“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, సెప్టెంబర్ 2015, సోమవారం

మోపిదేవి సందర్శనం

ఈ మధ్యన మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆలయం సందర్శించడం జరిగింది.

నాతో వచ్చిన రమణమూర్తికి నా వింత ప్రవర్తన ఈ మధ్యనే కొద్దికొద్దిగా అలవాటౌతున్నది.నాకున్న స్పిరిట్యువల్ ఇంటరెస్ట్ చూచి తన దగ్గరున్న రమణమహర్షి పుస్తకాలు తెచ్చి ప్రయాణంలో చదవమని ఇస్తూ ఉంటాడు.ఈరోజున గణపతి ముని వ్రాసిన 'రమణగీత' తెచ్చి ఇచ్చాడు.దానిని చూస్తూనే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.1977 లో నేను పదో తరగతి చదివే రోజుల్లో ఈ పుస్తకాన్ని మొదటిసారిగా చదివాను.గణపతిముని గారి చాందసపు ధోరణి అప్పట్లోనే నాకు నచ్చలేదు.ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పకుండా అతిశయోక్తులు, అనవసరమైన సాగదీతలు,పాండిత్య ప్రకర్షలు ఆయన రచనలలో ఉంటాయి.ఈ ధోరణికి విరుద్ధంగా, రమణమహర్షి గారి మాటలు సూటిగా స్పష్టంగా సింపుల్ గా ఉంటాయి. పాండిత్యానికీ జ్ఞానానికీ ఉన్న తేడా వీరిద్దరి మాటలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.అందుకే, గణపతి మునిగారి వివరణ కంటే కూడా, మహర్షి ఇచ్చిన సమాధానమే నాకు నచ్చుతుంది.ఆ సమాధానానికి అనవసరమైన సాగదీతగా గణపతి మునిగారి వ్యాఖ్యానం అనిపిస్తుంది. పేజీలు తిప్పుతుంటే చిన్నప్పుడు చదివినది మొత్తం వరుసగా గుర్తు వస్తూ ఉన్నది.ఆ పుస్తకాన్ని అక్కడక్కడా పైపైన చూచి తిరిగి ఇచ్చేశాను.

రేపల్లె నుంచి 'పెనుమూడి-పులిగడ్డ' వారధి మీదుగా ప్రయాణం.కారైతే ఏదో జైలులో కూచున్నట్లుగా ఉంటుంది.అందుకని హాయిగా గాలి తగులుతూ పోవచ్చని మోటార్ సైకిల్ తీసుకున్నాము. దానిమీద ప్రయాణం మొదలైంది.

రేపల్లె చిన్న టౌన్.పాతకాలపు ఇళ్ళూ, పెద్దగా గొడవ లేని ప్రశాంత వాతావరణమూ నాకు బాగా నచ్చుతాయి.బాపట్ల కూడా కొంతవరకూ ఇలాగే ఉంటుంది.కాకినాడ కూడా ఇలాగే ఉంటుంది.ఇవన్నీ సముద్రానికి దగ్గరగా ఉన్న చిన్న ఊళ్లు గనుక ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇటువంటి చెట్లూ,పాతకాలపు ఇళ్ళూ ఉన్న చిన్నసైజు టౌను వాతావరణంతో నేను త్వరగా సింక్ అయిపోతాను.అలాంటి పరిసరాలలో నాకు తేలికగా ధ్యానస్థితి వచ్చేస్తూ ఉంటుంది.












వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో చల్లని గాలి వీస్తూ పెనుమూడి వంతెన మీదనుంచి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. 'ఎక్కడైతే పెద్ద జలాశయం ఉంటుందో అక్కడ ధ్యానం చెయ్యమని' శ్రీరామకృష్ణులు తన భక్తులకు ఉపదేశించారు. ఎందుకంటే పైన ఉన్న విశాలమైన నీలాకాశం -క్రింద ఉన్న నీటిలో ప్రతిఫలించినట్లు, ఊర్ధ్వంగా ఉన్న దివ్యచైతన్యమూ దాని వెలుగూ నిశ్చలమైన మన మనస్సులో వెంటనే ప్రతిఫలిస్తాయి.అందుకోసం వంతెన మీద ఆగి కాసేపు ఆ నీటినీ పడవలనూ చెట్లనీ చూస్తూ నిలుచున్నాము. ధ్యానానికి అనువైన వాతావరణం కావాలంటే ప్రకృతి ఒడిని మించినది ఇంకేదీ ఉండదు.

