“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఏప్రిల్ 2016, సోమవారం

మా అమెరికా యాత్ర -3

నాలుగో రోజున మన పంచవటి మెంబర్స్ తో ఈ సంభాషణ జరిగింది.

ఆనంద్ ఇలా అన్నారు.

'అరిజోనా స్టేట్ లో చాలా మంది మిస్టిక్స్ ఉన్నారు.అమెరికాలో ఉన్న అందరు హీలర్స్, మిస్టిక్స్, ఆస్ట్రాలజర్స్ వీళ్ళంతా అక్కడకే చేరుతూ ఉంటారు.అక్కడ 'సెడోనా' అని ఒక ప్రదేశం ఉన్నది.ముఖ్యంగా ఆ ప్రదేశంలో గనుక మీరు వెళ్లి చూస్తె అక్కడ భౌతికానికీ ఆస్ట్రల్ ప్లేన్స్ కూ మధ్యన ఉన్న గీత చాలా పలుచగా ఉంటుంది.ఆ ప్రదేశంలో ఉంటే  other planes of existence ను కాంటాక్ట్ చెయ్యడం చాలా తేలిక. మీరక్కడకు వెళితే ఆ ప్రదేశాన్ని చాలా ఎంజాయ్ చెయ్యగలుగుతారు. నేను కొన్ని ఏళ్ళ క్రితం అక్కడకు వెళ్లాను.ఉద్యోగపని మీద ఒక రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది.ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు.అక్కడ స్పిరిచ్యువల్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.రెడ్ ఇండియన్ సెటిల్ మెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి.వాళ్ళలో పాతతరం మనుషులు చాలా మిస్టికల్ గా ఉంటారు.మీరు వాళ్ళను కలిస్తే చాలా ఎంజాయ్ చెయ్యగలరు.ఈసారి వచ్చినపుడు అక్కడకు వెళదాము.' 

'అలాగే' అన్నాను.

అమెరికాలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏమంటే ఎక్కడ చూచినా లాన్స్, గ్రీస్ పాచెస్, చెట్లు బాగా ఉన్నాయి.ఎవ్వరూ చెట్లను నరకడం లేదు.లాన్స్ పాడు చెయ్యడం లేదు.గార్బేజ్ లిట్టరింగ్ ఎక్కడా లేదు.రోడ్ల పక్కన మలమూత్ర విసర్జన అనేది లేనేలేదు.ఇళ్ళకు ప్రహరీ గోడలు లేవు.ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడా పోలీసు అనేవాడే లేడు.ఎలక్ట్రానిక్ ఐ మాత్రం ఉంటుంది.సిగ్నల్ ను పాటించకపోతే చలాన్ ఇంటికి వచ్చేస్తుంది.లేదా మన ఎకౌంట్ లోనుంచి ఫైన్ కట్ అయిపోతుంది.ఇది నాకు చాలా బాగా నచ్చింది.మన దరిద్రపు దేశంలో ఇలాంటి పద్ధతులు ఎప్పటికి వస్తాయా అని నాకు చాలా బాధ కలిగింది.నేనీ మాట అంటే చాలామందికి కోపాలు వస్తాయి.దరిద్రపు దేశం అంటే నా ఉద్దేశ్యం - మనదేశం దరిద్రపుది  అని కాదు. 'దరిద్రపు మనుషులు' - అని అర్ధం.తమ దేశాన్ని గౌరవించలేని వాళ్ళూ దాన్ని బాగుచేసుకుందామని ప్రయత్నం చెయ్యనివాళ్ళూ, పైగా దొంగలలాగా దానిని దోచుకునేవాళ్ళూ దరిద్రులు కాకుంటే మరెవరు? అలాంటివారిని అలా కాకుంటే ఇంకెలా పిలవాలి మరి?

ఆలోచనల్లోంచి తేరుకుని ఇలా అన్నాను.

"ఇండియాకు మూడు శాపాలున్నాయి ఆనంద్. వీటినే three 'P' s అంటారు.

First P is Population
Second P is Pollution
Third P is Politics "

"నిజమే"- అన్నట్లుగా ఆనంద్ తలాడించాడు.

'అవును.ఈ మూటిల్లో మళ్ళీ పాలిటిక్స్ అనేది అతి పెద్ద క్రైం అని నా ఉద్దేశ్యం. దానంత దరిద్రం ఇంకోటి లేదు.రాజకీయ నాయకుడు పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పడుకోబోయే వరకూ చేసేవన్నీ డర్టీ పనులే.ఎంత చెడుఖర్మను పోగుచేసుకుంటారో ప్రతిరోజూ వాళ్ళావిధంగా?' - అన్నాడు సాలోచనగా.

'అందుకేగా ప్రాచీనులు - "రాజ్యాన్తే నరకం ధృవం"- అన్నది" అన్నాను.

