26, మార్చి 2015, గురువారం

అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి?

సూక్ష్మ జ్యోతిష్య ఫలితాలు నిజమే అని ప్రతిరోజూ రుజువులు వస్తున్నాయి.ఈ పదిహేను రోజులూ ప్రత్యేకమైనవి గనుకనే-నూతన సంవత్సర ఫలితాలు కూడా వ్రాయకుండా-ఇవి వ్రాశాను.

మచ్చుకి రెండు సంఘటనలు చూద్దాం.సరిగ్గా మొన్న రెండు సంఘటనలు జరిగాయి.

1.అతి సాహసం-80 ఏళ్ళ వయసులో

మా ఇన్స్పెక్టర్ ఒకాయన తండ్రికి 80 ఏళ్ళు.మొదట్నించీ పొలం పనులు చేసిన ఒళ్ళు కావడం ఏమో,మనిషి ఇప్పటికీ గట్టిగానే ఉంటాడు.కానీ సరిగ్గా మొన్న మధ్యాహ్నం పూట-ఏదో పూనినట్టు-మోటార్ సైకిల్ తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ బయల్దేరాడు.ఒక్కడివే మోటార్ సైకిల్ ఒద్దని ఇంట్లోవాళ్ళు ఎంత చెప్పినా వినలేదు.స్పీడుగా పోతుంటే,ఆపుకోలేక క్రిందపడి,యాక్సిడెంట్ అయింది.తుంటి ఎముక, తొడ ఎముకలు మూడు చోట్ల విరిగిపోయాయి.ఈ యాక్సిడెంట్ ఒంగోలులో జరిగింది.

ఆయన్ను హుటాహుటిన గుంటూరుకు తెచ్చి ఆపరేషన్ చేసి,ఇంకా వెన్నెముకకు సంబంధించిన పరీక్షలు ఏవో చెయ్యాలంటే విజయవాడకు తీసుకెళ్ళి ఆ పరీక్షలు కానిచ్చి,అక్కడనుంచి మళ్ళీ ఒంగోలుకు చేర్చారు.ఆపరేషన్ సక్సెస్ అయింది.కానీ కనీసం మూడునెలలు మంచం మీద ఉండాలి.

మనం ఎన్నోసార్లు ఒక పని చేసి ఉంటాం.ఇంకోసారి కూడా చేస్తే ఏమీ కాదులే అని అనుకుంటాం.కానీ అప్పుడే జరగాల్సినది జరుగుతుంది.ఆ విధంగా-ఆ సమయంలో -ఆ పని చెయ్యమని- గ్రహాలు మనిషిని తీవ్రంగా ప్రేరేపిస్తాయి.

అందుకే పాతకాలంలో అనేవారు- "ఎంతమంది చెప్పినా వినకుండా -ఏదో గ్రహం పూనినట్లు చేశాడు-ఇలా జరిగింది."--అని.

పెద్ద వయసులో సాహసాలు పనికిరావు- అందులోనూ గ్రహస్థితులు బాలేనప్పుడు అస్సలు పనికిరావు- అనేది ఈ సంఘటన నేర్పే గుణపాఠం.

2.అందం మీద అతి శ్రద్ధ-ప్రాణం తీసిన 6 కేజీలు

మా దగ్గర పనిచేసే ఒక గార్డుగారి అమ్మాయి మంచి తెలివైనది.మెరిట్లో MBBS సీటు తెచ్చుకుంది.కోర్స్ అయిపోయింది.PG ఎంట్రెన్స్ వ్రాసింది. అందులో కూడా స్టేట్ ర్యాంక్-3 వచ్చింది.ప్రస్తుతం PG లో చేరాలి.ఈలోపల అందం మీద శ్రద్ధ ఎక్కువైంది.తను ఉండవలసిన బరువు కంటే ఒక్క 6 కేజీలు మాత్రం ఎక్కువ ఉన్నదట.ఆ 6 కేజీలు మాత్రం ఎందుకుండాలి? అన్న బాధతో ఒక జిమ్ లో చేరింది.యూనివర్సిటీ క్లాసులు మొదలయ్యే లోపు ఈ 6 కేజీలు ఎలాగైనా తగ్గాలన్న పట్టుతో జిమ్ తీవ్రంగా చేస్తున్నది.

సరిగ్గా మొన్న సాయంత్రం - గుంటూరులో జిమ్ లో ట్రెడ్ మిల్ మీద పరిగెత్తుతూ పరిగెత్తుతూ హటాత్తుగా కుప్పకూలిపోయింది.ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు చనిపోయింది.

ఆమె వయసు 22 ఏళ్ళు.

ఇప్పుడేం చేస్తే, ఆ తల్లిదండ్రుల గుండెకోత తీరుతుంది? వారి శేషజీవితం అంతా కుమిలిపోతూ శాపగ్రస్తులలాగా జీవచ్చవాల లాగా బ్రతకాల్సిందేగా?

ఆ మధ్య ఒక మోడల్ - జీరోసైజు కోసం తిండి మానేసి,ఉపవాసాలుండి,ఎక్సర్ సైజులు చేసి,చివరకు ర్యాంప్ మీదే కుప్పకూలిపోయి చనిపోయిందని వార్తల్లో చదివాం.ఇప్పుడు 6 కేజీల కోసం ప్రాణం పోగొట్టుకున్న మెడికో మన కళ్ళ ఎదురుగా ఉన్నది.

6 కేజీల బరువుకోసం ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఏం తెలివైన పని?

ఈ మధ్యన అమ్మాయిలకు అందంమీద అనవసరమైన అతిశ్రద్ధ ఎక్కువౌతున్నది.దానికోసం తిండి మానుకొని అతిగా వ్యాయామాలు చేస్తున్నారు.ఇది చాలా పొరపాటు.ఎవరి అందం వారికుంటుంది.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకోవడం మహా తెలివితక్కువపని.

భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని జంక్ ఫుడ్ తిని చెడగొట్టుకుంటారు. సరియైన రోజువారీ వ్యాయామం లేకుండా పిచ్చి పిచ్చిగా ఒళ్ళు పెంచేస్తారు.ఆ తర్వాత TV లో యాడ్స్ చూచో,లేకపోతే స్నేహితులు చెప్పిన సలహాలు వినో--తీవ్రమైన వ్యాయామాలు మొదలు పెడతారు.తెలిసీ తెలియకుండా చేస్తే అవి ప్రాణం మీదకు తెస్తాయన్న విషయం గ్రహించలేరు.

వీటికి తోడు పనికిమాలిన సినిమా కబుర్లు తోడౌతాయి.

'ఫలానా సినిమా కోసం ఫలానా హీరో ఒక్క నెలలో 20 కేజీలు బరువు పెరిగాడట.మళ్ళీ ఒక్క నెలలో 30 కేజీలు తగ్గిపోయాడట.' అని స్నేహితులు కలసి చెప్పుకుంటూ ఉంటారు.

ఇంతలో పేపర్లో వస్తుంది.ఫలానా సినిమా కోసం జీరో సైజుకు మారిపోయిన హీరోయిన్ అంటూ ఆమె ఫుల్ పేజీ ముప్పాతిక నగ్నచిత్రాన్ని ఆ పేపర్ వేస్తుంది.అది చూచి మన కాలేజీ అమ్మాయిలకు వెర్రి పుట్టుకొస్తుంది.మనం కూడా ఆ హీరోయిన్లా బక్కపలచగా తయారుకావాలి.పొట్ట అనేది వెన్నుకు అంటుకుపోవాలి.అదికూడా ఒక్కనెలలోనే-కాలేజీలు తెరిచేలోపే- జరిగిపోవాలి. తనే కాలేజీ బ్యూటీ అనిపించుకోవాలి.

ఇంకేముంది? తిండి మానేసి జిమ్ ల మీద పడతారు.అదృష్టం బాగుంటే చివరకు ఆస్పత్రిలో తేలతారు.లేకపోతే మార్చురీలో తేలతారు.

జిమ్ లో చేరి వ్యాయామాలు చెయ్యనక్కరలేదు.జంక్ ఫుడ్ తినకుండా,టీవీ ముందూ,కంప్యూటర్ ముందూ కూచునే సమయాన్ని తగ్గించి,రాత్రులు ఎక్కువ మేలుకోకుండా ఉండి,రోజువారీ పనులను ఒళ్ళొంచి చెయ్యడం నేర్చుకుంటే,ఏ ప్రత్యెక వ్యాయామాలూ అవసరం లేదు.మహా కావాలంటే రోజూ ఒక ఇరవై నిముషాలు సింపుల్ యోగా చేస్తే చాలు.

ప్రతి వ్యాయామానికి ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి.ఒక అనుభవజ్ఞుడైన శిక్షకుని సలహా తీసుకోవాలి.తమంతట తాము నిర్ణయించుకుని తిండి మానేసి ఇష్టం వచ్చిన వ్యాయామాలు అతిగా చేస్తే ఇలాగే అవుతుంది.వ్యాయామాలు ఎవరికీ వారు నిర్ణయించుకుని అతిగా చెయ్యరాదు.చేస్తే ఇలాగే మంచికి బదులు చెడు జరుగుతుంది.

