“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, అక్టోబర్ 2018, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 21 (పెట్టిన ముహూర్తం - జరిగిన ముహూర్తం)

13 వ తేది ఉదయం జిల్లెళ్ళమూడిలో మా గృహప్రవేశం జరిగింది. ముహూర్తాన్ని 8.31 AM నుంచి 8.45 AM లోపుగా నిర్ణయించడం జరిగింది. వారం ముందే అందరికీ చెప్పడం ఆహ్వానించడం జరిగిపోయింది. ఉదయం 5.30 కి ఇక్కడ బయలుదేరి 7.30 కల్లా జిల్లెల్లమూడి చేరాలని అనుకున్నాము. కానీ, హైద్రాబాద్ నుంచి రావలసిన వాళ్ళు ఆలస్యం అయ్యి, 6.15 కి గుంటూరులో బయలుదేరాము.

మూర్తి, రాజు మోటార్ సైకిల్ మీద బయలుదేరారు. మాకంటే కొంచం ముందుగా స్పీడుగా వెళ్లి అక్కడ పనులు ఏమన్నా ఉంటే చూస్తామని అన్నారు. సరేనన్నాను.

'మనం పెట్టుకున్న ముహూర్తం అవదేమో? "పెట్టింది ముహూర్తం కాదు. జరిగినదే ముహూర్తం" అని అమ్మ అన్నది కదా? అయినప్పుడే అవుతుందిలే' - అని నాతో వస్తున్నవారు కొందరన్నారు.

నేనేం మాట్లాడలేదు.

అమ్మ భక్తులలో చాలామందిని నేను గమనించాను. అమ్మ మాటల్లోని లోతులను వారు ఏమాత్రమూ పట్టుకోలేక పోతున్నారు. ఊరకే పైపైన యధాలాపంగా అమ్మ వాక్యాలను మాత్రం ఉదాహరిస్తూ ఉంటారు. వీరిని చూస్తే నాకు నవ్వూ జాలీ ఒకేసారి కలుగుతూ ఉంటాయి.

అమ్మ చెప్పిన ఈ వాక్యంలో కూడా కనపడని లోతు చాలా ఉంది. ఈ మాటలో పాపపుణ్యాలూ, పూర్వకర్మా, ఇప్పటి ప్రయత్నమూ, దైవానుగ్రహమూ - ఇవన్నీ కలసి మెలసి పడుగుపేకల లాగా పెనవేసుకుని ఉన్నాయి. ఆ లోతులను అర్ధం చేసుకోవాలంటే సూక్ష్మదృష్టి కావాలి. అలాంటి లోతైన దృష్టితో చూడకుండా, ఊరకే పైపైన అమ్మ వాక్యాలను మనకు నచ్చినట్లుగా ఉదాహరిస్తే ఎంతమాత్రమూ సరిపోదు. కానీ అమ్మ భక్తులలో చాలామంది ఇలాగే కాజువల్ గా మాట్లాడటం నేను గమనించాను.

పెట్టిన ముహూర్తమే ఎందుకు జరుగుతుంది? ఇంకొందరికి ఎందుకు తప్పిపోతుంది? అసలు ముహూర్తం పెట్టేది ఎవరు? పెట్టించేది ఎవరు? తప్పించేది ఎవరు? జరిగిందని సంతోషపడేది ఎవరు? తప్పిందని బాధపడేది ఎవరు? జరిగినంత మాత్రాన ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందా? తప్పిందని అంతా చెడే జరుగుతుందా? సృష్టిలో ప్రతిదీ ఏ ముహూర్తం ప్రకారం జరుగుతోంది?

ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. పెద్ద స్పీడుగా డ్రైవ్ చెయ్యకపోయినా 8.05 AM కల్లా జిల్లెళ్ళమూడి చేరుకున్నాము. అనేక ప్రాంతాల నుండి అప్పటికే అక్కడకు చేరుకొని సిద్ధంగా ఉన్న పంచవటి సభ్యులను చూచి ఆనందం కలిగింది. ముందుగా అమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, వసుంధరక్కయ్యతో కాసేపు మాట్లాడి, శ్రీమన్నారాయణ గారి దగ్గరకు వెళ్ళాము. అమ్మ ఫోటోని పట్టుకుని అందరూ అక్కడ మాకోసం వేచి ఉన్నారు. అక్కడనుంచి అందరం ఊరేగింపుగా బయల్దేరి నడుచుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చాము.

