“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, మార్చి 2015, సోమవారం

బెస్ట్ ప్రివ్యూ...

ప్రతి మనిషీ సుఖంగా బ్రతకాలని అనుకుంటాడు.

తప్పులేదు.

కానీ అదొక్కటే జీవిత పరమార్ధం అనుకోవడం మాత్రం చాలా తప్పు.

దానికోసం పక్కవాడిని వెనక్కు తోసేసి మనం ముందుకెళ్ళిపోవాలనుకోవడం శుద్ధ తప్పు.ఎవరెలా పోయినా సరే,మన పని మనకు కావాలనుకోవడం పరమ శుద్ధతప్పు.

కానీ వీటినే సక్సెస్ సూత్రాలనీ,మేనేజిమెంట్ పాఠాలనీ నేడు అన్నిచోట్లా బోధిస్తున్నారు.వీటివల్ల మనిషికి డబ్బు ఒక్కటి సమకూరవచ్చేమో గాని, ఆత్మసంతృప్తి మాత్రం రానేరాదు.అయితే ఇవి తప్పులని, వీటివల్ల జీవితంలో ఒక అమోఘమైన సంతృప్తి మాత్రం రాదనీ  చాలామందికి జీవితపు ఆఖరి అంకంలోగాని తెలియదు.

ఎందుకంటే జీవితపు ఆఖరి ఘడియలలో ఒక రీల్ మన కళ్ళముందు తిరుగుతుంది.అదే- 'బెస్ట్ ప్రివ్యూ'.

చనిపోయేముందు ప్రతివాడికీ తన కళ్ళముందు తన జీవితపు సినిమా రీల్ మొత్తం గిర్రున తిరుగుతుంది.

మనం ఎన్నో సినిమాల రివ్యూలు చదివి ఉండవచ్చు, ప్రివ్యూలు చూచి ఉండవచ్చు.కానీ మన జీవితపు ' బెస్ట్ ప్రివ్యూ' మాత్రం మన జీవితపు ఆఖరి క్షణాలలో మన కళ్ళముందు వెయ్యబడుతుంది.

ఇది ప్రతివారికీ ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుందని మన ప్రాచీనులు చెబితే మనం నమ్మలేదు.కానీ నేడు,NDE (నియర్ డెత్ ఎక్స్ పీరియెన్స్) ని అనుభవించి,ఏదో కారణం చేత వెనక్కు వచ్చిన ప్రతివారూ ఇదే చెబుతున్నారు.ఇలా జరుగుతుందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అది నిజం కూడా.

ఆ ప్రీవ్యూలో ఏం కనిపిస్తాయో తెలుసా?

మనం పొందిన సుఖాలు,సంపాదించిన ఆస్తులు,చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు,నడిపిన పైరవీలు,వెలగబెట్టిన రాజకీయాలు,కుట్రలు కుతంత్రాలు, కూడబెట్టిన డబ్బులు వగైరాలు దాంట్లో ఎక్కడా కనిపించవు.

మరేం కనిపిస్తాయి?

మనం జీవితంలో చేసిన తప్పులు కనిపిస్తాయి.ఇతరులకు మనం చేసిన సహాయాలు కనిపిస్తాయి.ఈ రెండూ తప్ప ఇంకేమీ కనిపించవు.

వెరసి మన తప్పొప్పుల పట్టికగా ఒక రీల్ మన కళ్ళముందు తిరుగుతుంది. అదే బెస్ట్ ప్రివ్యూ.

దానినే మనవాళ్ళు చిత్రగుప్తుని చిట్టా అన్నారు.

మనం చేసిన పనులను మనం మర్చిపోయినా ఆ చిట్టా మరచిపోదు.

మన బ్యాలెన్స్ షీట్ ను మన కళ్ళెదురుగా చూపించి మనచేత అవుననిపించి -"వీటి ప్రకారం నీ తరువాతి జన్మ ఇదిరా బాబూ"- అని చెప్పి మరీ తీసుకుపోతాడు యమధర్మరాజు.

ఆ ప్రీవ్యూ మన ఇష్టప్రకారం ఉండదు.మనకు ఇష్టం లేనివీ,మనం చూడటానికి ఇష్టపడనివీ,చూడటానికి భయపడేవీ,చూడలేక తలదించుకోవాల్సినవీ రకరకాల సీన్లు అందులో ఉంటాయి.

