“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

రూట్ మ్యాప్ బట్టీ పట్టొద్దు - దారిలో నడవండి

మా ఇంటి పక్కనే ఒక గుడి ఉంటుంది. 'మ్యూజియం ఆఫ్ గాడ్స్' లాగా, అక్కడ అనేకమంది దేవుళ్ళు కొలువై ఉంటారు.ఎవరికి బిజినెస్సు బాగుందో ఆ దేవుళ్ళని కొత్తగా ప్రతిష్టలు చేస్తూ ఉంటారు.ఆ దేవుళ్లలో కొంతమందికి బిజినెస్ బాగా నడుస్తూ ఉంటుంది.కొంతమంది బిజినెస్ లేక డల్ గా ఉంటారు. ఆ మధ్యన అమ్మవారిని కూడా ప్రతిష్ట చేశారు.సీజన్ బట్టి ఆయా భక్తులు వచ్చి వాళ్లకు తోచిన నానాగోల చేసి పోతుంటారు.

గత 17 ఏళ్ళుగా ఒక్కసారికూడా ఆ గుడికి నేను వెళ్ళలేదు.నేను ఆఫీసుకీ ఇతరపనుల మీదా వెళ్లి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను.అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూచుని లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారు.

మొన్నీ మధ్య ఒకరోజున ఒకామె ఫోన్ చేసింది.

'నా పేరు ఫలానా.మీరు ఫలానా నా?' అంటూ అడిగింది.

'అవును' అన్నాను.

'మీ పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' ఈ మధ్యనే చదివాను.చాలా బాగుంది.మీరు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారని అందులోని అడ్రస్ బట్టి తెలిసింది.మీ ఇంటిపక్కనే ఉన్న గుడిలో నేను లలితా పారాయణకు వస్తూ ఉంటాను.' అన్నది.

'మంచిది' అన్నాను.

'మేము గత పదేళ్ళ నుంచీ లలితా పారాయణ నిత్యం చేస్తున్నాము.మీరూ ఒకసారి రావచ్చు కదా?' అడిగిందామె.

'సారీ.నాకింట్రస్ట్ లేదు' అన్నాను.

'అంటే - పారాయణ చేస్తే తప్పు లేదు కదా?' అన్నది.

'తప్పని కాదు.నాకు అవసరం లేదు.మీకు అవసరం అయితే మీరు చేసుకోండి.' అన్నాను.

'మీ పుస్తకం చదివి మీరు కూడా అమ్మవారి భక్తులని అనుకున్నాను.మీరేమో పారాయణకు రానంటున్నారే?' అన్నదామె.

'అమ్మవారి భక్తుడిని కానని ఎవరన్నారు? భక్తుడైతే ఇక గుళ్ళలో సామూహిక పారాయణాలు చెయ్యవలసిందేనా?' అడిగాను.

'మీరు చెబుతున్నది నాకర్ధం కావడం లేదు' అందామె కొంచం అయోమయంగా కొంచం కోపంగా.

'మీకు ఓపికుంటే ఫోన్లోనే చెబుతాను.లేకుంటే ఒక ఆదివారం రోజు మా ఇంటికి రండి.తీరికగా మాట్లాడుకోవచ్చు.' అన్నాను.

ఆమెకు భయం వేసినట్లుంది.

'ఒద్దులెండి.ఫోన్లోనే చెప్పండి.' అన్నది.

'సరే వినండి.మీరు జీవితాంతం లలితా పారాయణ చేసినా మీకు ఏమీ ఒరగదు.మీ పూర్వకర్మ ప్రకారం మీ జీవితం గడుస్తుంది.మంచి జరిగితే అమ్మవారి దయ అనుకుంటారు.చెడు జరిగితే అమ్మ పట్టించుకోలేదు అనుకుంటారు.అదంతా మీ భ్రమ.మీ పారాయణకీ మీ జీవితంలో జరిగేవాటికీ ఏమీ సంబంధం లేదు.

నిజానికి లలితాసహస్రం అనేది ఒక రూట్ మ్యాప్.అందులో మీరు ఏమేం చెయ్యాలో వ్రాసి ఉంటుంది.వాటిని మీరు చెయ్యాలి.అంతేగాని రూట్ మ్యాప్ బట్టీపట్టి వల్లె వేస్తుంటే మీ జన్మంతా అయిపోయినా మీరు గమ్యం చేరలేరు.అందులో చూపిన దారిలో మీరు నడవాలి.నడవకుండా ఊరకే పారాయణాలు చేస్తుంటే ఏమీ ఉపయోగం ఉండదు.

కాశీకి వెళ్ళాలంటే ఒక రూట్ ఉంటుంది.ఆ రూట్ ని మీరు గుర్తు పెట్టుకుని ఆ దారిలో నడిస్తే కాశీకి చేరవచ్చు.అంతేగాని మీ ఇంట్లో కూచుని ఆ రూట్ మ్యాప్ ని బట్టీపట్టి వల్లె వేస్తుంటే ఏం జరుగుతుంది? మీ ఇంట్లోనే మీరు ఉంటారు.కానీ మీకేదో ఒరిగిందన్న భ్రమలో ఉంటారు.కాశీని చూశామని సంబరపడుతూ ఉంటారు.కానీ మీ ఇంటికి కాశీ కొన్ని వేలమైళ్ళ దూరంలో ఉంటుంది.రూట్ మ్యాప్ వల్లె వేసినంత మాత్రాన కాశీ మీ ఇంటికి రాదు.ఇది కూడా అంతే. 