ప్రకృతిలో వచ్చిన ఇలాంటి ఫీల్ ఏ దేవాలయంలోనూ రాదు.

ఆ తర్వాత కొద్ది నిముషాలలోనే వారధి దాటి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టాము.దారిలో మంచి మంచి జామకాయలను సైకిళ్ల వాళ్ళు అమ్ముతున్నారు.ఇలాంటివి గుంటూరులో దొరకవు.అందుకని అక్కడ ఆగి కొన్ని జామకాయలు తిని, కొన్ని సంచిలో వేసుకుని తిరిగి ప్రయాణం సాగించాము.అక్కడనుంచి అవనిగడ్డవైపు వెళ్ళే జంక్షన్ దాటి మోపిదేవి చేరాము.

ఆలయం బాగా రష్ గా చేపల మార్కెట్ లాగా అధ్వాన్నంగా ఉన్నది.అందరూ ఎవరి గోలలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.ఎవరిని చూచినా ఆధ్యాత్మికత కోసం వచ్చినవాళ్ళు ఒక్కరూ కనిపించలేదు.అందరూ ఏవేవో మొక్కులు,కోరికలు - ఇదే తంతు. ఎవరి 'ఆరా' చూచినా పచ్చిస్వార్ధం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళను చూస్తుంటే అసహ్యం అనిపించింది.

నేను ఏ దేవాలయానికి వెళ్ళినా, అక్కడి దైవంతో ధ్యానపూర్వకంగా సరాసరి కమ్యూన్ అవడానికి ప్రయత్నిస్తాను.అలా చెయ్యడం వల్ల అక్కడ కొలువై ఉన్న శక్తి ఏమిటో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దానితో మనకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది.అక్కడ మామూలుగా జరిగే తంతులూ అవీ నేను పాటించను.వాటివల్ల ఏమీ ఉపయోగం లేదని, అవి పూర్తిగా నేలబారు వ్యవహారమనీ నాకు బాగా తెలుసు.

ధర్మదర్శనం క్యూలో ఓపికగా నిలబడి దర్శనం కానిచ్చి ఇవతలకు వచ్చాము.బయటకు వచ్చి మోటార్ సైకిల్ తీసి వెనక్కు బయలు దేరాము.

వెనుక కూచున్న మూర్తికి కొన్ని సందేహాలు వచ్చాయి.

"ఒకవైపు నాగదేవత అంటున్నారు.మళ్ళీ సుబ్రమణ్యస్వామి అంటున్నారు. ఇంకోపక్కన రుద్రంతో శివునికి పూజ చేస్తున్నారు.ఇదేంటి సార్ ?" అని అడిగాడు.

నవ్వాను.

'అదంతే. మొదట్లో ఇది ఒక నాగదేవత పుట్ట.అడవి ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉంటాయి కదా.ఇక్కడ కూడా అవి ఎక్కువే.కృష్ణాజిల్లా అంతా అడవే కదా.జనం వాటిని ఎడాపెడా చంపుతూ ఉంటారు.నేటికీ అంతే.ఆ గుడిలో జనమంతా పూజలు చేస్తున్నారు కదా.బయట ఒక పాము కనపడితే వెంటనే చంపి పారేస్తారు.అదీ ఈ మనుషుల తంతు.ఆ ఫలితంగా నాగదోషాలు తగిలి, పిల్లలు పుట్టకపోవడం,పుట్టినా చనిపోవడం,మగపిల్లలు లేకపోవడం,పెళ్ళిళ్ళు కాకపోవడం, అయినా ఫెయిల్ కావడం, ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు కావడం ఇలాంటి దోషాలు ఎదురౌతూ ఉంటాయి.కాలక్రమేణా ఎవరో తెలిసిన వాళ్ళు చెబితే ఈప్రాంతం వాళ్ళు నాగదేవతారాధన మొదలుపెట్టారు.ఆ పుట్టనే కాలక్రమేణా ఘనీభవించి ఒక మోస్తరుగా శివలింగం ఆకారంలోకి వచ్చింది. అందుకని శైవ సాంప్రదాయం మొదలైంది.అతి ప్రాచీనకాలపు నాగదేవతారాధనను తరువాత తరువాత శైవంలోకి మార్చుకున్నారు. అందుకని శైవ సాంప్రదాయంలో పూజలు మొదలయ్యాయి.

