“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2015, సోమవారం

మూడవ యాస్ట్రో వర్క్ షాప్ - హైదరాబాద్ లో జరిగింది

మూడవ యాస్ట్రో వర్క్ షాప్ - అనుకున్నట్లుగానే హైద్రాబాద్ హిమాయత్ నగర్ లో దిగ్విజయంగా జరిగింది.ఈ సమావేశానికి దాదాపు 55 మంది హాజరయ్యారు.వీరిలో హైదరాబాద్ వారేగాక,చెన్నై,బెంగుళూర్, విజయవాడ, గుంటూరు మొదలైన ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారున్నారు.ఈ సమ్మేళనం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకూ జరిగింది.

సమావేశాన్ని విజయవంతం చెయ్యడంలో సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.కొందరైతే వారికి జ్యోతిష్యశాస్త్రం తెలియక పోయినా అర్ధం కాకపోయినా ఊరకే నన్ను కలవడం మాట్లాడటం కోసమే ఈ సమావేశానికి వచ్చారు.

మొదటి మరియు రెండవ జ్యోతిష్య సమ్మేళనాలలో ఇచ్చిన ప్రాధమిక సూత్రాల అవగాహనను కొనసాగిస్తూ, వాటి కొనసాగింపుగా ఈ మూడవ వర్క్ షాప్ లో చార్ట్ ఎనాలిసిస్ ఎలా చెయ్యాలో నాదైన పద్దతిలో వివరించడం జరిగింది.

ఈ సమావేశంలో వివరించబడిన విషయాలు:--

20 ఏళ్ళ పరిశోధనలో నేను కనుక్కున్న జ్యోతిష్య సూత్రాలను నాదైన విశ్లేషణా విధానాన్ని వీరికి పరిచయం చెయ్యడం జరిగింది.

ఆ తరువాత 16 జాతక చక్రాలను విశ్లేషిస్తూ నా సూత్రాలు ప్రతి జాతకంలోనూ ప్రాక్టికల్ గా ఎలా ప్రూవ్ అవుతున్నాయో నిరూపించడం జరిగింది.

ఈ జాతక చక్రాలలో-

మహాపురుషుల జాతకాలు-
శ్రీరామకృష్ణ పరమహంస,వివేకానంద స్వామి,రమణ మహర్షి,అరవింద యోగి.

రాజకీయ ప్రముఖుల జాతకాలు-
గాంధీ,నెహ్రూ,ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీ,బరాక్ ఒబామా.

అతి ధనవంతుల జాతకాలు-
వారెన్ బఫెట్,బిల్ గేట్స్,బ్రూనే సుల్తాన్,ధీరూభాయ్ అంబానీ,ముకేష్ అంబానీ,అనిల్ అంబానీ.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత జాతకాలను విశ్లేషించడం జరిగింది. నన్ను త్రికరణ శుద్ధిగా అనుసరిస్తే - ఒకటి రెండేళ్లలో మిమ్మల్ని జ్యోతిష్య శాస్త్రంలో దిట్టలుగా తయారు చేస్తానని వారికి ప్రామిస్ చేశాను.జ్యోతిష్య శాస్త్రం అనేది నా మొదటి ప్రయారిటీ కాదనీ, నా మొదటి ప్రయారిటీ యోగము-తంత్రము-ఆధ్యాత్మిక అంతరిక సాధన అన్న విషయాన్ని కూడా వారికి నొక్కి చెప్పాను. 

అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఫేమిలీ ఫంక్షన్ కంటే ఎక్కువ ఆత్మీయతతో ఈ సమ్మేళనం జరిగింది.అందరూ సరదాగా ఒకరితో ఒకరు కలసిపోయి ఒకవైపు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఇంకోపక్కన జోకులు నవ్వులతో ఈ సమ్మేళనం సాగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతులనూ అనేక మార్మిక విషయాలనూ సులభంగా విశ్లేషిస్తూ సాగిన ఈ సమ్మేళనం, దీనిలో పాల్గొన్న వారందరికీ మరపురాని అనుభవాన్ని మిగిల్చినదన్న విషయం చివరలో అందరూ మాట్లాడినప్పుడు వారివారి మాటల్లో అర్ధమైంది.

సమ్మేళనం తర్వాత పంచవటి సభ్యులు కొందరు నాతోపాటు నా రూమ్ కు వచ్చారు.అక్కడ మళ్ళీ ఒక రెండు గంటలపాటు చర్చ జరిగింది.వారితో జరిగిన సంభాషణలో - సూక్ష్మశరీరం ఎలా ఉంటుంది? స్వప్నలోకాలు ఎలా ఉంటాయి? వాటిలోకి ఎలా వెళ్ళాలి?కలల ప్రపంచాన్ని యోగశక్తితో ఎలా కంట్రోల్ చెయ్యాలి?ఇతరుల కలలలోకి మనం ఐచ్చికంగా ఎలా వెళ్ళగలుగుతాము?ఆ శక్తి ఎలా వస్తుంది? జ్యోతిష్యశాస్త్రానికీ కుండలినీ సాధనకూ గల సామ్యాలేమిటి? గతజన్మలను ఎలా తెలుసుకోవాలి?కర్మలకూ జన్మలకూ గల సంబంధాలు ఎలా ఉంటాయి? అతీతశక్తులు మనిషికి ఎలా కలుగుతాయి? వాటిని ఎలా వాడాలి?ఎప్పుడు వాడకూడదు? మొదలైన మార్మిక విషయాలమీద సంభాషణా వివరణా జరిగాయి.వీటిలో లోతైన విషయాలను వారికి వివరించాను.

వచ్చే నెలలో - ప్రాణశక్తి అభ్యాసాలతో కూడిన మార్షల్ ఆర్ట్స్ క్లాస్, ఆ తర్వాత జనసంచారానికి దూరంగా ఎక్కడైనా కొండల్లోకి వెళ్లి ఒక రెండు మూడురోజులు ఆధ్యాత్మిక సాధనాశిబిరం పెట్టుకుందామని నిర్ణయంతో ఈ సమావేశం ముగిసింది.

ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.