“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 39 (పునర్జన్మలున్నాయా?)






















తాయ్ ఛి అభ్యాసం అయ్యేసరికి దాదాపు మధ్యాన్నం అయింది. మూడు రోజుల రిట్రీట్ ఆ రోజుతో అయిపోవస్తున్నది. దూర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తిరిగి బయలు దేరవలసి ఉంది. అందుకని ఆరోజున బ్రేక్ ఫాస్ట్, లంచ్ కలిపి బ్రంచ్ కానిచ్చాము.

ముందుగా అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఆ రోజున నేను గాంగెస్ టెంపుల్ లో మాట్లాడవలసి ఉన్నది. కానీ ఉదయాన్నే ఆత్మలోకానంద గారు ఫోన్ చేసి, వాళ్ళకేదో వేరే కార్యక్రమం ఉన్నదనీ, అందుచేత మమ్మల్ని రావద్దని చెప్పారు. అది విని అందరికీ చాలా కోపం వచ్చింది. నిన్న రమ్మని ఈరోజు వద్దని ఇలా రోజుకొక మాట మారుస్తున్న వీళ్ళ ధోరణి చూస్తుంటే ఏదో తేడాగా ఉన్నదని అందరం అనుకున్నాం.

మొదట్లో గాంగెస్ రిట్రీట్ హోమ్ ఇస్తామని అన్నదీ వాళ్ళే, మళ్ళీ సమయానికి ఇవ్వకుండా ఎగర గొట్టిందీ వాళ్ళే. ఆదివారం మీరు మాట్లాడతారా? అని అడిగిందీ వాళ్ళే, సరేనని చెప్పాక మరుసటి రోజున వద్దని పది ఫోన్లు చేసిందీ వాళ్ళే. ఏమిటో వీళ్ళూ? వీళ్ళ జిత్తులూ? ఇదసలు నిజమైన ఆధ్యాత్మికతేనా? అనిపించింది.

నేనక్కడకి వెళ్లి మాట్లాడితే అక్కడున్న అమెరికన్స్ అందరూ నా ప్రభావంలో పడి స్వామీజీకీ మాతాజీకీ దూరమౌతారని వాళ్ళ ఊహ కావచ్చు. అదీగాక ఆశ్రమాన్ని మాకు రాసిస్తానని మాతాజీ మొన్న అన్నప్పుడే వాళ్ళందరిలో కలకలం రేగింది. ఆ విషయం నిన్ననే గమనించాము. అందుకని నన్ను గాంగెస్ టెంపుల్ కు దూరంగా ఉంచడం మంచిదని వాళ్ళందరూ కలసి అనుకోని ఉండవచ్చు. అందుకే ఇప్పుడు నా స్పీచ్ కేన్సిల్ చేసి, మమ్మల్ని రావద్దని చెబుతున్నారని మాకర్ధమైంది.ఇదంతా చూసి వాళ్ళ అజ్ఞానానికి మాకు చాలా జాలేసింది. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఏమౌతుంది? నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వతకూ కాషాయానికీ ఏమీ సంబంధం లేదని నేను మొదట్నించీ చెప్పేమాట మళ్ళీ ఈ విధంగా రుజువైంది. ఈ లోకంలో డబ్బూ ఆస్తులే నిజమైన దేవుళ్ళు. వాళ్ళముందు అందరు దేవుళ్ళూ బలాదూరే !!

నవ్వొచ్చింది.

ఆ తర్వాత కాసేపు కూచుని అవీ ఇవీ మాట్లాడుకున్నాక ఒక్కొక్కరు తిరుగు ప్రయాణానికి బయలుదేరడం మొదలు పెట్టారు. అలా కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన డెట్రాయిట్ బ్యాచ్ అందరం కూచుని మాట్లాడుకుంటూ ఉండగా మైకేల్, జూలియా వచ్చారు. వీళ్ళు పోయిన ఏడాది నా దగ్గర దీక్ష తీసుకున్న అమెరికన్స్.

