15, జులై 2009, బుధవారం

12, జులై 2009, ఆదివారం

కామ్య కర్మలు-తంత్ర విద్య

బాహ్యమైన పనులు పూర్తి కావటానికి, అధర్మమైన కోరికలు తీర్చుకోటానికి తంత్రాన్నిఉపయోగించటం అంత మంచిదికాదు. కాని కొందరు సాధకులు ఇది సరియైనదే అంటారు.ఎందుకంటే పిల్లవాడు ఏది కావాలన్నా తల్లిని అడిగి తీసుకుంటాడు.కొందరు బాగా తెలివైన పిల్లలు మోక్షాన్ని కోరవచ్చు. అంత పరిపక్వత లేని ఇంకొందరు పిల్లలు రకరకాలైన లౌకికకోరికలు కోరవచ్చు.తప్పు లేదు.ఎదుటి వ్యక్తికి హాని చెయ్యనంత వరకు జగన్మాతను ఏదైనా కోరవచ్చు.

ఎదుటి వారికి హాని కలిగించే అభిచారము, వశీకరణం, విద్వేషణం, ఉచ్చాటనం,మారణం వంటి క్రియలు కూడా తంత్రంలో భాగాలే. కాని అవి చేసేవారు వారి జీవితంలో తీవ్రఫలితాలు ఎదుర్కొంటారు. వారి జీవితాలు అర్థాంతరంగా విషాదంగా ముగుస్తాయి. ఎందుకంటే చేసిన కర్మ తిరిగి చక్రవడ్డీతో సహా తీర్చడం సృష్టి ధర్మం. దీనికి ఎంతటివారైనా మినహాయింపు లేదు.


ఒరిస్సాకు చెందిన నా స్నేహితుడు ఒక జరిగిన సంఘటన చెప్పాడు. అతనికి తెలిసిన ఒక వ్యక్తి రంభాఊర్వశి సాధన చేసేవాడు. ఇటువంటివి తంత్రంలో తక్కువ తరగతికి చెందిన యక్షిణీ విద్యలు. ఇతనికి అందమైన భార్య ఉండేది. కాని ఇతనికి అప్సరసల సాంగత్యం మీద గొప్ప కోరిక ఉండేది. పల్లెటూరిలో అతని ఇల్లు ఖాళీ చేసి ఈ సాధన కోసం ఊరిబయట ఒక ఇంట్లో ఉండేవాడు. ఇటువంటి అప్సరసాసాధనలు చేసేవారికి కనిపించే మొదటి రుజువు ఏమిటంటే ఈసాధనలు మొదలుపెట్టిన కొద్ది కాలానికి అతని భార్య మరణిస్తుంది.పుష్పదేహ అప్సరసాసాధన కూడా ఇటువంటిదే.రంభా ఊర్వశుల కంటే కూడా పుష్పదేహ అప్సరస చాలా అందగత్తె. ఈ అప్సరసలు మానవలోకంలోని మిస్ వరల్డ్ ల కంటే ఎన్నో రేట్లు సంమోహనకరమైన అందాన్ని కలిగి ఉంటారు. మానవ సుందరీమణులు వీరి ముందు కోతుల్లా ఉంటారు.

సరే,ఈ సాధన మొదలుపెట్టిన కొన్నాళ్ళకు ఇతని భార్య హఠాత్తుగా మరణించింది. ఇతని సాధన ఫలించడం మొదలుపెట్టింది. ఇతను ఎప్పుడూ తలుపులు వేసుకొని ఉండేవాడు.ఆ ఇంట్లోకి ఎవ్వర్నీ రానిచ్చేవాడు కాదు. రాత్రిళ్ళు మాత్రం ఆ ఇంటిలోనుంచి ఎవరో అమ్మాయి కిలకిల నవ్వినట్లు శబ్దాలు, గజ్జెలు కట్టి ఎవరో నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు వచ్చేవి. ఇతను మాత్రం రోజురోజుకూ క్షీణించిపోతుండేవాడు.


ఇలా ఒరిస్సా మంత్రతంత్రాల సాధనవల్ల క్రమేణా ఇతను చిక్కిశల్యమై  అస్థిపంజరంలా తయారయ్యాడు.కాని చాలా ఆనందంగా ఉల్లాసంగాఉండేవాడు.మంచి బట్టలు వేసుకొని సెంటు పూసుకొని ఎప్పుడు చూసినా జల్సాగా తిరిగేవాడు.ఒకరోజు తన స్నేహితునితో కలిసి మోటారుసైకిలు మీద దగ్గిరిలో ఉన్న 'బెరహంపూర్' అనే ఊరికి పోతుండగా ఎవరో విసిరేసినట్టు ఉన్నట్టుండి మోటారు సైకిల్ ఎగిరి రోడ్డు పక్కనపడి ఇతడు, ఇతని స్నేహితుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. తరువాత ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తె అతనిగదిలో ఒక మంచి జీవకళగా ఉన్న ఊర్వశి విగ్రహం పూజలో ఉంది.

అతను కంసాలి కులానికి చెందినవాడు కనుక తానే విగ్రహాన్ని తయారుచేసుకొని ఎవరి దగ్గరో ఈమంత్రాన్ని నేర్చుకొని ఈ సాధన చేసేవాడు. ఆ ఇంటిలో ఏమి జరిగి ఉంటుందో నేను వ్రాయను.మీ ఊహకే వదలి వేస్తున్నాను. ఇటువంటి సాధనలు ఎంతమాత్రం మంచివి కావు. అప్సరసల మీద మోజుతో కట్టుకున్న భార్యను బలిచేసుకునే ఇలాంటి మూర్ఖులు ఉంటారు. పరాయిఆడదాని మోజులో భార్యను అన్యాయం చేసేవాళ్ళు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నట్టే వీళ్ళూఉంటారు.

తంత్రం లౌకిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. పారమార్థిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. అది ఒక బలీయమైన శక్తి. దానిని వాడుకోవటం మన విచక్షణను బట్టి ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు అనుభవించవలసివస్తుంది.గుంటూరుకు చెందిన ఒక మాంత్రికుడు ఈ మధ్యనే కొండవీటికొండల్లో ఉన్న నిధులమీద మోజుతో జరిగిన ప్రయోగాలలో కేరళమాంత్రికులు చేసిన ఎదురు ప్రయోగంలో మరణించాడు. ఇది జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుందేమో. 

చాలామంది నమ్మక పోవచ్చు కాని ఇది నిజంగా జరిగింది. ఆయన చేసిన మహత్యాలు బాహాటంగా చూచినవారు చాలామంది ఉన్నారు.మా ఇంటి పక్కనే ఉన్న ఆయన స్నేహితుని ఇంటికి చాలాసార్లు వచ్చేవాడు. తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫెన్ ఆయన ఆగమంటే ఆగిపోయేది. చూస్తే కరెంటు బాగానే ఉండేది. మళ్ళీ తిరగమంటే తిరగడం మొదలు పెట్టేది. ఈ మిరకిల్ ను ఆయన్ను చాలెంజ్ చేసిన నాస్తికుల ఎదుట కూడా ప్రయోగించి చూపించాడు.వాళ్ళు బిత్తరపోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన దేవీ ఉపాసకుడు అయి ఉండి కూడా ఇటువంటి కార్యకలాపాలలో తలదూర్చి అనవసరంగా మరణాన్ని కొనితెచ్చుకున్నాడు.

ఈయనా,ప్రస్తుతం స్వాములవారైన ఇంకోకాయనా స్నేహితులు. వీరిద్దరూ  కలిసి ఇలాంటి కొన్నిశక్తుల సాధనకు క్షుద్రపూజలు చేసి కోళ్ళు బలి ఇచ్చేవారు. తర్వాత కొన్నాళ్ళకి ఈ రెండోవ్యక్తీ (ప్రస్తుతం స్వామీజీ అవతారం ఎత్తాడు)ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి దర్శనానికి వెళితే అమ్మ ఇతన్ని చూస్తూనే 'ఎందుకురా ఆ మూగజీవాల ఉసురు తీస్తారు మీరు?' అని ప్రశ్నించింది.ఆయనతో వచ్చినవారికీ చుట్టుపక్కల ఉన్నవారికీ ఈ మాటలు అర్ధం కాలేదు.బహుశా ఆయనక్కూడా అర్ధం అయ్యాయో లేదో తెలియదు.ఎందుకంటే ఆయనకు ఈ మహిమల పిచ్చి ఇప్పటికీ తగ్గలేదు మరి. ఏం చేస్తాం ఎవరి ఖర్మ వారనుభవించక తప్పదు కదా?
read more " కామ్య కర్మలు-తంత్ర విద్య "

10, జులై 2009, శుక్రవారం

గ్రహాలు-వారాలు

మనకున్న ఏడు వారాలు ఏడు గ్రహాల నుంచి వచ్చాయని చాలామందికి తెలుసు.కొంత మందికి తెలియక పోవచ్చు. అవి ఎలా వచ్చాయో తెలుసుకుందామా? ఆది వారం తరువాత సోమ వారమే ఎందుకు రావాలి. ఏ శుక్ర వారమోరావచ్చుగా? అని అనుమానం రావటం సహజం.

