“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంచిరోజులు


ఒంటిమిట్ట రామాలయం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది.దానికి కారణాలు అనేకం ఉన్నాయి.

ఒకటి-
భక్తకవి అయిన పోతన్నగారు ఇక్కడ నివసిస్తూ,కోదండరాముని కటాక్షాన్ని పొందినవాడై,తనయొక్క శ్రీమద్భాగవత రచన గావించడం వల్ల ఆ క్షేత్రానికి వచ్చిన ప్రాశస్త్యము.

రెండు-
ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారు ఈ క్షేత్రంలోనే ఎక్కువకాలం ఉండి తన తెలుగు రామాయణం (మందరం) ను వాల్మీకి ప్రణీతమైన సంస్కృత రామాయణానికి సరిసమానమైన 24000 పద్యాలలో రచించడము.అంతేగాక దాదాపు నూరేళ్ళ నాడే దేశమంతా తిరిగి భిక్షమెత్తి,జీర్ణస్థితికి చేరిన ఈ దేవాలయాన్ని  ఆ ధనంతో బాగుచెయ్యడము.  

మూడు-
ఈ ఆలయంలోని కోదండరాముని దర్శించిన క్షణంనుంచే నాలో కవితాఝరి ఉప్పొంగి దాదాపు 108 తెలుగు ఆశుపద్యాల రూపంలో ప్రవహించడము.ఆ తర్వాత అప్పటినుంచీ ఇప్పటివరకూ దాదాపు రెండువేల తెలుగుపద్యములు నా నోటినుంచి ఆశువుగా రావడము.

నాలుగు-
మార్కండేయుడు తన తపస్సుతో పరమేశ్వరుని మెప్పించి మరణాన్ని జయించిన ప్రదేశం ఇదే కావడము.

అయిదు-
అన్నింటి కంటే మించినది,సీతా రామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మూడురోజులు నివసించడము.

ఈ కారణముల వల్ల,ఈ ఆలయం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమాభిమానములు ఉన్నవి.ఇక్కడి కోదండరాముని కటాక్షం అనుపమానమైనదన్న విశ్వాసం నాకు అనేక అనుభవములు రుజువులతో సహా లభించింది.ఇదంతా జరిగి ఇప్పటికి దాదాపు అయిదేళ్ళు అవుతున్నది. అప్పట్లో నేను వ్రాసిన ఆయా పద్యములన్నీ నా బ్లాగు చదువరులకు సుపరిచితములే.

ఇన్నాళ్ళ తర్వాత,ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలని భావించడం,నిర్దారించడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది.విజయనగరం  జిల్లా రామతీర్ధమా? లేక కడపజిల్లా ఒంటిమిట్టయా? యన్న సందిగ్ధత తొలగిపోయి,ఒంటిమిట్ట వైపే ప్రభుత్వం మొగ్గుచూపడం బాగున్నది.రామతీర్ధం తక్కువది అని నా ఉద్దేశ్యం కాదు. అదికూడా మహత్తరమైన పుణ్యక్షేత్రమే.కానీ అనేక ఇతర అంశాలను బేరీజు వేసిన మీదట,ప్రభుత్వం చేత ఈ నిర్ణయం తీసుకోబడటం ముదావహం. రామతీర్ధాన్ని కూడా బాగా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం గట్టిగా ఉన్నది.

ఆంద్రవాల్మీకి వాసుదాసస్వామిగారి కలలు ఈ విధంగానైనా నెరవేరి మహిమాన్వితమైన ఈ ఆలయం వెలుగులోకి వచ్చితే తెలుగుజాతికి అంతకంటే అదృష్టం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం.

అయితే,ఇదే అదనుగా చూచుకుని,వ్యాపారులు,షాపులు,దళారీలు, మోసగాళ్ళు ఇక్కడకు చేరి దీనిని కూడా ఒక వ్యాపారకేంద్రంగా మార్చి చివరకు ఒంటిమిట్టను కూడా తిరుపతిలా తయారు చెయ్యకుండా,దాని పవిత్ర వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలమీదా ప్రభుత్వంమీదా కూడా ఉన్నది.

అన్నింటినీ,చివరకు దేవాలయాలనూ పుణ్యక్షేత్రాలనూ కూడా భ్రష్టు పట్టించే ఈ కలియుగంలో ఇది ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.

ఇక్కడ వాతావరణం దిగజారకుండా,ఆలయ పవిత్రత కాపాడబడుతూ, ఇంకొకవైపు సౌకర్యాలు అభివృద్ధి జరిగితే అంతకంటే సంతోషం రామభక్తులకు ఇంకొకటి ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.