పోయిన సారికీ ఈ సారికీ వీళ్ళలో చాలా మార్పు కనిపించింది. మునుపటంత ఓపన్ గా ఈసారి లేరు. బహుశా డబ్బు ఎక్కువై ఉంటుంది. అందుకే ఓపన్ నెస్ తగ్గింది. మానవ మనస్తత్వాలు ఎంత విచిత్రమైనవో కదా? అనిపించి మళ్ళీ నవ్వొచ్చింది.

గాంగెస్ లో తను ఎలా ల్యాండ్ డెవలప్ చెయ్యాలని అనుకుంటున్నది ఆ విషయాలన్నీ మైకేల్ చెప్పడం మొదలు పెట్టాడు. మనకలాంటి మాటలు నచ్చవుకదా ! సరాసరి విషయంలోకి వస్తూ,  సాధన ఎలా చేస్తున్నారని నేనడిగాను.

'ఏదో చేస్తున్నాము. కొన్ని రోజులు చేస్తున్నాము. కొన్ని రోజులు మానేస్తున్నాము. అలా సాగుతోంది.' అని జూలియా చెప్పింది. మైకేల్ అయితే అసలు జవాబే చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు. నాకు వారిద్దరి మీదా జాలేసింది. అద్భుతమైన గైడెన్స్ దొరికినా దానిని ఉపయోగించుకోలేక పోతున్నారు వాళ్ళు. మాయా ప్రభావం అంటే ఇదే కదా అనిపించింది. మనస్సులోనే మహామాయకు నమస్కరించాను.

సంభాషణ అలా అలా సాగి పునర్జన్మల వద్దకు వచ్చింది.

'హిందూ మతంలో చెప్పే పునర్జన్మలు నిజమేనా?' అని జూలియా ప్రశ్నించింది.

'నిజమే. కొన్ని మతాలు వాటిని నమ్మవు. కానీ అవి నిజమే. దీనిమీద ఎన్నో రుజువైన కేసులున్నాయి. శాంతి దేవి కేసు మీకు తెలుసా?' అడిగాను.

వాళ్ళు అయోమయంగా చూచారు. ఆ పేరు కూడా వాళ్ళు వినలేదని నాకర్ధమైంది.

శాంతిదేవి కేసు బాగా రీసెర్చి చెయ్యబడి సైన్స్ పరంగా నిర్ధారించబడిన కేసు. 1930 ప్రాంతాలలో ఈమె కేసు ఇండియాలో చాలా సంచలనం సృష్టించింది. గత జన్మలో తాను మధురలో పుట్టానని తన పేరు లుగ్దిదేవి అని చెబుతూ ప్రస్తుత జన్మలో డిల్లీలో పుట్టిన ఆమె తన ప్రస్తుత తల్లి దండ్రులను గత జన్మలో తను పుట్టిన ఊరికి తీసుకువెళ్ళింది.

అప్పట్లో ఉన్న తన బంధువులనూ, తను వాడిన వస్తువులనూ అప్పటి సంఘటనలనూ ఆ ఇంట్లో ఆమె ఖచ్చితంగా గుర్తించింది. 1926 లో పుట్టిన ఈమె 1987 దాకా బ్రతికే ఉంది. ఎంతోమంది పరిశోధకులు ఈమెను ఇంటర్వ్యూ చేసి ఈమె చెప్పేవన్నీ నిజాలే అని తేల్చారు. ఈమె మహాత్మా గాంధీని కూడా కలిసింది. అప్పటిలో జబల్ పూర్ లో ఉన్న రజనీష్ ను కూడా ఈమె కలిసింది. వారందరూ ఈమె చెబుతున్నది నిజమే అని తేల్చారు.' అని నేనన్నాను.

ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చూడవచ్చు.


వాళ్ళు సగం నమ్మీ సగం నమ్మలేనట్లుగా చూచారు.