నిజానికి సుబ్రమణ్యస్వామికీ నాగదేవతకూ ఎలాంటి సంబంధమూ లేదు.కానీ జనం ఈ రెంటినీ కలిపేశారు.అలా కలపడానికి ఏదో ఒక కధను సృష్టించారు. అంతా గందరగోళం చేశారు.ఇలాంటి కధలు ప్రతిచోటా మనవాళ్ళు అల్లారు. అసలు విషయం అది కాదు.అక్కడున్నది నాగదేవత మాత్రమే. చూడగలిగితే తెలుస్తుంది.ఇలాంటి గందరగోళాలు ప్రతి ప్రసిద్ధ దేవాలయంలోనూ ఉన్నాయి. అక్కడ ఉండే దేవత వేరు.జరిగే పూజలు వేరు.కానీ ఆ దేవత వాటిని స్వీకరిస్తూ ఉంటుంది.అంతే.

నరసింహ ఆరాధన కూడా ఇలాంటిదే.నువ్వు గమనించు.నరసింహస్వామి దేవాలయాలన్నీ అటవీప్రాంతం లోనో కొండప్రాంతం లోనో ఉంటాయి.అతి ప్రాచీనకాలంలో ఆటవికజాతులుగా మనం ఉన్నపుడు సింహాలు గ్రామాలలోకి వచ్చి అందర్నీ చంపుతూ ఉండేవి.అందుకని భయంతో వాటిని పూజించేవారు.మనిషికి భయంనుంచే భక్తి పుడుతుంది.ఒకటి తననేదో చేస్తుంది అనుకుంటే, దానికి లంచాలిచ్చి గౌరవించడం మొదలుపెడతాడు. ఇది మనిషి యొక్క నేలబారు మనస్తత్వం. అప్పటి ప్రజలు పొలిమేరల్లోనే వాటికి మేకనో బర్రెనో ఏదో ఒక జంతువును ఆహారంగా సమర్పించి అవి గ్రామంలోకి జొరబడకుండా ఆపుకునేవారు.అదే కాలక్రమేణా "బలి" లేదా "నైవేద్యం" అనే కాన్సెప్ట్ గా మారింది.ఎప్పుడైతే శైవమూ వైష్ణవమూ ప్రాచుర్యంలోకి వచ్చాయో,అప్పుడు,నాగదేవతారాధనను శైవం తీసుకుంది. సింహాల ఆరాధనను నరసింహస్వామి ఆరాధనగా మార్చి వైష్ణవం స్వీకరించింది.ఇలా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు.

ఈ విధంగా అనేక ప్రాచీన ఆచారాలు కాలానుగుణంగా నవీకరింపబడ్డాయి.ఇది మన దేశానికీ మన మతానికీ ప్రత్యేకమైన విషయం ఏమీకాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియలు అనేక దేశాలలో అనేక మతాలలో రకరకాలుగా జరిగాయి.పాతకాలపు ఆచారాలను తరువాత వచ్చిన కొత్తమతాలు స్వీకరించి అడాప్ట్ చేసుకుని వాటికి అనుగుణంగా మార్చుకున్నాయి.దేవాలయాలకు దేవాలయాలే కొత్త దేవాలయాలుగా మారిపోయాయి.అన్ని మతాలలోనూ ఈ ప్రక్రియ జరిగింది. జనాలు వారి అజ్ఞానంలో ఎవరికిష్టమైన పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే గనుక ఆయన ఓపికా సహనమూ అనంతమైనవి గనుక ఎవరే రూపంలో పూజించినా,ఏ విధానంలో పూజించినా, ఆయన కిమ్మనకుండా స్వీకరిస్తూ ఉంటాడు.ఇది అసలైన సత్యం." - అని మోటార్ సైకిల్ నడుపుతూ వివరించాను.