హేతు వాదులకు అన్నీ హేతువులు కావాలి. కాని వారి వాదనలోహేతువు ఎంతవరకు ఉందొ మాత్రం వారు చూచుకోరు. జ్యోతిషం పూర్తిగా లాజిక్ మీద ఆధారపడి ఉన్న శాస్త్రం. ఇందులోని ప్రతి దానికీ లాజిక్ ఉంది. అసలు Astrology అంటేనే Logic of the Astral Bodies అని అర్థం. వారాలలోఉన్న లాజిక్ చూద్దామా?

గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చెయ్యటానికి ఇన్ని సైడీరియల్ రోజులు పడుతుంది.
Saturn - 10759.22
Jupiter- 4332.58
Mars-686.98
Sun(Earth)-365.26
Venus-224.70
Mercury-87.97
Moon-27.32

ఇంకో విధం గా చెప్పాలంటే ఒక రాశిని దాటడానికి
శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు,
గురువు ఒక సంవత్సరం,
కుజుడు దాదాపు నలభై అయిదు రోజులు,
సూర్యుడు ముప్పై రోజులు,
శుక్రుడు ఇరవై అయిదు రోజులు,
బుధుడు పదిహేను నుంచి ఇరవై రోజులు,
చంద్రుడు రెండున్నర రోజులు తీసుకుంటారు.

ఇది డిసేన్డింగ్ ఆర్డర్ లో గ్రహాల పరిభ్రమణ కాలం.

ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు. రవి గ్రహరాజు కనుక గ్రహాలన్నీ ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నవి. కనుక ఆదివారం నాడు మొదటి గంట రవి హోర అనుకుంటే ( హోర అంటే hour ) రెండవది గ్రహాల descending order లో దాని తరువాత శుక్ర హోరఅవుతుంది. ఇలా ఏడు గ్రహాలు x3 ఆవృత్తులు =21 గంటలు అయి పోతాయి. మిగిలిన మూడు గంటలలో రవి, శుక్ర, బుధ హోరలు గడిచి, మర్నాడు సూర్యోదయానికి చంద్ర హోర మొదలు అవుతుంది. కనుక రెండవ రోజు సోమ వారంఅవుతుంది.

మళ్ళీ ఇదే లెక్క వేస్తె మూడో రోజు ఉదయానికి కుజ హోర, తరువాతరోజున బుధ హోర, ఇలా గురుహోర, శుక్ర హోర, శని హోర అయ్యి మళ్ళీ ఆదివారానికి సూర్యోదయ కాలంలో రవి హోర ఉదయిస్తుంది. కనుకవారాల వరుస ఆది, సోమ, మంగళ...ఇలా వచ్చింది. దీని వెనుక ఒక లాజిక్ ఉంది. ఒక పొందిక అమరిక ఉన్నాయి. వెరసి ఇదంతా గ్రహముల గమన వేగాన్ని బట్టి స్థిరపరుచ బడిన ఒక పద్దతి. పధ్ధతి లేకుండా ఉండటం కన్నా పధ్ధతి గాఉండటం మంచిది అని ఎవరైనా ఒప్పుకుంటారు కదా. నాస్తికులు హేతువాదులు సోమవారం ఆఫీసులకు పోకుండా ఇదిఆదివారం ఎందుకు కాకూడదు అని వితండ వాదం చేస్తూ ఇంట్లోనే కూచోకండి. ఉద్యోగాలు ఊడతాయి.

ఇక్కడ ఒక అనుమానం రావాలి. అసలు మొదటి రోజు ఆదివారం అని ఎట్లా గుర్తించడం? ఈ రోజు సూర్యోదయానికి ఉన్నది రవి హోరనే అని ఎలా గుర్తించటం? అలా లెక్క మొదలు పెట్టటానికి ఆధారం ఏమిటి? నేను ప్రతిదానికీ సమాధానం చెప్పను. మీరే ఊహించి నాకు మీ అభిప్రాయం చెప్పండి. తరువాత దీనికి ఆధారం ఏమిటో నేను చెబుతాను.

సూర్యుడు భ్రమణం చెయ్యటం ఏమిటి? అది గ్రహం కాదు గదా అని కొందరికి అనుమానం వస్తుంది. మనం భూమి మీద ఉన్నాము. సూర్యుని మీద లేము. మన భూమి మీది గాలిని పీల్చి మనం బతుకుతున్నాం. సూర్యుని మీది గాలిని పీల్చి కాదు. కనుక అది భ్రమ అయినా సూర్యుడు మన చుట్టూ తిరగటమే మనకు సత్యం. దీన్నే అప్పరెంట్ మోషన్ ఆఫ్ ప్లానేట్స్అంటారు. కనుక భూమి తిరుగుతున్నప్పటికీ మనం సూర్యుడే తిరుగు తున్నట్లు తీసుకోవాలి. కారణం మనం ఉన్నభూమే మనకు సెంటర్ కనుక.

మనం సినిమా చూస్తున్నపుడు అది తెరమీద బొమ్మల ప్రొజెక్షన్ మాత్రమే, నిజానికి అక్కడ ఏమీ లేదు అని అనుకుంటే సినిమా ఎంజాయ్ చెయ్యలేము. కనుక అక్కడ నిజానికి ఏమీ లేకపోయినా ఎలాగైతే ఆ కథలో ఇన్వాల్వ్ అవుతున్నామో అలాగే నిజానికి భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా, మనకు కనిపిస్తున్నది నిజమే అని ప్రస్తుతానికి అనుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించేదే మనకు ప్రస్తుతానికి నిజం. అసలు నిజం ఏదైనా కావచ్చు.

నిజానికి సూర్యుడు కూడా స్థిరం గా లేడు. ఆయన కూడా ఒక గాలక్టిక్ సెంటర్ చుట్టూగ్రహాలతో సహా భ్రమిస్తున్నాడు. ఈ వివరాలన్నీ వేదములలో చక్కగా ఉన్నాయి. తెల్సుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. అర్థం చేసుకుంటే అర్థం అవుతాయి.

తెలిసో తెలియకో ప్రపంచంలో అందరూ జ్యోతిష శాస్త్రం తయారు చేసి ఇచ్చిన ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. హేతువాదులు నాస్తికులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు (ఒక పక్క జ్యోతిష్యాన్ని విమర్శిస్తూనే). ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వరుసలో వారాలు వస్తాయి. దీన్ని లోకానికి అందించినది మన భారతీయులే అనేది నేడు చాలామందికి తెలీదు.

ఇంత వరకూ థియరీ పార్టు బాగానే ఉంది. మరి దీని ఉపయోగం ఏమిటి? ఆస్ట్రానమీ వల్ల గ్రహ గతులు తెలుస్తాయి. దాని ఉపయోగం ఏమిటి? అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేదే ఆస్ట్రాలజీ. అంటే జ్యోతిషం అనేది ఖగోళ గణిత విజ్ఞానం యొక్క ప్రాక్టికల్ పార్టు అన్నమాట.

ఈ గ్రహ హోరల ఉపయోగం ప్రశ్న శాస్త్రం లో ఉంది. ప్రశ్న శాస్త్రం అనేది రోజు వారీ సమస్యలకు చక్కగా ఉపయోగ పడేవిధానం. దీనికి జాతకుని జనన సమయం తో పని లేదు. మన మనసులో ఏదైనా సమస్య గురించి సందేహంతలెత్తినపుడు ఉన్న గ్రహ స్థితి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఇదొక అద్భుత మైన విధానం.

ఇందులో లగ్నాన్నిగుర్తించ దానికి హోరా జ్ఞానం ఉపయోగ పడుతుంది. అంటే ప్రశ్న అడిగి నపుడు జరుగుతున్న హోరను (Planetary hour)బట్టి ఆగ్రహం ఉన్న రాశిని లగ్నం గా తీసుకోవటం జరుగుతుంది. ఉదాహరణకు ప్రశ్న అడిగినపుడు శుక్ర హోర జరుగుతున్నది అనుకుందాం. అప్పుడు శుక్రుడు మీన రాశిలో ఉన్నాడు అనుకుందాం. కనుక మీనం లగ్నం గా తీసుకొని లెక్క వేసి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం జరుగుతుంది.