నేను కొనసాగించాను.

'తన ప్రయాణంలో జీవి ఎన్నో జన్మలు ఎత్తుతుంది. ఎన్నో చోట్ల పుడుతుంది. చనిపోతుంది. ఈ ప్రయాణంలో ఏదీ శాశ్వతం కాదు. తనవారనుకున్న ఎవరూ శాశ్వతం కారు. తనవారూ కారు. తనతో శాశ్వతంగా ఉండేది ఒక్క గురువు, దైవం మాత్రమే. కానీ వారినే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎప్పుడూ మనతో తోడుగా ఉండి, ఏమీ కోరకుండా మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ దారి చూపిస్తూ ఉండే వీరిద్దరినీ వదిలేసి, మనం మన బంధువులని స్నేహితులని నమ్ముతూ వారే శాశ్వతమని అనుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అదే మాయ అంటే ! ఈ మాయనుంచి బయట పడినప్పుడే మనిషికి అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్ధమౌతుంది. ఈ ఊబిలో ఉన్నంతవరకూ అతనికి వెలుగు కన్పించదు'.

మైకేల్ ఇదంతా నమ్మినట్లు కన్పించలేదు. అంతా విని అతను ఇలా అడిగాడు.

'మీరు Thich Nhat Hanh గురించి విన్నారా?'

నేనిలా అన్నాను.

'తెలుసు. వియత్నాం బుద్ధిస్ట్ గురువు గురించే కదా మీరు చెబుతున్నది?'

'అవును. ఆయనే. నేను ఆయన ఫిలాసఫీ బాగా చదివాను. ఆయన చెప్పేదేమంటే - ఆత్మ అనేది లేదు. మన మనసే మళ్ళీ జన్మ ఎత్తుతుంది. తీరని కోరికలే మళ్ళీ జన్మ ఎత్తుతాయి. అయితే అది పునర్జన్మ కాదు. మనం చనిపోయే సమయానికి తీరని కోరికలన్నీ నాశనం కావు. అవి గాలిలో ఉంటాయి. ఎవరో ఇంకొక వ్యక్తిని అవి ఆవహించి అతని ద్వారా లోకంలో పనిచేస్తాయి. దీనినే పునర్జన్మ అని ఆయన అంటాడు.

ఉదాహరణకు, నా దగ్గర పనిచేసే ఒక అమెరికన్ ఈ మధ్యనే మరణించాడు. అతనొక మంచి పెయింటర్ మంచి కవీ మాత్రమే గాక మంచి గిటార్ విద్వాంసుడు కూడా. అతను చనిపోయిన తర్వాత అతని పనులన్నీ ఇప్పుడు నేను చెయ్యాలని అనుకుంటున్నాను. అతని లెగసీ కొనసాగించాలని అనుకుంటున్నాను. అందుకని ఆ పనులన్నీ ఇప్పుడు నేను మొదలు పెట్టాను. ఒక రకంగా నా ద్వారా అతను పునర్జన్మను పొందాడు. ఇది నా ఊహ. ఇలాగే మనం ఎవరికైనా పునర్జన్మను ఇవ్వవచ్చు. ఉదాహరణకు రామకృష్ణుడు, వివేకానందుడు, మహాత్మాగాంధీ, ఎవరైనా సరే. వాళ్ళ భావాలను మన జీవితంలో ఆచరించడం ద్వారా మనం వారికి పునర్జన్మను ఇవ్వవచ్చు. ఏమంటారు?' అడిగాడు మైకేల్.

అతను చెప్పాలనుకుంటున్నది నాకర్ధమైంది. ఇలా అన్నాను.