తిరుగు ప్రయాణంలో రేపల్లె గుంటూరు మధ్యలో వాతావరణం అంతా మబ్బులు పట్టి వాన పడుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నది.ఆ వాతావరణాన్ని చూస్తూనే మళ్ళీ ధ్యానస్థితి వచ్చేసింది.ఆకాశం నుంచి పడే వాన, ఊర్ధ్వం నుంచి నిమ్నానికి ప్రసరించే దైవకృపకు సంకేతం.ఈ విధమైన ధ్యానవిధానాలు వేదంలో 'విద్య' లనే పేరుతో ఉన్నాయి.

"ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీ వాంతరిక్షం ధ్యాయతీవ ద్యౌర్ ధ్యాయన్తీవాపో ధ్యాయంతీవ పర్వతా" అంటుంది ఛాందోగ్యోపనిషత్తు.ధ్యానికి సమస్త ప్రకృతీ ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది.ఉపనిషదృషికి భూమీ, ఆకాశమూ, అంతరిక్షమూ, జలమూ, పర్వతములూ అన్నీ ధ్యానంలో ఉండి మౌనంగా సర్వేశ్వరుడిని ధ్యానిస్తున్నట్లు దర్శనమిచ్చాయి.ఆ స్థితిలోకి మనం వెళ్ళగలిగితే,ఆ స్థితిలో మనం ఉండగలిగితే, మనకూ అలాంటి దర్శనం కలుగుతుంది.

నాకు వెంటనే శ్రీరామకృష్ణులు గుర్తొచ్చారు.శ్రీ రామకృష్ణులకు మొట్టమొదటి సారి సమాధిస్థితి ఇలాంటి ప్రకృతిదృశ్యం వల్లనే కలిగింది.అప్పుడాయనకు ఆరేళ్ళు.చుట్టూ పెరిగిన పచ్చని పొలాలలో నడిచి వెళుతూ ఉన్నపుడు ఆకాశంలో పట్టిన దట్టమైన మబ్బులను చూచి ఆయన బాహ్యస్మృతిని కోల్పోయి క్రిందపడిపోయాడు.సమాధిస్థితిలోకి వెళ్ళిపోయాడు.ఆ స్థితిలో ఆ పిల్లవాడు ఏకధాటిగా మూడురోజుల పాటు ఉండిపోయాడు.ఎంత పవిత్రమైన నిష్కల్మషమైన మనస్సో ఆయనది!!! అలాంటి స్థితిని పొందటానికి ఎంత భావుకత్వం ఆయనలో ఉండేదో?

ప్రకృతిని చూచి భావుకుడు స్పందిస్తాడు.యోగీ స్పందిస్తాడు.ఇద్దరికీ ప్రకృతిమాత అలౌకిక అనుభవాలను తనే అందిస్తుంది.ప్రకృతిమాతేగా మనిషికి ఆది గురువు?

అసలైన మతాన్ని ప్రజలు ఎప్పటికి అర్ధం చేసుకుంటారు? అసలైన ఆధ్యాత్మికతను వారెప్పటికి గ్రహిస్తారు? లేదా, అది కొందరికోసమేనేమో? సామాన్యజనం వారి భయాన్నీ స్వార్దాన్నీ భక్తిగా భ్రమిస్తూ అజ్ఞానంలో ఎప్పటికీ ఇలా కాలం గడపవలసిందేనేమో? ప్రకృతి ధర్మం ఇంతేనేమో?

ఈ విధమైన భావధారతో మోపిదేవి సందర్శనం జరిగింది.