An artistic dreamy mind can easily lose itself in meditation

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఈ హృదయం...

ఎన్నో కట్టుబాట్లను
దాటిందీ హృదయం
ఎన్నో కత్తిపోట్లను
సైచిందీ హృదయం

ఎన్నో శిలువలు
మోసిందీ హృదయం
ఎన్నో విలువలు
పూచిందీ హృదయం

ఎన్నో జన్మలు
వేచిందీ హృదయం
ఎన్నో మనసులు
దోచిందీ హృదయం

ఎన్నో మలుపులు
చూచిందీ హృదయం
ఎన్నో తలుపులు
తెరిచిందీ హృదయం

ఎన్నో వలువలు
విడచినదీ హృదయం
ఎన్నో కలువలు
తలచినదీ హృదయం

ఎంతో స్నేహం
నేర్చిందీ హృదయం
ఎంతో మోహం
పేర్చిందీ హృదయం

ఎంతో ఓర్పుకు
నిలయమీ హృదయం
ఎన్నో తీర్పుల
వలయమీ హృదయం

ఎన్నో మార్పులు
తట్టుకుందీ హృదయం
ఎన్నో కూర్పులు
పట్టుకుందీ హృదయం

ఎన్నో ముంగిళ్ళలో
కృంగిందీ హృదయం
ఎన్నో ఎక్కిళ్ళను
మ్రింగిందీ హృదయం

ఎన్నో శిశిరాలలో 
పాలు మాలిందీ హృదయం
ఎన్నో శిబిరాలలో
కాలు మోపిందీ హృదయం

ఎన్నో వసంతాల
వన్నె ఈ హృదయం
ఎన్నో సుగంధాల
దిన్నె ఈ హృదయం

శ్రామిక నేస్తం
ఈ హృదయం
ప్రేమకు బానిస
ఈ హృదయం

కల్లను ఎరుగదు
ఈ హృదయం
ఎల్లలు లేనిది
ఈ హృదయం

కుసుమ కోమలం
ఈ హృదయం
పరమ పావనం
ఈ హృదయం

ఈ హృదయం
ప్రేమమయం
ఈ హృదయం
దైవమయం...