ప్రతి శరీరానికీ ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది.ఆ భాషను అర్ధం చేసుకుని దానికి తగిన వ్యాయామాలు మాత్రమే చెయ్యాలి.అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారని మనమూ అదే చెయ్యబోతే అది మనకు సరిపడక వికటించి ఇలాగే జరుగుతుంది.

మన ఒళ్ళు మనకు చెబుతూనే ఉంటుంది.నువ్వు లిమిట్స్ దాటుతున్నావు.జాగ్రత్త అని.దాని మాట వినడం ముందుగా నేర్చుకోవాలి.అప్పుడు అంతా బాగుంటుంది.

మా అబ్బాయి స్నేహితుడొకడు నాలుగేళ్ల క్రితం ఇలాగే- తన అభిమాన హీరోను చూచి- తనూ 6 ప్యాక్ పెంచాలనుకుని- రైస్ పూర్తిగా మానేసి- ఫ్రూట్ జ్యూసులు మాత్రమె త్రాగుతూ వ్యాయామాలు తీవ్రంగా చేశాడు.ఒకరోజున జిమ్ లో కళ్ళు తిరిగి పడిపోతే,ఆస్పత్రిలో చేర్చారు.కోలుకోడానికి ఆర్నెల్లు పట్టింది.సిక్స్ ప్యాక్ సంగతేమో గాని సిక్స్ మంత్స్ ఆస్పత్రి బెడ్లో ఉండవలసి వచ్చింది.అప్పటి దుష్ప్రభావాలు ఇప్పటికీ ఆ అబ్బాయి ఒంట్లోనుంచి పూర్తిగా పోలేదు.కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు వస్తే ఇంక అవి తగ్గడం కష్టం.

సరే మీరు చెప్పేది అంతా బానే ఉంది -- గ్రహాలకూ ఆ సంఘటనలకూ సంబంధం ఏమిటి? అని అనుమానం రావచ్చు.

ఉంది.

గ్రహాలు మనిషి మనస్సుమీద పనిచేస్తాయి.లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయి. పిచ్చిపిచ్చి పనులు చెయ్యమని ప్రేరేపిస్తాయి.ఆ క్రమంలో ప్రమాదాలు ఎదురౌతాయి.ఇదంతా మనిషి పూర్వకర్మానుసారమే జరుగుతుంది.ఇలా అందరికీ ప్రేరేపణ కలగదు.గ్రహస్థితులు బాగాలేనప్పుడు- ఎవరెవరి పూర్వకర్మ బాగులేదో - వారికి మాత్రమె ఇలాంటి పెడబుద్ధులు పుడతాయి. అందరికీ పుట్టవు.

ఇదంతా ఒక సీక్రెట్ సైన్స్.

అందుకే మనవాళ్ళు పాతకాలంలో ఒక మాట అనేవారు.

'పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులు పుడతాయి' అని.

అది అక్షరాలా నిజం. అది ఎంతో అనుభవం మీద చెప్పబడిన మాట.

ఆ ముసలాయన కూడా ఎంతమంది చెప్పినా వినకుండా ఆ రోజున మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.అలా జరిగింది."మూర్ఖత్వం" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

ఆ అమ్మాయికి కూడా ఇప్పటివరకూ అందంమీద అంత శ్రద్ధలేదు.అందం మీద చిన్నప్పటినుంచీ అంత శ్రద్ధ ఉంటె ర్యాంకర్ ఎలా అవుతుంది? కానీ ఇప్పుడు ఆయుస్సు అయిపోవస్తున్నది.యముడు పిలుస్తున్నాడు.కనుక ఇప్పుడు హటాత్తుగా అందంమీద అతిశ్రద్ధ పుట్టుకొచ్చింది.అదే ప్రాణం మీదకు తెచ్చింది."అతి" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

జీవితంలో జరిగే విచిత్రాలు ఇలాగే ఉంటాయి.మనిషి మీద గ్రహప్రభావాలు ఇలాగే సూక్ష్మంగా ఉంటాయి.వాటిలోని తారతమ్యాలను గ్రహించాలంటే యోగశక్తీ సూక్ష్మదృష్టీ  ఉండాలి.

గ్రహస్థితులు బాగాలేనప్పుడు సాహసాలు చెయ్యకూడదు.ఆ సమయాలలో అనేక జాగ్రత్తలు పాటించాలి.ఈ సూత్రం మళ్ళీమళ్ళీ అనేకసార్లు ఎందరి జీవితాలలోనో రుజువౌతూనే ఉన్నది.

నాకు మొన్న వచ్చిన యాస్ట్రల్ సూచన నిజమే అని ఈ సంఘటనలూ ఇంకా రోజూ జరుగుతున్న ఎన్నో సంఘటనలూ రుజువు చేస్తున్నాయి.
read more " అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి? "

24, మార్చి 2015, మంగళవారం

సూక్ష్మ జ్యోతిష్యం

సూక్ష్మజ్యోతిష్యం అనేది ఒకటుందన్న విషయాన్ని చాలా పాత పోస్ట్ లలో, అంటే దాదాపు మూడేళ్ళ క్రితం వ్రాసిన పోస్ట్ లలో ప్రస్తావించి ఉన్నాను.ఆ తర్వాత నన్ను అనుసరించే అతి దగ్గరివారితో తప్ప ఈ విషయాన్ని ఎవరితోనూ చర్చించలేదు.

జగన్మాత కృపవల్ల, ఈ సూక్ష్మజ్యోతిష్య రహస్యాలు అనేకం నాకు వాటంతటవే స్ఫురిస్తూ ఉంటాయి.వీటిని ఆమధ్య అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉండేవాడిని. తర్వాత కొంతకాలం పాటు ఈ విషయాలు వ్రాయడం ఆపాను.

నా బీరువాకు అనేక సొరుగులున్నాయి.వాటిలో అనేక విషయాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి ఒక్కొక్క సొరుగులో విషయాలను గురించి వ్రాస్తూ ఉంటాను.ఇప్పుడు జ్యోతిష్యపు సొరుగును తెరిచి కొన్ని విషయాలను చూద్దాం.

మొన్న మధ్యాహ్నం నాకొక అలౌకికమైన సూచన వచ్చింది.దాని ప్రకారం గమనించగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి.మొన్న మధ్యాహ్నం నుంచి మనుషుల జీవితాలలో- పదిహేనురోజుల పాటు- జరగబోయే మార్పులు ఎలా ఉంటాయో దానివల్ల నాకర్ధమైంది.

వాటిని ఈ క్రింద వ్రాస్తున్నాను.

లగ్నం/రాశిని బట్టి ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి.గమనించండి.

మేషరాశి
కొత్త ఆలోచనలు కలుగుతాయి.రచనలు గావిస్తారు.ప్రేమ వ్యవహారాలు, కొత్త స్నేహాలు మొదలౌతాయి.కానీ అవి అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు.

వృషభరాశి
ఇంట్లో ఊహించని గొడవలు మొదలౌతాయి.చికాకు ఎక్కువౌతుంది. మనశ్శాంతి లోపిస్తుంది.వాహన ప్రమాదాలు ఎదురౌతాయి.

మిధునరాశి
కాసేపు ధైర్యం కాసేపు పిరికితనం కలిగే పరిస్థితులు ఎదురౌతాయి.సోదర సోదరీలకు కష్టాలు ఎదురౌతాయి.మాట తేలికగా అపార్ధం చేసుకోబడుతుంది.

కర్కాటకరాశి
ఇంట్లో పరిస్థితులు చికాకులు కలిగిస్తాయి.మాట తీరు వల్ల గొడవలు జరుగుతాయి.ధననష్టం ఉంటుంది.

సింహరాశి
హటాత్ అనారోగ్య సూచన ఉన్నది.మానసిక క్రుంగుబాటు ఉంటుంది.ధైర్యం తగ్గుతుంది.పరిస్థితులు ఎదురు తిరుగుతాయి.

కన్యారాశి
నష్టాలు ఎదురౌతాయి.అనుకోని హటాత్ ప్రయాణాలు గావిస్తారు.రోగాలకు ఖర్చు పెరుగుతుంది.ఆస్పత్రులు సందర్శిస్తారు.

తులారాశి
ఇరుగు పొరుగువారికి,బంధువులకు,స్నేహితులకు,నౌకర్లకు కష్టకాలం. చెడువార్తలు వింటారు.డబ్బు నష్టపోతారు.

వృశ్చికరాశి
అనుకున్న పనులు జరగవు.మందగమనంతో నడుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.ఇంట్లో కూడా వాతావరణం అశాంతిమయం అవుతుంది.

ధనూరాశి
పెద్దలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారు.కొందరికి పెద్దలు గతిస్తారు. జీవితంలో అనైతిక ధోరణులు పెరుగుతాయి.

మకరరాశి
డబ్బు ఖర్చు అనుకోకుండా పెరుగుతుంది.హటాత్తుగా డబ్బు ఖర్చైపోతుంది. నష్టాలు చవిచూస్తారు.ఆరోగ్య భంగం ఉంటుంది.