'మీరు చెబుతున్నది పునర్జన్మ కాదు. Thich Nhat Hanh అనే అతను బౌద్ధ గురువు. బౌద్ధం అనాత్మ వాదం. వారు ఆత్మను నమ్మరు. కనుక ఆ విధంగా విషయాన్ని సరిపుచ్చుకుంటారు. అది పూర్తి నిజం కాదు. వారు చెబుతున్నట్లుగా మనసే మళ్ళీ జన్మను ఎత్తే పనైతే, శాంతిదేవి కేస్ ఏమిటి? అలాంటి వారు అమెరికాలో కూడా ఎంతో మంది ఉన్నారు. పారా నార్మల్ రీసెర్చిలో ఎన్నో కేసులు ఇలాంటివి రికార్డ్ అయ్యాయి. వాటిని ఎలా అర్ధం చేసుకుంటారు మీరు? అసలు చెప్పాలంటే బుద్ధుడే, అయిదు వందల పైగాఉన్న తన గతజన్మలను బోధివృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన నాటి రాత్రి గుర్తు చేసుకున్నాడని బౌద్ధమతం చెబుతున్నది. అది ఎలా సంభవం అవుతుంది? కనుక అసలు విషయం అది కాదు.

మీకు నచ్చిన ఒక వ్యక్తిని మీరు అనుసరించవచ్చు. అది అతనికి మీరిస్తున్న పునర్జన్మ ఎన్నటికీ కాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎందఱో చనిపోతూ ఉంటారు. అందరి హాబీలనూ మీరెందుకు తీసుకుని వాటిని అనుసరించడం లేదు? అందరి భావాలనూ మీరు ఆచరించడం లేదు కదా? మీకు నచ్చిన కొందరి భావాలనే మీరు అనుసరిస్తున్నారు. కనుక అది వారికి మీరిస్తున్న పునర్జన్మ కాదు. మీ మనసును మాత్రమె మీరు అనుసరిస్తున్నారు. మీ కోరికలనే మీరు అనుసరిస్తున్నారు. దానికి, ఎవరిదో పునర్జన్మ అనే ముసుగును వేసుకుని మీరు భ్రమిస్తున్నారు. ఇదే గాంగెస్ లో ఎందఱో మీ కళ్ళెదురుగా చనిపోయి ఉంటారు. కానీ మీరు వారందరి పనినీ వారు ఆపిన చోటనుంచి కొనసాగించడం లేదు కదా?  మీరిప్పుడు చెప్పిన ఫ్రెండు ఒక్కడినే ఎందుకు అనుసరిస్తున్నారు? ఎందుకు అతని లెగసీని మాత్రమే కొనసాగించాలని అనుకుంటున్నారు? అందరి పనులనూ మీరు నెత్తికెత్తుకుని చెయ్యవచ్చు కదా? కనుక ఈ లోకంలో ఎవరి పని వారిదే అన్నది సరిగ్గా అర్ధం చేసుకోండి.

జీవి తన సుదీర్ఘ ప్రయాణంలో ఒక జన్మలో తీరని కోరికలను తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి తీరవలసిందే. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరి కర్మ వారిదే. ఎవరి ప్రయాణం వారిదే. నిజానికి మన సొంతమనుషులు అనుకునే వారి కర్మలో కూడా మనం పాలుపంచుకోలేము. అది సాధ్యం కాదు. ఇక్కడ ఎవరికి వారే. ఒకరికి ఒకరం అనుకోవడం పెద్ద భ్రమ మాత్రమే. అదంతా ప్రేమ మైకంలో అనుకునే మాట. అది నిజం కాదు. నిజానికి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేది నీ గురువూ దేవుడూ మాత్రమే. ఇంకెవరూ మనవారు కారు. అయితే ఇది మనకు అంత తేలికగా అర్ధం కాదు. అలా కాకపోవడానికి కారణం అజ్ఞానం లేదా మాయ. ప్రకృతిలో ఈ డ్రామా అంతా తూచా తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ ఊరకే నేను చెప్పినంత మాత్రాన మీకు అర్ధం కావు. మీకు యోగదృష్టి ఉంటే నేను చెబుతున్న వాటిల్లో నిజాలను మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. యోగదృష్టి కావాలంటే సాధన చెయ్యాలి. అది ఊరకే వచ్చేది కాదు. కష్టపడి ఏళ్ళకేళ్ళు సాధన చేస్తే అది దక్కుతుంది. అప్పుడు మీరే చూడవచ్చు. అప్పుడు మాత్రమే నేను చెబుతున్న దాంట్లో నిజం మీకు తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. కానీ, పునర్జన్మ అనేది నిజమే.