 వింటున్నవారు - "అవునా?" అన్నారు.

"అవును.నాయకులు అందరూ చనిపోయాక నరకానికే పోతారు.అందులో ఏమీ అనుమానం లేదు.భూలోకంలోనేమో వాళ్ళ శిలావిగ్రహాలు పెట్టి దండలు వేసి పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు.అక్కడ నరకంలో చూస్తె వీళ్ళను కాగుతున్న నూనె బాండీలలో పడేసి శనగపిండి బజ్జీలలాగా వేయిస్తుంటారు. సృష్టిలోని ఈ చిత్రవిచిత్రాలు ఇలాగే ఉంటాయి" - అన్నాను..

"మరి మన దేశంలోని ఈ మూడు శాపాలకూ సొల్యూషన్ ఏమీ లేదా"- వింటున్నవారు అడిగారు.

"ఉంది.ఏదైనా మితిమీరిపోతే ప్రకృతే దానిని తుంచి పారేస్తుంది.ప్రస్తుతం మన జనాభా 125 కోట్లు.ఏవైనా ఉపద్రవాలు యుద్ధాలు జరిగి ఈ జనాభాలో 100 కోట్ల జనం చచ్చి 25 కోట్ల జనాభా మిగలాలి.అప్పుడే మన దేశం బాగుపడుతుంది.వినడానికి చాలా క్రూరంగా దయారహితంగా కనిపించినా ఇదే దీనికి అల్టిమేట్ సొల్యూషన్.ఇది నా ప్లాన్ కాదు.అమ్మ ప్లాన్.భవిష్యత్తులో జరగబోయే దానినే నేను చెబుతున్నాను.ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటికి మీరూ నేనూ ఉండకపోవచ్చు.దానిని చూడకపోవచ్చు.కానీ ఇది జరిగి తీరుతుంది.మనిషి విచ్చలవిడిగా ప్రకృతిని పాడుచెయ్యడం కూడా ఈ జరగబోయే విలయానికి ఇంకొక కారణం" - అన్నాను.

వింటున్న ఆనంద్ ఇలా అన్నారు.

"ఇక్కడ ప్రకృతిని రక్షించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.అనవసరంగా ఒక గడ్డిపోచను కూడా ధ్వంసం చెయ్యరు.అందుకేనేమో వీరిని ప్రకృతి కూడా పరిరక్షిస్తున్నది.ఇక్కడ టైముకు చక్కగా వానలు పడతాయి.వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు లేనేలేదు.ఉప్పునీళ్ళు మంచినీళ్ళు కాన్సెప్ట్ లేదు.అన్నీ మంచినీళ్ళే.ఎంత కావాలంటే అంత నీరు సమృద్ధిగా ఉంటుంది.కానీ ఏ వాటర్ బాడీనీ వీళ్ళు పొల్యూట్ చెయ్యరు.మన దేశంలో అయితే సమస్త దరిద్రాలనూ నదుల్లోనేగా కలిపేది.ఒక నదిలో మనం గార్బేజ్ కలుపుతున్నామంటే అది నా దృష్టిలో దైవద్రోహం క్రింద లెక్క" - అన్నాడు.

"అవును.ప్రకృతిలోని దైవత్వాన్ని విస్మరించడమే ఇండియా పతనానికి గల మూలకారణాలలో ఒకటి.నదులు దైవస్వరూపాలని మన గ్రంధాలు చెప్పాయి. మనం కూడా నదులకు పూజలు చేసి హారతులు ఇస్తాం.కానీ వాటిని శుభ్రంగా ఉంచాలనీ వాటిని గౌరవించాలనీ ఆ వనరును జాగ్రత్తగా మర్యాదగా వాడుకోవాలన్న జ్ఞానం ఎవడికీ ఉండదు.ఊరకే పూజలు మాత్రం చేస్తారు.ఇదే మనకు పట్టిన అసలైన దరిద్రం.దీనినే నేను "హిపోక్రసీ" అంటాను.

ఈ సందర్భంలో - వివేకానందస్వామి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తున్నది.

ఆయన లండన్లో ఉన్న సమయంలో ఒకరు ఇలా అడిగారు.

"మీరు ఇంత గొప్ప వేదాంతం చెబుతున్నారు కదా? కానీ మీదేశం బానిసత్వంలో మగ్గుతున్నదెందుకు? మీకు నిరక్షరాస్యతా దారిద్ర్యమూ అశుభ్రతా అంత ఎక్కువగా ఉన్నాయెందుకు? మీ గ్రంధాలలో ఇంత జ్ఞానసంపద ఉన్నప్పుడు మీ స్థితి మరి ఇలా ఘోరంగా ఉన్నదెందుకు?"