ఇది అంజన విద్య లాంటి అద్భుత విధానం. జాతకం అవసరం లేకుండానే చక్కని ఫలితాలు తెలుసుకోవచ్చు. పూర్వ కాలంలో దైవజ్ఞులు ఏ జాతకాన్ని చూడకుండానే అడిగిన ప్రశ్నకు టక్కున జవాబు చెప్పేవారు. అవి దాదాపు
90% నిజం అయ్యేవి. దానికి అనుబంధం గా ఈ హోరా జ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రశ్న శాస్త్రం గురించి త్వరలోవ్రాస్తాను.
read more " గ్రహాలు-వారాలు "

8, జులై 2009, బుధవారం

కాళీ తత్త్వం-5


కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.

ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల్ కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసంనురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.

'సైషాప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే' అంటుంది దేవీ సప్తశతి.అంటే ఆ దేవి ప్రసన్నురాలై వరదాయిని అయినపుడు మానవుడు మోక్షాన్ని పొందగలడు.దుర్లభమైన మోక్షమే సాధ్యమైనపుడు ప్రాపంచిక కోరికలు తీరవా?చాలా తేలికగా తీరుతాయి.కోహినూర్ వజ్రమే చేతిలో ఉన్నవానికి గులకరాయి దొరకదా? ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.

వివేకానందస్వామి ఇంకా నరెంద్రునిగా ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకు ధ్యానంలో ఒక దర్శనం కలిగింది. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్ల వయసు ఉండవచ్చు. ఆయనకు కాళీమంత్ర బీజాక్షరాలు జ్యోతుల మాదిరి వెలుగుతూ దర్శనం ఇచ్చాయి.సామాన్యంగా ఇటువంటి స్థితిలో కుండలినీ ప్రబోధం కలుగుతుంది.వెన్నెముక క్రింద భాగంలో కరెంటుషాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.అలాగే వెన్నెముక గుండా ఏదో జరజర పాకినట్టు అనిపిస్తుంది.స్వామి సత్యానంద సరస్వతికి మొదటిసారి కుండలిని ప్రబోధం కలిగినపుడు తన కాళ్ళ క్రింద భూమి చీలిపోయి తానేక్కడికో పాతాళంలోకి పడిపోతున్నట్లు అనుభవం కలిగింది.

కొందరికి ఇతరదర్శనాలు కూడా కలుగ వచ్చు.మరింత అదృష్టవన్తులకు కాళీమాత నిజదర్శనం కలుగవచ్చు.అది ఒక్కొక్కరి కర్మ పరిపక్వతను బట్టి, మానసిక పవిత్రతను బట్టి ఉంటుంది. కాళీమాత దర్శనం కలిగితే అది తట్టుకొవటానికి చాలా చాలా సాధన కావాలి. అది అంత తేలికైన విషయం కానే కాదు.

అసలు దేవతాదర్శనాలు అంటే ఏమిటి?మనకు సంబంధించని, ఎంతో అతీతమైన స్పందనా భూమికలలో (higher vibratory levels) ఉన్న శక్తులు రూపం ధరించి మన మనోభూమికకు దిగి వచ్చి కనిపించటమే.ఇలా జరిగినప్పుడు ఆయా స్పందనలను (vibrations) తట్టుకోగల శక్తి సాధకునికి ఉండాలి.అది లేనపుడు ఏమి జరుగుతుంది? 

ఒక ఉదాహరణతో చెప్తాను.ఒక చిన్నబల్బులోకి లక్ష వోల్టుల కరెంటు ప్రవహిస్తే ఏమి జరుగుతుంది?బల్బు పేలిపోతుంది.అలాగే ఇటువంటి దర్శనాలు తట్టుకునే శక్తి లేకుంటే బ్రెయిన్ సర్క్యూట్స్ ఫెయిల్ అయి పిచ్చెక్కుతుంది.లేదా ఆ షాక్ తట్టుకోలేక గుండె ఆగిపోతుంది.కాబట్టి దేవతాదర్శనాలు అందులోనూ కాళీమాత వంటి శక్తి దర్శనాలు అంత త్వరగా కలుగవు.దానికి ఆయా దేవతల అనుగ్రహమే కారణం.వారు కనిపించలేక కాదు.కనిపిస్తే సాధకుడు తట్టుకోలేడని వారికి తెలుసు.అందుకే సాధకునికి తపస్సు ద్వారా తగిన పరిపక్వత వచ్చినపుడే వారి దర్శనం కలుగుతుంది.

ఇంకొకసారి వివేకానందస్వామికి ధ్యానంలో బ్రహ్మాండమైన త్రికోణాకారం బంగారురంగులో వెలుగుతూ కనిపించింది.ఈ విషయాన్ని ఆయన శ్రీరామకృష్ణునికి చెబితే ఆయన సంతోషించి 'నీకు ఈరోజు బ్రహ్మయోని దర్శనం కలిగింది.నేను తంత్రసాధనలు చేసేరోజులలో ఆదర్శనం నాకూ కలిగింది.కాని దానినుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు లోకాలు జన్మిస్తున్నట్లు కూడా నేను చూచాను'.అని చెబుతారు. ఆ దర్శనం వివేకానందునికి కలుగలేదు. అంటే అనేక గెలాక్సీలను అనుక్షణం సృష్టి చేస్తున్న కాళీశక్తిని (source of creative power) వారు దర్శించారు. అంతే కాదు, శ్రీ రామకృష్ణునికి కలిగిన దర్శనంలో ఆ ఆద్యాశక్తి వచ్చి తనలోనే కలిసిపోయినట్లు,తానే ఆశక్తిని అన్న అనుభూతి ఆయనకు కలిగింది.

కాళీమాతకు కుండలినీశక్తికి సంబంధం ఉంది.ఏలాగంటే,ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణస్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే అంటే ఫీల్ అవగలిగే శక్తిలేక పోవటమే "నిద్రాణస్థితి" అంటే. కాళీమంత్రసాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.

కాళీమాత మొల చుట్టూ మానవఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వ్రాసినట్లు మన దేవీదేవతల చిత్రాలు అన్నీ గూడార్ధసంకేతాలు.ఆచిత్రాల వెనుక రహస్యమైన అర్థాలు దాగి ఉంటాయి.దీని అర్థం ఇప్పుడు వివరిస్తాను. మనుషులు పని చేసేది చేతులతోనే. చెయ్యి లేనపుడు మానవుడు ఏపనీ చెయ్యలేడు.అనగా క్రియాశక్తికి సంకేతం మానవుని చెయ్యి. ప్రపంచంలోని అందరు మానవుల చేతుల ద్వారా పని చేయిస్తూ తాను మాత్రం కనపడకుండా దాగిఉన్న శక్తి కాళిమాత. 

ఇంకొక గూడార్థం.మానవుడు పూర్తిగా క్రియాకలాపాలు మాని, అనగా తన స్వంత ప్రయత్నాలు మానేయడమే తెగిపోయిన చేతికి సూచన.అంటే రమణమహర్షివలె పూర్తిగా భగవంతుని పైన ఆధారపడి,కర్మను పూర్తిగా విసర్జించినవాడే జగన్మాత ఒడిలోకి చేరుకోగలడు.వేదం కూడా ఇదే చెబుతున్నది. నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేనమృతత్వ మానశు-- మనిషి కర్మవల్ల కాదు, సంతానంవల్ల కాదు, ధనంవల్ల కాదు-- ఒక్క త్యాగంవల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు.ఈవిధంగా,తెగిన చేతులు కర్మత్యాగాన్ని సూచిస్తున్నాయి.కర్మత్యాగియే మాత ఒడికి చేరుకోగలడు.ఇట్టి కర్మత్యాగం అందరికీ సాధ్యం కాదు అని అంటారా? సాధ్యంకాదు కనుకనే కాళీమాత దర్శనం కూడా అందరికీ సాధ్యం కాదు.

మాత మెడలో పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలు. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుత అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు.మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు.కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో వాగర్థా వివ సంపృక్తౌ శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు.అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.

పుర్రెలు శాశ్వతత్వానికి సూచన.ఎందుకని?మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి.మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్షకారాంతమయి.వర్ణమాల అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై sir John woodroffe(Arthur Avalon) ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు The Garland of Letters. అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.

ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి.కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు.మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు వైబ్రేషన్లుగా ఉంటాయి.సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే.కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.

ఈ అక్షరబీజముల మంత్రజపంతో కుండలినీ సాధన చెయ్యటాన్ని రహొయాగం అంటారు.ఇది శ్రీ విద్యోపాసనలో అంతర్యాగ విధానం. అంటే బాహ్యంగా చేసే యాగంవంటిదే లోపల్లోపల చేసే అంతర్యాగ క్రమం.దీనిని చేసేవారిని గుప్తయోగులు/యోగినులు అంటారు.అంటే వీరు సాధనచేసే విధానం బయటకు కనిపించదు.దీనిని వివరిస్తూ లలితాసహస్రనామం"రహో యాగ క్రమారాద్యా రహస్తర్పణ తర్పితా" రహోయాగక్రమంలో ఆరాధించబడేదానవు,రహస్సు అనబడే తర్పణముతో తడిసిన దానవు అయిన నీకు ప్రణామము- అంటూ మాతను ప్రార్ధిస్తుంది.నా గురువుల వద్ద ఇటువంటి రహస్యాలు అనేకం నేర్చుకునే అదృష్టాన్ని మాత నాకు ప్రసాదించింది. 

జ్యోతిషవిజ్ఞానంలో శాక్తేయ పరిహారాలలో శనిభగవానుని పీడలకు కాళీ ఉపాసన చక్కని ఉపాయం.కారణమేమంటే శని భగవానుడు యమునికి సంకేతం.యముడు కాలస్వరూపం.కాళిమాత కాలమునే సంహరించగలదు. కనుక శనిదశలో వచ్చే బాధలకు, ఏలినాటి శని మొదలైన గోచారబాధలకు కాళీ ఉపాసన శ్రేష్టం.కాని దీనికి ముఖ్యంగా నియమనిష్టలతో కూడిన జీవితం, అహంకారంలేని జీవితం గడపవలసి ఉంటుంది.అపుడే మాత అనుగ్రహం త్వరగా కలుగుతుంది.నియమం తప్పితే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

కాళీసాధనా రహస్యాలు చాలా ఉన్నాయి.వాటిని ఇంతకంటే ఇంకా బహిర్గతం చేయటానికి నాకు అనుమతి లేదు.అలా చేసినందువల్ల ప్రయోజనమూ లేదు.నిజంగా సాధన చేయాలని ఆరాటపడేవారికి మాతయే మార్గాన్ని చూపుతుంది.కనుక దశమహావిద్యలలో మొదటిది అయిన కాళీతత్త్వం మీద సీరీస్ ఇంతటితో ముగిస్తున్నాను.
read more " కాళీ తత్త్వం-5 "

6, జులై 2009, సోమవారం

కాళీ తత్త్వం-4

సృష్టి మొత్తం విశ్లేషణ చేస్తే రెండే తత్వాలు కనిపిస్తాయి. ఒకటి శివుడు. రెండు శక్తి. అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది తప్ప ఎంత వెతికినా సృష్టిలో ఏమీ లేదు.మనకు కనిపించే సమస్త ప్రకృతిలో ఇవే నిండి నడుపుతూ ఉన్నాయి.దీనిని ప్రాచీన ఋషులు ఏనాడో కనుగొని ఆరాధించారు.

తంత్రం శివుని మహాకాలుడు అంటుంది, శక్తిని కాళి అంటుంది. ఉజ్జయినిలోని శివునికి మహాకాలేశ్వరుడు అని పేరు. కాళి అనగా కాలము అని అర్థం. కాలానికి అధిపతి కాలేశ్వరుడు. లేక మహాకాలుడు. కాలాధీనం జగత్సర్వం, అంటే సర్వ ప్రపంచం కాలానికి లోబడి నడుస్తున్నది. కాలము అంటే ఏమిటి? మన భూమి వరకూ చూస్తె, సూర్యోదయం సూర్యాస్తమయం తో కలుగుతున్న రోజులు,నెలలు,ఋతువులు,సంవత్సరాలు వెరసి కాలం ముందుకు నడుస్తూ మానవుని ఆయుస్సు నశిస్తూ ఉంటుంది.ఇదే కాలం. 

భగవత్ గీతలో భగవంతుడు 'కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవ్రుద్దో' అంటూ లోకాన్ని నాశనం చేసే కాలాన్ని నేనే అంటాడు. ఆ భయంకర విశ్వరూపాన్ని చూడలేక భయభ్రాన్తుడై అర్జునుడు ఆ రూపాన్ని ఉపసంహరించి ఎప్పటిలాగే సుమనోహరమైన కృష్ణరూపంలో దర్శనం ఇమ్మని వేడుకుంటాడు.తెలిసిన వారు కాళియే కృష్ణుడు అని అంటారు.మా ఆమ్మగారు కూడా ఇదే చెప్పే వారు.రాజరాజేశ్వరి,శ్రీరాముడు ఒకటే అని కాళి కృష్ణుడూ ఒకటే అని అనేవారు.

కాని ఇంకొంచం లోతుగా పరిశీలిద్దాం. సూర్యోదయం సూర్యాస్తమయం ఇదేనా కాలం అంటే. ఒక వ్యక్తిని ఎండ చొరబడని, రాత్రో పగలో తెలియని ఒక గదిలో ఉంచితే అతనికి కాలం స్తంభించి పోతుందా? బాహ్య ప్రపంచాన్ని నడిపే కాలం అతనికి తెలియదు.కాని తన శరీరంలో జీవ రసాయనిక ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కణాలు మరణించి తిరిగి పుడుతూనే ఉంటాయి. కనుక అతనివరకూ కాలం అతని శరీరంలో నడుస్తూనే ఉంటుంది. దీన్ని బయలాజికల్ క్లాక్ అంటున్నారు. బాహ్య కాల ప్రక్రియకు అంతర కాల ప్రక్రియకు సమన్వయము ఉన్నంత వరకు మనిషి ఆరోగ్యం బాగుంటుంది. దీన్నే ప్రకృతిని అనుసరించే జీవనం అని నేటి యోగాచార్యులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది.

అదలా ఉంచితే, మీ ఊహా శక్తికి కొంత పని చెబుతాను. భూమిని వదలి కొన్ని వెల మైళ్ళు అంతరిక్షం లోకి పోయామని ఊహించుకోండి. అక్కడ చుట్టూ చీకటి. శూన్యంలో నిరాధారంగా మనం నిలబడి ఉన్నాం. చుట్టూ మిణుగురు పురుగుల మాదిరిగా నక్షత్రాల గుంపులు. అక్కడ కాలం ఉందా? లేదా? భూమికి సంబంధించిన కాలం అక్కడ లేదు. మనం ఏదైనా గ్రహం మీదకు పొతే, అక్కడ కాల మాన పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాని శూన్యంలో కాలం ఉందా? లేదా? ఉంది అనే చెప్పాలి.

ఏలాగంటే చూచే 'నేను' ఉన్నంత వరకు నావరకు కాలం పని చేస్తూనే ఉంటుంది. నేను అదృశ్యం అయిన స్థితిని చేరితే అక్కడ మాత్రమె కాలం అదృశ్యం అవుతుంది. అందుకే రెండు మూడు గంటలు ఒళ్లుతెలియని ధ్యానం లో ఉండి బయటకు ఒచ్చినపుడు ఒక్క క్షణం మాత్రమె జరిగిన అనుభూతి కలుగుతుంది.ఇప్పుడే కదా ధ్యానానికి కూర్చున్నాను అనిపిస్తుంది. కాని గడియారం చూస్తె గంటలు గడిచి ఉంటాయి.కనుక మొత్తం మీద తేలేదేమంటే,  'నేను' అన్న భావనే కాలం పని చెయ్యటానికి ఆధారం. అది ఉన్నంత వరకూ మనం కాలం అధీనంలో ఉండక తప్పదు.అంటే అందరూ కాళీమాత ఆధీనంలో ఉన్న వాళ్ళమే.వాళ్లు మహాపురుషులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు,అవతార పురుషులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు.కాలానికి అతీతులై ఎవరూ లేరు. అందుకే ఎంతటివారైనా అందరూ జగన్మాత బిడ్డలే అని చెప్పేది. 

