“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, అక్టోబర్ 2018, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 27 (జాబాలో జాబాల: జాబాలి:)

బయటకు వస్తూ ఉండగా, నిన్న కనిపించినాయన మళ్ళీ ఎదురొచ్చాడు. నేను తలొంచుకుని నా దారిన పోతుంటే ఆయనే ఆపి మరీ పలకరించాడు. ఏంటా అని ఆగాను.

'మీరు నిన్న ఇచ్చిన పుస్తకం చదివాను. దాని టైటిల్ తప్పు ఉంది' అన్నాడు. ఆ ఒక్క మాటతో అతని గురించి నిన్న అనుకున్న విషయం నిర్ధారణ అయిపొయింది నాకు. విసుగు అనిపించినా ఆగి, 'అవునా' అన్నాను.

'అవును. సంస్కృతం వ్యాకరణం ప్రకారం - 'జాబాలో జాబాల: జాబాలి:' అని రావాలి. అంటే మీ పుస్తకం పేరు 'జాబాలి దర్శన ఉపనిషత్' అని పెట్టాలి. మీరు తప్పుగా 'జాబాల దర్శన ఉపనిషత్' అని పెట్టారు.' అన్నాడు.

'అంటే 'లీ' బదులు 'ల' వచ్చింది. అవునా?' అడిగాను.

'అవును' అన్నాడు.

నవ్వొచ్చింది.

'బాగుందమ్మా నీ లీ..ల' అనుకున్నాను.

అతన్ని చూస్తే చాలా జాలికూడా అనిపించింది.

ఒక పుస్తకాన్ని చదివి అందులో ఉన్న మంచిని మెచ్చుకోడానికి కూడా కొంత సంస్కారం ఉండాలి. అందులోని తప్పులు మాత్రమే చూడటం ఆ మనిషిలో ఉన్న ఓర్వలేనితనానికి సూచన అవుతుంది. అలాంటి దుర్గుణం లోపల ఉన్నప్పుడు సంస్కృతం చదివినా, ఇంకా ఎన్ని గ్రంధాలు, స్తోత్రాలు చదివినా ఆధ్యాత్మికంగా ఉపయోగం ఏమీ ఉండదు. ఇంత చిన్న విషయం తెలీకుండా అమ్మ భక్తులై ఉండి వీళ్ళు ఏం నేర్చుకున్నారా? అని మళ్ళీ అనిపించింది.

వ్యాకరణం, శాస్త్రజ్ఞానం, పాండిత్యాలే సర్వస్వం అనుకునే మనుషులు చాలామంది ఉంటారు. నా దృష్టిలో ఇలాంటివారు పొట్టును దాచుకుని ధాన్యాన్ని పారేసే మనుషులవంటివారు. సర్లే, ఇలాంటి మనిషితో మనకెందుకులే అనిపించి 'అలాగా, సరే' అంటూ ముందుకు కదిలాను.

ఒకాయన మహాభారతాన్ని తిరగా మరగా చదివాడుట. ఏం అర్ధమైందయ్యా నీకంటే - 'ధర్మరాజుకు పేకాట అంత బాగా రాదని అర్ధమైంది' అన్నాడుట. 'అదేంటి' అంటే, 'పేకాట రాదు కాబట్టే జూదంలో ఓడిపోయాడు. అదే నేనైతేనా అలా ఓడిపోయేవాడిని కాదు' అన్నాట్ట. మహాభారతం మొత్తం తిరగా మరగా చదివితే ఆయనకర్ధమైంది అది ! ఏం చేస్తాం? ఎవడి దృష్టి వాడిది. 'నీ దృష్టిని బట్టే సృష్టి కనపడుతుంది' అని అమ్మ చెప్పింది కదా ! ఎంతసేపూ పేకాట మీదే దృష్టి ఉన్నవాడికి మహాభారతం చదివినా కూడా అందులో పేకాటే కనపడుతుంది. ఇంత చిన్నవిషయం కూడా వీళ్ళకు అర్ధం కావడం లేదే అని కించిత్ బాధ కలిగింది.

సర్లే ఎవడి ఖర్మ వాడిది మనకెందుకు? అని అనుకుంటూ ఆఫీస్ వైపు నడక సాగించాము.

(ఇంకా ఉంది)