Love the country you live in OR Live in the country you love

6, అక్టోబర్ 2018, శనివారం

చరణామృతం

జిల్లెళ్లమూడిలో మేము ఇల్లు కొనడం తమ్ముడు చరణ్ ను మహదానందపరచింది. రిజిస్ట్రేషన్ రోజున తను కూడా మాతో బాపట్ల రావలసి ఉన్నది. కానీ ఆఫీసులో పనుండి రాలేకపోయాడు. రాలేకపోయినా తన మనసంతా మాతోనే ఉంది. జిల్లెళ్లమూడిలో అమ్మ పాదాల దగ్గరే ఉంది. ఆనందంతో తబ్బిబ్బై పోయింది. ఆ ఆనందం కవితగా మారింది. ఆ కవిత అక్షరాల రూపంలో దూకింది. నాకు పంపించాడు. హృదయంలోనుంచి పుట్టిన ఇలాంటి కవితలు కలకాలం భద్రపరుచవలసినవి. బంగారంలో వ్రాసి ఉంచుకోదగ్గవి. మనకు అంత స్తోమత లేదు గనుక బ్లాగులో భద్రపరుస్తున్నాను.
----------------------------
'అందరికీ సుగతే' నన్నది అమ్మ వాక్కు
అర్కపురి జేరయది త్వరగ జిక్కు
'పంచవటీయుల' కిదే హక్కు; భుక్కు; 
మాతృ శ్రీచరణుడిదే భవిష్యవాక్కు 
---------------------------

'జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి'

Note:-- జిల్లెళ్లమూడి మరోపేరు అర్కపురి. జిల్లేడుచెట్టు సూర్యునకు ఇష్టమైనది. పూర్వకాలంలో జిల్లెళ్లమూడిలో జిల్లేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే ఆ పేరు వచ్చింది. జిల్లేడాకును అర్కపత్రం అని పిలుస్తాము. అందుకే జిల్లెళ్లమూడి అర్కపురి అయింది. అంటే, సూర్యనిలయం అని అర్ధం. అజ్ఞానపు చీకటిని తన అమేయమైన ప్రేమవెలుగుతో చెల్లాచెదరు చేసిపారేసే అమ్మ నివసించిన చోటు సూర్యనిలయం కాక మరేమౌతుంది?