కుంభరాశి
జీవిత భాగస్వామికి చెడుకాలం.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.వ్యాపారంలో నష్టం వస్తుంది.

మీనరాశి
అనుకోని శత్రువుల నుంచి తాకిడి పెరుగుతుంది.మొండి బాకీలు వసూలౌతాయి.మొండి పనులు అనుకోకుండా అయిపోతాయి.విచక్షణ పెరుగుతుంది.దీర్ఘరోగాలు అదుపులోకి వస్తాయి.జీవితంలో ఆశ పెరుగుతుంది.

రెండు రోజులనుంచీ (సరిగ్గా చెప్పాలంటే మొన్న మధ్యాహ్నంనుంచీ) ఈ మార్పులు అనేకమంది జీవితాలలో మొదలయ్యాయి.నిన్నటినుంచీ స్పష్టంగా ఎక్కువయ్యాయి.గమనించండి.
read more " సూక్ష్మ జ్యోతిష్యం "

19, మార్చి 2015, గురువారం

మహావృక్షాలకు నీళ్ళు పోస్తున్న స్వామీజీలు

నేడు ఎక్కడ చూచినా స్వామీజీల క్లాసులు చాలా బిజీగా నడుస్తున్నాయి.

కొందరు స్వాములు కార్పోరేట్ ఉద్యోగులకూ,గవర్నమెంట్ ఉద్యోగులకూ కూడా క్లాసులు చెబుతున్నారు.జీవితమంతా అవినీతిలో గడిపిన ఈ ఉద్యోగులు ఏడాదికి ఒక మూడు రోజులు యోగా క్లాసులూ మెడిటేషన్ క్లాసులూ చేస్తున్నారు.

సరే వాళ్ళ అవస్థలు వాళ్ళు పడుతున్నారు.

అంతా బాగానే ఉంది.

మొన్నొక రోజున మా కొలీగ్ ఒకాయనా నేనూ ఏదో సందర్భంలో ఫీల్డ్ వర్క్ లో కలిశాం.

టీ ఆఫర్ చేశాను.

'ఒద్దు.మానేశాను' అన్నాడు.

'అదేంటి? మానేసేంత దురలవాటు కాదుగా ఇది?' అడిగాను.

'మొన్న మూడ్రోజుల పాటు కార్పోరేట్ మెడిటేషన్ ప్రోగ్రాం కి వెళ్లి వచ్చాను.అక్కడ ఒక్కొక్కరినీ ఏదో ఒకటి వదిలెయ్యమన్నారు.అందరూ వాళ్ళకిష్టమైనది ఏదో ఒకటి ఒదిలేస్తున్నారు.నేను టీ వదిలేశాను.' అన్నాడు.

జాలిగా చూశాను.

'వదిలెయ్యాల్సిన దుర్గుణాలన్నీ లోపలే ఉంచుకొని టీ ఒక్కటి వదిలేస్తే ఏమొస్తుంది?' అని నోటిదాకా వచ్చింది.

కానీ దానిని రిసీవ్ చేసుకునే పరిస్థితి అక్కడ లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాను.

అతనికి నలభై- ఏభై మధ్యలో ఉంటుంది వయసు.

'మీ క్లాస్ కి వచ్చిన వాళ్ళలో ఎంత వయసు వాళ్ళున్నారు?' అడిగాను.

'అందరూ మన ఏజ్ గ్రూప్ వాళ్ళే'- చెప్పాడు.

కాసేపు టీ సిప్ చేస్తూ మౌనంగా ఉన్నాను.

తను బాటిల్లోంచి నీళ్ళు తాగుతూ ఉన్నాడు.

టీ త్రాగడం పూర్తి చేసి,- 'ఒక్కసారి బాటిల్ ఇవ్వు' - అని అడిగాను.

బాటిల్ నా చేతికిచ్చాడు.

అది తీసుకుని ట్రాక్ పక్కనే ఉన్న వేపచెట్టుకు నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను.

'సార్!సార్! అది పెద్దచెట్టు.దాని వేర్లు భూమి లోపలదాకా ఉంటాయి.మనం నీళ్ళు పొయ్యనక్కరలేదు.మనం పొయ్యకపోయినా అది భూమిలోనుంచి నీళ్ళు గ్రహిస్తుంది.నీళ్ళు వేస్ట్ చెయ్యకండి.అసలే ఫీల్డ్ లో ఉన్నాం.నీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి.' అన్నాడు.

'మరి ఏ చెట్టుకు పొయ్యాలి నీళ్ళు?' అడిగాను.

'మొక్కగా ఉన్నపుడు పొయ్యాలి.పెద్ద వృక్షంగా మారాక అక్కర్లేదు' అన్నాడు.

'మరి మెడిటేషన్ కూడా అంతే కదా? కాదా?' అన్నాను నవ్వుతూ.

అతను ఆలోచనలో పడ్డాడు.

ఈనాడు స్వామీజీలు నడుపుతున్న మెడిటేషన్ క్లాసులు కూడా ఇంతే.

చెప్పే స్వామీజీలకు 60 లలో ఉంటుంది వయసు.వినే అనుచరులకు కూడా దాదాపు అంతే ఉంటుంది.స్వామీజీకి గడ్డం నెరిసిపోయి ఉంటుంది.వినే శిష్యులకు పళ్ళు ఊడిపోయి ఉంటాయి.స్వామీజీని కుర్చీలోనుంచి ఎవరన్నా లేపవలసిన పరిస్థితి ఉంటుంది.భక్తులను కూడా అంతే.అందుకే వారసలు నేలమీదనే కూర్చోరు.వారుకూడా స్వామీజీ పక్కనే కుర్చీలలో దిండ్లు వేసుకుని జారగిలబడి కూచుని ఉంటారు.

ఒక్కొక్కసారి స్వామీజీ కంటే అనుచరులకే పెద్దవయసు ఉంటుంది.స్వామీజీ ఉపన్యాసం ఇస్తూ ఉంటే,భక్తులలో చాలామంది నిద్రపోతూ ఉంటారు.అంత వయసులో అన్నీ ఉడిగిపోయాక ఇంక వారు నేర్చుకునేది ఏముంది? సాధన చేసేది ఏముంది? సాధించేది ఏముంది?

'మేముకూడా ఫలానా క్లాస్ చేశాము'-అని గొప్పలు చెప్పుకోడానికి తప్ప ఈ క్లాసులు ఎందుకూ పనిచెయ్యవు.

'మేము కూడా ఫలానా స్వామీజీ శిష్యులము'- అని చెప్పుకోడానికీ,తద్వారా వచ్చే డొల్ల ఆత్మసంతృప్తికీ తప్ప ఇంకెందుకూ ఇవి పనిచెయ్యవు.

ఇలాంటి క్లాసులు పిల్లలకు చెప్పాలి.

ఇంకా లేతగా ఉన్నపుడే ఇలాంటి సంస్కారాలు అలవాటు చెయ్యాలి.

అది నేడు ఎవ్వరూ చెయ్యడం లేదు.

వీళ్ళ పిల్లలేమో మొబైల్స్ లో కూరుకుపోయి, బైకుల్లో కార్లల్లో జల్సాగా తిరుగుతూ,పబ్బుల్లో కాలక్షేపం చేస్తుంటారు.లేదా అమ్మాయిలూ అబ్బాయిలూ కలసి ఎక్కడో సరదాగా పార్టీలలో అల్ట్రా మోడరన్ గా తిరుగుతుంటారు.వీరి పునాదులు తప్పుగా పడిపోతుంటాయి.

పెద్దలేమో, స్వామీజీ క్లాసులలో కూచుని బోధనలు వింటుంటారు.

వృక్షాలయ్యాక వీరికి నీళ్ళు పొయ్యబడుతూ ఉంటాయి.

లేత మొక్కలకేమో విషం ఎక్కించబడుతూ ఉంటుంది.

రెండూ తప్పులే.

ఎవరి వయసులో చెయ్యవలసిన పనులు వారు చెయ్యడం లేదు.ఎవరి వయసులో అందవలసినవి వారికి అందటం లేదు.

దీనికి కారణాలు అనేకం.

మారుతున్న విలువలు,టీవీ,సెల్ ఫోన్, ఇంటర్ నెట్ ప్రభావం.ఇవి గాక స్నేహాలు.ఇలా రకరకాలుగా యువత తప్పుదారిన పోతున్నది.ఈ తప్పు పునాదుల ఫలితాలు 35-40 మధ్యలో వారికి తెలుస్తున్నాయి.అక్కడకు వచ్చేసరికి వారు డైరెక్షన్ లెస్ అయిపోతున్నారు.డొల్ల జీవితాలు గడుపుతున్నారు.అప్పటికే రెండు మూడుసార్లు విడాకులు తీసుకుంటున్నారు.డిప్రెషన్ కు గురౌతున్నారు.లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇకపోతే పెద్దవారు.

