“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, సెప్టెంబర్ 2015, శనివారం

సుభాష్ చంద్ర బోస్ వివాదం - ప్రశ్నశాస్త్రం ఏమంటున్నది?

దివంగత సుభాస్ చంద్రబోస్ గురించి వార్తలు అనేకం మీడియాలో వస్తున్న నేపధ్యంలో ఇందులోని నిజానిజాల గురించి మన జ్యోతిష్యశాస్త్రం ఏమంటున్నదో చూద్దాం.

బోస్ జననతేదీ దొరుకుతున్నది.కానీ ఖచ్చితమైన జననసమయం లేదు. అనేకమంది జ్యోతిష్కులు వారికి తోచినట్లు బోస్ జాతకాన్ని విశ్లేషణ చేసి ఎవరికి తోచినట్లు వారు ఫలితాలను వ్రాశారు.వాటిని నమ్మలేం.కనుక ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం.

అసలు అందరూ అనుకుంటున్నట్లు, లేదా ప్రభుత్వం ఇన్నాళ్ళూ ప్రచారం చేస్తున్నట్లు,బోస్ విమాన ప్రమాదంలో మరణించాడా?ఒకవేళ అలా మరణించకపోతే చనిపోయేదాకా ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? ఎలా ఉన్నాడు? అనేవి ప్రశ్నలు.

గుంటూరులో ఈరోజున మధ్యాన్నం 12.26 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది.

సూర్యుడు- కన్య-1 డిగ్రీ
చంద్రుడు - వృశ్చికం-8 డిగ్రీలు
కుజుడు - సింహం - 2 డిగ్రీ
బుధుడు (వక్రి)- కన్య-21 డిగ్రీ
గురుడు - సింహం - 14 డిగ్రీ
శుక్రుడు - కర్కాటకం - 23 డిగ్రీ
శని - వృశ్చికం- 6 డిగ్రీలు
రాహువు - కన్య- 7 డిగ్రీ
కేతువు - మీనం - 7 డిగ్రీ

రూలింగ్ ప్లానెట్స్ సహాయం తీసుకుందాం.

లగ్నం - ధనుస్సు - 7 డిగ్రీలు
లగ్నాధిపతి- గురువు
లగ్న నక్షత్రం - మూల - అధిపతి కేతువు, గురువును సూచిస్తున్నాడు.
హోర - చంద్ర హోర - అధిపతి చంద్రుడు
నక్షత్రం - అనూరాధ - అధిపతి శని.
వారం-శనివారం- అధిపతి శని.
రాశి- వృశ్చిక రాశి - అధిపతి కుజుడు, గురువుతో కలసి ఉన్నాడు.
ఇవీ రూలింగ్ గ్రహాలు.శని, గురువు బలమైన రూలింగ్ గ్రహాలుగా అవతరించాయి.

ఈ డేటాతో ముందుకు వెళదాం.

వారాదిపతి, నక్షత్రాధిపతి శనీశ్వరుడు అయ్యి బలమైన రూలింగ్ ప్లానెట్ గా అవతరించాడు.అలాగే గురువు కూడా లగ్నాధిపతి మరియు కేతువు సిగ్నిఫై చేస్తున్న గ్రహంగా బలమైన రూలింగ్ ప్లానెట్ అయ్యాడు. హోరాదిపతి చంద్రుడు కూడా శనీశ్వరునితోనే ఉన్నాడు.కనుక శనిచంద్రుల కాంబినేషన్ కు ప్రాముఖ్యత వచ్చింది.అలాగే,గురుకుజుల కాంబినేషన్ కు ప్రాముఖ్యత కలిగింది.ఈ రెండు కాంబినేషన్స్ లోనే అసలు రహస్యం అంతా దాగుందని గ్రహాలు చెబుతున్నాయి.దీనిని నిర్ధారిస్తూ శని కుజుల మధ్యన పరస్పరదృష్టి (mutual aspect) ఉన్నది.ఇది ప్రతికూల కేంద్రదృష్టి.ఈ రెండు గ్రహాలు కూడా క్రూర గ్రహాలు.కనుక ఈ ప్రశ్న అంత మంచి ఫలితాన్ని ఏమీ ఇవ్వదని ఈ దృష్టి చెబుతున్నది.

లగ్నాధిపతీ మరియు బలమైన రూలింగ్ ప్లానెట్ కూడా అయిన గురువు 6,8,12 దుస్థానాలలో లేడు.నవమంలో మిత్రస్థానంలో క్షేమంగా ఉన్నాడు. కనుక అందరూ అనుకుంటున్నట్లు లేదా ప్రభుత్వం ఇన్నాళ్ళూ మనల్ని నమ్మిస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదు.ఒక మిత్రదేశంలో కాలం గడిపాడని తెలుస్తున్నది.అయితే తనకు మిత్రుడూ, 12 వ స్థానాదిపతీ అయిన కుజునితో కలసి ఉండటం వల్ల ఇదొక మిత్రనిర్బంధం అని తెలుస్తున్నది.

