“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, అక్టోబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర - 1 (అనుక్షణం జరిగేదే అనుష్ఠానం)

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ కు రాత్రి పదకొండున్నరకి చేరింది. రైల్వేలో ఉన్న నాకే విసుగు పుట్టింది. సమయానికి సరిగ్గా నడపడం చేతకానప్పుడు ఎందుకు కొత్తకొత్త రైళ్ళు ప్రవేశపెడతారో అర్ధం కాదు. మంత్రిత్వశాఖ నుంచి ఒత్తిడి ఉంటుంది. అందుకని ప్రవేశపెడతారు. కానీ సమయానికి నడపడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. కనుక నడపలేరు. అలాంటప్పుడు కొత్త రైళ్ళు ప్రవేశ పెట్ట కూడదు. కానీ ఇదంతా ఎవడికి పట్టింది?

జపాన్ లో అయితే, నూరు రైళ్ళు కరెక్ట్ గా నడపడానికి వీలున్న ఒక లైన్ లో డెబ్భై రైళ్ళు నడుస్తున్నపుడే కొత్త లైన్ వేసుకుంటారు. పాత లైన్లో ఇంకో రైలును అనుమతించరు. ఈ విషయం అమరావతిని సందర్శించిన జపాన్ రైల్వే బృందం చెప్పింది. కానీ మన భారతీయ రైల్వేలలో అదే లైన్ మీద నూట డెబ్భై రైళ్ళను కుక్కి కుక్కి నడుపుతున్నాం. ఇండియాలో రైల్వే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా రాజకీయ నాయకుల నిర్వాహకమే. మన రైల్వేలో ప్రస్తుతం కావలసింది కొత్త లైన్లు మాత్రమే. కానీ అవి వెయ్యకుండా కొత్త రైళ్ళు మాత్రం వేస్తున్నారు. అందుకే రైళ్లన్నీ లేట్ గా నడుస్తూ ఉంటాయి. ఇదీ లోగుట్టు !!

నాందేడ్ పాసింజర్ ఉందో వదిలిందో తెలీదు. మొత్తం మీద ఒకటో నంబరు ప్లాట్ ఫాం మీద దిగాక అది ఏడో నంబర్ నుంచి కదలడానికి సిద్ధంగా ఉందని ఎనౌన్స్ మెంట్ వినిపించింది. పరుగు అందుకుని బ్రిడ్జి ఎక్కి చూస్తే, 7A ఉంది 7B ఉందిగాని ప్లాట్ ఫాం 7 మాత్రం కనిపించలేదు. భలే చిరాకనిపించింది. రైల్వేలో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న నాకే ఇలా ఉంటే ఇక ఒక మామూలు ప్రయాణీకుడి పరిస్థితి ఏమిటా అని ఆ హడావుడిలో కూడా ఒక ఆలోచన వచ్చింది. రైల్వేని జనం తిడుతున్నారంటే తిట్టరూ మరి !

సరే ఏదైతే అది అవుతుందిలే అని 7A లోకి దిగాను. అక్కడే కదలడానికి సిద్ధంగా ఉంది ఈ పాసింజర్. దానికి ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ ఉంటుంది. కానీ అదెక్కడో ముందు ఉంది. నేనేమో గార్డు పెట్టె దగ్గర ఉన్నాను. ఈలోపల బండి కదిలింది. ఇక పరుగు లంకించుకున్నాను. యాక్సిడెంట్ లో దెబ్బతిన్న కుడిమోకాలు కలుక్కుమంది. అయినాసరే, దాన్ని లెక్కచెయ్యకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి కోచ్ లో ఎక్కాను. నాందేడ్ లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు అందులో కనిపించారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి నా బెర్తులో సెటిలై నిద్రకు ఉపక్రమించాను.

ఉదయం 6 కు నాందేడ్ చేరవలసిన బండి 9.30 కి చేరింది. నేను లేచి చూస్తే మాల్ టేక్ది అనే స్టేషన్లో ఆగి ఉంది. అక్కడే దాదాపు రెండు గంటలు ఆగిపోయింది. పక్క స్టేషనే నాందేడ్. చాలామంది జనం దిగి లగేజి తీసుకుని పట్టాల మీద నడుస్తూ రైల్వేని తిట్టుకుంటూ పోతున్నారు. లేచి చూస్తె మా పెట్టె మొత్తం ఖాళీ అయి ఉంది. అందరూ దిగిపోయారు. నేనే మాత్రం చలించకుండా, చేరినప్పుడే చేరుతుందిలే అనుకుంటూ ఆ పెట్టెలో ఒక్కడినే ప్రశాంతంగా కూర్చుని రెండు గంటలు మౌనంగా కాలక్షేపం చేశాను. చివరకు ఉదయం 9.30 కు నాందేడ్ చేరుకున్నాను.

స్టేషన్లోనే ఉన్న మా ఆఫీసుకు వెళ్లి వాకబు చెయ్యగా అక్కడ శర్మగారని మా కొలీగ్ ఆఫీసర్ కనిపించాడు. హోటలుకు వెళ్ళడానికి వెహికిల్ రెడీగా ఉందని అన్నాడు. లేటైనందుకు నొచ్చుకుంటూ, 'టీ కోసం మనిషిని పంపాను. వస్తుంది. కొంచంసేపు కూర్చోండి' అన్నాడు. మళ్ళీ ఆయనకేం అనుమానం వచ్చిందో, 'హోటల్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి, అనుష్ఠానం అయ్యాక టీ త్రాగుతారా? లేక పరవాలేదా?' అని అనుమానంగా అడిగాడు.

నా ముఖం చూస్తే పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసేవాడిలాగా కనిపిస్తున్నానో ఏమో అనుకుంటూ - 'అబ్బే అలాంటిదేం లేదు. నేనింకా ముఖమే కడగలేదు. కానీ మీరిచ్చే టీ త్రాగే హోటల్ కి వెడతాను' అన్నాను సోఫాలో సెటిలౌతూ.

'మరి అనుష్ఠానమో?' అన్నాడు. పాపం చాలామంది సర్వీసులో ఉంటూ కూడా ఆ మడీ, పూజలూ చేసుకుంటూ ఏదో విధంగా మానేజ్ చేస్తూ ఉంటారు. అలాంటివారిలో ఈయనా ఒకడన్నమాట ! 

ఆయన వైపు చూచి నవ్వుతూ 'అనుక్షణం జరిగేదే అనుష్ఠానం' అన్నాను.

ఆయనకా మాట అర్ధం కాలేదు. అదీగాక ఆయన విపరీతమైన పని హడావుడిలో ఉన్నాడు. అందుకని - 'అలాగా ఓకే సార్' అన్నాడు.

ఈ లోపల టీ వచ్చింది. తాపీగా దానిని సేవించి, కారెక్కి హోటల్ కి బయలుదేరాను.

(ఇంకా ఉంది)