వారి జీవితమంతా ఏదో గాలివాటంగా పూర్తిగా డబ్బుకోసం బ్రతికేసి, చివరలో ఏదో స్వామీజీని ఆశ్రయించి,ఒకరకమైన డొల్ల ఆత్మసంతృప్తితో వాళ్ళు కాలం గడుపుతున్నారు.కానీ అదీ నిజమైన సంతృప్తి మాత్రం కాదు.నిజమైన సంతృప్తి కోసం మొదటినుంచీ ఒక తీరులో బ్రతకాలి.అప్పుడే అది సొంతం అవుతుంది.ఇప్పటికప్పుడు రమ్మంటే గాలిలోనుంచి అదెలా వస్తుంది?

చిన్నప్పుడు ఆధ్యాత్మికంగా మంచి పునాది పడాలి.పెద్దయ్యాక దాని ఫలాలు అందుకోవాలి.అంతేగాని చిన్నప్పుడు గాలికి తిరిగి,పెద్దయ్యాక యోగా క్లాసులు చేస్తే ఉపయోగం ఏమీ లేదు.చదువుకోవలసిన వయసులో నిర్లక్ష్యం చేసి పెద్ద వయసులో 'అ ఆ' లు నేర్చుకోడానికి వయోజన విద్య నైట్ క్లాసులకు వెళ్ళినట్లుగా ఉంటుంది ఈ పరిస్థితి.

టీ మానేసినంత మాత్రాన ఏమీ ఒరగదు.ఈ రకంగా కాశీలో కూరగాయలు ఒదిలి పెట్టినవారినీ,రామేశ్వరంలో పచ్చళ్ళు ఒదిలిపెట్టిన వారినీ,యోగా క్లాసులలో టీ కాఫీలు ఒదిలేసినవారినీ చాలామందిని నేను చూచాను.కానీ వారి నిత్యజీవితంలో పెద్దగా ఆత్మౌన్నత్యం ఎక్కడా కనిపించదు.

దీనికి విభిన్నంగా అప్పుడప్పుడూ ఆల్కహాల్ త్రాగే సోషల్ డ్రింకర్స్ కూడా కొందరు నా స్నేహితులలో ఉన్నారు.అలాంటి వారిలో కొన్ని గొప్ప లక్షణాలను నేను గమనించాను.అవి మన సోకాల్డ్ ఆధ్యాత్మిక క్లాసులు అటెండ్ అయ్యేవారిలో ఉండకపోవడాన్నీ గమనించాను.

'వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయి?'- అని ఆలోచిస్తే రెండవ గ్రూపు వాళ్ళకే అని అర్ధమౌతుంది.

కనుక కావలసింది ఏమిటి? అని ఆలోచిస్తే ఒక్క విషయం కనిపిస్తుంది.

'మనం దేనిని బలవంతంగా,మొక్కుబడిగా, వదిలిపెట్టాం?' అన్నది ముఖ్యం కాదు.

'నిత్యజీవితంలో మనం ఎలా ఉంటున్నాం? మన సాటి మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నాం?'- అన్నదే అతిముఖ్యం.

ఒక వ్యక్తి నిత్యజీవితంలో పరమ స్వార్ధపరుడిగా ఉంటూ,మహా దురహంకారిగా ఉంటూ- కాఫీ టీలు మానేసి యోగా చేసినంత మాత్రాన అక్కడ ఏమీ ఒరగదు.కాకపోతే ఆరోగ్యం కొంత బాగుపడవచ్చునేమో?ఆ ఆరోగ్యం వల్ల,దురహంకారం ఇంకా పెరిగి సాటివారికి ఇంకా చెడు చేస్తాడు.

అదే సమయంలో ఇంకొకడు ఇవేవీ చెయ్యకపోయినా,కొన్ని సోకాల్డ్ దురలవాట్లు ఉన్నాకూడా, నిత్యజీవితంలో స్వచ్చంగా ఉంటే-- ఈ రెండో వాడికే నేను ఎక్కువ మార్కులు వేస్తాను.

నిజమైన ఆధ్యాత్మికత కాఫీ టీ లలో లేదు.మన అంతరిక పరిపక్వతలో ఉంది.ఆ పరిపక్వత మన నిత్యజీవితంలో మన చుట్టూ ప్రతిఫలించడంలో ఉంటుంది.

దానికి కావలసిన పునాదులు చిన్నవయసులోనే పడాలి.ఆ పునాదులు జీవితం అంతా గట్టిగా ఉండిపోతాయి.దానికి భిన్నంగా పెద్దవయసులో నేర్చుకునే ఆధ్యాత్మికత అనేది కూలిపోయే ఇంటికి రంగులు వేసినట్లుగా ఉంటుంది.దానిలో సహజత్వం రాదు.కృత్రిమంగా ఉంటుంది.

మొక్క చిన్నగా ఉన్నప్పుడే దానికి నీళ్ళు పొయ్యాలి.మహావృక్షంగా మారాక ఇంకా దానికి నీళ్ళెందుకు?

"ఒక పిల్లవాడు ఆలయానికి వెళ్ళకపోతే అది తప్పు.ఒక ముసలివాడు ఆలయానికి ఇంకా వెళుతూ ఉంటే అదీ తప్పే"- అన్నారు వివేకానంద స్వామి.

ఎంత గొప్ప నిజమో కదా??
read more " మహావృక్షాలకు నీళ్ళు పోస్తున్న స్వామీజీలు "

16, మార్చి 2015, సోమవారం

బెస్ట్ ప్రివ్యూ...

ప్రతి మనిషీ సుఖంగా బ్రతకాలని అనుకుంటాడు.

తప్పులేదు.

కానీ అదొక్కటే జీవిత పరమార్ధం అనుకోవడం మాత్రం చాలా తప్పు.

దానికోసం పక్కవాడిని వెనక్కు తోసేసి మనం ముందుకెళ్ళిపోవాలనుకోవడం శుద్ధ తప్పు.ఎవరెలా పోయినా సరే,మన పని మనకు కావాలనుకోవడం పరమ శుద్ధతప్పు.

కానీ వీటినే సక్సెస్ సూత్రాలనీ,మేనేజిమెంట్ పాఠాలనీ నేడు అన్నిచోట్లా బోధిస్తున్నారు.వీటివల్ల మనిషికి డబ్బు ఒక్కటి సమకూరవచ్చేమో గాని, ఆత్మసంతృప్తి మాత్రం రానేరాదు.అయితే ఇవి తప్పులని, వీటివల్ల జీవితంలో ఒక అమోఘమైన సంతృప్తి మాత్రం రాదనీ  చాలామందికి జీవితపు ఆఖరి అంకంలోగాని తెలియదు.

ఎందుకంటే జీవితపు ఆఖరి ఘడియలలో ఒక రీల్ మన కళ్ళముందు తిరుగుతుంది.అదే- 'బెస్ట్ ప్రివ్యూ'.

చనిపోయేముందు ప్రతివాడికీ తన కళ్ళముందు తన జీవితపు సినిమా రీల్ మొత్తం గిర్రున తిరుగుతుంది.

మనం ఎన్నో సినిమాల రివ్యూలు చదివి ఉండవచ్చు, ప్రివ్యూలు చూచి ఉండవచ్చు.కానీ మన జీవితపు ' బెస్ట్ ప్రివ్యూ' మాత్రం మన జీవితపు ఆఖరి క్షణాలలో మన కళ్ళముందు వెయ్యబడుతుంది.

ఇది ప్రతివారికీ ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుందని మన ప్రాచీనులు చెబితే మనం నమ్మలేదు.కానీ నేడు,NDE (నియర్ డెత్ ఎక్స్ పీరియెన్స్) ని అనుభవించి,ఏదో కారణం చేత వెనక్కు వచ్చిన ప్రతివారూ ఇదే చెబుతున్నారు.ఇలా జరుగుతుందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అది నిజం కూడా.

ఆ ప్రీవ్యూలో ఏం కనిపిస్తాయో తెలుసా?

మనం పొందిన సుఖాలు,సంపాదించిన ఆస్తులు,చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు,నడిపిన పైరవీలు,వెలగబెట్టిన రాజకీయాలు,కుట్రలు కుతంత్రాలు, కూడబెట్టిన డబ్బులు వగైరాలు దాంట్లో ఎక్కడా కనిపించవు.

మరేం కనిపిస్తాయి?

మనం జీవితంలో చేసిన తప్పులు కనిపిస్తాయి.ఇతరులకు మనం చేసిన సహాయాలు కనిపిస్తాయి.ఈ రెండూ తప్ప ఇంకేమీ కనిపించవు.

వెరసి మన తప్పొప్పుల పట్టికగా ఒక రీల్ మన కళ్ళముందు తిరుగుతుంది. అదే బెస్ట్ ప్రివ్యూ.

దానినే మనవాళ్ళు చిత్రగుప్తుని చిట్టా అన్నారు.

మనం చేసిన పనులను మనం మర్చిపోయినా ఆ చిట్టా మరచిపోదు.

మన బ్యాలెన్స్ షీట్ ను మన కళ్ళెదురుగా చూపించి మనచేత అవుననిపించి -"వీటి ప్రకారం నీ తరువాతి జన్మ ఇదిరా బాబూ"- అని చెప్పి మరీ తీసుకుపోతాడు యమధర్మరాజు.