శ్రీ రామకృష్ణులు భక్త రాంప్రసాద్ వ్రాసిన ఒక గీతాన్ని చాలా సార్లు పాడేవారు. "అమ్మా. ప్రపంచం అనే సంతలో నీవు గాలిపటాలు ఎగుర వేస్తున్నావు. అవి రంగురంగులుగా ఉండి రకరకాల ఎత్తులలో ఎగురుతూ ఉన్నాయి. లక్షలో ఒకటోరెండో దారం తెంచుకొని గాలికి ఎగిరి కనపడని సీమలకు వెళ్ళి  పోతున్నాయి.వాటిని చూచి నీవు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నావు." అంటూ ఆ గీతం సాగుతుంది. ఈ గీతం మనం అనుకుంటున్న విషయాన్నే మార్మికంగాచెబుతున్నది.

ఈ సృష్టి జగన్మాత లీల. ఇదంతా ఒక ఆట. ఇందులోని కోట్లాది జీవులలో ఒకరో ఇద్దరో మాయా బంధాలు తెంపుకొని ఎగిరిమోక్షాన్ని చేరుకుంటున్నారు. అంటే ఇంద్రియాతీత, మనోతీత, గుణాతీతస్థితికి చేరుతున్నారు.వారే కాలానికి అతీతస్థితికి చేరుతున్నారు.అంటే కాళి వారికి తనదే అయిన ఇంకొక స్థితిని, అనగా నిశ్చల సమాధిలో నిమగ్నుడై త్రిగుణాతీతుడైన శివస్వరూపస్థితిని అనుగ్రహిస్తున్నది.అచలతత్వరూపంగా విరాజిల్లుతున్నది కూడా జగన్మాతయే గనుక ఆమె అనుగ్రహం లేనిదే అట్టి స్థితి ఎవరికీ అందదు.

దేవీసూక్తంలో ఒక అద్భుతమంత్రం ఉంది."అహమేవ స్వయమిదం వదామి జుష్టం. దేవేభిరుత మానుషేభిహి. యంకామయే తముగ్రం కృనోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం" అంటూ సాగే ఈమంత్రార్థం- "నేనే దీన్ని స్వయంగా చెబుతున్నాను. దేవతలుగాని మనుషులుగాని ఎవరిమీద నైతే నేను అనుగ్రహాన్ని చూపుతానో అతనిని ఉన్నతున్ని చేస్తాను,బ్రహ్మజ్ఞానిగా చేస్తాను,ఋషిగా చేస్తాను,చక్కని మేధస్సును ఇస్తాను" అంటుంది ఈ దేవీ సూక్తమంత్రం. కనుక ఏది సాధించాలన్నా శక్తి అనుగ్రహం తప్పనిసరి. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగార్ని ఒకరడిగారు. "అమ్మా ఫలానా వాడికి ఏమి అర్హతలు ఉన్నాయని జీవితంలో అంత ఎత్తుకు ఎదిగాడు?"అని.దానికి అమ్మగారు- "చూడు నాయనా. అర్హతలు ఏమున్నాయో నాకు తెలుసు. ఏది ఇవ్వాలో నాకు తెలుసు" అని జవాబు చెప్పారు.

కాళి ఎందుకు నల్లగా ఉంటుంది? శ్రీ రామకృష్ణులు దీనికి చక్కని వివరణ ఇచ్చారు. నీవు దూరంగా ఉండిచూస్తె ఆమె నల్లగానే కనిపిస్తుంది.సముద్ర జలం దూరంనించి చూస్తె నీలంగా ఆకుపచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది.అదే దగ్గరికిపోయి చేతిలోకి తీసుకొని చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది. అలాగే ఆకాశం నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.కాని మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని దగ్గిరగా చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది.అలాగే కాళీమాత దూరం నుంచి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని దగ్గరగా చూస్తె, ఆమెకు ఏ రంగూ లేదు అని, అన్ని రంగులూ ఆమెవే అనీ తెలుస్తూంది. అంతే కాదు శక్తీ ఆమెయే, శివుడూ ఆమెయే అన్న సత్యజ్ఞానం కలుగుతుంది. సృష్టి లో అనంతమైన ప్రతిదీ నీలంగానో నల్లగానో ఉంటుంది. ఉదాహరణకు ఆకాశం, సముద్రం మొదలైనవి.అంటే ఈ రంగులు అనంతతత్వాన్ని,రహస్యమైన శక్తినీ చూపుతాయి. నేటి భౌతికశాస్త్రం కూడా సృష్టిలో అల్టిమేట్ ఎనర్జీని డార్క్ ఎనేర్జీ అని తలుస్తూ దానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. అందుకనే కాళిమాత నల్లని రంగులో ఉన్నట్లు తంత్రం దర్శించింది. 

కనుక ప్రపంచంలో సర్వ కార్యకలాపాలకు ఆధారమైన క్రియాశక్తి,చర్యాశక్తినే కాళి అని తంత్రం పిలుస్తుంది.ఎక్కడచలనం ఉన్నదో అక్కడ కాళీశక్తి పని చేస్తున్నది.చలనం లేని రాళ్ళు రప్పలలో కూడా అణువు దానిలో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి.కనుక వాటిలో కూడా కాళీశక్తి ఉన్నది.అవీ కాలానికి లోబడే ఉన్నాయి.కనుక బాహ్యంగా,అంతరికంగా కాలానికి కాళీశక్తికి అతీతంగా ఎవరూ లేరు. సృష్టి ఉన్న ప్రతి చోటా కాళీశక్తి పని చేస్తూనే ఉన్నది.

ఒక్క శివుడే కాలానికి అతీతస్థితిలో ఉన్నాడు.ఇంకో విధంగా చెప్పాలంటే కాళియే తన ఇంకొక రూపమైన శివునిగా కాలాతీత స్థితిలో విరాజిల్లుతూ ఉంది.ఆ శివస్థితిని అందుకోవటమే జీవిత పరమార్థం.ఇది అందుకునే వరకూ జీవికి జన్మలు తప్పవు.అది అందుకోవటానికి జగన్మాత కటాక్షం తప్పనిసరి. అందుకే సాక్షాత్ భగవంతుని అవతారమూర్తులైన శ్రీ రామకృష్ణుడు మొదలైన వారు కూడా శక్తిని ఉపాసించారు.

తంత్రంలో ఒక అద్భుత శ్లోకముంది. 'త్వం స్త్రీ త్వం పుమానషి త్వం కుమారా ఉతవా కుమారీ, త్వం జీర్ణో దండేనవంచసి, త్వం జాతో భవసి విశ్వతోముఖ:' "నీవే స్త్రీవి. నీవే పురుషుడవు. నీవే కుమారునివి. నీవే కుమారివి. నీవే జీర్ణ దండముతో నడుస్తున్నావు. నీవే తిరిగిపుట్టి విశ్వతోముఖముగా విస్తరించి ఉన్నావు". 

కాలంలో బ్రతుకుతున్న జీవులు ఏది సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పకుండా కావలసి ఉంటుంది.చివరికి కాలాన్ని అధిగమించి మోక్షాన్ని సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే జగన్మాతను భుక్తి ముక్తి ప్రదాయిని అని ప్రార్దిస్తాం.
read more " కాళీ తత్త్వం-4 "

2, జులై 2009, గురువారం

జ్యోతిషం సైన్సు కాదు

జ్యోతిషం ఒక శాస్త్రం కాదు అని వాదించే అర్భకులు ఎందఱో నేడు కనిపిస్తారు. ఆయుర్వేదం, హోమియోలు కూడా సైన్సు కాదు అని వాదించేవారు కోకొల్లలుగా ఉన్నారు. సరే అవి వైద్య శాస్త్రాలు వాటి గురించి తరువాత వ్రాస్తాను. ప్రస్తుతానికి జ్యోతిషం గురించి మాత్రమె మాట్లాడుకుందాం. నాకు న్యూక్లియర్ సైన్సు తెలియదు కాబట్టిఅది సైన్సు కాదు అని నేను వాదిస్తే అది నా అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటమే అవుతుంది. అలాగే శాస్త్రమైనా ఇంతే. జ్యోతిష్యం సైన్సు కాదు. ఇది నేనూ ఒప్పుకుంటాను. వెంటనే తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఇది సైన్సు కాదుసూపర్ సైన్సు. నేటి సైన్సుకు అందని ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. బహుశా ఇంకొక 100 ఏళ్ళుపరిశోధించినా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రహస్యాలను సైన్సు కనుక్కోలేదు.