దానికి వివేకానంద స్వామి ఇలా జవాబిచ్చారు.

'మేము వేదాంతాన్ని ఊరకే చదువుతాం.ఊరకే వల్లె వేస్తాం.ఇతరులకు బోధిస్తాం.కానీ ఆచరించం.మీకు వేదాంతం తెలియదు.కానీ మీరు దానిని నిత్యజీవితంలో మీకు తెలీకుండానే ఆచరిస్తున్నారు.అదీ మీకూ మాకూ తేడా. అందుకే మీరు ఇలా ఉన్నారు.మేము అలా ఏడుస్తున్నాం.వేదాంతాన్ని చదివితే ఫలితం రాదు.ఆచరిస్తే వస్తుంది.అనుష్టాన వేదాంతం కావాలి. ఉపన్యాస వేదాంతం ఎందుకూ పనికిరాదు.పుస్తకాలు మా దగ్గరున్నాయి. అనుష్ఠానం మీ దగ్గరుంది.అందుకే మీరు బాగున్నారు."

నూట పదహారు సంవత్సరాల క్రితం స్వామి చెప్పిన మాటలు నేటికీ సజీవ సత్యాలే.ఈనాటికీ మన గతి అప్పటిలాగే ఉన్నది.వివేకానందస్వామి చెప్పినది మనం ఆచరించినప్పుడే మన దేశం బాగుపడుతుంది.అలా కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేశాన్ని భ్రష్టు పట్టిస్తే దాని గతి అధోగతే అవుతుంది.ఇది తప్పదు." - అన్నాను.

సంభాషణ "నైతికత - అనైతికత" ల వైపు మళ్ళింది.

"మానసికంగా ఒక స్థాయికి చేరాక ఇక నైతికత అనైతికత అంటూ ఉండవేమో అనిపిస్తున్నది" - అని ఒకరన్నారు.

'అవును.ఆ రెండూ రిలేటివ్ కాన్సెప్ట్స్.ఇవి మూడు విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అవేమిటంటే దేశం-కాలం-నిమిత్తం.అంటే Place-Time-Cause(reason).ఈ మూటిని బట్టి నీతీ అవినీతీ అనేవి మారిపోతూ ఉంటాయి.

ఉదాహరణకు ఒక దేశంలో నీతి అయినది ఇంకొక దేశంలో నీతి అవ్వదు. అలాగే చరిత్రలో ఒకానొక సమయంలో నీతిగా పరిగణింపబడినది ఇంకొక కాలంలో నీతిగా నిలవదు.మన జీవితంలో కూడా ఒక సమయంలో నీతి అయింది ఇంకొక సమయంలో నీతి కాలేదు.అలాగే మనం చూచే దృష్టిని బట్టి - అంటే మనం తీసుకునే రీజన్ ను బట్టికూడా వీటికి అర్ధాలు మారుతూ ఉంటాయి.

అసలు విషయం ఏమంటే - మనం మన చుట్టూ భౌతికంగా మానసికంగా కొన్నికొన్ని గిరులు గీసుకుని బ్రతుకుతూ ఉంటాము.ఆ గిరులు అనేక రకాలుగా ఉంటాయి.మనం అనుకునే నీతీ అవినీతీ అనేవి ఆ గిరులకే పరిమితం.అవి రిలేటివ్ కాన్సెప్ట్స్.ఆ గిరి దాటితే ఆ కాన్సెప్ట్స్ పనిచెయ్యవు.

మనిషి ఎలాంటి వాడంటే - మూడు concentric circles మధ్యలో ఉన్న బిందువు లాంటివాడు.ఈ సర్కిల్స్ లో లోపలది తన చుట్టూ తను గీసుకున్న మానసిక గిరి.ఆ తర్వాత ఉండే రెండోది సమాజం తన చుట్టూ గీసిన గిరి.ఆ తర్వాత ఉండే మూడోది ప్రకృతి మన చుట్టూ గీసిన గిరి.ఈ మూడింటికీ వేర్వేరు నీతీ వేర్వేరు అవినీతీ - వేటికవే విడివిడిగా - ఉంటాయి.ఈ మూడు గిరుల(domains)కూ మధ్యన సంఘర్షణ లేకుండా ఉన్నంతవరకూ మనిషి జీవితం సుఖంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది.వీటిమధ్యన ఉన్న సంఘర్షణలలో గల తేడాలను బట్టి మనిషి జీవితంలో రకరకాలైన అసంతృప్తులు ఉంటాయి.