ఆ ప్రీవ్యూ మన ఇష్టప్రకారం ఉండదు.మనకు ఇష్టం లేనివీ,మనం చూడటానికి ఇష్టపడనివీ,చూడటానికి భయపడేవీ,చూడలేక తలదించుకోవాల్సినవీ రకరకాల సీన్లు అందులో ఉంటాయి.

ప్రతివాడికీ,ఈ ప్రీవ్యూ చాలా క్లీన్ గా ఉండాలనీ,ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలనీ,మరణం ముందు మనం తలెత్తుకుని నిలబడాలనీ,ఈ ప్రపంచం నుంచి దొరలాగా నిష్క్రమించాలనీ ఉంటుంది.కానీ మొదట్నించీ దానికి తగినట్లుగా మనం బ్రతకాలని మాత్రం తోచదు.ఊరకే ఆశించినంత మాత్రాన ఈ ప్రివ్యూ బాగుండదు.మొదట్నించీ అలా బ్రతికితేనే అది బాగుంటుంది.లేకుంటే పరమ దరిద్రంగా ఉంటుంది.

అది మన జీవితంలో ఆఖరి పేజీ.

ఆ పేజీని బట్టి తర్వాత జన్మలో మొదటి పేజీ ఉంటుంది.

ఈ ఆఖరిపేజీని వ్రాయడం మన చేతిలో ఉండదు.జీవితమనే పుస్తకంలో మిగతా పేజీలు వ్రాసుకునే వెసులుబాటు మాత్రం మనకు ఉంటుంది.కానీ ఆ ఆఖరిపేజీని వ్రాసే అధికారం మన చేతిలో ఉండదు.అది మృత్యువు చేతిలో ఉంటుంది.దానిప్రకారం తర్వాతి జన్మకు ఈడ్చుకుంటూ తీసుకుపోయే అధికారమూ దానికే ఉంటుంది.అప్పుడు మనం ఎంత అరిచి 'గీ' పెట్టినా దానిముందు మన ఆటలు ఏమాత్రం సాగవు.మన వాదనలు ఏమాత్రం అప్పుడు పనిచెయ్యవు.

న్యాయశాస్త్రంలో 'ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్' అనేవి ఉంటాయి.

'తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండా నేరస్తుడిని శిక్షించకూడదు'-అనేది వాటిల్లో ఒకటి.

మరణం దగ్గర కూడా ఈ సూత్రం ఉంటుంది.మన వాదనను వినిపించే అవకాశం తనూ ఇస్తుంది.కానీ అది చూపించే ప్రివ్యూ చూచినప్పుడు ఇక మనం మాట్లాడటానికి ఏమీ ఉండదు.మనం చేసిన పనులన్నీ మన కళ్ళెదుట HD వీడియోలో కనిపిస్తుంటే ఇంక మాట్లాడటానికీ,వాదించడానికీ మనకేమి మిగిలుంటుంది గనుక?

అయితే ఇక్కడొక విచిత్రం ఉన్నది.

ఆఖరి పేజీలో మనకు కనిపించే రీల్లో ఏవేవి ఉంటాయో వాటికి మన రోజువారీ జీవితంలో మనం ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వం.

దానిలో ఏవేవి కనపడవో వాటికి మాత్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తాం.

ప్రపంచమంతా ఇంతే.

ఏ దేశమైనా,ఏ మనుషులైనా ఇంతే.

ఆ రీల్లో కనిపించే మంచివాటికి కూడా నిత్యజీవితంలో చోటు కల్పించేవాడే అసలైన జీవితాన్ని జీవించినవాడు.ఆ రీల్లో కనిపించి మనల్ని బాధపెట్టే వాటిని చెయ్యకుండా ప్రతిరోజూ జాగ్రత్తపడేవాడే అసలైన మానవుడు.

మనం జీవితాన్ని ఎంతో ప్లాన్డ్ గా గడుపుతాం.ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం.కానీ అసలైన ఈ విషయాన్ని మాత్రం నిర్లక్ష్యంగా వదిలేస్తాం.ఈ వదిలేసినవే చివరి రీల్లో మన కళ్ళెదుట 3D లో కనిపిస్తాయి. రోజూ ప్రేమగా చూచుకున్నవి అప్పుడస్సలు కనపడవు.

అందులో మనం పొందిన సుఖాలు కనపడవు.జీవితాన్ని మనం ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఆ సీన్లు కనపడవు.ఏం తిండి తిన్నాం?ఏం బట్టలు కట్టుకున్నాం?ఎన్ని నగలు కొన్నాం?ఎన్ని ఇళ్ళు కట్టాం?ఎన్ని రిసార్ట్ లకు తిరిగాం? ఎలా జల్సా చేశాం? జీవితాన్ని ఎలా బ్రతికాం?-- ఇవేవీ కనపడవు.

మనం ఇతరులకు చేసిన మోసాలు కనిపిస్తాయి.ఘోరాలు కనిపిస్తాయి. నమ్మకద్రోహాలు కనిపిస్తాయి.వెన్నుపోట్లు కనిపిస్తాయి.బాధ్యతారాహిత్యాలు కనిపిస్తాయి.మన స్వార్ధపూరిత వికృత అవతారం మొత్తం కనిపిస్తుంది.

ఇంతేనా? ఎంతసేపూ నెగటివ్ విషయాలేనా? కాదు.

మనం ఇతరులకు చేసిన సహాయాలు కూడా కనిపిస్తాయి.మన అవసరాలు మానుకుని ఇతరులకు మనం చేసిన నిస్వార్ధమైన సేవలు కనిపిస్తాయి.నీ తిండి కొంచం తగ్గించుకుని ఆకలితో ఉన్న ఎదుటి మనిషికి నీవు పెట్టిన అన్నం ముద్దలు కనిపిస్తాయి.నీవద్ద సహాయం పొందిన ఆర్తులు నీవైపు చూచిన కృతజ్ఞతాపూరితములైన చూపులు కనిపిస్తాయి.ఎదుటి మనిషి ముఖంనుంచి నీవు తుడిచిన కన్నీళ్లు కనిపిస్తాయి.

ఇవి కూడా కనిపిస్తాయి.

వీటిని బట్టే నీ తరువాతి జన్మ ఏమిటో నిర్ణయింపబడుతుంది.నువ్వు పొందిన సుఖాలను బట్టి నీ తర్వాతి జన్మ ఉండదు.నువ్వు ఇతరులకు చేసిన నిస్వార్ధమైన సహాయాలను బట్టి నీ భవిష్యత్ జన్మ ఉంటుంది.

ఈ ఆఖరిపేజీ ఇంకా చాలా దూరంగా ఉన్నపుడే ఈ వింతను అర్ధం చేసుకుని, తదనుగుణంగా బ్రతికినవాడే అసలైన మానవుడు.అది దగ్గరయ్యాక -గతమును తలచి వగవడం తప్ప- ఇంక మనం చేసేది ఏమీ ఉండదు.అప్పటిదాకా బ్రతికిన బ్రతుకును మారుద్దామంటే అప్పుడస్సలు వీలుకాదు.నేరం చేసిన తర్వాత శిక్షకోసం ఎదురుచూచే ముద్దాయిలా ఉంటుంది అప్పటి మన పరిస్థితి.ఎందుకంటే 'పైకోర్టు' లో మన తప్పుల్ని ఒప్పులుగా వాదించి నిరూపించే లాయర్లు ఎవరూ ఉండరు.మన అతితెలివితేటలు అక్కడ ఏమాత్రం పనిచెయ్యవు.

అందుకే--తన 'బెస్ట్ ప్రివ్యూ' నిజంగా 'ది బెస్ట్' గా ఉండాలని ప్రతిరోజూ నిజాయితీగా ప్రయత్నించేవాడే నిజమైన మానవుడు.

జీవితం ఇంకా మన చేతిలో ఉన్నపుడు దానిని వేస్ట్ చేసుకుని,చివరి క్షణంలో మన ప్రివ్యూ మన కళ్ళముందు ప్రదర్శింపబడుతున్నపుడు చింతించి ఉపయోగం ఉండదు.

ఆ !! ఇదంతా సోదిలే !! ఇలాంటివేవీ ఉండవులే!! --అని మాత్రం అనుకోవద్దు.

ప్రతి మనిషికీ ఇది తప్పకుండా జరుగుతుంది.జరుగుతుందని ఈనాడు పారా నార్మల్ రీసెర్చి కూడా చెబుతున్నది.ఇలా జరుగుతుందని మన పురాణాలూ శాస్త్రాలూ ఏనాడో చెప్పాయి.వ్రాసి ఉంచాయి. 

"నీ బెస్ట్ ప్రివ్యూ నిజంగా బెస్ట్ గా ఉండాలంటే బీస్ట్ లా బ్రతకొద్దు.మానవుడిలా బ్రతుకు.ఎంతసేపూ నీ గురించే నీ సుఖం గురించే నీ స్వార్ధం గురించే ఆలోచించకు.బాధల్లో ఉన్న నీ సాటి మనిషికి నీవేం చెయ్యగలవో దానిని ఆలస్యం లేకుండా వెంటనే చెయ్యి."అని చెప్పాయి.  

దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవడం మంచి పని కదూ???
read more " బెస్ట్ ప్రివ్యూ... "

23, ఫిబ్రవరి 2015, సోమవారం

Astro Workshop -2 విజయవాడలో జరిగింది.
























Astro Workshop -2 విజయవాడలో జయప్రదంగా జరిగింది.

హైదరాబాద్ లో జరిగిన Astro workshop-1 కు హాజరు కాలేని వారికోసం విజయవాడలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరువరకూ ఈ కార్యక్రమం జరిగింది.హైదరాబాద్ లో చెప్పిన విషయాలనే కొత్తపద్ధతిలో వివరిస్తూ,ఇంకా కొన్ని ఎక్కువ విషయాలను చెప్పడం జరిగింది.

ఈ సమావేశానికి హాజరై,జ్యోతిష్యశాస్త్రపు మౌలికాంశాలను ఆకళింపు చేసుకున్నవారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

వదలకుండా ఈ సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిశ్శాస్త్రవేత్తలుగా రాణించాలని వారందరినీ కోరుతున్నాను.
read more " Astro Workshop -2 విజయవాడలో జరిగింది. "

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు


ఒంటిమిట్ట రామాలయం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

ఒకటి-
భక్తకవి అయిన పోతన్నగారు ఇక్కడ నివసిస్తూ,కోదండరాముని కటాక్షాన్ని పొందినవాడై,తనయొక్క శ్రీమద్భాగవత రచన గావించడం వల్ల ఆ క్షేత్రానికి వచ్చిన ప్రాశస్త్యము.

రెండు-
ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారు ఈ క్షేత్రంలోనే ఎక్కువకాలం ఉండి తన తెలుగు రామాయణం (మందరం) ను వాల్మీకి ప్రణీతమైన సంస్కృత రామాయణానికి సరిసమానమైన 24000 పద్యాలలో రచించడము.అంతేగాక దాదాపు నూరేళ్ళ నాడే దేశమంతా తిరిగి భిక్షమెత్తి,జీర్ణస్థితికి చేరిన ఈ దేవాలయాన్ని  ఆ ధనంతో బాగుచెయ్యడము.  

మూడు-
ఈ ఆలయంలోని కోదండరాముని దర్శించిన క్షణంనుంచే నాలో కవితాఝరి ఉప్పొంగి దాదాపు 108 తెలుగు ఆశుపద్యాల రూపంలో ప్రవహించడము.ఆ తర్వాత అప్పటినుంచీ ఇప్పటివరకూ దాదాపు రెండువేల తెలుగుపద్యములు నా నోటినుంచి ఆశువుగా రావడము.

నాలుగు-
మార్కండేయుడు తన తపస్సుతో పరమేశ్వరుని మెప్పించి మరణాన్ని జయించిన ప్రదేశం ఇదే కావడము.

అయిదు-
అన్నింటి కంటే మించినది,సీతా రామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మూడురోజులు నివసించడము.

ఈ కారణముల వల్ల,ఈ ఆలయం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమాభిమానములు ఉన్నవి.ఇక్కడి కోదండరాముని కటాక్షం అనుపమానమైనదన్న విశ్వాసం నాకు అనేక అనుభవములు రుజువులతో సహా లభించింది.ఇదంతా జరిగి ఇప్పటికి దాదాపు అయిదేళ్ళు అవుతున్నది. అప్పట్లో నేను వ్రాసిన ఆయా పద్యములన్నీ నా బ్లాగు చదువరులకు సుపరిచితములే.

ఇన్నాళ్ళ తర్వాత,ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలని భావించడం,నిర్దారించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది.విజయనగరం  జిల్లా రామతీర్ధమా? లేక కడపజిల్లా ఒంటిమిట్టయా? యన్న సందిగ్ధత తొలగిపోయి,ఒంటిమిట్ట వైపే ప్రభుత్వం మొగ్గుచూపడం బాగున్నది.రామతీర్ధం తక్కువది అని నా ఉద్దేశ్యం కాదు. అదికూడా మహత్తరమైన పుణ్యక్షేత్రమే.కానీ అనేక ఇతర అంశాలను బేరీజు వేసిన మీదట,ప్రభుత్వం చేత ఈ నిర్ణయం తీసుకోబడటం ముదావహం. రామతీర్ధాన్ని కూడా బాగా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం గట్టిగా ఉన్నది.

ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారి కలలు ఈ విధంగానైనా నెరవేరి మహిమాన్వితమైన ఈ ఆలయం వెలుగులోకి వచ్చితే తెలుగుజాతికి అంతకంటే అదృష్టం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం.

అయితే,ఇదే అదనుగా చూచుకుని,వ్యాపారులు,షాపులు,దళారీలు, మోసగాళ్ళు ఇక్కడకు చేరి దీనిని కూడా ఒక వ్యాపారకేంద్రంగా మార్చి చివరకు ఒంటిమిట్టను కూడా తిరుపతిలా తయారు చెయ్యకుండా,దాని పవిత్ర వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలమీదా ప్రభుత్వంమీదా కూడా ఉన్నది.

అన్నింటినీ,చివరకు దేవాలయాలనూ పుణ్యక్షేత్రాలనూ కూడా భ్రష్టు పట్టించే ఈ కలియుగంలో ఇది ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.

ఇక్కడ వాతావరణం దిగజారకుండా,ఆలయ పవిత్రత కాపాడబడుతూ, ఇంకొకవైపు సౌకర్యాలు అభివృద్ధి జరిగితే అంతకంటే సంతోషం రామభక్తులకు ఇంకొకటి ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
read more " ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు "

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

Astro Workshop-1 విజయవంతంగా జరిగింది





















Astro Workshop-1 హైదరాబాద్ లో విజయవంతంగా జరిగింది.

ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదున్నర వరకూ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.హేతువాద భవనంలో,హేతువాద (logical) శాస్త్రం అయిన జ్యోతిష్యం చర్చింపబడటం చాలా సమంజసంగా అనిపించింది.

కార్యక్రమానికి 49 మంది హాజరయ్యారు.వీరిలో ఉద్యోగులు(ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు),వ్యాపారులు,గృహిణులు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చినవారే కాక,దూరప్రాంతాలైన బెంగుళూర్ మొదలైన ప్రదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వచ్చినవారందరూ చాలా శ్రద్ధగా ఏడుగంటలపాటు మౌనంగా ఉండి సబ్జెక్టును వింటూ అర్ధం చేసుకుంటూ చక్కగా సహకరించారు.

దాదాపు 280 slides తో కూడిన పవర్ పాయింట్ సహాయంతో సబ్జెక్ట్ ని వివరించడం జరిగింది.

అయితే చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్న అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ సబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు పరిచయం లేకపోవడంతో అతి బేసిక్ స్థాయి నుంచి మొదలుపెట్టి వివరిస్తూ రావడం జరిగింది.ఈ క్రమంలో సబ్జెక్ట్ లో ప్రవేశం ఉన్నవారికి కొంత విసుగు కలిగి ఉండవచ్చు.ఈ విషయాన్ని ముందుగానే చెప్పి,తమ సహచరులను దృష్టిలో ఉంచుకుని,సంయమనాన్ని పాటించమని వారందరినీ ముందుగానే కోరడం జరిగింది.

జ్యోతిష్య విజ్ఞానంలో ఉన్న పరాశర,జైమిని,తాజక,నాడీ మొదలైన రకరకాల సిస్టమ్స్ ను క్లుప్తంగా పరిచయం చేస్తూ,గ్రహాలు,రాశులు,నక్షత్రాలు,భావాలు, వాటి రకరకాల కారకత్వాలు,పంచాంగవివరాలను బట్టి జాతకుని జీవితాన్ని స్థూలంగా ఎలా గ్రహించాలి?ప్రాధమిక గ్రహయోగాలైన వేసి,వాసి, ఉభయచరి, అనఫా,సునఫా,దురుధరా,కేమద్రుమ,పంచమహాపురుష యోగాలైన రుచక, భద్ర,హంస,మాలవ్య,శశయోగాలు,కాలసర్పయోగం మొదలైన అనేక విషయాలను వివరించడం జరిగింది.

జ్యోతిర్విజ్ఞానంలో ఉన్న ప్రాధమిక అంశాలను,దాని పునాదులుగా నిలిచి ఉండే రకరకాల విషయాలను సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పడంలో ఈ సమావేశం ఫలప్రదం అయిందని నేను భావిస్తున్నాను.

ఆరోజున క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకొని ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.ఇది వారిలోని శ్రద్ధకు తార్కాణంగా నేను భావిస్తున్నాను.

ఈ సెమినార్ లో వివరింపబడిన విషయాలను బాగా ఆకళింపు చేసుకుని, ఇవ్వబడిన హోం వర్క్ చక్కగా చేస్తూ,ఒకటి రెండునెలలలో మళ్ళీ జరగబోయే రెండవ వర్క్ షాప్ కు సిద్ధం కావాల్సిందిగా మొన్న అటెండ్ అయిన అందరినీ కోరుతున్నాను.