కారణం తెలుసా? దాదాపు 10000 BC లోనే శాస్త్రం లో మన దేశంలో అద్భుతమైన రీసెర్చి జరిగింది. నాడీ గ్రంధాలుజ్యోతిష్యానికి జరిగిన రీసెర్చిలో పుట్టిన అత్యున్నత సాహిత్యం. అంటే PhD స్థాయి పరిశోధనా ఫలితాలే నాడీగ్రంధాలు. కొన్ని వందల కుటుంబాలు తర తరాలుగా శాస్త్రాన్ని మధించి దీని లోతులు కనుక్కున్నాయి. శాస్త్రమైనాదాన్ని శ్రద్ధగా అభ్యాసం చేస్తే, దాని లోతులు కనిపిస్తాయి. అంతే గాని ఏదో నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నాంగదా అని విమర్శిస్తే మన ప్రాచీన సంపదను మనమే రోడ్డున పెట్టి వేలం వేసుకున్నట్టు ఉంటుంది.
ప్రపంచంలోని ఇతర జాతైనా తన వారసత్వ సంపదని గురించి గర్వం గా చెప్పుకుంటుంది. కాని ప్రపంచం మొత్తం మీద మన సంస్కృతినీ ధర్మాన్నీ శాస్త్రాలనూ సిగ్గు లేకుండా విమర్శించుకునే వాళ్ళం ఒక్క మన భారతీయులే తప్ప ఇంకో జాతి కనిపించదు. ఇది నేను అనే మాట కాదు. ఒక సారి నాకు రైలు ప్రయాణం లో ఒక కెనడియన్ పరిచయంఅయ్యాడు. అతను అన్న మాట ఇది.

అసలు మన ప్రాచీన శాస్త్రాలకు నేటి సైన్సు సర్టిఫికేట్ ఎంత మాత్రం అవసరం లేదు. సైన్సు ఇంకా శైశవం లో ఉంది. మనశరీరాన్ని గురించి మనకు పూర్తిగా ఇంకా తెలీదు అంటె మీరు నమ్ముతారా? నిద్ర ఎందుకు వస్తుందో సైన్సు ఈనాటికీచెప్పలేకపోతున్నది. మెదడు రహస్యాలు సైన్సుకు ఇంకా తెలీదు. లివర్ కు ఉన్న తనను తానె బాగు చేసుకునే శక్తిఎలా వస్తున్నదో సైన్సుకు తెలీదు. జలుబును నివారించటం సైన్సుకు తెలీదు, కేన్సరు కు మందు లేదు, ఎయిడ్సు కుమందు లేదు. మధ్యలో విచిత్రంగా వస్తున్న వైరల్ జ్వరాలు ఎందుకు వస్తున్నవో సైన్సు చెప్ప లేక పోతున్నది. ఇకమరణం ఎందుకు కలుగుతున్నదో సైన్సు చెప్పలేదు. మరణం తరువాత ఏమి జరుగుతుందో అస్సలే తెలీదు.

పుట్టిన తేది, సమయం, ప్రదేశం మూడు వివరాలతో జెర్మనీ లో ఉన్న మనిషి ఒంటి మీద పుట్టు మచ్చలుఎక్కడున్నాయో మనిషి ముఖం చూడకుండా చెప్పగలిగే శాస్త్రం సైన్సు కాకుండా ఎలా పోతుంది? నమ్మ లేకపోతున్నారా? ఇది నిజం గా జరిగింది. ఐదేళ్ళ క్రితం ఇలాగే నెట్ లో ఒక జర్మన్ యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్నాకు మిత్రుడయ్యాడు. ఆయన జ్యోతిష్యం లో బాగా పరిశ్రమ చేసిన వాడు. ఒక సాఫ్ట్ వేరు కూడా వ్రాశాడు. అది నెట్ లోఇప్పటికీ ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు చెప్పటం భావ్యం కాదు కనుక చెప్పటం లేదు.

ఆయన జాతకాన్ని నేను సరదాగా వ్రాశి ఆయనకు మెయిల్ ఇచ్చాను. రెండురోజుల్లో ఆయన, ఆయన సతీ మణిఇద్దరూ మన మతాన్ని, జ్యోతిష్యం వంటి శాస్త్రాలను ఎంతో మెచ్చుకుంటూ నాకు మెయిల్ ఇచ్చారు. ఇంతా చేస్తే నేనువ్రాసిందేమిటి? నేను వ్రాసిన ఆయన జీవిత వివరాలు పూర్తిగా సరిపోయినవి అలా ఉంచితే, ఆయన ఎడమ తొడ మీదతెనేరంగులో మచ్చలు Birth Marks ఉంటాయి అని నేను వ్రాసాను. అది యధా తధం గా నిజం కావటంతో వాళ్లు బిత్తరపోయి ఇన్ని వేల మైళ్ళ దూరంలో నుంచి మీరు విషయాన్ని ఎలా ఊహించ గలిగారు? అని ప్రశ్నల పరంపరకురిపిస్తూ Oh! It is unbelievable. We have heard a lot about India.Now we are direct witnesses to Her great wisdom. Our salutations to your great country and its ancient wisdom!!! అని మెయిల్ఇచ్చారు.

నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకని? అక్కడేదో నేను చెప్పిన విషయం నిజం అయినందుకు కాదు. ఆయనఒంటి మీద పుట్టు మచ్చలు ఎక్కడున్నా ప్రపంచానికి ఒరిగేదీ లేదు తరిగేదీ లేదు. అది నేను చెప్పినందువల్ల ప్రత్యేకంగా జరిగేదీ లేదు. కాని విధం గా చెప్పగల ఒక అద్భుత విజ్ఞానం మన మహర్షులు మనకు అందించారు. వారి యొక్కపరిశ్రమ, తపస్సు, అన్నింటినీ మించి వారి నిస్వార్థత తలపుకు వచ్చి నాకు ఆనందం కలిగింది.

ఎవరు కనిపెట్టారో తెలియని యోగాసనాలకు కూడా పేటెంట్లు తీసుకుని ఆసనం నాది అంటూ వ్యాపారంచేసుకుంటున్న మనకు-- ఎంతెంత అమూల్య విజ్ఞానాన్ని, వారి వారి జీవిత కాల పరిశ్రమనూ కనీసం పేరు కూడాచెప్పకుండా మనకు అందించి వెళ్లి పోయిన వారి నిస్వార్థ జీవితాలకు తేడా స్ఫురించి ప్రాచీన మహర్షులను స్మరించిచేతులెత్తి నమస్కరించాను.

అన్నింటినీ మించి కనీసం ఒక్క విదేశీ కుటుంబాని కైనా మన దేశం యొక్క ప్రాచీన విద్యల యొక్క గొప్ప తనాన్నిరుజువు చేయగలిగాను అన్న ఆత్మ తృప్తి నాకు కలిగింది. ప్రాచీన ఋషుల రక్తం ఇంకా మన నరాల్లో ప్రవహిస్తున్నది అని నాకు ఆనందం కలిగింది. ఇదీ భారతీయ విజ్ఞానం అంటే. అవును జ్యోతిషం సైన్సు కాదు మరి , అది సూపర్ సైన్సు.
read more " జ్యోతిషం సైన్సు కాదు "

30, జూన్ 2009, మంగళవారం

మైకేల్ జాక్సన్ జాతకం


కళా కారులు, లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారు జన్మించే త్రికోణ రాసులు మిథున, తులా, కుంభ రాసులు. వీనిలో ఒకటైన కుంభ రాశిలో మైకేల్ జాక్సన్ జననం జరిగింది. ఆయనే ఒకసారి తన జాతకం చెప్పించుకోడానికి ఒక భారతీయ జ్యోతిష్కునికి తన జనన సమయాన్ని రాత్రి 7.30 ప్రాంతం గా చెప్పాడు. సమయం ప్రకారం వేశిన జాతక చక్రం ఇక్కడ ఇస్తున్నాను


ఈయన శ్రావణ బహుళ పాడ్యమి శుక్రవారం పూర్వాభాద్ర నక్షత్రం ఒకటో పాదం లో రవి హోరలో ధృతి
యోగంలో జన్మించాడు. పూర్ణిమకు దగ్గిరగా జన్మించటం వలన లో ప్రసిద్ది ని పొందాడు. రవి లగ్నానికి సప్తమ స్థానంలో ఉండటం వల్ల తండ్రితో మనస్పర్థలు విరోధం కలిగింది. సప్తమంలో రెండు గ్రహాలు ఉండటం వాటిలో బుధుడు వక్రించి ఉండటంతో రెండు వివాహాలు కలిగాయి. కాని అవి అర్థాంతరంగా పెటాకులయ్యాయి. లగ్నాతిపతి యైన శని దశమంలో ఉండటం మంచి యోగమే కాని అది శత్రు స్థానం కావటం వల్ల తన వృత్తి వల్ల తనకు మంచి పేరు ధనం వచ్చినా అదే చివరకు తనకు శత్రువుగా మారి ప్రాణాంతకం అయింది

తృతీయాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో ఉండి కేతువుతో కలిశి ఉండటం వల్ల acrobatic dance skills కలిగాయి. 4,9 స్థానముల అధిపతి శుక్రుడు 6 ఇంటిలో ఉండుట వల్ల తండ్రితో విరోధం, కుటుంబ జీవితంలో శాంతి లేకుండుట కలిగాయి. అష్టమాదిపతి బుధుడు వక్రించి సప్తమంలో ఉండటంతో వివాహ జీవితం చిద్రం అయింది. నవమంలో గురు రాహువుల కలయికతో తన సుఖమే కాని కొడుకు సుఖం పట్టని తండ్రి సంప్రాప్తం అయ్యాడు.