అందుకే మీరు చేస్తున్న సామూహిక పారాయణాలు అవన్నీ శుద్ధవేస్ట్ అని నేనంటాను.వేస్ట్ పనులు తెలివున్నవాళ్ళు ఎవ్వరూ చెయ్యరు కదా.అందుకే నేనూ మీ గుడికి రాను.మీ పారాయణలూ చెయ్యను.' అని చెప్పాను.

ఆమెకు బాగా కోపం వచ్చిందని ఆమె గొంతు వింటుంటే తెలుస్తున్నది.

'అంటే మేం చేస్తున్నదంతా వేస్ట్ అంటారా?' అడిగింది.

'నేనలా అనలేదు.నావరకూ వేస్ట్ అని చెప్పాను.మీ సంగతి మీ ఇష్టం.' అన్నాను.

కనీసం 'థాంక్స్' కూడా చెప్పకుండా టక్కున ఫోన్ కట్ చేసింది ఆమె.

మనుషులంతా ఇలాగే ఉంటారు.వారికి కావలసిన సమాచారం వరకూ రాబట్టుకోవడం, ఆ తరువాత కనీసం సివిక్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తిస్తారు. దానికి తోడు నిజం చెబితే కోపం ఒకటి. నేను కూడా ఆమె పిలవడంతోనే ఎగిరి గంతేసి ఆ గ్రూప్ లో చేరి, గుడికి పోతూ,పారాయణాలు చేస్తూ,ఆ భజనబృందం పాటలకు తబలా వాయిస్తూ ఉంటే నేను మంచివాణ్ణి.లేకుంటే పెడమనిషిని, దుర్మార్గుడిని.నాస్తికుణ్ణి.

ఇలాంటి గ్రూపులని నా చిన్నప్పటినుంచీ చూస్తున్నాను.వీరంతా 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'- అనే బాపతు.వీరికి నిజంగా కావలసింది అమ్మవారు కాదు.ఆ గ్రూపులో ఉండే స్నేహాలు,గుడిలో చేరి చెప్పుకునే పోసుకోలు కబుర్లు,తామేదో గొప్ప భక్తులమనీ, అమ్మవారి అనుగ్రహానికి దగ్గరలో ఉన్నామన్న భ్రమా, వారి చీరలూ నగలూ ప్రదర్శిస్తూ నలుగురిలో చేసే 'షో' మాత్రమే వీరికి కావాల్సినవి.

నిజమైన ఆధ్యాత్మికత ఇది కాదు.

"లలితా సహస్రనామం అనేది పారాయణ గ్రంధం కాదు, ఆచరణగ్రంధం"- అని నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరు నాతో అన్నారు.అదృష్టవశాత్తూ ఆ ఆచరణ ఎలా చెయ్యాలో నేర్పించే గురువులూ నాకు చిన్నప్పుడే దొరికారు. ఆ మాట అక్షరాలా నిజం.కానీ నిజం చెబితే వినేవారు ఈ కలియుగంలో ఎందరున్నారు? ప్రజలకి కావలసింది వారివారి అహాలు తృప్తిపడటమే గాని అసలు నిజం ఎవరికి కావాలి?

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువమంది ఇలాంటి భ్రమల్లో కాలం గడపవలసిందే. దేవుడి దగ్గరే ఉన్నామనుకుంటూ దేవుడికి దూరం కావలసిందే.ఈ మాయను దాటనంతవరకూ అసలైన ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో వారికి అర్ధం కాదు.అలా అర్ధం కానంతవరకూ, వారు చేస్తున్నదే నిజమైన ఆధ్యాత్మికత అనే భ్రమలో వారు ఉండక తప్పదు.కొండొకచో మనలాంటి వాళ్ళని కూడా ఆ ఊబిలోకి లాగాలని చూడకా తప్పదు.

అందరూ 'కాశీ కాశీ' అంటూ అరిచేవారే గాని నిజంగా కాశీకి పోయి చూచేవారు ఎందరుంటారు? చూచినా కాశీలోనే ఉండిపోయేవారు ఎందరుంటారు? ఒకవేళ వెనక్కి వచ్చినా, కాశీని తమతో ఇంటికి తెచ్చుకునే వారు ఎందరుంటారు?

ఈ మాయను దాటినవాడికే అసలైన ఆధ్యాత్మికద్వారాలు తెరుచుకుంటాయి. అతీతలోకాలకు దారులు తెరుస్తాయి.నిజమైన దివ్యత్వం అంటే ఏమిటో బోధపరుస్తాయి.

అంతవరకూ ఈ పూజలూ పారాయణాలే సర్వస్వం అనే భ్రమలో లోకులు బ్రతకక తప్పదు.