“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, అక్టోబర్ 2018, బుధవారం

నవరాత్రులు - అమ్మవారి అవతారం

'ఈరోజు మా గుడిలో అమ్మవారికి బాలాత్రిపురసుందరి అవతారం వేస్తున్నాం. మీరు తప్పక రావాలి.' అన్నాడు ఒకాయన ఫోన్ చేసి.

వీడొక అవినీతి తిమింగలం. కానీ ఒక ప్రముఖ దేవాలయ కమిటీలో మెంబర్.

ఆఫీసులో ఏదో పనిలో ఉన్నానేమో భలే చిరాకేసింది.

'అమ్మవారికి నువ్వు అవతారం వేస్తున్నావా?' అడిగాను అప్పటికీ సాధ్యమైనంత సౌమ్యంగానే.

'అవును. నేనంటే నేనొక్కడినే కాదు. మా కమిటీ అంతా కలసి డిసైడ్ చేశాం' అన్నాడు.

'ఓహో! అమ్మవారి అవతారాన్ని డిసైడ్ చెయ్యడానికి ఒక కమిటీ కూడా ఉందా?' అన్నాను ఫోన్లోనే నవ్వుతూ.

'అందులో అంత నవ్వడానికేముంది? సాయంత్రం రండి వీలైతే' అన్నాడు.

'వీలుకానంత పగిలిపోయే పనేమీ లేదుగాని, నేను రాను' అన్నాను.

'అదేంటి? ఖాళీగా ఉంటె రావచ్చుగా?' అన్నాడు.

'ఖాళీగా ఉన్నానని రాలేను. రావాలనిపిస్తే వస్తాను' అన్నాను.

'సరే! రావాలని అనుకోండి' అన్నాడు వదలకుండా.

'నా అవతారం బాగుంటే గదా అమ్మవారి అవతారం చూడ్డానికి?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు అప్పటికీ ఫోన్ కట్ చెయ్యకుండా.

ఇక ఇలా కాదని డైరెక్ట్ గా చెప్పేశాను.

'ముందు నీ అవతారం సంగతి చూసుకో. అమ్మవారికి ఏ అవతారం వెయ్యాలో తర్వాత ఆలోచిద్దువుగాని'.

ఫోన్ కట్ అయిపోయింది.

పీడా వదిలింది అనుకున్నా.