“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, సెప్టెంబర్ 2015, గురువారం

వినాయక చవితి - కొన్ని రహస్యాలు

ఈరోజు వినాయక చవితి.ఈ సందర్భంగా కొన్ని యోగ - జ్యోతిషశాస్త్రపరమైన విషయాలు మాట్లాడుకుందాం.

వినాయకుడంటే ఎవరు?వినాయకుడంటే ఈశ్వరపుత్రుడు. ఓం ఈశపుత్రాయ నమ: అనేది ఆయన నామావళిలో ఒక నామం.

మానవులందరూ ఈశపుత్రులే.కానీ అందరిలో ఈశ్వరశక్తి సమానంగా ప్రకాశించడం లేదు.దానికి కారణం వారు వారు చేసుకున్న ఖర్మలు.మొదట్లో అందరూ వినాయకునిలా స్వచ్చంగా ఉన్నారు.కానీ వారి వారి కర్మల వల్ల దిగజారి ఇప్పుడున్న స్థితికి చేరారు.ఈ స్థితినుంచి సాధన ద్వారా ఎదిగి మళ్ళీ అప్పటి ప్రాధమిక స్థితికి చేరడమే మానవ జన్మ పరమార్ధం.

తాను మామూలు మనిషినన్న భ్రమనుంచి ప్రతి మనిషీ బయటపడి తానూ ఈశ్వరపుత్రుడనే అన్న సత్యాన్ని తెలుసుకుని ఆ విధంగా ఉన్నతంగా జీవించడం వల్లనే తన నిజస్వరూపాన్ని తను తెలుసుకోగలుగుతాడు. అప్పుడే తానుకూడా ప్రపంచానికి జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరుల ఒడిలోకి చేరుకోగలుగుతాడు.

వినాయకుడు ఓంకార స్వరూపుడు.ప్రధమంగా ఆయన పూజనే మనం చెయ్యాలి.అలాగే ప్రతి మంత్రమూ ఓంకారంతోనే మొదలౌతుంది.అదే గణపతి స్వరూపం.మనమూ ఓంకార స్వరూపులమే.అయితే ఇప్పుడు మనమున్న స్థితిలో మనకా విషయం తెలియదు.ఓంకార మంత్రజపం వల్లా, సాధనవల్లా మనిషి తన నిజస్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతాడని సూచనకే గణపతి స్వరూపం అలా ఉంటుంది.

ఇకపోతే - పార్వతీదేవి నలుగుతో పిండిబొమ్మను చేసిందని ఆ బొమ్మ శివుని అడ్డగించగా ఆయన దాని శిరస్సును ఖండించాడని ఆ తర్వాత గజాసురుని తలను అతికించారనే కధను నేను నమ్మను.ఇది ఒక కల్పిత కధ. సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి ఆ బొమ్మ ఎవరో తెలియదా? కనుక, ఇది మధ్యలో ఎవరో కల్పించిన కధేగాని నిజం కాదు.

అలాగే - నృత్యం చేస్తున్న వినాయకుడిని చంద్రుడు చూఛి నవ్వగా ఆయన పొట్ట పగిలిందన్నది కూడా కల్పిత కధే. అసలు విషయం అది కాదు. భాద్రపద చవితి రోజున వచ్చే చంద్రుని కిరణాలలో చెడు ప్రభావం ఉంటుంది.అది మానవులను,పశుపక్ష్యాదులను,ఇతర జీవులను ఎవ్వరినీ వదలదు. ఈ విషయాన్ని మార్మికంగా చెప్పడమే ఈ కధ వెనుక ఉన్న ఉద్దేశ్యం.ఓంకార మంత్రజపం చెయ్యడం వల్ల ఈ ప్రభావాన్నుంచి మనిషి తనను తాను రక్షించుకోగలుగుతాడు.అంటే లైట్ వైబ్రేషన్ ఇచ్చే చెడు ప్రభావం నుంచి సౌండ్ వైబ్రేషన్ సహాయంతో మనిషి తప్పుకోగలడు.వినాయక చవితి పండుగ వెనుక ఉన్న అసలైన నిజం ఇది.విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల నీలాపనిందలు తొలగిపోతాయంటే ఇదే.

శ్రీకృష్ణుడు పాలు పితుకుతూ ఆ పాలల్లో చవితి చంద్రుని చూచి నీలాపనిందల పాలైనాడని చెప్పే కధలో కూడా నిజం లేదు.మహారాజైన శ్రీకృష్ణునికి పాలు తనే పితకవలసిన పనిలేదు.తెమ్మంటే తెచ్చి ఇవ్వడానికి సేవకులు సిద్ధంగా ఉంటారు.

