“My Yogic realization is higher than the sky, yet my insight into Karma is finer than the grains" -- Guru Padma Sambhava

15, మే 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - 34 (లలితా సహస్ర నామాలపై పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం)

ఏయే కామ్య కర్మలు సిద్ధించాలంటే (కోరికలు తీరాలంటే) ఈ సహస్ర నామాలను ఎలా ప్రయోగించాలన్న విషయం మూడో భాగమైన ఫలశ్రుతిలో చెప్పబడింది. చాలా సహస్ర నామాలలో చెప్పినట్లుగా, విద్య కోరిన వారికి విద్య వస్తుందని, ధనం కోరినవారికి ధనం వస్తుందని, కీర్తి కండూతి ఉన్నవారికి అదీ వస్తుందని ఇలా రకరకాలుగా ఫలశ్రుతిలో చెప్పబడింది.

ఏదీ కోరకుండా నిష్కామంగా పారాయణ గావిస్తే అన్ని బంధాలనుంచీ విడివడి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడని కూడా 'బ్రహ్మజ్ఞాన మవాప్నోతి యేన ముచ్యేత బంధనాత్' అన్న శ్లోకంలో చెప్పబడింది.

అయితే ఈ నామాలను ఎలా పారాయణం చెయ్యాలో తెలియాలి. అదెలా? అంటే, త్రికరణశుద్ధిగా మాత్రమే ఏ నామాలనైనాసరే పారాయణం గావించాలి. అంటే మనస్సు వాక్కు కర్మ ఈ మూటినీ కలిపి అనుసంధానం చేసి ఒక త్రాటిమీదకు తెచ్చి అప్పుడు మాత్రమె పారాయణం చెయ్యాలి. అప్పుడే సద్యో ఫలితాలను (immediate results) చూడవచ్చు.

కానీ ఇదే మనం చెయ్యలేని పని. ఎందుకంటే, మనస్సు మన అదుపులో ఉండదు. వాక్కు కూడా ఉండదు. ఇక కర్మ అసలే ఉండదు. అందుకే మనం చేసే పారాయణం ఫలితాలను ఇవ్వదు. ఇస్తుందన్న భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇవ్వదు. మన జాతకంలోని యోగాలను బట్టి మన జీవితం జరుగుతూ ఉంటుంది. మనం చేస్తున్న తూతూ పారాయణం వల్లనే మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయన్న భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. అది నిజం కాదు.

నువ్వు పూజలు చేసినా చెయ్యకపోయినా, పారాయణాలు చేసినా చెయ్యకపోయినా నీ జీవితం నీ జాతకం ప్రకారం పోతూనే ఉంటుంది. నీ పూజలవల్ల అంతా మంచి జరుగుతున్నది అనుకోవడం నీ భ్రమ. పూజల పారాయణాల పరమ ప్రయోజనం 'అనుకున్నవన్నీ జరగడం', 'కోరికలు తీరడం' ఇవి కాదు.

ఉదాహరణకు - లలితా రహస్య నామాలలో ఒక నామం ఇలా ఉంటుంది.

'సత్యసంధా సాగరమేఖలా' 

నిత్యజీవితంలో మనం కూడా సత్యంగా ఉండకుండా, మనం ఈ నామాలను పారాయణం చేస్తే ఉపయోగం ఎలా ఉంటుంది? ఉండదు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ మనం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు చెబుతూ, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, ఇంకో పక్క ' సత్యసంధా సాగరమేఖలా' అని అమ్మవారి ఎదురుగా అరుస్తుంటే అదే రకమైన పారాయణం? నీ అరుపులకు బెదిరిపోవడానికి అమ్మవారు పిచ్చిదా? నీ నిత్యజీవితంలో నువ్వు సత్యాన్ని అనుక్షణం అనుసరిస్తున్నంత వరకే సత్యస్వరూపిని అయిన జగజ్జనని నిన్ను ఆదరిస్తుంది. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వుంటూ, అదే కరెక్ట్ అనుకుంటూ, ఇలాంటి దొంగ పారాయణాలు ఎన్ని చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.

సముద్రాలు దాటి నీవు ప్రయాణించినా సరే, నీవు సత్యాన్ని వదలకూడదు. ఇది ఈ నామానికి గల అసలైన అర్ధం.

ఇంకో ఉదాహరణ ఇస్తాను.

'శోభనా శుద్ధమానసా' అనేది ఇంకో నామం.

'అందమైన దానివి. మరియు శుద్ధమైన మనస్సు కలదానివి.' అని దీని అర్ధం. శుద్ధమైన మనస్సు నీకుంది అంటూ మనం ఆశుద్ధమైన మనస్సుతో పారాయణం చేస్తే ఉపయోగం ఏముంటుంది?

