితంగా వారి దేహాలలో విపరీతమైన వేడి పుడుతూ ఉంటుంది.అందుకే వారికి చల్లని ప్రదేశాలు హాయిగా ఉంటాయి.వేడి ప్రదేశాలలో సాధన చెయ్యడం చాలా కష్టం.ఎందుకంటే ఆ ఎండకు వేడికి ఎనర్జీ లాస్ ఎక్కువగా ఉంటుంది.హిమాలయాలలో అయితే చల్లదనమూ ఉంటుంది భూమికి చాలా ఎత్తుగానూ ఉంటుంది.అక్కడ ఎనర్జీ లాసూ ఉండదు, భూమి మన మనసుల్ని క్రిందకు లాగడమూ ఉండదు.అందుకనే ఋషులు యోగులు చాలా ఎత్తైన హిమాలయాలను ఇష్టపడతారు.ఇందులోని రహస్యం ఇదే.

ఈ 14 గంటల ప్రయాణంలో భూమికి అంత ఎత్తులో వచ్చిన ఎడ్వాంటేజిని ఉపయోగించుకుని విమానంలో ఉన్నంతసేపూ, నేనూ రాజూ సాధ్యమైనంత సేపు ధ్యానంలోనే గడిపాము. పక్కన ఉన్న ప్రయాణీకుల దరిద్రపు వైబ్రేషన్స్ తప్ప మనస్సు చాలా సహజంగా ధ్యానాన్ని అందుకుంది.మిగతా సమయంలో 'The invincible golden staff' అనే ఒక థాయిలాండ్  మార్షల్ ఆర్ట్స్ సినిమా పూర్తిగా చూచాను.

చికాగోలో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మూడు గంటలు ఎయిర్ పోర్ట్ లో వేచి చూచాము.అక్కడ నుంచి అమెరికన్ ఎయిర్ లైన్స్ చిన్న విమానంలో ఎక్కి నలభై నిముషాల ప్రయాణంతో డెట్రాయిట్ లో దిగాము.

అరబ్స్ అమెరికన్స్ ఈ రెండు జాతులనూ గమనిస్తే - ఇద్దరిలోకీ అరబ్బులే మంచి అందంగా కనిపించారు.వారి ఒంటి రంగు చాలా ప్లెజంట్ గా ఉంటుంది. అమెరికన్స్ ఒంటి రంగు అంత హాయిగా ఉండదు. ఎక్కువ ఎర్రగా ఏదో చర్మరోగం వచ్చినవారిలా కొన్ని దద్దుర్లతో అదోరకమైన ఇబ్బందిగానే ఉంటుంది.బహుశా ఎండ తగలకపోవడం వల్ల అలా జరుగుతూ ఉండవచ్చు. అందుకే వారు స్కిన్ టానింగ్ కోసం అంత తాపత్రయపడుతూ ఉంటారు.

అరబ్బు అబ్బాయిలలాగే, అమ్మాయిలు కూడా బొద్దుగా అందంగా ఉన్నారు. అమెరికా అమ్మాయిలు కూడా బాగానే ఉన్నప్పటికీ అరబ్బులలో ఉన్న కళ వీళ్ళలో కనిపించదు.ఏదో పాలిపోయిన ముఖాలలా కళాకాంతీ లేకుండా కనిపిస్తున్నాయి.మన దేశంలో కాశ్మీరీలలో మళ్ళీ అరబ్బుల పోకడలు కనిపిస్తాయి.వాళ్ళు అక్కడనుంచి దిగుమతి అయినవారేగా?

డెట్రాయిట్ లో దిగేసరికి మధ్యాన్నం 2.30 అయింది.మా అబ్బాయి మాధవ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి రెడీగా ఉన్నాడు.తనతో పాటు ఆనంద్ గారు కూడా వచ్చారు.ఆయన వస్తారని నేను ఊహించలేదు.