పునర్జన్మ నిజం కాకుంటే, ఎక్కడో 13,270 km దూరంలో ఇండియాలో పుట్టిన నేను ఈ డెట్రాయిట్ కు రెండేళ్లలో రెండుసార్లు రావడం ఏమిటి? అమెరికాలో ఏభై రాష్ట్రాలున్నాయి. కానీ నేను ఈ మిషిగన్ కే రెండేళ్ళలో రెండుసార్లు వచ్చాను. మిషిగన్ రాష్ట్రంలో కూడా గాంగెస్ కి మాత్రమే రెండుసార్లు వెదుక్కుంటూ వచ్చాను. ముందు ముందు కూడా వస్తాను. ఎందుకిలా జరుగుతోంది? గత జన్మలలో ఏ విధమైన కనెక్షనూ లేకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎందఱో తెలుగువాళ్ళున్నారు.కానీ కొందరు మాత్రమే నాతో కలుస్తున్నారు. దగ్గరౌతున్నారు. మిగిలిన వాళ్ళు కాలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఆలోచించండి.

లేదా, మీ విషయమే తీసుకోండి. మీరు అమెరికాలో పుట్టారు. మీకు మా కల్చర్ తెలీదు. ఇండియాలో 29 రాష్ట్రాలున్నాయి. కానీ మీరు రెండేళ్ళ క్రితం గుజరాత్ వచ్చానని నాతో చెప్పారు. అది ఎందుకు జరిగింది? మిగిలిన 28 రాష్ట్రాలలో ఎక్కడికీ వెళ్లాలని మీకెందుకు అనిపించలేదు? సత్యమేమంటే, ఇవన్నీ పూర్వజన్మ సంబంధాల వల్ల జరుగుతాయి. అనేక గత జన్మలలో మనం ఎన్నోసార్లు కలుసుకున్నాం. అయితే అవన్నీ ప్రస్తుతం మర్చిపోయాం. మనం మర్చిపోయినా ప్రకృతి మరచిపోదు. కర్మ మరచిపోదు. అందుకనే దేశాలను దూరాలను అధిగమిస్తూ అది మనల్ని మళ్ళీ మళ్ళీ కలుపుతూనే ఉంటుంది. అయితే ఆ పాత రిలేషన్స్ మనకు అర్ధం కావు. గుర్తుండవు.

అందుకని ఈ జన్మలో మన స్వార్ధపూరిత ఆలోచనల ప్రకారం మనం పోతూ ఇదే నిజమని భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఈ భ్రమను సాధన ద్వారా మాత్రమే బ్రేక్ చెయ్యడం సాధ్యమౌతుంది. ఇక ఏ రకంగానూ ఇది సాధ్యపడదు. అయితే విచిత్రంగా ఆ సాధననే మనం పోస్ట్ పోన్ చేస్తూ పోతూ ఉంటాం. ఇదే మాయ అంటే. సగటు మనిషి జీవితం ఇలాగే జరిగి ఇలాగే ముగుస్తుంది. చెయ్యవలసిన పని మాత్రం వాయిదా పడుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ జన్మ అవసరం అవుతుంది. ఇది నిజం. భారతీయ సనాతన ధర్మం చెబుతున్న సత్యం ఇదే. మీ బైబుల్ నుంచి చెప్పాలంటే అందులో కూడా పునర్జన్మ ప్రస్తావన ఉన్నది. కానీ మీవాళ్ళు దానిని అర్ధం చేసుకోలేక ఆ విషయాన్ని అణచి ఉంచారు.' అన్నాను.