ఆరోజున ఆరుబైట కూచుని పాలు త్రాగుతూ ఆపాలల్లో చంద్రుని చూచాడు.చంద్రకిరణాలు ప్రసరించిన ఫలితంగా పాడైన పాలను త్రాగడం వల్ల నీలాపనిందలు వచ్చాయి.ఇది అసలైన నిజం.

పాలలో చంద్ర కిరణాలు పడినంత మాత్రాన అవి పాడైపోతాయా? అని చచ్చు అనుమానాలు ఇప్పుడు రావలసిన అవసరంలేదు.రేడియేషన్ థెరపీ అంటే ఏమిటో మనకు తెలుసు. ప్రతి రేడియేషన్ కూ ఒక ఫలితం ఉంటుంది.చంద్రకిరణాలకూ సూర్య కిరణాలకూ ఉన్న శక్తి మీద పరిశోధనలు మనం చెయ్యకపోయినా విదేశాలలో చేస్తున్నారు.నిజమే అని ఒప్పుకుంటున్నారు.

విదేశాలలో ప్రస్తుతం జరుగుతున్న హోమియో రీసెర్చిలో లూనార్ రేమేడీస్ సోలార్ రెమెడీస్ కనుక్కుంటున్నారు.మనకు వేదంలో ఉన్నది.సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉన్నపుడు ఒక్కొక్క రేడియేషన్ ను విడుదల చేస్తాడు.సూర్యరశ్మి ఏడాది పొడుగునా ఒకే శక్తితో ఒకే క్వాలిటీతో ఉండదు. వాటినే ద్వాదశాదిత్యులు (పన్నెండుమంది సూర్యులు) అన్నారు.ఈ విషయం మన వేదంలో ఉన్నది.మనం వదిలేశాం.వాళ్ళు రీసెర్చిలో నిజమని ఒప్పుకుంటున్నారు.

అలాగే చంద్రుని రేడియేషన్ లో కూడా తేడాలుంటాయి.ఒక్కొక్క నెలలో చంద్రుని శక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది.అదికూడా సూర్యుని నుంచి చంద్రుడున్న దూరాన్ని బట్టి (తిధిని బట్టి) ఆ శక్తిలోనూ దాని క్వాలిటీ లోనూ మార్పులు ఉంటాయి.నిజమైన శ్రీవిద్యా సాధకులకు తెలిసిన 'చంద్రవిద్య' అంటే ఇదే.శుక్లపక్షంలోనూ కృష్ణపక్షం లోనూ ఉన్న చంద్రుని స్థితులను బట్టి చేసే అంతరిక సాధనే చంద్రవిద్య.

'మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా' అని లలితా సహస్రనామం చెప్పినది దీనినే.

పౌర్ణమి రోజున చంద్రకాంతిలో పాలను ఉంచి 'సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ' అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పాలల్లో కనిపిస్తున్న చంద్రబింబంలో అమ్మవారిని ధ్యానించి  ఆ పాలను త్రాగితే అసాధ్య రోగాలు కూడా నయమౌతాయన్న ప్రక్రియ శ్రీవిద్యాతంత్ర సాంప్రదాయంలో ఉన్నది. పాతకాలంలో పల్లెటూళ్ళలో, కార్తీక పౌర్ణమి రోజున, ఆవుపాలతో పాయసాన్ని కాచి తెల్లవార్లూ ఆ పాయసాన్ని ఆరుబయట వెన్నెలలో ఉంచి మరుసటిరోజున పొద్దున్నే ఆ పాయసాన్ని త్రాగేవారు.చంద్రునినుంచి అమృతకిరణాలు వచ్చి ఆ పాయసంలో కలుస్తాయని నమ్మేవారు. కొందరైతే తెల్లవార్లూ వెన్నెలలో ఆ పాల ఎదురుగా కూర్చుని మంత్రజపం చేసేవారు.ఇప్పుడు ఈ ప్రక్రియను ఎవ్వరూ చెయ్యడం లేదు.కానీ మొన్నమొన్నటివరకూ చాలా బ్రాహ్మణ కుటుంబాలలో చేసేవారు.

ఆ నెలలో పౌర్ణమిరోజున చంద్రకాంతికి ఉన్న మంచి ప్రభావాన్నే 'అమృతకిరణాలు' అనే మాటతో సూచించేవారు.దానినే మనం ఇప్పుడు 'బెనిఫిక్ రేడియేషన్' అంటున్నాం. 

