“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

రండు మిత్రులార...

రండు మిత్రులార
మిమ్ము దోడ్కొని పోదు
దుమ్ము ధూళి లేని
లోకమునకు

రండు ప్రేమికులార
మిమ్ము దోడ్కొని పోదు
శోకమంతమైన
లోకమునకు

ఎచటి కేగినంత
ఏకత్వ ముదయించి
సకల ద్వంద్వ భ్రమలు
సద్దు మణగు

ఎచట కాలుమోప
మీరు నేనను భావ
మంతయును మాయమై
ముద్దు గొలుపు

ఎచటి నీరు ద్రావ
దాహంబు శాంతించి
తిరిగి దోచకుండ
మాయమౌను

ఎచటి గాలి సేవ
గాయంబు లన్నింటి
తత్క్షణమె మాన్పించి
స్వాస్థ్యమొసగు

ఎచట మిమ్ము గోరి
ఎల్ల ధన్యాత్ములును
వేచిచూచుచుందు
రాత్రమొప్ప

ఎచటి సీమలోన
దుఃఖమన్నది లేక
నిత్యసంతసంబు
రాజ్యమేలు

ఎచట జూచినంత
ఆకలియు దప్పియున్
ఎంతమాత్రమేని
దోచకుండు

ఎచట నాకమందు
సూర్యుండు చంద్రుండు
నితర కాంతులు లేక
వెలుగు నిండు

ఎచట జేరినంత
ఎన్నడును విడిపోని
ప్రేమ యందు మీరు
పవ్వళింత్రు

ఎచట నిత్యమెపుడు
హెచ్చు తగ్గులు లేని
ఆనంద ఝరి యొకటి
ఆర్ణవించు

ఎచటి సీమలోన
వారు వీరను భావ
మంతయును అంతమై
ఉజ్జ్వలించు

ఎచట జూడబోవ
కాలమంతయు సుంత
మంతమై కనరాని
తావుజేరు

రండు మిత్రులార
మిమ్ము దోడ్కొని పోదు
దుమ్ము ధూళి లేని
లోకమునకు

రండు ప్రేమికులార
మిమ్ము దోడ్కొని పోదు
శోకమంతమైన
లోకమునకు