'అవునా? మా మతంలో ఎక్కడ అలా చెప్పబడింది?' అడిగాడు మైకేల్ ఆశ్చర్యంగా.

'న్యూ టెస్టమెంట్ లో చూడండి. Mathew 11:14 లో ఏముందో చదవండి. మీకే తెలుస్తుంది.Old Testament లో Malachi 4:5 లో చూడండి ఏముందో? అక్కడిలా ఉంది. "Behold, I am going to send you Elijah the prophet before the coming of the great and terrible day of the Lord".

ప్రాచీనకాలంలో నివసించిన ఎలిజా అనే ప్రవక్త గురించి వ్రాయబడిన మాటలివి. భవిష్యత్తులో అతను మళ్ళీ పుడతాడని ఓల్డ్ టెస్టమెంట్ లో వ్రాయబడి ఉన్నది. క్రీస్తు కంటే ముందుగా అతను వస్తాడని కూడా చెబుతూ before the coming of the great and terrible day of the Lord అని చెప్పబడింది. ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ళ తర్వాత 'జాన్ ద బాప్టిస్ట్' గురించి చెబుతూ క్రీస్తు తన శిష్యులకు Old Testament లో ఇవ్వబడిన ఈ ప్రామిస్ ను గుర్తు చేస్తూ ఇలా అంటాడు.

'And if you are willing to accept it, he (John the Baptist) is Elijah who was supposed to come...'

(New Testament - Mathew 11:14)

అంటే ఎలిజా మళ్ళీ జాన్ ద బాప్టిస్ట్ గా పుట్టాడనేగా అర్ధం? పునర్జన్మ అంటే ఇదే కదా? బైబిల్లో పునర్జన్మ గురించిన ప్రస్తావన అనేకచోట్ల ఉన్నది. అయితే దానిని అర్ధం చేసుకోలేని క్రైస్తవ పండితులు దానికి వక్రభాష్యం చెప్పి క్రైస్తవులకు పునర్జన్మ లేదని నూరిపోస్తూ వచ్చారు. వాళ్ళూ దానిని గుడ్డిగా నమ్ముతున్నారు. వెరసి మీరు ప్రకృతిలో ఉన్న సత్యాన్ని గ్రహించలేక పోతున్నారు. మీ నమ్మకమే నిజమన్న భ్రమలో మీరున్నారు. అదీ అస్సలైన విషయం ! సరిగ్గా గమనిస్తే, బైబిల్లో కూడా పునర్జన్మ నిజమే అనేదానికి ఆధారాలున్నాయి. క్రీస్తే స్వయంగా ఈ మాటను చెప్పాడు. కనుక పునర్జన్మ సత్యమే. ' అని ముగించాను.

నేను చెప్పినదాన్ని వాళ్ళు చాలా శ్రద్ధగా విన్నారు.

'అమ్మయ్య ! ఇప్పుడు మాకు మనసులు తేలికయ్యాయి. మా జీవితాలను నిశ్చింతగా ఇప్పుడు గడపవచ్చు. ఎందుకంటే ఈ జన్మలు ముగిసేవి కాదని ఇప్పుడు అర్ధమైంది. పనులూ తెమిలేవి కావు. కర్మలూ తీరేవి కావు. కనుక నిదానంగా తొందర లేకుండా మా పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే పనులన్నీ జన్మ నుంచి ఇంకో జన్మకు క్యారీ ఫార్వార్డ్ అవుతూ ఉంటాయని అర్ధమైంది.' అంది జూలియా.

