“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, మే 2017, శనివారం

రెండవ అమెరికా యాత్ర - 31 (లలితా సహస్ర నామాలపై పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం)



అనుకున్నట్లుగానే నిన్న సాయంత్రం పాంటియాక్  పరాశక్తి ఆలయంలో లలితా సహస్ర నామముల మీద ఇచ్చిన ఉపన్యాసం జయప్రదం అయింది. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ తో బాటు వీడియో తియ్యడం జరిగింది. త్వరలో దానిని యూ ట్యూబ్ లో అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది.మొదటగా www.miindia.com అధినేత శ్రీ ఆనంద్ కుమార్ ఇచ్చిన పరిచయ వాక్యాల అనంతరం నా ఉపన్యాసం మొదలైంది.

బ్లాగు పాఠకుల సౌకర్యార్ధం ఆ వివరాలను క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.

లలితా సహస్ర నామములు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో మనకు లభిస్తాయి. ఇది వ్యాసమహర్షి చేత రచింపబడిన 36 పురాణాలలో ఒకటి. అందులో, మహావిష్ణు అవతారమైన హయగ్రీవుని చేత అగస్త్య మహర్షికి ఉపదేశింపబడినవే ఈ లలితా సహస్ర నామములు.

లలితా సహస్రనామములు మూడు భాగాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి పూర్వపీఠిక,రెండవది సహస్రనామములు, మూడవది ఉత్తర పీఠిక లేదా ఫలశ్రుతి. పూర్వ ఉత్తర పీఠికలలో ఈ సహస్ర నామముల ప్రయోజనము, శ్రేష్టత్వము, కామ్యకర్మలలో దీని ఉపయోగములు చెప్పబడినాయి.

అగస్త్య మహర్షి ఉత్తరభారతం నుంచి దక్షిణాదికి వచ్చిన మహర్షి. వింధ్య పర్వత శ్రేణి ఉత్తర భారతానికీ దక్షిణ భారతానికీ మధ్యలో సరిహద్దులాగా ఉంటుంది.అమితంగా పెరిగిపోతూ గ్రహ గమనానికి కూడా అడ్డుగా వస్తున్న వింధ్య పర్వతపు గర్వం అణచమని దేవతలు ఆయన్ను కోరారు.దక్షిణభారత దేశానికి పోతున్న ఆయనకు దారి ఇవ్వడానికి బాగా తగ్గిపోయి వంగింది వింధ్యపర్వతం. తను తిరిగి వెనక్కు వచ్చేవరకూ అలాగే వంగి ఉండమని చెప్పిన మహర్షి దక్షిణ దేశంలో స్థిరపడి తిరిగి వెనక్కు పోలేదు. ఈయన మహా సిద్ధుడు. ఈనాటికీ సజీవంగా తమిళనాడులో ఉన్నాడు. తమిళనాడులోని 'టెంకాశి' ప్రాంతాలలో అర్హులైనవారికి ఆయన భౌతిక దర్శనం ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది. తమిళ వీరవిద్యలైన 'సిలంబం' 'మర్మఅడి' లకు ఈయనే ఆద్యుడనీ పరమ గురువనీ ఆయా స్కూల్స్ వారు భావిస్తారు. ఆయనకు నమస్కరించనిదే వారు వీరవిద్యా అభ్యాసం మొదలు పెట్టరు.

ఈయన మహా తంత్రసాధకుడు. ఎన్నో తంత్రాలు అభ్యసించినప్పటికీ ఈయనకు దాహం తీరక, మహావిష్ణు అవతారమైన హయగ్రీవస్వామిని ఆరాధించాడు. హయగ్రీవ స్వామి అన్ని విద్యలకూ గురువు. సమస్త జ్ఞానానికీ నిధి. హిందూ తంత్రం లోనే గాక, బౌద్ధ తంత్రంలో కూడా ఈయన ఒక దేవతగా మనకు కనిపిస్తాడు. ముఖ్యంగా టిబెటన్ తంత్రంలో ఈయన ఒక దేవతగా ఆరాధింపబడుతూ ఉంటున్నాడు. ఈయనకు  గుర్రం తల ఉంటుంది.

తనకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన హయగ్రీవ స్వామిని ' నాకు అత్యుత్తమమైన స్తోత్రాన్నీ మంత్రాన్నీ సాధనా విధానాన్నీ ఉపదేశించమని' అగస్త్య మహర్షి ప్రార్ధిస్తాడు. అప్పుడు ఆయన లలితా సహస్ర నామాలను మహర్షికి ఉపదేశిస్తాడు.

విష్ణు నామ సహస్రాచ్చ శివనామైక ముత్తమం
శివ నామ సహస్రాచ్చ దేవీ నామైకముత్తమం
దేవీ నామ సహస్రాణి కోటిస సంతి కుంభజ
తేషు ముఖ్యం దశవిధం నామ సాహస్ర ముచ్యతే
రహస్య నామ సాహస్రం ఇదం శస్తం దశస్వపి

అనే శ్లోకాలలో -'వెయ్యి విష్ణునామాల కంటే ఒక్క శివనామం ఉత్తమం. వెయ్యి శివనామాల కంటే ఒక్క దేవీ నామం ఉత్తమం. దేవీ సహస్ర నామాలు కోట్లు ఉన్నాయి. వాటిల్లో పది సహస్ర నామాలు ముఖ్యములైనవి. వాటిలో మళ్ళీ లలితా రహస్య నామములే అత్యుత్తమములు' అని చెప్పబడింది.

అమ్మవారి పది రకాలైన సహస్ర నామాలు ఏవేవో ఈ క్రింది సూత్రాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

'గంగా శ్యాలకాబాల రాసభా'

గం= గంగా సహస్ర నామములు
గా= గాయత్రీ సహస్ర నామములు
శ్యా = శ్యామలా సహస్ర నామములు
ల= లక్ష్మీ సహస్ర నామములు
కా = కాళీ సహస్ర నామములు
బా = బాలా సహస్ర నామములు
ల= లలితా సహస్ర నామములు
రా= రాజరాజేశ్వరీ సహస్ర నామములు
స= సరస్వతీ సహస్ర నామములు
భా= భవానీ సహస్ర నామములు

ఈ పది రకాలైన సహస్ర నామములలోనూ మళ్ళీ లలితా నామములే అత్యుత్తమములు.

అన్ని అమ్మవార్లలోనూ, శక్తి రూపాలలోనూ లలితా రూపమే అతి మనోహరంగా,సౌమ్యంగా,అందంగా,అమాయకంగా, మహా తేజోవంతంగా ఉంటుంది. కాళీ, తారా, చిన్నమస్తికా, భైరవీ మొదలైన దేవీ రూపాలు చాలా భయంకరమైనవి. కానీ లలితా రూపం, ఆ పేరుకు తగినట్లే, పరమ లలితంగా సౌమ్యంగా మనోహరంగా ఉంటుంది.

శ్రీ రామకృష్ణుల వారికి కలిగిన ఎన్నో దేవీ దేవతా దర్శనాలలో లలితాదేవి యొక్క దర్శనమే అత్యుత్తమంగా, అతి మనోహరంగా, అతి తేజోవంతంగా ఉన్నదని ఆయన చెప్పారు. కనుక పురాణములలో చెప్పబడిన విషయం సత్యమేననీ అతిశయోక్తి కాదనీ మనం నమ్మవచ్చు.

చరమే జన్మని యదా శ్రీవిద్యోపాసకో భవేత్
నామ సాహస్ర పాఠశ్చ తధా చరమ జన్మని

చిట్ట చివరి జన్మలో మాత్రమె ఎవడైనా సరే అసలైన శ్రీవిద్యను పొందగలడు. అలాగే, చివరి జన్మలో మాత్రమె లలితా సహస్ర నామాలను ఉపాసించే అదృష్టమూ కలుగుతుంది. అంటే పరిణామ క్రమంలో అలాంటి వాడు అత్యున్నత శిఖరానికి చేరుకుంటాడని, ఆ జన్మ తర్వాత ఒక దేవతగా మారిపోతాడనీ అర్ధం. అయితే - ఊరకే చిలక లాగా పారాయణం చేస్తే సరిపోదు. అర్ధాన్ని తెలుసుకుని ధ్యానపూర్వకంగా పారాయణ చేసినప్పుడే అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి.

లలితా సహస్ర నామాలకు ఒక చరిత్ర ఉన్నది. ముందుగా ఆ చరిత్రను హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి వివరిస్తాడు.

