“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, ఏప్రిల్ 2016, సోమవారం

వరుస ప్రమాదాలు - అమావాస్య ప్రభావం

గ్రహస్థితులు బాగాలేనప్పుడు అమావాస్య పౌర్ణమి పరిధులలో భయంకర ప్రమాదాలు జరుగుతాయని నేను గతంలో లెక్కలేనన్ని సార్లు వ్రాశాను. ఉదాహరణలతో స్టాటిస్టికల్ గా నిరూపించాను కూడా.ఈ సూత్రం మళ్ళీ నిన్న రుజువైంది.

మీకు గుర్తుందో లేదో? ఏడాదిన్నర క్రితం నేను రోహిణీ శకట భేదనం గురించి వ్రాస్తూ - శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి వచ్చినపుడు ప్రపంచవ్యాప్తంగా రకరకాలైన ఘోరాలు ప్రమాదాలు జరుగుతాయని వ్రాశాను.ప్రస్తుతం అదే గ్రహస్థితి నడుస్తున్నది.అవే ఘోరాలు జరుగుతున్నాయి. గమనించండి. జ్యోతిశ్శాస్త్రం ఎంత సత్యమైనదో అర్ధమౌతుంది.

మొన్న రాత్రి+నిన్న రోజంతా - అమావాస్యకు సరిగ్గా మూడవరోజు.అంటే అమావాస్య పరిధిలోనే ఉన్నది. వృశ్చికరాశిలో శనీశ్వరుడు కుజుడు కలసి ఉన్నారు.ఈ యోగం ఘోరమైన ప్రమాదాలకు యాక్సిడెంట్లకూ సూచిక అని కూడా ఎన్నో సార్లు గతంలో నేను చెప్పి ఉన్నాను.

మొన్న శనివారం రాత్రినుంచీ నిన్న ఆదివారం సాయంత్రం లోపు జరిగిన ప్రమాదాలు చూస్తే నేను చెబుతున్న జ్యోతిష్య సూత్రాలు పచ్చి వాస్తవాలే అన్నది స్పష్టంగా రుజువౌతున్నది.

కేరళలో ఘోర అగ్నిప్రమాదం
కేరళలోని కొల్లం జిల్లాలో పరపూర్ గ్రామంలోని పట్టింగల్ శక్తి ఆలయ ప్రాంగణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి మందుగుండు సామగ్రి పేలి కనీసం నూట యాభై మంది చనిపోయారు.నాలుగు వందలమంది గాయపడ్డారు.ఈ ప్రమాదంలో కూడా Initial spark చిన్నదే.కానీ అదే పెద్ద ప్రమాదానికి కారణం అయింది.ఇదీ కర్మ ప్రభావమే.

నాలుగు దేశాలలో భూకంపాలు
ఆఫ్ఘనిస్తాన్ లో నిన్న వచ్చిన భూకంపం నాలుగు దేశాలను వణికించింది.అవి ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్,ఇండియా,చైనా.ఉత్తరభారతంలో ప్రజలు ఇళ్ళు వదలిపెట్టి బయటకు పరుగులు తీశారు.అనేక లక్షలమంది భయభ్రాంతులయ్యారు.

వరుస రోడ్డు ప్రమాదాలు
నిన్న లెక్కలేనన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి.ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.గాయాల పాలయ్యారు.Final Destination అనే సినిమాలో జరిగినట్లు ఒక చిన్న తప్పు వల్ల అనేక పెద్ద తప్పులు ఒక చెయిన్ రియాక్షన్ లాగా జరిగాయి.చివరకు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి.ఇదంతా కర్మప్రభావమే. 

ఇవన్నీ ఖచ్చితంగా అమావాస్య పరిధిలోనే జరిగాయి.

ఇవిగాక ముస్లిం ఉగ్రవాదం పెచ్చుమీరుతుందనీ, దానివల్ల దేశాలమధ్యన యుద్ధ వాతావరణం వస్తుందనీ కూడా వ్రాశాను.ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో జరుగుతున్న కొన్ని దేశాల యుద్ధం అదికాక మరేమిటి?