కనుక జపాన్ లోని రెంకోజీ ఆలయంలో భద్రపరచబడి ఉన్న అస్థికలు బోస్ వి కావు అన్న నిజాన్ని గురువు స్పష్టంగా చెబుతున్నాడు.

నాలుగింట ఉన్న కేతువు వల్ల -అసలు జరిగిన విషయం ఏమైనప్పటికీ - తన స్వదేశంలో మాత్రం తప్పుడు ప్రచారం జరిగిందన్న విషయం తెలుస్తున్నది. చతుర్ధం స్వదేశానికి సూచిక.దశమంలో ఉన్న రాహువు వల్ల - ఈ ప్రచారాన్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేయించిందని తెలుస్తున్నది.దశమం ప్రభుత్వానికి సూచిక అని మనకు తెలుసు.అక్కడనే ఉన్న దశమాధిపతి ఉచ్చ వక్రబుధుని వల్ల, ఈ ప్రచారం కావాలనే వక్రీకరింపబడిందని, దానికి కారకులు తెలివైన పాలకులే అని, ఈ అబద్దపు ప్రచారంతో ప్రజలను వెర్రి వెధవలను చేశారని అర్ధమౌతున్నది. బుధుడు కమ్యూనికేషన్ కు కారకుడు.ఆయన వక్రస్థితి ఏమి సూచిస్తున్నది? వక్రీకరింపబడిన సమాచారం ప్రజలచే ఇన్నాళ్ళూ నమ్మించబడింది అని సూచిస్తున్నది.ఆయన యొక్క ఉచ్చస్థితి వల్ల పాలకులు బలమైనవారని సూచన ఉన్నది.

హోరానాదుడైన చంద్రుడు శనీశ్వరునికి రెండే రెండు డిగ్రీల దూరంలో వృశ్చికరాశిలో ఉంటూ - ఒక రహస్యాన్ని వెల్లడి గావిస్తున్నాడు.బోస్ ఒక నేలమాళిగ వంటి జైలులో పెట్టబడి దయనీయమైన జీవితాన్ని గడిపాడని ఈ కాంబినేషన్ సూచిస్తున్నది.వృశ్చిక రాశి - నేలమాళిగలను, భూగృహాలను, రహస్య జైళ్ళను సూచిస్తుంది.శనిచంద్రుల కాంబినేషన్ ఆధ్యాత్మిక చింతనను, పేదరికాన్ని, ఒంటరితనాన్ని,దుర్భరమైన మానసిక వేదనను సూచిస్తుంది. కనుక బోస్ ఈ విధమైన పరిస్థితులలో తన జీవితాన్ని గడిపాడని తెలుస్తున్నది. ఈ యోగం లగ్నం నుంచి ద్వాదశంలో ఉంటూ అదొక విదేశీ రహస్య స్థావరం అని సూచిస్తున్నది. అయితే ఆ దేశం మన మిత్రదేశమే అన్న సూచన కుజునికి వచ్చిన పంచమాదిపత్యం వల్లా, గురుకుజుల మిత్రత్వం వల్లా సూచితం అవుతున్నది.

మరొక బలమైన రూలింగ్ ప్లానెట్ అయిన శనీశ్వరుడు ద్వాదశంలో ఉంటూ మిత్రవిదేశంలో ఒక రహస్యప్రదేశంలో ఆయన జీవితం ఒంటరిగా గడిచిందని సూచిస్తున్నాడు.అంటే - తను అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదన్న బాధా, తను ఊహించిన విధంగా తన దేశం లేదన్న బాధతో, అయినా సరే తానేమీ చెయ్యలేకపోతున్నానన్న నిస్పృహతో ఆయన శేషజీవితం గడిచిందన్న సూచన ఉన్నది.శనిచంద్రుల కలయిక వల్ల - నిరాశా నిస్పృహలతో కూడిన మానసిక సమస్యలు సూచితం అవుతున్నాయి. అంటే - చివరి దశలో ఆయన తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యాడని శనిచంద్రులు సూచిస్తున్నారు.

ద్వాదశాదిపతి కుజుడు నవమంనుంచి తన చతుర్ధదృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు.అంటే - ఆ దూరదేశాదిపతి ఈ కుట్రలో భాగస్వామి అని తెలుస్తున్నది.

