Love the country you live in OR Live in the country you love

19, అక్టోబర్ 2018, శుక్రవారం

జిల్లెళ్లమూడి స్మృతులు - 23 (కార్యక్రమం శాస్త్రోక్తమేగా?)

రవన్నయ్య వచ్చి వెళ్ళాక, మేమంతా లేచి, ఒకసారి వసుంధర అక్కయ్య దగ్గరకు పోయి వద్దామని క్రిందకు దిగడం మొదలు పెట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకాయన ఎదురయ్యాడు.

'మీ క్రింది ఫ్లాట్ లో ఈయన ఉంటారు.' అని శ్రీమన్నారాయణగారు ఆయన్ని నాకు పరిచయం చేసాడు.

నేను నమస్కారం చేస్తూ ఆయనవైపు చూచాను. చాదస్తపు బ్రాహ్మడిలా కనిపించాడు.

'కార్యక్రమం శాస్త్రోక్తంగానే జరిగిందిగా?' అని అనుమానంగా ఆయన శ్రీమన్నారాయణగారిని అడిగాడు.

నేను ప్రక్కనే ఉండటంతో జవాబు చెప్పడానికి ఆయన మొహమాటపడి ఊరకే నవ్వి ఊరుకున్నాడు.

ఆయన నన్నడక్క పోయినా, నేను కల్పించుకుని - 'అవును. శాస్త్రోక్తంగానే జరిగింది. కానీ మా శాస్త్రం వేరు.' అని జవాబిచ్చాను.

'అదే ! మంత్రాలూ అవీ వినపడకపోతే అలా అడిగాన్లెండి' అన్నాడాయన మళ్ళీ అనుమానంగా.

'మా మంత్రాలు పైకి వినపడవు లెండి' అని చెప్పి, 'ఈ పుస్తకం ఈ మధ్యనే వ్రాశాను. చదవండి.' అంటూ 'జాబాల దర్శనోపనిషత్' పుస్తకాన్ని ఆయన చేతిలో ఉంచాను.

'ఓ ! ఉపనిషత్తు కదా? ఎక్కడనుంచి తీసుకున్నారు?' అడిగాడాయన.

'ఉపనిషత్తుల్లోంచే తీసుకున్నాను' అన్నా నేను నవ్వుతూ.

నా ధోరణి ఆయనకర్ధం కాలేదు లాగుంది కొంచం ముఖం చిట్లించాడు.

ఇలాంటి వాళ్ళను కొన్ని వందలమందిని చూచీచూచీ విసిగి పోయి ఉండటంతో - 'సరే. పోదాం పదండి' అని అందరితో చెబుతూ నేను రోడ్డుమీదకు వచ్చాను.

చాలామంది ఇంతే ! వాళ్లకు తెలిసినదే శాస్త్రం అనుకుంటూ ఉంటారు. శాస్త్రంలొ ఎన్నో లెవల్స్ ఉన్నాయని పాపం వారికి తెలీదు. అమ్మగారి తత్త్వం వీళ్ళకు ఎప్పుడు వంటపడుతుందా అని జాలి కలిగింది.

అమ్మ అనేమాట ఒకటి గుర్తొచ్చింది.

'మీరు చెప్పేది మంత్రం. నేను చేసేది తంత్రం' అని అమ్మ కొంతమంది పురోహిత బ్రాహ్మలతో అన్నది.

అంటే, మంత్రాలతో పని లేకుండా అమ్మ సూటిగా ఆ పనిని చేసేస్తుంది. మంత్రాలనేవి ఒక వయా మీడియా లాంటివి. నిశ్చలం కాలేని మనస్సుకు అవి ఒక సపోర్ట్ లాంటివి. డైరెక్ట్ గా మూలానికి వెళ్లేవారికి మంత్రాలు అవసరం లేదు. చెయ్యగలిగితే, మంత్రం చెయ్యలేని పనిని తంత్రం ద్వారా డైరెక్ట్ గా చెయ్యవచ్చు.

'ఎలాంటి మనుషులతో వేగుతున్నావమ్మా?' అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. మనసులోనే నవ్వుకుంటూ అక్కయ్య ఇంటికి నడక సాగించాం.