“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, అక్టోబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర - 2 (Spiritual City)










 హోటల్ కు చేరుకొని ఫ్రెష్ అయ్యి, కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాను.

నాందేడ్ గురించి మా కొలీగ్స్ ద్వారా నేను చాలా విన్నాను. అదొక నరకమనీ, అక్కడ తిండి, భాష, మనుషుల ప్రవర్తనా అన్నీ వేరనీ, మహారాష్ట్ర కల్చర్ అనీ, అక్కడ మనం ఉండలేమనీ నాకు చాలామంది చెప్పారు. కానీ నాకలా ఏమీ అనిపించలేదు. అక్కడి వైబ్రేషన్స్ ను బట్టి అదొక ఆధ్యాత్మిక నగరం అని నాకనిపించింది.

మా కొలీగ్ ఒకాయనతో ఫోన్లో ఈ మాట అంటే -' టూరిస్ట్ గా అక్కడకు వెళితే బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఉండి ఉద్యోగం చెయ్యవలసి వస్తే అప్పుడు నరకం కనిపిస్తుంది' అన్నాడు.

ఏ ఊరైనా సరే, అక్కడున్న గొర్రెల్లాంటి మనుషుల వల్ల దానికి విలువ రాదు. ఎక్కడైనా మనుషులు ఒకే విధంగా పశువుల్లా బ్రతుకుతూ ఉంటారు. వాళ్లకు కావలసింది డబ్బు, తిండి, సెక్స్, సరదాలు, ఆస్తులు అంతే. ప్రపంచం మొత్తం ఈ ఊబిలోనే ఉంది. వీటివల్ల ఒక ఊరికిగాని మనిషికిగాని విలువ ఎప్పటికీ రాదు. అక్కడున్న కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాల వల్ల, అక్కడ బ్రతికిన ప్రత్యెక వ్యక్తులవల్ల ఆ ఊరికి విలువ వస్తుంది. అతని ఉన్నతమైన జీవనవిధానం వల్ల మనిషికి విలువ వస్తుంది. నేను ఏ ఊరినైనా ఏ మనిషినైనా ఇదే దృష్టితో చూస్తాను.

నేను మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ తిండినే తినడానికి చూస్తాను, అక్కడి కల్చర్ ను అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాను గాని మన ఆంధ్రా హోటల్ ఎక్కడుందా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళను. అందుకని, ఇతర రాష్ట్రాల గురించి మామూలుగా మన తెలుగుజనం మాట్లాడుకుండే సోదిమాటలు నాకు రుచించవు. 

ఇంతలో టిఫిన్ వచ్చింది. తినేసి స్టేషన్ కు బయలుదేరాను. అక్కడకు చేరాక, పొద్దున్న నేనేదైతే స్టేషన్ లో రెండుగంటల పైగా రైల్లో వేచి ఉన్నానో, అదే మాల్ టేక్డి స్టేషన్ లో నాకు నైట్ డ్యూటీ అని తెలిసింది.  రోజంతా చేసేదేమీ లేదు. కాసేపు ఆఫీస్ లోనే కూర్చుని అక్కడ మనుషుల పనితీరును గమనిస్తూ ఉన్నాను.

ఇంతలో మా ఇన్స్పెక్టర్ ఒకాయన వచ్చి - 'సార్. ఇక్కడ గురుద్వారాలు చాలా ఫేమస్. మిమ్మల్ని అక్కడకు తీసుకు వెడతాను. వెహికిల్ రెడీగా ఉంది. మీరు సిద్ధమైతే మనం వెళదాం' అన్నాడు.

'ఏ గురుద్వారాకు వెళదాం?' అన్నాను.

'ఇక్కడ దాదాపు 14 గురుద్వారాలున్నాయి. కానీ వాటిల్లో ముఖ్యమైనది 'సచ్ ఖండ్ గురుద్వారా'. దానిపేరు మీదనే అమృత్ సర్ నుంచి ఇక్కడకు 'సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్' ఉన్నది.' అన్నాడు.

'ఓహో అదా సంగతి' అనుకున్నాను.

'సచ్ ఖండ్' అంటే సత్యస్వరూపమని సత్యలోకమని అర్ధం. నిత్యసత్య స్వరూపమైన బ్రహ్మమునే గురునానక్ 'సచ్ ఖండ్' అన్నాడు. కనుక ఆ గురుద్వారాకు అదే పేరు వచ్చింది.

నాందేడ్ చాలా ఓల్డ్ టౌన్. ఫక్తు నార్త్ ఇండియా కల్చర్ అక్కడ కనిపిస్తున్నది. నవీనకాలపు పోకడలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మంచి రిచ్ టౌన్ అని కొద్ది సేపట్లోనే అర్ధమైంది. కొద్దిసేపట్లో సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నాం. అది చాలా పెద్దది. ఎంతో విశాలమైన ప్రాంగణంలో కట్టబడింది. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ ఇక్కడే చనిపోయాడని అంటారు.

మమ్మల్ని సరాసరి గర్భాలయంలోకి తీసుకెళ్ళిన మా ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న ప్రధాన పూజారికి మమ్మల్ని పరిచయం చేశాడు. ఆయన ఆదేశం మేరకు అక్కడున్న ఒక సిఖ్ ముందుకొచ్చి మా భుజాల చుట్టూ శాలువలు కప్పి సత్కరించాడు. చాలా సంతోషం కలిగింది. కొద్దిసేపు అక్కడ ఉండి, కొన్ని ఫోటోలు తీసుకుని, బయట హోటల్లో భోజనం చేసి మళ్ళీ హోటల్ కు చేరుకున్నాం. రాత్రికి డ్యూటీ ఉంది కనుక మధ్యాన్నం కొద్దిసేపు నిద్రపోయాను.

(ఇంకా ఉంది)