మీనంలో ఉన్న కేతువు గురువును సిగ్నిఫై చేస్తూ లోన్లీ ప్లానెట్ గా ఉన్నాడు. కనుక బోస్ ఒక ఒంటరి మరియు నిరాశాపూరిత దయనీయ జీవితాన్ని గడిపాడని తెలుస్తున్నది.

గురువుతో ఉన్న కుజుడు ఏమి సూచిస్తున్నాడు?ఆయన పంచమ ద్వాదశాదిపతి.అంటే - రహస్యమైన కుట్రను సూచిస్తున్నాడు.అంతేగాక ఒక నియంతను సూచిస్తున్నాడు.కుజునికి నియంత పోకడలు ఉంటాయి.కనుక ఒక నియంత పాలిస్తున్న దేశంలో, నవమం చేత సూచింపబడుతున్న దూరదేశంలో నిర్భందంలో ఉండిపోయాడని తెలుస్తున్నది.కుజుని రంగు ఎరుపు.నవమం మరియు సింహరాశి అధిపతి అయిన సూర్యుని రంగు కూడా ఎరుపే. కనుక ఎరుపు సూచిక అయిన దేశంలో ఆయన బందీగా ఉంచబడ్డాడని తెలుస్తున్నది. 

తొమ్మిది అంటే దూరదేశం. దాని అధిపతి సూర్యుడు పదిలో రాహువుతో కలసి ఉన్నాడు.పైగా దశమాదిపతి బలంగా ఉన్న బుదునితో కలసి ఉన్నాడు. కానీ బుధుడు వక్రించి కూడా ఉన్నాడు.అంటే దీని అర్ధం - బోస్ ఎక్కడైతే బందీగా ఉన్నాడో ఆ దేశపు అధిపతి మన దేశనేతలతో కుమ్మక్కు అయ్యాడని,లేదా వారు చెప్పినట్లు విన్నాడని,మన దేశనేతలకు బుద్ధి వక్రించిందనీ అర్ధం.

విషయాన్ని రూఢిగా,అంటే ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేదే ఆరూఢం.కనుక లగ్నారూఢాన్ని చూద్దాం.

లగ్నారూఢం -- మేషం అయింది. అధిపతి కుజుడు పంచమంలో, నవమాదిపతి అయిన గురువుతో కలసి ఉన్నాడు.అంటే మనకు సహచర దేశం అయిన ఒక దేశంలో మిత్రపూర్వకంగా ఆయన ఉంచబడ్డాడనీ, అయితే. అష్టమంలో ఉన్న శని చంద్రులవల్లా, శనికుజుల మధ్య ఉన్న పరస్పర దృష్టి వల్లా,ఇలా ఉంచబడటం తెలివైన కుట్ర అనీ, నిజానికి అది నిర్బంధం అనీ రూడిగా తెలుస్తున్నది.

ఇంకా చూద్దాం.

చతుర్దంలో ఉన్న శుక్రుని దృష్టి షష్ఠంలో ఉన్న షష్టాధిపతి ఉచ్ఛబుధుని పైన దగ్గరగా ఉండటం వల్ల - ఈయనకు స్వదేశంలో తెలివైన బలమైన శత్రువులు ఉండేవారని సూచిస్తున్నది.ఆ శత్రువులు పాలకులే అని అక్కడే ఉన్న సూర్యుడు చెబుతున్నాడు.

ప్రశ్నసమయానికి నడుస్తున్న దశ ఇంకా క్లియర్ గా విషయాన్ని చెబుతుంది.అదేంటో చూద్దాం.

ప్రశ్న సమయానికి శని/శుక్ర/సూర్యదశ నడుస్తున్నది.శని ద్వాదశంలో ఉంటూ బందీగా పట్టుబడటాన్నీ జైలునూ సూచిస్తున్నాడు,శుక్రుడు అష్టమంలో ఉంటూ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవడాన్నీ, దుర్భరమైన జీవితాన్నీ సూచిస్తున్నాడు.నవమాదిపతి అయిన సూర్యుడు దశమంలో రాహుగ్రస్తుడై ఇదంతా ఒక దూరదేశం మరియు మన దేశనాయకుల మధ్య నడిచిన కుట్ర అని సూచిస్తున్నాడు.

విషయం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే బోస్ విమాన ప్రమాదంలో మరణించాడని ఎలా నమ్మగలం? కుదరదు గాక కుదరదు.

మొత్తానికి మహానాయకులందరూ కలసి ఒక మహానుభావుడికి అన్యాయం చేశారన్న మాట? ఆ శాపమేనా ప్రస్తుతం మన దేశాన్ని అన్ని రకాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రం?

ఈ ప్రశ్నకు 'అవును' అనే సమాధానం రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.రాజు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలని అంటారు.

ప్రస్తుతం మన గతి అదేగా మరి.