చిన్న తనంలోనే పాటలు పాడటంలో ప్రతిభ కనపరిచాడు. ఇది త్రుతీయంలో కేతు కుజుల వల్ల కలిగింది. 14 ఏళ్ళ నుంచి మొదలైన శని మహర్దశ ఈయన జీవితాన్ని మలుపులు తిప్పింది. అక్కడ నుంచి తనకు 33 ఏళ్ళు వచ్చే వరకు అంటే 1991 వరకు ఎన్నో అవార్డులు సన్మానాలు పొందాడు. ఊహించనంత ధనం సంపాదించాడు. జనవరి 1984 లో ఒక ప్రదర్శన ఇస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన జుట్టు, తల కాలిపోయాయి. అప్పుడు శనిలో/చంద్రునిలో/రాహువు జరుగుతున్నది. 1986-91 జరిగిన శని/రాహు, గురు అన్తర్దశలలొ అనేక అపవాదులు నిందలు కోర్టు కేసులు ఎదుర్కున్నాడు.

లగ్నం లో పూర్ణ చంద్రుడు ఉండటం వల్ల మంచి కళాత్మకమైన మనసు వచ్చింది. కాని బుధుని వక్ర స్థితి వల్ల పితృ కారక గ్రహం రవి తో కూడా సప్తమం నుంచి లగ్నాన్ని చూస్తుండటం వల్ల చైల్డ్ అబ్యూస్ కు గురి అయ్యాడు. చిన్న తనంలో తండ్రి పెట్టిన భయం అతన్ని చివరి వరకూ వెంటాడింది. పీడ కలలు అతన్ని వెంటాడేవి. ఇదంతా ఈ గ్రహ స్థితి వల్లనే కలిగింది. చంద్రుడు బాల్యానికి సహజ కారకుడు. అదే చంద్రుడు ఆరవ ఇంటి ఆధిపత్యం వల్ల తన సొంత ఆలోచనలతోనే తన రోగాలను కొని తెచ్చుకున్నాడు.

పన్నెండవ ఇంటిపైన శని దృష్టి తో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు లోనయ్యాడు. దానికి తోడూ బిగ్ నోస్ అంటూ తండ్రి వెక్కిరింపులు, నల్ల చర్మం అంటూ తెల్ల వాళ్ల వేధింపులు ఇవి అన్నీ కలిశి అతనిలో చిన్న తనంలోనే మానసిక సంఘర్షణ కలిగించాయి. దీని ప్రభావం చివరి వరకూ అతన్ని వెంటాడింది. చర్మం రంగు తెల్లగా మార్చుకోవాలని బ్లీచింగ్ చేయించుకుని అది వికటించి విటిలిగో అనే బొల్లి సంప్రాప్తించింది. నీగ్రో కవళికలు మార్చుకోవాలని ముఖానికి ఎన్నో సర్జరీలు చేయించుకుని కళ గల ముఖాన్ని చివరికి చివరికి దయ్యపు ముఖం గా మార్చుకున్నాడు. నాకు మటుకూ అతను నీగ్రో ముఖంతోనే కళగా ఉన్నట్లు అనిపిస్తాడు. చిన్నతనంలో ఏర్పడిన మానసిక చీలికలు ఎంతగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయో అనడానికి ఇతని జాతకం ఒక ఉదాహరణ.

ధన యోగాలు:

రెండు ధన స్థానం, తొమ్మిది భాగ్య స్థానం, పదకొండు లాభ స్థానం. ఈ మూడింటి కలయిక తో ధన యోగాలు కలుగుతాయి. ఇతని జాతకంలో ద్వితీయ లాభ స్థానాధిపతి గురువు. ఈ గురువు నవమ స్థానంలో రాహువు తో కలిశి ఉన్ననాడు. రాహువు శుక్రుణ్ణి సూచిస్తున్నాడు. అనగా స్టేజి షోలు మొదలైన కళాత్మక ప్రదర్శనల ద్వారా ఇతనికి విపరీత ధన లాభం సూచింప బడుతున్నది. జీవితంలో జరిగింది అదే కదా. తృతీయ స్థానం సంగీతానికి సూచిక. ఇతనికి త్రుతీయంలో కుజుడు స్వస్థానంలో బలంగా ఉంది విపరీత ప్రవర్తనను చూపే కేతువుతో కలిశి ఉన్నాడు. అందుకనే ఇతని సంగీతం, నాట్యం లో పిచ్చి కేకలు, అరుపులు, హటాత్ కదలికలు ఉంటాయి. ఇది కేతు ప్రభావం. కేతువు కుజుని సూచిస్తున్నాడు. కనుక తృతీయం డబల్ కుజ ఎఫెక్ట్ తో అతి బలవత్తరం గా మారింది. వీరి ద్రుష్టి భాగ్య స్థానం లో గల గురువు మీద ఉంది. కనుక సంగీతం, నాట్యం, ప్రదర్శనలతో ధన యోగం కలిగింది.

రోగాలు-స్వయం క్రుతాపరాధాలు:
1980 నుంచి ఈయనకు శ్వేత కుష్టు అని పిలువబడే బొల్లి వచ్చింది. అప్పుడు శనిలో శుక్ర అంతర్దశ జరిగింది. శని శుక్రులు యోగ కారకులైతే జాతకంలో శని/శుక్ర దశలో రాజును కూడా బిచ్చ గాన్ని చేస్తారని ఉత్తర కాలామృతం లో కాళిదాసు చెప్పే ఉన్నాడు. దాదాపు అదే ఈయనకు జరిగింది. ఎంత డబ్బు ఉండి కూడా చర్మ వ్యాధి తగ్గే మార్గం కనిపించలేదు. నల్ల చర్మాన్ని రంగు మార్చుకోటానికి ఈయనే బ్లీచింగ్ చేయించుకున్నాడని అంటారు.

అది నిజమే అని జాతకం చెబుతున్నది. ఎలా? శని/శుక్ర దశలో ఇది జరిగింది. శని లగ్నాధిపతి, దశమంలో ఉన్నాడు. అంటే తన సొంత చర్యలను చూపిస్తున్నాడు. అది కూడా వృత్తి కోసం అని తెలుస్తున్నది. ఇక శుక్రుడు సౌందర్యానికి కారకుడు. రోగ స్థానమైన ఆరవ ఇంటిలో ఉన్నాడు. ఇదంతా కలిపి చూస్తె తెలుస్తున్నది? వృత్తి పరమైన ఆశల వల్ల, తన సొంత ఆలోచనతోనే, నలుగురిలో ఇంకా అందంగా కనిపించాలన్న తపనతో, సౌందర్యం కోసం రోగం తెచ్చుకున్నాడు అని స్పష్టం గా జ్యోతిషం చెబుతున్నది. కనుక ఇది స్వయంక్రుతాపరాధమే.

1993 కల్లా అతను మత్తు మందులకు పెయిన్ కిల్లర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. అష్టమాదిపతి గా బుధుడు వక్రించి సప్తమంలో ఉండటం చూడవచ్చు. ఇక్కడి నుంచే ఈయన ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. వక్ర బుద్ది( బుధుని వక్ర స్థితి) వల్ల అనగా సరియగు ఆలోచన లేని స్థితి వల్ల పిచ్చి పిచ్చి మందులు వాడి చేజేతులా చావు కొని తెచ్చుకోవటం ( ఆరోగ్య కారకుడగు రవి మారక స్థానంలో ఉండటం) జాతకంలో స్పష్టం గా చూడ వచ్చు. అప్పుడు శని మహర్దశ అంతమై సరిగా బుధ మహర్దశ మొదలైంది.