ప్రతివాడికీ,ఈ ప్రీవ్యూ చాలా క్లీన్ గా ఉండాలనీ,ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలనీ,మరణం ముందు మనం తలెత్తుకుని నిలబడాలనీ,ఈ ప్రపంచం నుంచి దొరలాగా నిష్క్రమించాలనీ ఉంటుంది.కానీ మొదట్నించీ దానికి తగినట్లుగా మనం బ్రతకాలని మాత్రం తోచదు.ఊరకే ఆశించినంత మాత్రాన ఈ ప్రివ్యూ బాగుండదు.మొదట్నించీ అలా బ్రతికితేనే అది బాగుంటుంది.లేకుంటే పరమ దరిద్రంగా ఉంటుంది.

అది మన జీవితంలో ఆఖరి పేజీ.

ఆ పేజీని బట్టి తర్వాత జన్మలో మొదటి పేజీ ఉంటుంది.

ఈ ఆఖరిపేజీని వ్రాయడం మన చేతిలో ఉండదు.జీవితమనే పుస్తకంలో మిగతా పేజీలు వ్రాసుకునే వెసులుబాటు మాత్రం మనకు ఉంటుంది.కానీ ఆ ఆఖరిపేజీని వ్రాసే అధికారం మన చేతిలో ఉండదు.అది మృత్యువు చేతిలో ఉంటుంది.దానిప్రకారం తర్వాతి జన్మకు ఈడ్చుకుంటూ తీసుకుపోయే అధికారమూ దానికే ఉంటుంది.అప్పుడు మనం ఎంత అరిచి 'గీ' పెట్టినా దానిముందు మన ఆటలు ఏమాత్రం సాగవు.మన వాదనలు ఏమాత్రం అప్పుడు పనిచెయ్యవు.

న్యాయశాస్త్రంలో 'ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్' అనేవి ఉంటాయి.

'తన వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండా నేరస్తుడిని శిక్షించకూడదు'-అనేది వాటిల్లో ఒకటి.

మరణం దగ్గర కూడా ఈ సూత్రం ఉంటుంది.మన వాదనను వినిపించే అవకాశం తనూ ఇస్తుంది.కానీ అది చూపించే ప్రివ్యూ చూచినప్పుడు ఇక మనం మాట్లాడటానికి ఏమీ ఉండదు.మనం చేసిన పనులన్నీ మన కళ్ళెదుట HD వీడియోలో కనిపిస్తుంటే ఇంక మాట్లాడటానికీ,వాదించడానికీ మనకేమి మిగిలుంటుంది గనుక?

అయితే ఇక్కడొక విచిత్రం ఉన్నది.

ఆఖరి పేజీలో మనకు కనిపించే రీల్లో ఏవేవి ఉంటాయో వాటికి మన రోజువారీ జీవితంలో మనం ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వం.

దానిలో ఏవేవి కనపడవో వాటికి మాత్రం అత్యంత ప్రాధాన్యతను ఇస్తాం.

ప్రపంచమంతా ఇంతే.

ఏ దేశమైనా,ఏ మనుషులైనా ఇంతే.

ఆ రీల్లో కనిపించే మంచివాటికి కూడా నిత్యజీవితంలో చోటు కల్పించేవాడే అసలైన జీవితాన్ని జీవించినవాడు.ఆ రీల్లో కనిపించి మనల్ని బాధపెట్టే వాటిని చెయ్యకుండా ప్రతిరోజూ జాగ్రత్తపడేవాడే అసలైన మానవుడు.

మనం జీవితాన్ని ఎంతో ప్లాన్డ్ గా గడుపుతాం.ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం.కానీ అసలైన ఈ విషయాన్ని మాత్రం నిర్లక్ష్యంగా వదిలేస్తాం.ఈ వదిలేసినవే చివరి రీల్లో మన కళ్ళెదుట 3D లో కనిపిస్తాయి. రోజూ ప్రేమగా చూచుకున్నవి అప్పుడస్సలు కనపడవు.

అందులో మనం పొందిన సుఖాలు కనపడవు.జీవితాన్ని మనం ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఆ సీన్లు కనపడవు.ఏం తిండి తిన్నాం?ఏం బట్టలు కట్టుకున్నాం?ఎన్ని నగలు కొన్నాం?ఎన్ని ఇళ్ళు కట్టాం?ఎన్ని రిసార్ట్ లకు తిరిగాం? ఎలా జల్సా చేశాం? జీవితాన్ని ఎలా బ్రతికాం?-- ఇవేవీ కనపడవు.