'ప్రయాణం బాగా జరిగిందా?' - అంటూ ఇద్దరూ చక్కగా ప్రేమతో రిసీవ్ చేసుకోవటంతో ప్రయాణపు బడలిక క్షణంలో ఎగిరిపోయింది.లగేజి తీసుకుని ఒక గంట కారు ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాము.

డెట్రాయిట్ లో నాకు వెంటనే నచ్చిన విషయం రోడ్లమీద మనుషులు కనిపించకపోవడం.మన దేశంలో నేల ఈనినట్లు ఎక్కడ చూచినా మనుషులే కనిపిస్తారు. స్వతహాగా, ఎక్కువ జనసమ్మర్దం ఉంటే నాకు నచ్చదు,జనాలు కన్పించని ఏకాంత ప్రదేశాలు నేను చాలా ఇష్టపడతాను.దానితో అక్కడ వాతావరణం నాకు చాలా బాగా నచ్చేసింది.పైగా చలిచలిగా ఉండి 10 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది.ఇది కూడా నాకు బాగా నచ్చేసింది.జాకెట్, స్వెటర్ వేసుకోకుండా ఉత్త టీ షర్ట్ వేసుకుంటేనే హాయిగా అనిపించింది.

అదీగాక ఇక్కడ మనుషులు వారంతట వారే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండటం నాకు చాలా నచ్చేసింది.దుమ్ము లేకపోవడం ఇంకా నచ్చేసింది.లిట్టరింగ్ లేకపోవడం ఇంకా బాగా నచ్చేసింది.ప్రకృతిని పాడు చెయ్యకపోవడం ఇంకా చాలా బాగా నచ్చేసింది.

రాజుకు కూడా నా భావాలే కావడంతో అతని పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా అనిపించింది.మొత్తం మీద మాకిద్దరికీ అమెరికా వాతావరణం బాగా నచ్చేసింది.We had love at first sight with this country and its vibes.Nature lovers కు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందేమో?

ఆబర్న్ హిల్స్ లో ఉన్న బసకు చేరుకొని సెటిల్ అయ్యాము.నాకేమీ జెట్ లాగ్ అనేది అనిపించనేలేదు.కాసేపు ఉండి ఫ్రెష్ అయ్యాక, అక్కడకు ఒక ముఖ్యమైన పనిమీద అరగంట దూరంలో తీసుకున్న ఇంకొక ఇంటికి వెళ్లి అక్కడి వాతావరణ తరంగాలను క్లీన్ చేసి తిరిగి వచ్చాను.

ఆ ఇంటిని మనకోసం టెంపరరీ ఆశ్రమంగా తీసుకున్నాము.అమెరికాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మనవారికోసం,వారితో సమావేశాలకోసం ఈ ఇంటిని కేటాయించాం. అది ఒక లేక్ పక్కనే ఉంది.ఈ ఇంటిలోకి అడుగు పెట్టి గమనిస్తే, అదొక డూప్లెక్స్ టూ బెడ్ రూమ్ హౌస్ గా ఉంది. ఇంటిని చాలా టేస్ట్ తో కళాత్మకంగా కట్టుకున్నాడు ఓనర్. ఇంటిలో చాలావరకూ మంచి వైబ్స్ ఉన్నాయి.కానీ కొన్నికొన్ని గదులలో మాత్రం కొన్ని unwanted vibes ఉన్నాయి. పైన మెట్లమీదనుంచి పై పోర్షన్ లోకి వెళ్ళే తలుపును లాక్ చేసి ఉంచారు.కింద సెల్లార్ లోకి కూడా వెళ్లి చూచాము.చుట్టూ నిర్మానుష్యంగా చల్లచల్లగా చాలా హాయిగా ఉంది.అక్కడ రెండుగంటల పాటు ఉండి ఆ ఇంటి వాతావరణపు ఆరా (unwaned vibes) ను క్లీన్ చేసి మళ్ళీ మా బసకు చేరుకున్నాను.

ఆ విధంగా అమెరికాలో మా మొదటి రోజు గడచింది.

(ఇంకా ఉంది)