పురోహితుడూ మిగతా తంతూ వద్దని ముందే నేను చెప్పి ఉండటంతో ఆ ఏర్పాట్లు ఏమీ చెయ్యలేదు. సింపుల్ గా రిబ్బన్ కత్తిరించి లోనికి వెళ్లి అమ్మ ఫోటోను, శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానందస్వాముల ఫోటోలను పూజా మందిరంలో ఉంచేసరికి సరిగ్గా 8.35 AM అయింది.

ఆ విధంగా, పెట్టిన ముహూర్తమే జరిగిన ముహూర్తం కూడా అయింది.

మామూలు దృష్టిలో అయితే అమ్మ చెప్పినమాట కరెక్టే. అహంకార పూరితంగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం కొన్నిసార్లు నెరవేరవచ్చు, ఇంకొన్నిసార్లు నెరవేరకపోవచ్చు. కానీ మన సంకల్పం దైవసంకల్పంతో కలిసిపోయినప్పుడు, అక్కడ చేరిన మనుషుల కర్మకూడా దానికి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం పెట్టిన ముహూర్తమే జరిగే ముహూర్తం కూడా అవుతుంది. ఆ రోజున జరిగింది అదే.

'కర్మ' అని ఎందుకంటున్నానంటే, ఇలాంటి విషయాలలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు - ఈ కార్యక్రమానికి రమ్మని చాలామందికి ముందుగానే చెప్పాను. కానీ వాళ్ళలో చాలామంది రాలేకపోయారు. ఇంకొందరిని పిలవకపోయినా (క్రొత్తవాళ్ళు) ఆ సమయానికి అక్కడకు రాగలిగారు. రాలేనివారికి, చెడుకర్మ చాలా బలంగా ఉన్నదని అర్ధం. వారి కారణాలు వారికి ఉండవచ్చు. కాని సత్యం ఏమంటే - పూర్వం చేసుకున్న చెడుకర్మ చాలా బలంగా వారి ఎకౌంట్లో ఉంటుంది. అది వారిని రానివ్వదు. ఇది సత్యం. దానిని అధిగమించి రాగలిగినప్పుడే వాళ్ళు పూర్వకర్మను జయిస్తున్నట్లు లెక్క. లేకుంటే దానికి లొంగిపోయినట్లే. అప్పుడు దైవశక్తికి వారు దూరమైనట్లే.

ఇదే, అమ్మ చెప్పిన మాటకు నేనిచ్చే వివరణ.

లోకంలో ఎన్నెన్నో ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఆ కార్యక్రమాలలో చాలావరకూ అదే ముహూర్తానికి జరుగుతూ ఉంటాయి కూడా. వారికందరికీ దైవానుగ్రహం ఉన్నట్లేనా? అని ప్రశ్న ఉదయిస్తుంది. వారందరిమీదా పరిపూర్ణంగా దైవానుగ్రహం ఉన్నట్లు కాదు. ఆ ముహూర్తం జరగడానికి మాత్రం ఉన్నట్లు లెక్క !!

మా ఈ గృహప్రవేశం చాలా విలువైన కార్యక్రమం. ఇది పంచవటి ప్రస్థానంలో ఒక మైలురాయి. దీని ప్రాముఖ్యతను కొంతమంది గుర్తించలేకపోవడం వారి దురదృష్టం. దైవం ఇచ్చిన ఆశీస్సులను, మన అహంకారం, నిర్లక్ష్యాలతోనే మనం చాలావరకూ చేజార్చుకుంటూ ఉంటాం. మన పాత్రతను బట్టే గదా మన యాత్ర జరిగేది !!