Spiritual ignorance is harder to break than ordinary ignorance

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

Astro Workshop-1 విజయవంతంగా జరిగింది

Astro Workshop-1 హైదరాబాద్ లో విజయవంతంగా జరిగింది.

ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం అయిదున్నర వరకూ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.హేతువాద భవనంలో,హేతువాద (logical) శాస్త్రం అయిన జ్యోతిష్యం చర్చింపబడటం చాలా సమంజసంగా అనిపించింది.

కార్యక్రమానికి 49 మంది హాజరయ్యారు.వీరిలో ఉద్యోగులు(ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు),వ్యాపారులు,గృహిణులు ఉన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చినవారే కాక,దూరప్రాంతాలైన బెంగుళూర్ మొదలైన ప్రదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వచ్చినవారందరూ చాలా శ్రద్ధగా ఏడుగంటలపాటు మౌనంగా ఉండి సబ్జెక్టును వింటూ అర్ధం చేసుకుంటూ చక్కగా సహకరించారు.

దాదాపు 280 slides తో కూడిన పవర్ పాయింట్ సహాయంతో సబ్జెక్ట్ ని వివరించడం జరిగింది.

అయితే చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్న అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ సబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు పరిచయం లేకపోవడంతో అతి బేసిక్ స్థాయి నుంచి మొదలుపెట్టి వివరిస్తూ రావడం జరిగింది.ఈ క్రమంలో సబ్జెక్ట్ లో ప్రవేశం ఉన్నవారికి కొంత విసుగు కలిగి ఉండవచ్చు.ఈ విషయాన్ని ముందుగానే చెప్పి,తమ సహచరులను దృష్టిలో ఉంచుకుని,సంయమనాన్ని పాటించమని వారందరినీ ముందుగానే కోరడం జరిగింది.

జ్యోతిష్య విజ్ఞానంలో ఉన్న పరాశర,జైమిని,తాజక,నాడీ మొదలైన రకరకాల సిస్టమ్స్ ను క్లుప్తంగా పరిచయం చేస్తూ,గ్రహాలు,రాశులు,నక్షత్రాలు,భావాలు, వాటి రకరకాల కారకత్వాలు,పంచాంగవివరాలను బట్టి జాతకుని జీవితాన్ని స్థూలంగా ఎలా గ్రహించాలి?ప్రాధమిక గ్రహయోగాలైన వేసి,వాసి, ఉభయచరి, అనఫా,సునఫా,దురుధరా,కేమద్రుమ,పంచమహాపురుష యోగాలైన రుచక, భద్ర,హంస,మాలవ్య,శశయోగాలు,కాలసర్పయోగం మొదలైన అనేక విషయాలను వివరించడం జరిగింది.

జ్యోతిర్విజ్ఞానంలో ఉన్న ప్రాధమిక అంశాలను,దాని పునాదులుగా నిలిచి ఉండే రకరకాల విషయాలను సభ్యులకు అర్ధమయ్యేలా చెప్పడంలో ఈ సమావేశం ఫలప్రదం అయిందని నేను భావిస్తున్నాను.

ఆరోజున క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకొని ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.ఇది వారిలోని శ్రద్ధకు తార్కాణంగా నేను భావిస్తున్నాను.

ఈ సెమినార్ లో వివరింపబడిన విషయాలను బాగా ఆకళింపు చేసుకుని, ఇవ్వబడిన హోం వర్క్ చక్కగా చేస్తూ,ఒకటి రెండునెలలలో మళ్ళీ జరగబోయే రెండవ వర్క్ షాప్ కు సిద్ధం కావాల్సిందిగా మొన్న అటెండ్ అయిన అందరినీ కోరుతున్నాను.

ఈసారి జరగబోయే వర్క్ షాప్ లో - జాతకచక్రాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?ఎలా విశ్లేషణ చెయ్యాలి? అనే అంశాలను,అనేక సెలెబ్రిటీ చార్టులను ఉదాహరణలుగా చూపిస్తూ,జ్యోతిష్యపరమైన టెక్నికల్ పదాలను ఉపయోగిస్తూ డైరెక్ట్ గా వివరించడం జరుగుతుంది.ఈలోపల మొన్నటి వర్క్ షాప్ లో ఇవ్వబడిన మెటీరియల్ ను బాగా అర్ధం చేసుకుని తయారు అవ్వవలసిందిగా కోరుతున్నాను.ఆపైన జరుగబోయే వర్క్ షాపులలో 'అడ్వాన్సుడ్ ఎస్ట్రాలజీ టాపిక్స్' లోకి సరాసరి వెళ్ళడం జరుగుతుంది. 

ముఖ్యంగా స్త్రీలుకూడా జ్యోతిష్య విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం కలిగించింది.మనకు మహిళా జ్యోతిష్యవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు.ఒక గాయత్రీ దేవి వాసుదేవ్(బీవీ రామన్ గారి కుమార్తె),ఒక మృదులా త్రివేది మొదలైనవారు తప్ప జ్యోతిష్యరంగంలో పెద్దగా మనకు మహిళలు కనిపించరు.ఈ నేపధ్యంలో, ఇంతమంది స్త్రీలు ఈ వర్క్ షాప్ లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇందులో పాల్గొన్న 49 మందీ,సబ్జెక్టును బాగా నేర్చుకుని మంచి జ్యోతిష్యవేత్తలుగా రాణించాలని ఎంతోమంది జీవితాలను బాగుచేసే శక్తిని తద్వారా వారు సంపాదించాలని శ్రీరామకృష్ణులను,కాళీమాతను ఈ సందర్భంగా ప్రార్ధిస్తున్నాను.

అన్ని పనులనూ ఎంతో ప్లానింగ్ తో చూచుకుని,ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కారకులైన రాజూ సైకం (MA Astrology),జానకిరాం,గిరిధర్ వర్మ లకు,మంచి ఫోటోలను తీసి ఇచ్చిన రేణూకుమార్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Astro workshop-2 ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో మళ్ళీ బ్లాగు ముఖంగా ప్రకటన చెయ్యబడుతుంది.