'None can reach Heaven, who had not passed through hell' - Sri Aurobindo in 'Savitri'

15, జులై 2015, బుధవారం

పుష్కర పాపం -2

1

ఆ|| నదుల మునిగినంత నైష్కర్మ్యమది రాదు
గుడుల దిరుగ గుడ్డి గుణము బోదు
మనసులోన మునుగు మహిత మార్గము నేర్చి
ఉన్నచోట నిలువ నుత్తమంబు

నదుల్లో మునిగితే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుందా? గుడుల వెంట తిరిగితే గుణం మారుతుందా? బయట క్రియలవల్ల అంతరిక శుద్ధి ఎన్నటికీ రాదు.మనసులో మునిగే రహస్యం తెలుసుకుని-ఆచరించి-సాధించాలి.ఉన్నచోటనే కదలకుండా ఉండి నిన్ను నీవు తెలుసుకుంటే చాలు.అది ఒక్కటే ఉత్తమమైన పని.

2

ఆ|| పుష్కరంబు లంచు పుణ్యతీర్ధ మటంచు
పిచ్చి పరుగులేల పైత్యమేల?
దివ్యజలము లన్ని దేహంబు లోనుండ
చావు కెదురు బోయి చావనేల?

పుష్కరాలనీ, పుణ్య తీర్దాలనీ పిచ్చిగా పరుగులు పెడితే పైత్యం పెరగడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. దివ్య నదులూ, తీర్ధాలూ అన్నీ నీ దేహంలోనే ఉన్నాయి.వాటిలో స్నానం చేసే రహస్యం తెలుసుకో. తెలుసుకున్న దానిని ఆచరించు.ఫలితాన్ని పొందు.ఇది అసలైన ఆర్షమార్గం.

3

ఆ|| కల్లకాలమందు కనులుగానగ రావు
ఆశ ముంచివైచు నడుసు నందు
నీట మునిగినంత నిత్యంబు దొరకునా?
సత్యగురుని మాట చద్దిమూట

కలికాలంలో మంచిమాటలు ఎక్కవు.కళ్ళు కనపడవు.దురాశ అనేది మనిషిని బురదలో ముంచుతుంది.నీళ్ళలో మునిగితే నిత్యమైన ఫలితం ఎలా వస్తుంది? సత్యమైన బోధ ఇదే.

4

ఆ|| పుణ్యమంచు బారి పిచ్చిపాట్లను దేలి
తంతులందు దూర తప్పు గాదె?
పుణ్యమెక్క డౌను?పాడు జీవనమందు
తెలివి దెచ్చుకొనుడు దేబెలార

పుణ్యం వస్తుందనే భ్రమలో పిచ్చి పిచ్చి ప్రవచనాలు విని అవన్నీ నిజాలనుకుని అర్ధం లేని తంతులు ఆచరిస్తుంటే అంతరిక శుద్ధి ఎలా కలుగుతుంది? నేడు మనిషి జీవితం అంతా కల్మషాల మయమే.ఇలాంటి కుళ్ళు బ్రతుకులు గడుపుతూ ఒకరోజున నీళ్ళలో మునిగినంత మాత్రాన పుణ్యం ఎలా వస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది?

5

ఆ|| బుద్ధిలేని జనులు బురదలోతుల జచ్చి
దైవనింద జేయ దప్పు గాదె?
గంగనున్న భవుడు ఘటము నందుండడా?
సత్యగురుని మాట చద్దిమూట

దురాశ చేత ఈడ్వబడే జనం బురద నీటిలో ప్రాణాలు పోగొట్టుకుని దానికి కారణం దైవం అని దైవాన్ని నిందించి ఉపయోగం ఏముంది? కుండలో నీళ్ళున్నాయి.కుండ నీ దేహం అయితే నీరు నీ ప్రాణం.నీటిలో దేవుడుంటే కుండలో ఉండడా? ఈ రహస్యాన్ని తెలుసుకో.