బుధుడు సప్తమ స్థానంలో ఉండటంతో అపుడే ఈయనకు వివాహం జరిగింది. కాని రెండేళ్ళు తిరగకుండానే 1996 లో విడాకులు తీసుకుని విడిపోయారు. అపుడు సరిగా బుదునిలో/ శుక్రునిలో/కుజ దశ జరిగింది. కళత్ర కారకుడైన శుక్రుడు బుధునికి 12 స్థానంలో ఉండటం అది లగ్నాత్ గొడవలు చిక్కులు ఇచ్చే షష్ఠ స్థానం కావటం శుక్రుని మీద కుజ దృష్టి ఉండటం చూడ వచ్చు. ఇవన్నీ కలిశి ఆయా దశలలో మొదటి పెళ్లి పెటాకులైంది. తిరిగి 1997 లో రెండవ పెళ్లి తన నర్సుతోనే జరిగింది. శుక్రుని మీద కుజ దృష్టి, సప్తమంలో రెండు గ్రహాలు ఇత్యాది కారణాల వల్ల రెండవ వివాహం బుధ/శుక్ర/బుధ దశలో జరిగింది. 1999 లో ఇది కూడా విడాకుల పాలైంది. ఇప్పుడు జరిగిన బుధ/చంద్ర దశలో ఇతను చాలా దాన ధర్మాలు చేసాడు. కారణం చంద్ర బుదుల సమ సప్తకం.

2003-07 మధ్యలో చిన్న పిల్లలతో లైంగిక కార్య కలాపాలలో పాల్గొన్నాడని అనేక కోర్టు కేసులు ఎదుర్కున్నాడు. కాని అవి రుజువు కాలేదు. అప్పుడు బుధ/గురు, శని దశలు జరిగాయి. బుధుడు జ్యోతిషంలో చిన్న పిల్లలకు కారకుడని అందరికీ తెలిసిందే. గురువు రాహువుతో కలిశి ఉండటం వల్ల అపవాదులు, నమ్మిన వారి మోసం, అప కీర్తి కలిగాయి. బుధుని పైన శని దృష్టి వల్ల ఇదంతా వృత్తి పరమైన అసూయ వల్ల పెట్టిన కేసులు అని తెలుస్తున్నది. ఇదే సమయంలో ఈయన డ్రగ్స్ కు, పెయిన్ కిల్లర్స్ కు బాగా అలవాటు పడ్డాడు.

25-6-2009 1-14 to 1.30 PM మధ్యలో గుండె పని చెయ్యక పోవటం వల్ల చని పోయినట్టు చెబుతున్నారు. సమయంలో కేతు/శుక్ర/రవి దశ జరుగుతున్నది. రాహు కేతువులు గండాత స్థితిలో ఉండుట గమనించాలి. కేతువు ఆయుస్తానంలో గండాంత స్థితిలో ఉండుట వల్ల అయుస్సుకు గండం ఏర్పడింది. శుక్రుడు రోగ స్థానమైన షష్ఠం లో ఉన్నాడు. అదీ కూడా సౌందర్య కారకుడుగా ఉన్నాడు. రవి మారక స్థానమైన సప్తమంలో ఉన్నాడు. గుండె కు కారకుడు. కనుక గ్రహాల కాంబినేషన్ ప్రకారం సౌందర్య పోషణ కోసం పిచ్చి సర్జరీలు చేయించుకొని, అనవసర మందులు అతి మోతాదులో వాడి దాని దుష్ఫలితాల వల్ల అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడని జాతకం ద్వారా తెలుస్తున్నది. మరణ సమయానికి చంద్ర లగ్నాత్ శని మారక స్థానమైన సప్తమంలో ఉండటం చూడ వచ్చు.

ఫలదీపికాది గ్రంధాల ప్రకారం మరణ కారణాన్ని అష్టమ స్థానం నుంచి చూడాలి. ఈయన జాతకంలో అష్టమం ఖాళీ గా ఉంది. ఎవరి దృష్టీ లేదు. కాని ఒకవైపు రవి బుదుల చేత ఇంకొక వైపు గురు రాహువుల చేత అర్గలం కలిగింది. పాపుల సహవాసి యైన బుధుడు పాపి అవుతాడు. కనుక రవి బుధులు పాపులు. ఇక గురువు సుభ గ్రహం అయినప్పటికీ రాహువు పాపి. కనుక ఇతని అష్టమ స్థానం నాలుగు గ్రహాల ప్రభావానికి లోనయింది. వీటిలో, గురువు= లివర్ చెడి పోవటం, జీర్ణక్రియ చెడిపోవటం, తిన్నది అరుగక పోవటం, పస్తులుండటం సూచిస్తుంది. రాహువు=అనవసర పిచ్చి మందులు అతిగా వాడటం చూపుతుంది. ఇక రవి= గుండె జబ్బులు,రక్త దోషాలు, ఆరోగ్య భంగం సూచన. వక్ర బుధుడు= సరియగు ఆలోచన కొరవడటం, నరాల జబ్బులు, అసాధ్య చర్మ రోగాలు చూపుతుంది. ఇవన్నీ క్రోడీకరించి చూడండి. ఆయన మరణం ఎందువల్ల జరిగిందో చక్కగా కనిపిస్తుంది. చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది.

ఇంకొంచం లోతుగా పరిశీలిద్దామా? లగ్న చంద్రుల నుండి ఇరవై రెండవ ద్రేక్కాణం మృత్యు సూచకం. లగ్నం కుంభం రెండవ ద్రేకానం. కనుక కన్య రెండవ ద్రేక్కాణం లో ఇరవై రెండవ ద్రేక్కాణం ఉంటుంది. అంటే అక్కణ్ణించి అయిదవది అయిన మకరం. ఇది లగ్నాత్ ద్వాదశం. మృత్యు స్థానం. దీని అధిపతి శని తన ఏడవ దృష్టి తో లగ్నాత్ చతుర్తాన్ని (గుండె) చూస్తున్నాడు. కనుక పై కారణాలన్నీ కలిశి గుండె ఆగి మరణించాడు.

చంద్రుడు కుంభం మూడవ ద్రేకానం లో ఉన్నాడు. కనుక కన్య మూడవ ద్రేకానం ఇరవై రెండవ ద్రేక్కాణం అవుతుంది. అంటే అక్కడినుంచి తొమ్మిది అయిన వృషభం అనగా మళ్ళీ ఇందాకటి లగ్నాత్ చతుర్థం అవుతుంది. అంటే మళ్ళీ హృదయం సూచింప బడుతున్నది. కనుక చతుర్ధం( గుండె)+శని(ఆగి పోవటం) వెరసి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మరణం కలిగింది. 

ఇతని జీవితం ఏమైనా, ఈయన్ని ఈయన డాన్సులని కాపీ కొట్టి మన చిరంజీవి, ప్రభు దేవా, లారెన్స్ మొదలైన వారు జీవితం లో బాగా స్థిర పడ్డారు. బహుశా వీరి గురించి ఆయనకు తెలుసో లేదో దేవునికే తెలియాలి.ఒక రకంగా మైకేల్ జాక్సన్ మరణం నేటి యువతకు కనువిప్పు కావాలి. సౌందర్య పోషణకోసం టీ వీ లలో కనిపించే ప్రతి చెత్తనూ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు. బహుళ జాతి కంపెనీలను పోషించ వద్దు. ముఖ్యం గా నేటి ఆడ పిల్లలు దీనిని గుణ పాఠం గా తీసుకోవాలి.

సంతులిత ఆహారం, యోగా వంటి సాంప్రదాయ బద్దమైన వ్యాయామం చేయటాన్ని మించినది లేదు. కాస్మెటిక్స్ వాడకం, కాస్మెటిక్ సర్జరీలు, పెయిన్ కిల్లర్స్ వాడకం, బ్రాడ్ స్పెక్ట్రం ఏంటీ బయోటిక్స్ వాడకం ఎంతటి అనర్థాలను తెచ్చి పెడుతుందో మైకేల్ జాక్సన్ జాతకం ఉదాహరణ. అన్నింటి కన్నా మించి భగవంతుడు మనకు ఇచ్చిన ఆకారాన్ని ఏవేవో సర్జరీలు చేయించుకొని అందం గా మార్చుకోవాలన్న భ్రమ వీడండి. అందం ఆకారంలో లేదు. అది వ్యక్తిత్వం లో ఉంటుంది అన్న సత్యం మరువకండి. అని మైకేల్ జాక్సన్ విషాద కథ లోకానికి చెబుతోంది. వినిపించటం లేదూ?
read more " మైకేల్ జాక్సన్ జాతకం "