“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, జులై 2015, మంగళవారం

పుష్కర పాపం

ఈరోజు మధ్యాన్నం పనిమీద ఒక మారుమూల స్టేషన్లో ఉండగా మిత్రునినుంచి ఫోన్ వచ్చింది.అతను పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో స్పెషల్ డ్యూటీ మీద వెళ్లి తిరిగి వస్తూ ట్రెయిన్ లోనుంచి నాకు ఫోన్ చేశాడు.

'ఏంటి సంగతి?' అడిగాను.

'రాజమండ్రిలో తొక్కిసలాట జరిగింది.30 మంది చనిపోయారు.'అన్నాడు.

వెంటనే నాకు ఒకే ఊహ వచ్చింది.

రోహిణీ శకటభేదన ప్రభావం -- సామూహిక జనహననం!!!

'మంచిది' అన్నాను క్లుప్తంగా.

'అదేంటి అలా అంటావ్?నీకు బాధగా లేదా?' అన్నాడు.

'ఎవరికుంది బాధ వారివారి కుటుంబ సభ్యులకు తప్ప?' అడిగాను.

'అవుననుకో అయినా ఎందుకిలా జరిగిందో? అన్నాడు.

'కనిపించే కారణాలు చెప్పనా? కన్పించని కారణాలు చెప్పనా?' అడిగాను.

'అలాకాదు.ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇలా జరిగితే నీకు బాధ అనిపించట్లేదా?' అడిగాడు.

'ఇందులో ఆధ్యాత్మికం ఎక్కడుంది?' ఎదురు ప్రశ్నించాను.

'ఆధ్యాత్మికం కాకపోతే ఇదంతా ఏమిటంటావ్?'- అన్నాడు.

'దీనిని నేను ఆధ్యాత్మికం అనను.ఇందులో మనుషుల స్వార్ధమూ దురాశా తప్ప ఇంకేమీ నాకు గోచరించడం లేదు.' అన్నాను.

నా ధోరణి తనకు తెలుసు గనుక ఇంకేమీ రెట్టించకుండా ఏవేవో ఇతర విషయాలు మాట్లాడి పెట్టేశాడు.

భూమిమీద మనుషులకు కర్మ తీరే మార్గాలు అనేకం.

పుష్కరాలలో మొదటిరోజు మొదటిస్నానం చేద్దామని ఆత్రంతో ఎగబడి ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుని కొంతమంది చనిపోతారు.

పుణ్యక్షేత్రాలలో దర్శనాలకోసం ఎగబడి ఆ తోపులాటలో ఇంకొంతమంది చనిపోతారు.

పుణ్యం మీద ఆశతో ప్రమాదకరయాత్రలు చెయ్యబోయి ప్రమాదాలలో చిక్కుకుని కొంతమంది చనిపోతారు.ఇంతా చేస్తే ఆ పుణ్యం అనేది ఎక్కడుంటుందో మన ఎకౌంట్లో అసలు జమ అవుతుందో లేదో ఎవరికీ తెలియదు.అదొక స్విస్ బ్యాంక్ ఖాతా లాంటిది.అందులో ఎవరికి ఎంతుందో వారికే తెలియదు.వారికే కాదు ఎవరికీ తెలియదు.

మొదటిరోజు మొదటి ఆట సినిమా చూడాలని టికెట్ల తోపులాటలో కొంతమంది చస్తారు.దీనికి కారణం - అభిమానపు వెర్రి.

ర్యాష్ డ్రైవింగ్ లో కొంతమంది చనిపోతారు.మరి కొంతమంది తమ డ్రైవింగ్ తో,ఎదుటివారినీ,తనతో ప్రయాణం చేస్తున్న వారిని చంపుతారు.దురుసుతనం దీనికి కారణం.

ప్రతిదానికీ రకరకాల కారణాలున్నట్లే పోవడానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది.లేదా అనేక కారణాల సామూహిక ప్రభావం కూడా ఉంటుంది.

