“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, ఏప్రిల్ 2016, ఆదివారం

పరమాత్ముని ఆత్మఘోష

నాకు గుళ్ళు కట్టి
వ్యాపారాలు చేసేవారేగాని
గుండెగుడిని నాకిచ్చేవారు
ఏరీ?

నా శక్తి చూచి
అంగలార్చేవారే గాని
నన్ను కావాలనుకునేవారు 
ఏరీ?

వాళ్ళ తోడుదొంగగా
నన్ను మార్చేవారే గాని
నన్ను తోడుగా కోరేవారు
ఏరీ?

గిల్టు నగలు నాకేసి
నా నగలు కాజేసేవారే గాని
వారి వగలు మానుకునేవారు
ఏరీ?

వాళ్ళ సోది
నాకు చెప్పేవారే గాని
నా బోధ వినేవారు
ఏరీ?

వాళ్ళ గీత
మార్చమనేవారే గాని
నా గీతను పాటించేవారు
ఏరీ?

వాళ్ళ వంశరక్షణం
కోరేవారే గాని
నా అంశగా మారేవారు
ఏరీ?

నా ప్రకృతిని
పాడు చేసేవారే గాని
వారి ప్రకృతిని మార్చుకునేవారు
ఏరీ?

నాకు కల్యాణం చేసి
కమీషన్లు కాజేసేవారే గాని
ఆత్మకల్యాణ పరులు
ఏరీ?

ఇంకా ఇంకా
కావాలనే వారే గాని
ఇవేవీ మాకొద్దనేవారు
ఏరీ?

కనిపించని నన్ను
ఎక్కడో వెదికేవారే గాని
వాళ్ళ చుట్టూ నన్ను చూచేవారు
ఏరీ?

బయట బయట
నాకోసం వెదికేవారే గాని
వారి లోపలే వెదకేవారు
ఏరీ?

రాత్రీ పగలూ పూజలంటూ
విసిగించే వారే గాని
మనసు బూజులు దులుపుకునే వారు
ఏరీ?

ఇంటికి రమ్మంటూ
పిలిచేవారే గాని
ఆ ఇల్లు శుభ్రం చేసుకునేవారు
ఏరీ?

వాళ్ళ పనులకు
నన్ను వాడుకోడమే గాని
నా పనిని చేసేవారు
ఏరీ?

వాళ్ళ కోరికలు
నాకు చెప్పడమే గాని
నా మనసు తెలుసుకునేవారు
ఏరీ?

వాళ్లకు తోచిన వేషాలు
నాకు వెయ్యడమే గాని
నా అసలు రూపం కోరేవారు
ఏరీ?

నన్నో బొమ్మను చేసి
ఆడించడమే గాని
వాళ్ళ ఖర్మను తొలగించుకునే వారు
ఏరీ?

నా పేరుతో ప్రవచనాలు
చేసేవారే గాని
నా వచనాలు పాటించేవారు
ఏరీ?

నాపేర్లలో ఒక పేరు చెప్పి
మతాలు మార్చేవారే గాని
పేర్లన్నీ నావేనని చెప్పేవారు
ఏరీ?

నేను నేనంటూ
ఎగిరేవారే గాని
ఆ నేనేంటో గ్రహించేవారు
ఏరీ?

నాలుగు రోజుల నాటకం కోసం
నానా నాటకాలే గాని
ఆట ముగిద్దామని అనుకునేవారు
ఏరీ?

నీ వాణ్ని నీ వాణ్ని
అనేవారే గాని
నిజమైన నావారు
ఏరీ?

ఎవరు చూచినా
నా వరాలు కోరేవారే గానీ
నన్ను కోరేవారు.
ఏరీ?