అయితే - ముందే అన్నీ తెలుసుకొని నివారణ చెయ్యవచ్చు కదా అనేది అజ్ఞానులు వేసే అజ్ఞానప్రశ్న.సామూహిక కర్మను తప్పించలేము. తప్పించకూడదు కూడా.కారణం ఏమంటే - అసలెందుకు తప్పించాలి? ఎవర్ని రక్షించడం కోసం చెయ్యాలి? మంచి చెబితే వినేవారు ఇప్పుడెవరున్నారు?ఎవరూ లేరు.అందరూ స్వార్ధపరులే,అందరూ అవినీతిపరులే,అందరూ అవకాశవాదులే.అందరూ దొంగలే.

కనుక వారి ఖర్మ వారిని అలా వెంటాడటమే కరెక్ట్.వాళ్ళు అలా చావడమే కరెక్ట్.కనుక ఈ ఖర్మను తప్పించాలని దైవజ్ఞులు ప్రయత్నించకూడదు.ఎవరైతే వారివారి వ్యక్తిగత కర్మను పోగొట్టుకోవాలని చూస్తారో,అలాంటి వారి నిజాయితీని గమనించి వారికి మాత్రమే సాయం చెయ్యాలి.అంతేగాని లోకకర్మలో సామూహిక కర్మలో ఎన్నడూ మనం జోక్యం చేసుకోకూడదు.

అందుకనే - లోకకల్యాణం కోసం హోమాలు యజ్ఞయాగాలు చేసేవారిని చూస్తే నాకు చచ్చే నవ్వొస్తుంది.వాళ్ళది వాళ్ళు కడుక్కుంటే చాలు లోకులది కడగక్కర్లేదు.అలా కడగడం వాళ్ళ వల్ల కాదు కూడా. 

"ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా ఎవరికైనా తప్పదన్నా
అలనాడు శూర్పణఖ ముక్కుచెవులూ పోయి అడవిలో పడి ఏడ్చెనన్నా"

"చేసేటప్పుడు నవ్వుతూ చేస్తారు.పడేటప్పుడు ఏడుస్తూ పడతారు"-- అనేది చాలా పాత సామెత.అది అక్షరాలా నిజం. 

ఎవరి ఖర్మను వారు అనుభవిస్తారు.మనకనవసరం.ఏది జరిగినా స్థితప్రజ్ఞతతో నవ్వుతూ శ్రీకృష్ణభగవానుడిలా చూస్తూ ఉండటమే మన చెయ్యవలసిన అసలైన పని.ఆయన కళ్ళముందే ముసలం పుట్టి తనవాళ్ళంతా తప్పత్రాగి ఒకరినొకరు కొట్టుకుని చస్తూ ఉంటే ఆయన ఏమాత్రం చలించకుండా నవ్వుతూ చూస్తూ నిలుచోలా? ఇదీ అంతే.

నడుస్తున్న మనుషులు నడుస్తున్నవారే పిట్టల్లా రాలిపోయే రోజులొస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయిదువందల సంవత్సరాల క్రితమే చెప్పారు.అప్పట్లోనే పెరుగుతున్న అధర్మాన్ని చూచే ఆయన ఆ మాటను వ్రాశారు.అది జరిగే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది.ధర్మాచరణ తీవ్రస్థాయిలో లోపించడమే ఈ విలయాలకు కారణం.అందరూ ధర్మాన్ని పాటించండి పాటించండి అని చెప్పేవారే గాని ఆచరించేవారు ఎక్కడా కనపడటం లేదు.కనీసం అలా చెబుతున్నవారు కూడా పాటించడం లేదు.అందుకే ఇలాంటి విలయాలు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా తీవ్రస్థాయిలో జరుగుతాయి కూడా.

ప్రజలలో పాలకులలో ఎవరిలో కూడా నీతీ నిజాయితీ ధర్మాచరణా లేనప్పుడు ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది? ఇలా జరగడమే కరెక్ట్.

జ్యోతిశ్శాస్త్రం ఎంత గొప్ప విజ్ఞానమో అని చెప్పడానికి ఇంకా ఇంకా వేరే రుజువులు ఏం కావాలి?