ఇష్ట దేవత అనే పదానికి అర్ధం ఏమిటి? మనకు ఇష్టమైన దేవత అనే కదా. మరి మన ఇష్టదేవత ఎలా ఉన్నదో అలా మనమూ ఉండవలసిన పని లేదా? కనీసం ఆమెకు ఇష్టమైన రీతిలో మనం ఉండవలసిన పని లేదా? మనం ఎలా ఉంటె ఆమెకు ఇష్టమో నామాలలో క్లియర్ గా ఉన్నది. మనం వాటిని ఊరకే చిలకలాగా చదువుతూ, వాటికి పూర్తిగా విరుద్ధంగా ఉంటె దానర్ధం ఏమిటి?

పాతకాలంలో రావణుడు మొదలైన రాక్షసులు కూడా పూజలు హోమాలు చేసేవారు. మనకంటే ఇంకా అఘోరంగా చేసేవారు. కానీ ఆ నామాలు పూజలు ఏం చెబుతున్నాయో వాటిని మాత్రం ఆచరించేవారు కాదు. ప్రస్తుతం మనమూ అంతే. ఇక మనకూ వారికీ తేడా ఏముంది? మనమూ వారివంటి వాళ్ళమే.

ఇంకొక ఉదాహరణ ఇస్తాను.

'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అనే నామం అందరికీ తెలిసిందే. మనం ఎన్నోసార్లు పారాయణ చేసిన నామమే ఇది. దీనర్ధం ఏమిటి? ' అమ్మా! నువ్వు అంతర్ముఖులైన వారిచేత పూజింపబడతావు. కానీ బహిర్ముఖులకు నువ్వు అందవు.' అని దానర్ధం.

మనం చేస్తున్నదేమిటి?

ప్రతిక్షణం బహిర్ముఖులుగా ఉంటూ, కోతిలాంటి మనస్సుతో బయట బయట తిరుగుతూ, ఎన్నెన్నో ఎత్తులు జిత్తులు వేస్తూ, అహంకారానికి మన జీవితంలో పెద్దపీట వేస్తూ, మళ్ళీ ఈ నామాన్ని పారాయణ చేసినందువల్ల ఉపయోగం ఏమిటి? ఎవర్ని మనం మోసం చేస్తునట్లు? ఇలా భక్తులుగా నటించడం వల్ల నిజానికి మనకేం ఒరుగుతుంది?

ఆలోచించండి.

కనుక సహస్ర నామాలను ఎన్ని వేల సార్లు ఎన్ని లక్షల సార్లు చేశామన్నది ముఖ్యం కాదు. ఏయే దినుసులతో చేశామన్నది ముఖ్యం కాదు. నువ్వు ఉత్త గడ్డి పూలతో చేశావా బంగారు పూలతో చేశావా అన్నది ముఖ్యం కాదు. ఎలాంటి మనస్సుతో చేశావన్నదే ప్రధానమైన విషయం. నీ మనస్సు స్వచ్చంగా లేకుండా ఉన్నంతవరకూ నువ్వెన్ని పారాయణాలు చేసినా అవన్నీ వేస్టే అన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి.

ప్రతివాడూ తన మనస్సు స్వచ్ఛమే అనుకుంటాడు. అది నిజం కాదు. మనలో ప్రతివారూ కూడా, మన మనస్సులు ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నాయో కనీసం గుర్తించలేనంతగా దిగజారిపోయి ఉన్నామన్నది అసలైన నిజం.

మన అంతరిక పరిస్థితి చండాలంగా ఉన్నది కనుకనే ఫలశ్రుతిలో చెప్పబడిన ఫలితాలు ఏవీ మనకు రావడం లేదు. ఇది ఇంకొక నిజం.

కనుక ఏతావాతా నేను చెప్పేది ఒకటే ! ఊరకే టేప్ రికార్డర్ లాగా పారాయణం చెయ్యడం కాదు. ఆ నామాల అర్ధాలు నీ జీవితంలో ప్రతిఫలించాలి. అదే అసలైన పారాయణ విధానం. అలా చెయ్యలేనంతవరకూ రోడ్డు పక్కన గుళ్ళో పాడుతున్న మైకుకూ నీకూ ఏమీ తేడా లేదు. దానికీ లైఫ్ లేదు. నీకూ నిజమైన ఆధ్యాత్మికత లేదు.

ఈ విషయాన్ని లలితా పారాయణాలు మాత్రమె కాదు, ఇతర ఏ పారాయణ అయినా సరే చేసేవారు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుని సక్రమంగా పారాయణం చేస్తే సద్యోఫలితాలు వస్తాయి. అనుభవంలో ఎవరికి వారే దీనిని రూఢి పరుచుకోవచ్చు.

(ఇంకా ఉంది)