“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఆగస్టు 2015, మంగళవారం

జ్యోతిష్య శాస్త్రం నిజమని మీరు నిరూపించవచ్చుగా?

మొన్నొక అభిమాని కడప జిల్లా నుంచి ఫోన్ చేశాడు.

జ్యోతిష్యశాస్త్రం అబద్దం అని ఎవరో ఒకాయన ఫేస్ బుక్ లో తెగ అల్లరి చేస్తున్నాడనీ,ఆయన చాలా ఫేమస్ అయిపోయాడనీ చెప్పి, దీనిని మీరు ఎదుర్కోవచ్చు కదా? ఈ శాస్త్రం నిజమే అని ఆయన్ను నమ్మించవచ్చు కదా అని ప్రశ్నించాడు.

నేను సింపుల్ గా నవ్వేసి, 'నాకు ఇంటరెస్ట్ లేదు' - అన్నాను.

'ఇంటరెస్ట్ లేకుంటే మరి బ్లాగెందుకు వ్రాస్తున్నారు?' అని వెంటనే ప్రశ్న వచ్చింది.

'అది నా ఓపెన్ డైరీ.కొన్నేళ్ళ తర్వాత నేనే చదువుకోవడానికి అలా వ్రాసుకుంటూ ఉంటాను.అది ఒకరి కోసం కాదు.కాకపోతే, ఇంటరెస్ట్ ఉన్నవారు చదువుకోవచ్చు.అంతే.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

చాలామందిలో ఒక విషయం గమనిస్తూ ఉంటాను.వాళ్ళు చెయ్యాలనుకున్న పనిని,చెయ్యలేని పనిని నన్ను చెయ్యమని పురిగొల్పుతూ ఉంటారు.'మీకు టాలెంట్ ఉంది కదా.మీరు చెయ్యండి' అంటారు. ఇలాంటి వారిని చూస్తే నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది.

మీక్కావాలనుకుంటే మీరు చేసుకోండి. ఇదంతా నాకెందుకు? నా దారి వేరు.

జ్యోతిష్యశాస్త్రం కానీ, ఇంకే శాస్త్రం గానీ, నిజమే అని ఒకరికి ఋజువు చెయ్యాల్సిన పని నాకు లేదు. నా నమ్మకం నాది. నా ఈ నమ్మకానికి ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి.

నా నమ్మకం లాంటిదే వాళ్ళ నమ్మకం కూడా.వారికీ కొన్ని ఆధారాలు ఉండే ఉంటాయి. వాళ్ళ నమ్మకాన్ని మార్చాలన్న దుగ్ధ నాకేమీ లేదు.

వాళ్ళంతట వాళ్ళు నన్ను అనుసరిస్తే, అప్పుడు మాత్రమే, నాకు తెలిసిన విషయాలను వారికి నేర్పగలను.వాళ్లకు ఉపయోగపడగలను.అంతేగాని లోకాన్ని ఉద్ధరించే పని నాకక్కర్లేదు. దారిన పోయేవారిని వెంటపడి పిలిచి మరీ షడ్రసోపేతమైన భోజనం పెట్టాల్సిన పని నాకెందుకు?

మొన్నామధ్యన ఒక టీవీ చానల్ వారు ఫోన్ చేశారు.

'గోదావరి పుష్కరాల మీద చర్చా కార్యక్రమం పెడుతున్నాం.జ్యోతిష్య బృందంలో మీరూ పాల్గొంటారా?' అంటూ.

'నేను రాను.నాకిష్టం లేదు.' అని చెప్పాను.

'అదేంటి?' అన్నారు. పిలిచి టీవీ ప్రోగ్రాంలో చాన్స్ ఇస్తుంటే రాను పొమ్మన్నవాడిని బహుశా నేనే అయిఉంటాను ఇప్పటివరకూ.

'ఆ చర్చలలో ఏమీ తేలదు.ఊరకే అరుచుకోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు.నేను రాను.నాకు అవసరం లేదు' అని చెప్పాను.

జ్యోతిష్యశాస్త్రం నిజమే అని 100% నాకు తెలుసు. నా జ్ఞానాన్ని నాకోసం ఉపయోగించుకుంటాను.నన్ను అనుసరించే వారికోసం ఉపయోగిస్తాను. ఫలితాలు అందుకుంటాను.అంతేగాని లోకానికి బోధించాలని, నాస్తికులను ఆస్తికులుగా మార్చాలని నాకేమీ దురద లేదు.అందరూ ఆస్తికులుగా మతవాదులుగా మారిపోతే ఎలా?లోకంలో నాస్తికులూ ఉండాలి, హేతువాదులూ ఉండాలి.వారి పాత్ర కూడా లోకానికి అవసరమే.నకిలీ స్వామీజీలనుంచీ,నకిలీ బాబాల నుంచీ,నకిలీ జ్యోతిష్కుల నుంచీ లోకాన్ని రక్షించడానికి వారు అవసరమే.వారు మారకూడదు.వారు ఉండాలి.కావాలంటే నేను కూడా వారి తరఫున నకిలీలకు వ్యతిరేకంగా వాదిస్తాను.

అయినా ఒకరికి నిరూపించడం ఎందుకు? దాని అవసరం ఏముంది? కళ్ళు తెరిచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.సూర్యుడున్నాడని ఒకరికి నిరూపించవలసిన పని ఏముంది? కళ్ళు తెరిచి చూస్తే చాలు."నేను కళ్ళు తెరవను.తెరిస్తే నేను చులకనై పోతాను.నాకిలాగే బాగుంది"-అని ఎవరైనా అంటుంటే వారి కళ్ళు బలవంతాన తెరిపించవలసిన పని మనకెందుకు?వారికలాగే బాగుంటే అలాగే వారిని ఉండనివ్వడమే మంచిది.ఒకరి హాయిని మనం చెడగొట్టడం ఎందుకు?

ఒకరితో మనకనవసరం.

మనకు విషయం అర్ధమైంది కదా.దానిని సక్రమంగా మన జీవితాలలో ఉపయోగించుకుంటే చాలు.ఒకరిని మార్చవలసిన పనిని తెలివైనవాడు ఎప్పుడూ పెట్టుకోకూడదు.దానివల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు.

ఈలోకంలో ఎవరి ఖర్మకు వారే బాధ్యులు.అది చాలదన్నట్లు ఇంకొకరి కర్మలో కూడా మనం తలదూర్చాల్సిన పని ఎందుకు?