మనం ఇతరులకు చేసిన మోసాలు కనిపిస్తాయి.ఘోరాలు కనిపిస్తాయి. నమ్మకద్రోహాలు కనిపిస్తాయి.వెన్నుపోట్లు కనిపిస్తాయి.బాధ్యతారాహిత్యాలు కనిపిస్తాయి.మన స్వార్ధపూరిత వికృత అవతారం మొత్తం కనిపిస్తుంది.

ఇంతేనా? ఎంతసేపూ నెగటివ్ విషయాలేనా? కాదు.

మనం ఇతరులకు చేసిన సహాయాలు కూడా కనిపిస్తాయి.మన అవసరాలు మానుకుని ఇతరులకు మనం చేసిన నిస్వార్ధమైన సేవలు కనిపిస్తాయి.నీ తిండి కొంచం తగ్గించుకుని ఆకలితో ఉన్న ఎదుటి మనిషికి నీవు పెట్టిన అన్నం ముద్దలు కనిపిస్తాయి.నీవద్ద సహాయం పొందిన ఆర్తులు నీవైపు చూచిన కృతజ్ఞతాపూరితములైన చూపులు కనిపిస్తాయి.ఎదుటి మనిషి ముఖంనుంచి నీవు తుడిచిన కన్నీళ్లు కనిపిస్తాయి.

ఇవి కూడా కనిపిస్తాయి.

వీటిని బట్టే నీ తరువాతి జన్మ ఏమిటో నిర్ణయింపబడుతుంది.నువ్వు పొందిన సుఖాలను బట్టి నీ తర్వాతి జన్మ ఉండదు.నువ్వు ఇతరులకు చేసిన నిస్వార్ధమైన సహాయాలను బట్టి నీ భవిష్యత్ జన్మ ఉంటుంది.

ఈ ఆఖరిపేజీ ఇంకా చాలా దూరంగా ఉన్నపుడే ఈ వింతను అర్ధం చేసుకుని, తదనుగుణంగా బ్రతికినవాడే అసలైన మానవుడు.అది దగ్గరయ్యాక -గతమును తలచి వగవడం తప్ప- ఇంక మనం చేసేది ఏమీ ఉండదు.అప్పటిదాకా బ్రతికిన బ్రతుకును మారుద్దామంటే అప్పుడస్సలు వీలుకాదు.నేరం చేసిన తర్వాత శిక్షకోసం ఎదురుచూచే ముద్దాయిలా ఉంటుంది అప్పటి మన పరిస్థితి.ఎందుకంటే 'పైకోర్టు' లో మన తప్పుల్ని ఒప్పులుగా వాదించి నిరూపించే లాయర్లు ఎవరూ ఉండరు.మన అతితెలివితేటలు అక్కడ ఏమాత్రం పనిచెయ్యవు.

అందుకే--తన 'బెస్ట్ ప్రివ్యూ' నిజంగా 'ది బెస్ట్' గా ఉండాలని ప్రతిరోజూ నిజాయితీగా ప్రయత్నించేవాడే నిజమైన మానవుడు.

జీవితం ఇంకా మన చేతిలో ఉన్నపుడు దానిని వేస్ట్ చేసుకుని,చివరి క్షణంలో మన ప్రివ్యూ మన కళ్ళముందు ప్రదర్శింపబడుతున్నపుడు చింతించి ఉపయోగం ఉండదు.

ఆ !! ఇదంతా సోదిలే !! ఇలాంటివేవీ ఉండవులే!! --అని మాత్రం అనుకోవద్దు.

ప్రతి మనిషికీ ఇది తప్పకుండా జరుగుతుంది.జరుగుతుందని ఈనాడు పారా నార్మల్ రీసెర్చి కూడా చెబుతున్నది.ఇలా జరుగుతుందని మన పురాణాలూ శాస్త్రాలూ ఏనాడో చెప్పాయి.వ్రాసి ఉంచాయి. 

"నీ బెస్ట్ ప్రివ్యూ నిజంగా బెస్ట్ గా ఉండాలంటే బీస్ట్ లా బ్రతకొద్దు.మానవుడిలా బ్రతుకు.ఎంతసేపూ నీ గురించే నీ సుఖం గురించే నీ స్వార్ధం గురించే ఆలోచించకు.బాధల్లో ఉన్న నీ సాటి మనిషికి నీవేం చెయ్యగలవో దానిని ఆలస్యం లేకుండా వెంటనే చెయ్యి."అని చెప్పాయి.  

దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవడం మంచి పని కదూ???