కానీ పుణ్యక్షేత్రాలలో తోసుకుని తొక్కుకుని చావడం చాలా ఘోరం.

ఏదో పుణ్యం తేరగా సంపాదించేద్దాం అనే దురాశే దీనికి కారణం.

పక్కవాడు ఎలా పోయినా పోనీ, మన పుణ్యమే మనకు ముఖ్యం అనే పచ్చిస్వార్ధమే దీనికి కారణం.అసలు అటువంటి ఆలోచనే పెద్ద పాపం అన్న సంగతి వాళ్లకు తెలియదు.

"144 ఏళ్ళకు గాని మళ్ళీ ఇలాంటి పుష్కరాలు రావు,మంచితరుణం మించిపోవును.తొందరగా వచ్చి మునగండి" -- అంటూ మీడియా అతిప్రచారం ఇంకొక కారణం.

మూఢభక్తి ఇంకొక కారణం.

అసలు పుష్కరం అంటే ఏమిటో తెలియని అజ్ఞానం ఇంకొక కారణం. టీవీలలో చెబుతున్నది అంతా నిజమని నమ్మే అమాయకత్వం ఇంకొక కారణం.


పుష్కరాలను మేనేజ్ చెయ్యడంలో అధికారుల చేతగానితనం ప్రధానమైన కారణం.

మేనేజ్ చెయ్యడం చేతగానప్పుడు -- టీవీలలో ఊదరగొట్టి,ఇంతమందిని అక్కడకు ఆకర్షించి చివరకు నట్టేట ముంచడం అసలు కారణం.

పక్కవాడు ఏమైపోతే మనకెందుకు?వాడిని పక్కకు తోసేసి మనం ఆ బురదనీళ్ళలో మూడుమునకలేసి పుణ్యం మూట గట్టేసుకుందాం అనే దురాశలో సాటి మనుషులను తొక్కేసి/తొక్కబడి పాపం మూటగట్టుకుని అది మోసుకుంటూ పరలోకానికి ప్రయాణం కట్టడం ఇంకొక కారణం.

కలియుగంలో చావుకు అనేక విచిత్ర కారణాలుంటాయి. ఎందుకంటే ఈ కలికాలంలో మనం చేసుకునే కర్మ కూడా అలాగే చిత్రవిచిత్రాలుగా ఉంటుంది మరి.

అలాగే- చావు అనేది ఒక మనిషిని పికప్ చేసుకోవడం కూడా విచిత్రంగానే ఉంటుంద.

నేను రాయలసీమలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను.

అక్కడ ఫాక్షన్ గొడవలుంటాయి.వారికి కావలసిన మనిషి ఒక వందమందిలో ఉన్నాకూడా మిగతావారిని ఏమీ చెయ్యకుండా ఆ ఒక్కడిని మాత్రమె పికప్ చేసుకుని అతన్నే చంపేస్తారు వాళ్ళు.కనీసం అతని పక్కనే ఉన్న మనిషిని కూడా ఏమీ చెయ్యరు, అతను ప్రతిఘటిస్తే తప్ప.

వాళ్ళు యమునికి ప్రతిరూపాలే గనుక చావు ఎలాగైతే వందమందిలో ఉన్నాసరే తనకు కావలసిన వారిని ఎలాగైతే పికప్ చేసుకుంటుందో వాళ్ళూ అదే పని చేస్తారు.

పుష్కరాలకు లక్షలమంది వెళ్ళారు.కానీ కొందరినే చావు తీసుకుపోయింది.దానికి కారణాలేంటి?

ఎవరికి కనిపించే కారణాలు వారిని కన్పిస్తాయి.

కొంతమంది ప్రభుత్వాన్ని నిందిస్తారు.కొంతమంది మనుషుల దురాశనీ,మూర్ఖత్వాన్నీ నిందిస్తారు.కొంతమంది మీడియా అతి ప్రచారాన్ని నిందిస్తారు.మరికొంతమంది ఏకంగా మతాన్నే నిందిస్తారు.

ఎవరి భావాలు వారివి.