నిజమైన సాధకుడు ఈ మూడు గిరులనూ దాటాలి.తన మానసిక పరిమితులనూ భయాలనూ మొదటగా అధిగమించాలి.ఆ తర్వాత సంఘం తన చుట్టూ బలవంతంగా గీచిన గిరిని బ్రేక్ చేసి బయటకు రావాలి.ఆ తర్వాత ప్రకృతి తన చుట్టూ గీచిన గిరిని కూడా బ్రేక్ చెయ్యాలి.అప్పుడే మానవుడు దైవాన్ని 'అనుభవం ద్వారా' తెలుసుకోగలుగుతాడు.ఈ మూడు గిరులలో అఘోరిస్తూ ఉన్నంతవరకూ వాడు అధముడిగా బ్రతికి అధముడిగానే చస్తాడు.అందుకే, నిజమైన మిస్టిక్ అన్నవాడు ఈ మూడు గిరులనూ దాటాలి. ఈ మూడు గిరుల గురించే నేను - 'మూడుగిరులు దాట ముంచెత్తు నొకముప్పు ముగియునింక నీదు మూలధనము' అంటూ "శ్రీ విద్యారహస్యం" లో వ్రాశాను.

అందుకే మిస్టిక్స్ అనేవాళ్ళు మనుషులనూ లెక్కచెయ్యరు.సమాజాన్నీ లెక్కచెయ్యరు.ప్రకృతిని కూడా లెక్క చెయ్యరు.తలచుకుంటే వారు ప్రకృతిని కూడా మార్చగలుగుతారు.అవే మిరకిల్స్ అంటే.ఈ పనిని వాళ్ళు ఎలా చెయ్యగలుగుతారో చెప్తాను వినండి.ప్రకృతికి అతీతంగా ఉన్న పరమసత్యాన్ని వాళ్ళు టచ్ చేసి ఉంటారు.ఆ స్థాయికి వాళ్ళు వెళ్లి దానిని దర్శించి దానిలో కరగిపోయి ఉంటారు కనుక వాళ్లకు ఆ శక్తి వస్తుంది.ఎలాగంటే - ప్రకృతికి అతీతంగా ఉన్నదేదో అదే ఈ ప్రకృతిని సృష్టించింది.దానిని టచ్ చెయ్యగలిగితే అప్పుడు అలాంటివాడి మాటను ప్రకృతి శిరసావహిస్తుంది.అతని విల్ ప్రకారం ప్రకృతి తనను తాను మార్చుకుంటుంది.అదే మిరకిల్ అంటే.' అన్నాను.

'అంటే మిస్టిక్స్ కు నీతీ అవినీతీ అనేవి ఉండవా?'- అని వింటున్నవారు అడిగారు.

'నిజమైన మిస్టిక్ కు మీరనుకునే నీతీ అవినీతీ ఉండవు."నీతి-అవినీతి" గురించి అతని నిర్వచనమూ మీ నిర్వచనమూ వేర్వేరుగా ఉంటాయి.అందుకే అతని చర్యలు మీకు వింతగా అనిపిస్తాయి.అతను మీ స్థాయినుంచి ప్రపంచాన్ని చూడడు.అతని యాంగిల్ వేరుగా ఉంటుంది.అప్పటి అవసరాన్ని బట్టి అతని దృక్కోణం అనుక్షణం మారిపోతూ ఉంటుంది.కానీ దానిలో అనుస్యూతంగా ఒక అద్భుతమైన దైవనీతి దాగి ఉంటుంది.అయితే అది మీరు అనుకునే - మీకు తెలిసిన - పరిమితమైన నీతి అయి ఉండదు.అతనికి ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ ఏదీ ఉండదు.అలా ఉండనంత మాత్రాన అతను అవకాశవాదీ కాడు.అందుకే అతను మీకు పరస్పర విరుద్ధ విషయాల సమాహారం లాగా కనిపిస్తాడు.అతనిలో ఎన్నో దృక్కోణాలు ఉంటాయి.ఒక్క దృక్కోణమే తెలిసిన మీకు అందుకే అతను అర్ధం కాడు.ఈ విషయాలన్నీ నా పుస్తకంలోని 'గుణాతీత జీవన్ముక్త స్థితి' అనే అధ్యాయంలో వ్రాశాను.

ఇదంతా మీకిప్పుడు అర్ధం కాదు.మీరు మీ చుట్టూ ఉన్న మూడు గిరులను దాటి ఆ పైన ఉన్నదానిని టచ్ చేసినప్పుడే నేను చెబుతున్నది మీకు 'అనుభవంలో' అర్ధం అవుతుంది.అలా చెయ్యాలంటే సాధన అవసరం.ఊరకే కూచుని మాట్లాడుకుంటూ ఉంటె మీరు ఆ పనిని ఎన్నటికీ చెయ్యలేరు.మీరా 'మిస్టిక్ పాత్' లో నడవాలి.అప్పుడే అది సాధ్యం అవుతుంది.అందుకే సాధన అనేదానిని నేనింతగా నొక్కి చెప్పేది." -  అన్నాను.

(ఇంకా ఉంది)