ఈసారి జరగబోయే వర్క్ షాప్ లో - జాతకచక్రాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఎలా విశ్లేషణ చెయ్యాలి? అనే అంశాలను,అనేక సెలెబ్రిటీ చార్టులను ఉదాహరణలుగా చూపిస్తూ,జ్యోతిష్యపరమైన టెక్నికల్ పదాలను ఉపయోగిస్తూ డైరెక్ట్ గా వివరించడం జరుగుతుంది.ఈలోపల మొన్నటి వర్క్ షాప్ లో ఇవ్వబడిన మెటీరియల్ ను బాగా అర్ధం చేసుకుని తయారు అవ్వవలసిందిగా కోరుతున్నాను.ఆపైన జరుగబోయే వర్క్ షాపులలో 'అడ్వాన్సుడ్ ఎస్ట్రాలజీ టాపిక్స్' లోకి సరాసరి వెళ్ళడం జరుగుతుంది. 

ముఖ్యంగా స్త్రీలుకూడా జ్యోతిష్య విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం కలిగించింది.మనకు మహిళా జ్యోతిష్యవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు.ఒక గాయత్రీ దేవి వాసుదేవ్(బీవీ రామన్ గారి కుమార్తె),ఒక మృదులా త్రివేది మొదలైనవారు తప్ప జ్యోతిష్యరంగంలో పెద్దగా మనకు మహిళలు కనిపించరు.ఈ నేపధ్యంలో, ఇంతమంది స్త్రీలు ఈ వర్క్ షాప్ లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇందులో పాల్గొన్న 49 మందీ,సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిష్యవేత్తలుగా రాణించాలని ఎంతోమంది జీవితాలను బాగుచేసే శక్తిని తద్వారా వారు సంపాదించాలని శ్రీరామకృష్ణులను,కాళీమాతను ఈ సందర్భంగా ప్రార్ధిస్తున్నాను.

అన్ని పనులనూ ఎంతో ప్లానింగ్ తో చూచుకుని,ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కారకులైన రాజూ సైకం (MA Astrology),జానకిరాం,గిరిధర్ వర్మ లకు,మంచి ఫోటోలను తీసి ఇచ్చిన రేణూకుమార్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Astro workshop-2 ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో మళ్ళీ బ్లాగు ముఖంగా ప్రకటన చెయ్యబడుతుంది.
read more " Astro Workshop-1 విజయవంతంగా జరిగింది "

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఉచ్చు

లౌకికజీవితంలో ఎదురయ్యే ఆటంకాలనూ అడ్డంకులనూ ఎలా అధిగమించాలో మానవుడికి తెలుసు.కానీ అంతరికలోకంలో,ఆధ్యాత్మిక లోకంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా దాటాలో తెలీదు.

లోకంలో ఎవరైనా మనల్ని ఒక తాడుతో కట్టేస్తే ఆ కట్లు ఎలా విప్పుకోవాలో మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మికలోకంలో మనల్ని మనమే రకరకాల తాళ్ళతో కట్టేసుకుంటూ ఉన్నామన్న సంగతి మనకు తెలియదు.మనల్ని మనమే కట్టేసుకుంటున్నామన్న విషయం తెలియకపోతే ఇక ఆ కట్లను విప్పుకోవాలని ఎలా అనిపిస్తుంది?మనకు తెలియకపోవడమే కాదు. తెలిసినవారు చెప్పినా వినిపించుకునే స్థితిలో,ఒప్పుకునే స్థితిలో మనం ఉండము.అదే ఆధ్యాత్మిక లోకంలో అసలైన విచిత్రం.

ఇలా జరగడానికి కారణం ఏమిటి?

బయట ప్రపంచంలో ఉన్న ఉచ్చులు ఆటంకాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.కనుక వాటిని దాటటం మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆటంకాలు ఉచ్చులు కనిపించవు.బయట ప్రపంచంలో ఆటంకాలు బయటనుంచి వస్తాయి.ఇతరుల నుంచి వస్తాయి.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఆటంకాలు తమనుంచే పుట్టుకొస్తాయి.లోలోపలే అవి ఉంటాయి.వాటిని తయారు చేసుకునేదీ మనమే.వాటితో మనల్ని మనం కట్టుకునేదీ మనమే.కనుక వాటిని దాటే విధానం మనకు తెలియదు.దాటాలని కూడా మనకు అనిపించదు.ఆ కట్లను విప్పుకోవాలన్న స్పృహే మనకు ఉండదు. ఎందుకంటే ఆ కట్లు చాలా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నవారుకూడా తాము స్వేచ్చగా ఉన్నామని అనుకోవడమే ఆధ్యాత్మిక లోకంలోని విచిత్రాలలో ఒకటి.

ఆధ్యాత్మిక లోకపు ఉచ్చులు ఎలా ఉంటాయో చూద్దామా?

'అ' 'ఆ' లు రానివారికి అద్భుతాల ఉచ్చు
అన్నీ చదివిన వాడికి అహంకారపు ఉచ్చు
అతితెలివి ఉన్నవాడికి అడుగు పడని ఉచ్చు
ఆశ ఎక్కువైపోతే అయోమయపు ఉచ్చు

ఆధ్యాత్మికత అంటే ఓనమాలు తెలియనివారు చాలామంది ఉంటారు.వారికి అద్భుతాల మీద మహామోజుగా ఉంటుంది.గారడీవిద్యలకూ ఈ అద్భుతాలకూ ఏమీ తేడాలేదు.రోడ్డుమీద గారడీ చేసి డబ్బులు అడుక్కునేవారికీ అద్భుతాలు చేసే మహాత్ములకూ పెద్దగా భేదం ఏమీలేదు. ఇద్దరూ దాదాపుగా ఒక స్థాయిలోని వారే.ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నవారు ఇలాంటి గారడీవిద్యలు చూచి బోర్లా పడిపోయి మోసపోతూ ఉంటారు.

ఇంకొంతమంది పుస్తకాలు విపరీతంగా చదివేసి విషయసేకరణ చేసి ఉంటారు. తద్వారా అన్నీ తెలుసుకున్నామని అనుకుంటూ ఉంటారు.ఇలాంటివారు పాండిత్య అహంకారం అనే ఉచ్చులో చిక్కుకుని ఇక అక్కడనుంచి ముందుకు కదలలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంతమంది అతితెలివితో నిండిపోయి ఉంటారు.వీరికి ఆధ్యాత్మికత అంటే ఒక పిచ్చివ్యవహారం కింద లెక్క.అదొక "టైంవేస్ట్" అని వారి ఉద్దేశ్యం.ఇలాంటి అతితెలివి మనుషులకు వారి అతితెలివే ఉచ్చుగా మారి వారిని ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటుంది.మాకన్నీ తెలుసు అనే భ్రమలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని కామెంట్ చేస్తూ వారు ఏమి కోల్పోతున్నారో వారే గ్రహించలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంత మందికి అత్యాశ ఉంటుంది.వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదో లాభం పొందుదామనే ప్రయత్నిస్తూ ఉంటారు.ఇలాంటివారు ఎన్నేళ్ల తరబడి అందులో ఉన్నాకూడా చివరకు ఏమీ అర్ధంకాని అయోమయమే వారికి మిగులుతుంది.వారి అత్యాశే వారికి ఉచ్చుగా మారి బిగిస్తుంది.అప్పనంగా వరాలొస్తాయన్న అత్యాశతో నిన్నా మొన్నటివరకూ కొందరు ప్రసిద్ధ గురువులను,అవతార పురుషులను(?) అనుసరించిన వారికి నేడు మిగిలింది అదే.ఆయా గురువులూ,అవతార పురుషులూ 'ఫ్రాడ్' అని నేడు తేలడంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో వారు ప్రస్తుతం ఉన్నారు.

గురువులమనుకునేవారికి గ్రుడ్డితనపు ఉచ్చు
మోసకారులకు వారి మోహపాశమే ఉచ్చు
అడుగు వెయ్యని వారికి అలసత్వమనే ఉచ్చు
అర్పణ చేతకానివారికి అహంకారమే ఉచ్చు

అసలు "విషయం" అంటూ వారిదగ్గర పెద్దగా లేకపోయినా, అనేకమంది వారికివారే 'సద్గురు' వులమని పేర్లు పెట్టుకుని శిష్యులచేత ప్రచారాలు చేయించుకుంటూ తెలిసీ తెలియని ఆధ్యాత్మికతను బాగా మార్కెటింగ్ చేస్తున్నారు.ఇలాంటి స్వయంగురువులకు వారి గ్రుడ్డితనమే వారికి ఉచ్చుగా మిగులుతుంది.

ఇంకొంతమంది వారి మోసకారుతనాన్ని ఆధ్యాత్మికలోకంలో కూడా ప్రయోగిస్తూ ఉంటారు.ఇలాంటివారికి కావలసింది ఆయా సర్కిల్స్ లో దొరికే పరిచయాలు.ఆ పరిచయాల ద్వారా అయ్యే పనులు.వీరంతా పచ్చి మోసగాళ్ళు.పనులు కావడమే వీరికి ప్రధానంగాని పరిణతి రావడం కాదు. వారిని పట్టి పీడిస్తున్న మోహాలే ఇలాంటివారికి ఉచ్చులుగా మారుతాయి. పక్కదారులు పట్టిస్తాయి.