దక్షయజ్ఞంలో సతీదేవి తనను తను యోగాగ్నిలో కాల్చుకుని మరణిస్తుంది. శివునిచే సృష్టించబడిన వీరభద్రునిచేతా ప్రమధగణాల చేతా యజ్ఞధ్వంసం జరుగుతుంది. ఆ తర్వాత శివుడు వైరాగ్యపూరితుడై ధ్యానస్థితుడై నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తాడు. ఈ లోపల సతీదేవి హిమవంతునికి పార్వతి అనే కుమార్తెగా జన్మించి మళ్ళీ శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది.

ఈలోపల తారకాసురుడనే ఒక రాక్షసుని ఆగడాలు మితిమీరి పోగా లోకం వాడిని భరించలేని స్థాయికి చేరుకుంటుంది. శివ పార్వతులకు పుట్టిన వాడే ఆ రాక్షసుడిని అంతం చెయ్యగలడు. కనుక దేవతలందరూ కలసి మన్మధుడిని ప్రార్ధించి నిర్వికల్ప సమాధిగతుడైన శివుని మనస్సులో కామాన్ని రగల్చడం కోసం పుష్పబాణ ప్రయోగం చేయ్యమని కోరుతారు. అలాగే చేసిన మన్మధుడు శివుని మూడవకంటి అగ్నికి ఆహుతై బూడిదగా మారుతాడు.

ఆ బూడిదలోనుంచి భండాసురుడు విశుక్రుడు విషంగుడు అనే రాక్షసులు పుట్టుకొస్తారు. మన్మధుడు లేని లోకం రసహీనంగా, మోహహీనంగా మారిపోతుంది. స్త్రీలకూ పురుషులకూ ఒకరి పైన ఒకరికి ఆకర్షణ మాయమౌతుంది.చివరకు చెట్లు కూడా పూలు పుయ్యడం మానేస్తాయి. సృష్టి ఆగిపోతుంది. అలాంటి మోడుప్రపంచాన్ని ఈ ముగ్గురు రాక్షసులూ పరిపాలిస్తుంటారు. తారకాసురుని పీడను వదల్చుకుందామనుకుంటే ఇంకా ముగ్గురు కొత్త రాక్షసులు పుట్టుకొస్తారు. దేవతలకు ఏం చెయ్యాలో తెలియదు.

ఇదంతా - మనకు తెలిసిన మనం ఉంటున్న ఒక విశ్వంలో జరిగిన కధ. అలాంటి విశ్వాలు (universes) సృష్టిలో లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క విశ్వానికీ మళ్ళీ ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులుగా ఉంటారు.

అప్పుడు అందరూ కలసి మహాశంభువును ప్రార్ధిస్తారు. ఆయన సమస్త విశ్వాలకూ ప్రపంచాలకూ అధినేత. ఆయన సృష్టిలో, మన్మధ సంహారం జరిగిన విశ్వం ఒక అణువు మాత్రమే.

దేవతలకు ప్రత్యక్షమైన ఆయన వారితో ఇలా అంటాడు.

'నేను నిర్వికారుడను.నిరాకారుడను.గుణరహితుడను.నేను సృష్టిలో పాలు పంచుకొనను గనుక మీకు ఏ విధమైన సాయమూ చెయ్యలేను. కానీ మీకొక ఉపాయం చెబుతాను. నా శక్తియైన లలితా దేవిని మీరు ప్రార్ధించండి. ఆమె సృష్టి స్థితి లయకారిణి పరమ దయామయి గనుక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీమీ చిత్ ( తెలివి, ఎరుక) లతో ఒక మహాగ్ని కుండాన్ని నిర్మించి అందులో మీమీ ప్రాణాలనే ఆహుతులుగా సమర్పిస్తూ హోమం చెయ్యండి. అప్పుడు ఆ దేవి మీకు ప్రత్యక్షమౌతుంది.మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.'

ఆ మాటలు విన్న దేవతలు వారి సమిష్టి 'చిత్' లతో ఒక పెద్ద అగ్నిగుండాన్ని నిర్మించి అందులో ప్రాణహోమం గావిస్తారు. అప్పుడు ఆ హోమగుండంలో లలితాదేవి ప్రత్యక్షమౌతుంది. కనుకనే ఆమె 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' అయ్యింది.

(ఇంకా ఉంది)