6

ఆ|| మెడలు బట్టి కర్మ; మిత్తి మార్గము జూప
ఆపగల్గు టెట్లు? అవనియందు
కల్లకలిని గెల్చు కనకంబు చేబట్టి
సాగమంచు జెప్పు సత్యగురుడు

పూర్వకర్మ బలీయం అయినప్పుడు మెడలు వంచి ప్రమాదం వైపు తోసుకుంటూ ఈడ్చుకు పోతుంది.దానిని ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా కలికర్మ ప్రభావం.కలికాలపు ఈ దుష్ట ప్రభావాన్ని గెలవాలంటే నీ చేతిలో బంగారం వంటి గురుబోధ ఉండాలి. దానిని నీ చేత ధరించి ముందుకు సాగావంటే అప్పుడు కలిప్రభావం నిన్ను తాకలేదు. 

7

ఆ|| పుష్కరముల మునుగ పుణ్యంబు దొరకునా?
బురద లోన గలదె? బుద్ధి బలము
నీటిలోని చేప నిజమోక్ష మందెనా?
మోక్షమనగ దెలియ మొక్కు గాదు

పుష్కరాలలో మునిగితే పుణ్యం వస్తుందా? ఆ పుణ్యం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది?మన ఖాతాలో ఎంత జమ అయిందో ఎలా తెలుస్తుంది? బురదనీళ్ళలో గుంపుగా మునిగితే మోక్షం వస్తుందా? అదే నిజమైతే -- ఎప్పుడూ ఆ నీటిలోనే ఉండే చేపకు మోక్షం రాదేమి? కోరికలతో మొక్కులు మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకోవడం మోక్షం అనబడుతుందా?

8

ఆ|| కలిని జనులు జేరి కల్మషంబులదేలి
సత్యపధము వదలి చవటలగుచు
గంతులెన్నొ వేయ గమ్యంబు దొరకునా?
పుచ్చులోకమందు పుణ్యమగునె?

కలికాలంలో ప్రజల ప్రవర్తన ఇలాగే ఉంటుంది.వారికి సత్యమార్గం అక్కర్లేదు. చెప్పినా ఎవరూ ఆలకించరు.విన్నట్లు నటిస్తారు గాని ఎవరూ వినరు.వారి పద్ధతులు మార్చుకోరు.పిచ్చిపిచ్చి తంతులలో గంతులేస్తుంటే పరమగమ్యం ఎప్పటికి దక్కుతుంది?ఎటుచూచినా రకరకాలైన పాపాలతో పుచ్చిపోయిన ఈ లోకంలో పుణ్యం అనేది అసలుందా?

9

ఆ|| ఆశలోన జిక్కి యల్లాడు జనులెల్ల
మంచి మాట వినగ మరలి రారు
అహము లోన యుండ ఆధ్యాత్మమందునా?
వేసడముల జిక్కు వెర్రి గాక?

ఆశాపాశంలో చిక్కి అల్లాడుతున్న జనులకు మంచిమాటలు ఎలా రుచిస్తాయి?రుచించవు.నిలువెల్లా అహంకారంతో కలుషితమైన మనుషులకు ఆధ్యాత్మికం ఎలా అందుతుంది?అసంభవం.ఎన్నేళ్ళు గడచినా వీరు ఎప్పటికీ ఇలా అనవసరములైన చేష్టలలో కాలం గడపవలసిందే.

10.

ఆ|| సత్యపధము వదలి సుద్దులందున దేలు
మోసకారులైన మాయజనులు
రెండు చెడిన యట్టి రేవళ్ళ చందంబు
కర్మ కట్లలోన గుములు జగము

సత్యమార్గాన్ని వదలి అనవసరములైన సుద్దులలో కాలక్షేపం చేసే మాయజనులు ఇహానికీ పరానికీ కూడా చెడిపోతారు.ఈ ప్రపంచం అంతా కర్మ అనే తాళ్ళతో గట్టిగా కట్టబడి ఉన్నది.వీటిని ఛేదించుకోగలిగిన వాడే అసలైన ఘనుడు.