కనుక చంద్రకాంతికి అనేక శక్తులున్న మాట వాస్తవం.మూలికలకు శక్తి చంద్రుని నుంచే వస్తుందని ఆయుర్వేదం అంటుంది.నేటికీ కవులూ భావుకులూ కళాకారులూ చంద్రకాంతికి బాగా ప్రభావితులౌతూ ఉంటారు. పౌర్ణమి రోజునో ఆ దరిదాపుల్లోనో కవులు ఎక్కువగా కవిత్వాలు వ్రాస్తూ ఉంటారు.ముఖ్యంగా స్త్రీలు ఈ సమయంలో 'హిస్టీరిక్' గా ప్రవర్తిస్తూ ఉంటారు.గమనించండి.అర్ధమౌతుంది.

అమావాస్యకూ పౌర్ణమికీ చంద్రుని ప్రభావం భూమిమీద స్పష్టంగా కనిపిస్తుంది.మనుషులలో కామం ఈ సమయంలో ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉంటుందనేది ప్రత్యక్షసత్యం.పౌర్ణమికి మనిషి దేహంలో హార్మోన్స్ ఎక్కువగా విడుదల అవుతాయి.దానికి చంద్రకాంతి ప్రభావమే కారణం. గమనించుకుంటే ఎవరికి వారికి ఈ విషయం తెలుస్తుంది.

కానీ ఈ మధ్యలో ఉండే తిధులలో కూడా ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది.అది శుక్లపక్షంలో ఒక విధంగా, కృష్ణపక్షంలో ఇంకొక విధంగా ఉంటుంది. మన భారతీయులు ఈ సూక్ష్మమైన తేడాలను వారి రీసెర్చిలో కనుక్కున్నారు.

భాద్రపద శుక్లచవితి రోజున వచ్చే చంద్ర కిరణాలలో - మానవులను చికాకు పరచే శక్తి ఉంటుంది.దానివల్ల చెయ్యకూడని పనులు చేసి, పడకూడని మాటలు పడవలసి వస్తుంది.దానిని మనకు అర్ధమయ్యే రూపంలో చెప్పడానికే పై కధలన్నీ అల్లబడ్డాయి.అంతేగాని అవి నిజంగా అదేవిధంగా మక్కీకి మక్కీగా జరిగాయని కాదు.

అదే విధంగా జాంబవంతుడు తన కూతురైన జాంబవతిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడని గాధ ఉన్నది. ఉయ్యాలలో ఆడుకుంటున్న తన కూతురికి శ్యమంతక మణిని తీసుకుపోయి ఇచ్చాడని చెబుతారు.జాంబవతి అప్పటికి ఉయ్యాలలో పడుకుని ఆడుకునే పిల్ల అయితే వెంటనే ఆమెను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి ఎలా చేస్తాడు? అసలు ఎలుగుబంటి పిల్లను కృష్ణుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? అది అసంభవం.కనుక సత్యం అది కాదు.

అడవిలో ఉండే ఆటవిక జాతులకు వినోదం ఏమిటి? ఉయ్యాల ఊగడం.అక్కడ చెట్లకు ఉయ్యాల వేసుకుని ఊగుతూ పాటలు పాడుకుంటూ ఆ అడవిలో ఉంటారు. కృష్ణ జాంబవంతుల యుద్ధం జరిగేనాటికి జాంబవతి ఉయ్యాలలో పడుకునే పాపాయి కాదు.ఉయ్యాలలో ఊగే కోయయువతి.కానీ మన కధలలో అలా వ్రాస్తారు.ఈ రకంగానే మన పురాణాలు అన్నింటినీ (ముఖ్యంగా సినిమావాళ్ళు) వక్రీకరించారు.