అసలు సంగతి ఏమంటే --

పుష్కరస్నానాల కోసం ఇలా ఎగబడవలసిన పని ఎంత మాత్రం లేదు.

ఈ విధంగా చావవలసిన పని అంతకంటే లేదు.

పుష్కరాల ప్రభావం ఈ పన్నెండు రోజులు మాత్రమె కాదు. ఏడాది పాటు ప్రతిరోజూ ఉంటుంది. ఈ ఏడాదిపాటూ ప్రతిరోజూ మధ్యాన్నం సూర్యుడు నడినెత్తిన ఉండే సమయంలో గోదావరికి పుష్కరమే.ఒక నెలతర్వాత, ఒకరోజు మధ్యాన్నం పూట, ఎవరూ లేని సమయంలో నిదానంగా వెళ్లి స్నానం చేస్తే సరిపోతుంది.అప్పుడు ఈ తొక్కిడీ ఉండదు.ఈ గోలా ఉండదు. ప్రశాంతంగా స్నానం చేసి మన జపమో ధ్యానమో హాయిగా చేసుకోవచ్చు.

ఇంకా చేతనైతే -- మనం ఉన్న ఊరిలో, మన ఇంట్లోనే కదలకుండా కూచుని పుష్కరస్నాన ఫలితాన్ని పొందవచ్చు. అయితే అది యోగమార్గం.ఇది వినడానికి వింతగా ఉండవచ్చు.


కానీ సాధ్యమే.

అది చేతకానంత వరకూ మనుషులు ఇలా రకరకాల అజ్ఞానాలకి గురయ్యి మోసపోకా తప్పదు.బలికాకా తప్పదు.

మన లోపల ఏదుందో బయటకూడా అదే మనకు ఎదురౌతుంది.ఇదొక విశ్వ నియమం.ఇదే విషయాన్ని 'శ్రీవిద్యా రహస్యం' లో ఎన్నో చోట్ల వ్రాశాను.

Faith business is the greatest business on Earth.

And every business has its own risks and dangers.

ఆరేళ్ళ క్రితం నా బ్లాగులో మొదటి పోస్ట్ వ్రాసినప్పుడు ఇదే మాటను వ్రాశాను.అప్పుడు తుంగభద్రా పుష్కరాలు జరుగుతున్నాయి. మంత్రాలయంలో తుంగభద్రానదీ తీరంలో ఎవరూలేని ఒక రేవులో ప్రశాంతంగా స్నానం చేసి జపధ్యానాలు ముగించిన తర్వాత కలిగిన భావంతో నా బ్లాగు మొదటి పోస్ట్ వ్రాశాను.

"మనలోని ముష్కరుడు (స్వార్ధం, అహంకారం, అసూయ, కపటం,దురాశలు) పోనంతవరకూ ఎన్ని పుష్కరాలలో మునిగినా ఫలితం శూన్యం."


ఆరేళ్ళ తర్వాత ఈరోజున మళ్ళీ అదే జరిగింది.

ఇంతకీ ఇంతమంది చావులకు ఎవరు బాధ్యులు? ఈ పాపం ఎవరి తలపైన కూచుంటుంది? అంటే - ప్రభుత్వం,మీడియా,అక్కడ గుమిగూడి తోసుకున్న జనం,సామాన్యజనం రావలసిన ఘాట్ లో రాజకీయ నాయకులను రానిచ్చి, వారికోసం అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా తోసేసిన అధికారులూ--వీరందరికీ ఈ పాపంలో భాగం ఉంటుంది.

పుష్కరస్నాన పుణ్యం మాట అలా ఉంచితే, నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన పాపం వీరందరి నెత్తినా ప్రస్తుతం నాట్యం చేస్తున్నది.ఇది పోగొట్టుకోవాలంటే ఇంకే గంగల్లో మునగాలో? పోనీ వీరందరూ అలా మునిగినా అది పోతుందని గ్యారంటీ ఏముంది?

కలియుగమా ఇంకా ఇంకా వర్ధిల్లు !!!