ఇంకొంతమంది ఏళ్ళతరబడి ప్రవచనాలూ బోధలూ వింటూ ఉన్నప్పటికీ ఆచరణలో ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేరు.ఇలాంటి వారికి వారి అలసత్వమూ బద్ధకాలే ఉచ్చులుగా మారి కట్టివేస్తాయి.

ఇంకొంతమంది గురువుకూ దైవానికీ శరణాగతి కాలేరు.దానికి అడ్డుపడేది వారి అహంకారమే.'అహం' అన్న మాటను ఒప్పుకోకుండా దానికి రకరకాల కారణాలను వారు చెబుతారు.అలా వారికి వారే సర్దిచెప్పుకుంటూ సంతృప్తి పడుతూ ఉంటారు.ఇలాంటివారికి వారి అహంకారమే ఉచ్చుగా మారి బంధిస్తుంది.దానిని వారు దాటలేరు.

లోన శుద్ధికాకపోతె లోకమనేదే ఉచ్చు
కాలు కదపలేకపోతే కల్లమాటలే ఉచ్చు
మానవత్వమెరుగనిచో మాయతంతులే ఉచ్చు
దేశద్రిమ్మరులకేమో దేబిరింపే ఉచ్చు

మనస్సు శుద్ధి కాకపోతే లోకంలో ప్రతిదీ ఉచ్చుగా మారి మనల్ని కదలకుండా బంధిస్తుంది.మనస్సు శుద్దంగా ఉంటే లోకంలో ఏదీ మనల్ని బంధించలేదు.మనస్సు ద్వారానే బంధమైనా స్వతంత్రమైనా మనిషికి ప్రాప్తిస్తుంది.

కొంతమంది ఆచరణ అనేది లేకుండా ఊరకే కూచుని ఉపన్యాసాలు ఇస్తుంటారు.వారికి చివరకు మిగిలేవి కల్లమాటలూ సొల్లుమాటలే.ఆ మాటలే వారికి ఉచ్చులు.

ఇంకొంతమంది దేశాలు పట్టుకుని ఊరకే పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.అదే నిజమైన ఆధ్యాత్మికత అని వారనుకుంటారు.పోయిన ప్రతీచోటా ఏదో దొరుకుతుంది అన్న దేబిరింపే వారికి ఉచ్చుగా మారి వారిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా కట్టి ఉంచుతుంది.ఆ సంగతి వారు గ్రహించలేరు.

మరికొంతమంది మాయతంతులు హోమాలూ పూజలే మహాగొప్ప విషయాలని భ్రమిస్తూ వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారు.వారికి మానవత్వం మాత్రం ఉండదు.ఇలాంటి మనుషులకు వారి మాయతంతులే ఉచ్చుగా మారి వారిని బంధిస్తూ ఉంటాయి.వారూ ఈ విషయాన్ని గ్రహించలేరు.

ఈ విధంగా ఆధ్యాత్మికలోకంలో అడుగడుగునా ఎవరి అజ్ఞానమూ స్వార్ధమూ అహంకారమూ అలసత్వమూ ఆశపోతుతనాలే వారికి ఉచ్చులుగా మారి వారిని కట్టిపడేస్తూ ఉంటాయి.కానీ అలా కట్టబడి ఉన్నామన్న స్పృహ వారికి ఉండదు.

ఇదే ఆధ్యాత్మిక లోకపు విచిత్రాలలో ఒక మహావిచిత్రం.

ఈ ఉచ్చులనుండి బయటపడలేకపోతే నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో ఎన్నటికీ అర్ధం కాదనేది మాత్రం కఠోరవాస్తవం.అర్ధం చేసుకోడానికే జన్మంతా సరిపోతుంటే ఇక దానిని ఆచరణలో పెట్టేది ఎన్నడు? అనుభవాన్ని పొందేది ఎప్పుడు?
read more " ఉచ్చు "

29, జనవరి 2015, గురువారం

స్వైన్ ఫ్లూ--హోమియో చికిత్స

అంటువ్యాధులూ సాంక్రామిక వ్యాధులూ ప్రబలినప్పుడే జనం హోమియోపతిని గురించి మాట్లాడుకుంటారు. కలియుగ సమాజంలో ఇదొక వింత.ఇలాంటి సమయాలలో సమర్ధవంతంగా పనిచేసే హోమియో మందులు మరి మిగతా రోగాలకు కూడా ఇంతే సమర్ధవంతంగా పనిచేస్తాయని ప్రజలకు ఎందుకు తోచదో అర్ధం కాదు.ఒకవేళ తోచినా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదో ఒక డాక్టరు పాలు గాక తప్పదు గనుక అల్లోపతీ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారేమో తెలియదు.

ప్రస్తుతం స్వైన్ ఫ్లూ బూచి మళ్ళీ తెరమీదకు వచ్చింది.అక్కడక్కడా కేసులు వినిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా 'ఆర్సెనికం ఆల్బం' మందును బటానీల లాగా పంచి పెడుతున్నారు.ఇంతకు ముందు మెదడు వాపు వ్యాధిలో 'బెల్లడోనా' మందును ఇలాగే పప్పు బెల్లాల లాగా వాడారు.ఆ వ్యాధి పుణ్యమాని 'బెల్లడోనా' పేరు చదువు రానివారి నోళ్ళలో కూడా నానింది.ఇప్పుడు 'ఆర్సెనికం ఆల్బం' పేరు నానుతోంది.

స్వైన్ ఫ్లూ రాకుండా నివారక ఔషధంగా (prophylactic) 'ఆర్సెనికం ఆల్బం' పనిచేస్తుంది అని ప్రచారం జరుగుతున్నది.నిజమే కావచ్చు.కానీ దానితో బాటే -'ఇన్ఫ్లూయంజినం' కూడా ఉపయోగపడుతుంది.వ్యాధి వచ్చిన తర్వాత బాధించే ఒళ్ళు నొప్పులను చలినీ తగ్గించదానికి 'యూపటోరియం పర్ఫోలియేటం' కూడా పనిచేస్తుంది.

"ఫలానా వ్యాధికి హోమియోలో మందు ఉన్నదా?" అని కొందరు అడుగుతూ ఉంటారు.అన్ని రోగాలకూ హోమియోలో ఔషధాలు ఉన్నాయి.ఈ విషయం అన్నీ తెలుసనుకునే నేటి నాగరికులకు ఎందుకు అర్ధం కాదో తెలియదు.

బహుశా దీనికి కూడా కారణం ఖర్మే అని నేననుకుంటాను.

మనకు డబ్బు వదిలించుకుని,బాధ తగ్గక,అవస్థపడే యోగం ఉన్నపుడు,హోమియోపతి వాడదామని తోచదు.అక్రమసంపాదన అంతా వదిలి,ఒళ్ళు గుల్ల అయిన లాస్ట్ స్టేజిలో మాత్రమే హోమియో వైపు జనం చూస్తారు.అప్పుడెలాగూ ఉపయోగం ఉండదు.'మేము హోమియో కూడా వాడాము'- అని చెప్పుకోడానికి తప్ప ఇంక దేనికీ అది ఉపయోగపడదు.

ఖర్మ తీరే సమయం ఇంకా రాకపోతే,ఒకవేళ హోమియోపతి వాడుదామని తోచినా,సరియైన హోమియో వైద్యుడు దొరకక ఎవరో ఒకరి దగ్గర హోమియో మందులు వాడి,రోగం తగ్గక,బాధపడుతూ ఉంటారు.తగ్గలేదని హోమియోపతి వైద్యాన్ని నిందిస్తూ ఉంటారు.ఇలాంటి వారిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం.

అంటువ్యాధులు ప్రబలినప్పుడే కాదు మామూలు సమయాలలో వచ్చే రకరకాల రోగాలకు కూడా హోమియోపతి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.సరియైన వైద్యుని వద్ద మందులు వాడితే ఈ విషయం అతికొద్ది రోజులలోనే అర్ధమౌతుంది.

జ్యోతిష్య ఫలితం తప్పితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నిందించకూడదు.అది జ్యోతిష్కుని చాతకానితనం.అలాగే,హోమియో మందులు పనిచెయ్యకపోతే ఆ శాస్త్రాన్నే నిందించడం తప్పు.ఆ వైద్యునికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాతకాలేదని తెలుసుకోవాలి.

ప్రస్తుతం మనకు తెలిసిన అన్ని రోగాలకూ(ఏవో ఒకటి రెండు తప్పించి) హోమియోపతిలో సమర్ధవంతమైన మందులు ఉన్నాయన్నది వాస్తవం.అవి ఇంగ్లీషు మందుల కంటే బ్రహ్మాండంగా పని చేస్తాయన్నదీ వాస్తవమే.

ఈ విషయం అనుభవంలో మాత్రమే తెలుస్తుంది.

అంటువ్యాధులను హోమియో ఔషధాలు చాలా వేగంగా సమర్ధవంతంగా తగ్గించడమే దీనికి ఋజువు.
read more " స్వైన్ ఫ్లూ--హోమియో చికిత్స "