అసలు వానరులు, జాంబవంతులు అంటే కోతులు ఎలుగుబంట్లు కావు. అడవిలో నివసించే ఒక విధమైన ఆటవిక జాతులనే ఆ పేర్లతో పిలిచేవారు. అడవిజాతులలో మూతి కొంచం కోతిమూతి లాగా ఉండేవారిని వానరులు అనేవారు.ఇంకా కొంచం పొడుగుమూతి ఉంటె వారిని జాంబవంతులు అనేవారు.వీరంతా "నెగ్రోయిడ్" జాతికి చెందిన నల్లరంగు మానవులే. నేటికి కూడా గమనిస్తే,నల్లజాతి వారిలో(నీగ్రోలలో) కొందరు ఎత్తుగా బలిష్టంగా ఎలుగుబంట్ల లాగా ఉంటారు.కొందరు కోతిమూతితో దాదాపుగా కోతులలాగే ఉంటారు.రామాయణంలో చెప్పబడిన వానరజాతి, భల్లూకజాతి మొదలైన జాతులందరూ మానవులే.కానీ ఆటవిక జాతులు. అవి వారి గోత్రాల పేర్లు. మనకు గోత్రాలున్నట్లే వారికీ ఉంటాయి.రామాయణంలో చెప్పబడిన వానరసైన్యం కోతిమూక కాదు.అది ఆటవిక జాతికి చెందిన ఇలాంటి వీరుల సైన్యం.

కనుకనే శ్యమంతకమణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని, జాంబవంతుడు (ఆటవిక జాతికి చెందిన వేటగాడు) వేటాడి ఆ మణిని తీసుకుపోయి తన కూతురిని గిఫ్ట్ గా ఇచ్చాడు.వేటలో ఏదైనా ప్రత్యేకమైనది దొరికితే దానిని తీసుకుపోయి భార్యకో కూతురుకో బహుమతిగా ఇవ్వడం నేటికీ కోయజాతి వేటగాళ్ళకు ఒక సంప్రదాయమే.

ఆ తర్వాత ఆ జాంబవంతజాతికి చెందిన వేటగాడిని కృష్ణుడు ఓడించి అతని కూతురిని పెళ్లి చేసుకున్నాడు.పాతకాలంలో యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఇలా వివాహ సంబంధాలు కలుపుకునేవారు.మొన్న మొన్నటి వరకూ, తాను ఓడించిన రాజపుత్రుల కన్యలను అక్బరు ఇలాగే వివాహం చేసుకున్నాడు.శ్రీకృష్ణదేవరాయలు కూడా తను ఓడించిన రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు.రాచరిక వ్యవస్థలో ఇది మామూలే.

అప్పట్లో కృష్ణుడు ఇలా అన్ని జాతుల వారినీ పెళ్లి చేసుకున్నాడని,కులవ్యవస్థను పట్టించుకోవడం లేదనీ, ఆయన్ను మిగతా రాజులు తక్కువగా చూచి ఎగతాళి చేసేవారు.ఈనాడు ఆయన్ను మనం దేవుడని కొలుస్తున్నాం.కానీ ఆయన బ్రతికున్నపుడు మామూలు మానవుడనే చాలామంది అనుకున్నారు.

అలాగే - దేవతలు దానవులు- వారి మధ్య యుద్ధాలు అని మనం పురాణాలలో చదువుతాం. తెల్లగా ఉండి, నగరాలలో ఉంటూ నాగరిక జీవనం గడపేవారిని దేవతలు అన్నారు. నల్లగా ఉంటూ అడవులలో నివసిస్తూ ఆటవికంగా బ్రతికేవారిని రాక్షసులు అన్నారు.దేవతలు రాక్షసులు అంటే సివిలైజుడు వైట్స్ మరియు అన్ సివిలైజుడు బ్లాక్స్ అనేది అసలైన నిజం. వీరి మధ్యన ప్రాచీన కాలంలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి.అలా ఒకసారి జరిగిన దేవదానవ యుద్ధంలో దేవతల తరఫున దశరధుడు పాల్గొన్నట్లు రామాయణం చెబుతుంది.

ఈ విధంగా అనేక ప్రాచీన కధలను మనవాళ్ళు కాలక్రమేణా వక్రీకరించి వాటి అసలైన అర్ధాలను విస్మరించి, మన పురాణాలు అంటే మనకే అపనమ్మకం కలిగేలా వాటిని దిగజార్చారు.పురాణాలు నిజంగా జరిగినవే.కాకపోతే వాటిని వాస్తవ దృష్టితో అర్ధం చేసుకోవాలి.

వాస్తవదృష్టితో, సైంటిఫిక్ దృష్టితో,పురాణాలను చదివితే అసలైన నిజాలు అర్ధమౌతాయి.అంతేగాక వాటిల్లో ఉన్న శాస్త్రపరిజ్ఞానం అప్పుడు అర్ధమౌతుంది.అప్పుడే మన పురాణాలన్నా మన పండుగలన్నా మన పూజలన్నా మనకు గౌరవం ఇంకా పెరుగుతుంది.