'ఇప్పటిదాకా మీరు విన్నది సగం విషయం మాత్రమే. మిగతా సగం మనం మళ్ళీ కలిసినప్పుడు చెబుతాను. అప్పుడు మీకు ఈ నిదానం పోయి, ఇంకా ఎక్కువ తపనా ఎక్కువ తొందరా గాభరాలు మొదలౌతాయి. ఎందుకంటే, ప్రస్తుతం మీరు కోల్పోతున్నదేంటో మీకు తెలీడం లేదు. కానీ అదంతా ఇప్పుడొద్దు. ఉన్న నిజాలన్నీ ఒకేసారి చెప్పేసి ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ప్రస్తుతానికి ఈ మాత్రం చాలు' అన్నాను.

'పొద్దుట నుంచీ మీరు బిజీగా ఉన్నారేమో?' అడిగాను, ఇప్పటిదాకా జరిగిన ఆధ్యాత్మిక సంభాషణకు ఫుల్ స్టాప్ పెడుతూ.

'అదేం లేదు. పొద్దున్న నుంచీ గాంగెస్ టెంపుల్ లో మామూలుగానే ప్రేయర్స్ జరిగాయి. శక్తిమా అక్కడ చిన్నపిల్లల చేత ప్రేయర్స్ చేయించారు. అవి అటెండ్ అయి వస్తున్నాం. అంతే. ప్రత్యేకమైన పనులేమీ లేవు.' అన్నాడు మైకేల్.

'అదేంటి? అలా అయితే, నా స్పీచ్ కేన్సిల్ చేస్తూ, మమ్మల్ని టెంపుల్ కు రావద్దని, ఏదో స్పెషల్ ప్రోగ్రాం ఉందని స్వామీజీ ఫోన్ చెయ్యడంలో అర్ధం ఏమిటి?' నేను అక్కడకు వెళ్ళడం ఆయనకు ఇష్టం లేక అలా అబద్దం చెప్పారా?' అని మాకనుమానం వచ్చింది.

ఆ తర్వాత ఇంకాసేపు కూచుని మాట్లాడిన మైకేల్ జూలియాలు మా దగ్గర సెలవు తీసుకుని వెనక్కు వెళ్ళిపోయారు. మేము కూడా కాసేపట్లో అన్నీ సర్దుకుని రిట్రీట్ హోమ్ ఖాళీ చేసి తిరిగి ఆబర్న్ హిల్స్ కు బయల్దేరాము.

బయట బాగా మబ్బులు పట్టి ఉన్నాయి. వానజల్లు బాగానే పడుతోంది. గాంగెస్ ఆశ్రమంలో ఉన్న రెలిక్స్ ను మనస్సులో తలచుకుని నమస్కరించి కార్లు స్టార్ట్ చేశాము.

మళ్ళీ ఈ జన్మలో గాంగెస్ కు వస్తామో రామో తెలియదు. ఎందుకంటే, ఇక్కడి వాళ్ళ ప్రవర్తనను బట్టి మా మనస్సులు అలా మారిపోయాయి. శ్రీరామకృష్ణుల రెలిక్స్ ఇక్కడ ఉన్నాయన్న ఒక్క విషయం కోసమే మేమింత దూరం వెతుక్కుంటూ వచ్చాం. కానీ మేము రావడం వీళ్ళకు ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు ఇంత దూరం రావడం? బహుశా మళ్ళీ గాంగెస్ కు ఎప్పటికీ రామేమో?

ఏం పరవాలేదు !! నాకిలాంటి అనుభవాలు ఇప్పటికి ఎన్నయ్యాయో? ఎంతమంది ఈ గుండెను గాయపరచారో లెక్కిస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. వాళ్ళ దురదృష్టానికి నేనేం చెయ్యగలను? నా స్నేహ హస్తాన్ని నేను అందిస్తూనే ఉంటాను. దానిని వాళ్ళు అందుకోకుండా నా చేతిని గాయపరిస్తే అది నా తప్పు కాదుగా !

అయినా, సరిగా చూచే విద్య తెలిస్తే, భగవంతుడు మన గుండెల్లోనే లేడూ? ఇలాంటి చోట్ల ఆయన్ను వెదకడం ఎందుకు?

(ఇంకా ఉంది)