“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, జులై 2009, సోమవారం

కాళీ తత్త్వం-4

సృష్టి మొత్తం విశ్లేషణ చేస్తే రెండే తత్వాలు కనిపిస్తాయి. ఒకటి శివుడు. రెండు శక్తి. అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది తప్ప ఎంత వెతికినా సృష్టిలో ఏమీ లేదు.మనకు కనిపించే సమస్త ప్రకృతిలో ఇవే నిండి నడుపుతూ ఉన్నాయి.దీనిని ప్రాచీన ఋషులు ఏనాడో కనుగొని ఆరాధించారు.

తంత్రం శివుని మహాకాలుడు అంటుంది, శక్తిని కాళి అంటుంది. ఉజ్జయినిలోని శివునికి మహాకాలేశ్వరుడు అని పేరు. కాళి అనగా కాలము అని అర్థం. కాలానికి అధిపతి కాలేశ్వరుడు. లేక మహాకాలుడు. కాలాధీనం జగత్సర్వం, అంటే సర్వ ప్రపంచం కాలానికి లోబడి నడుస్తున్నది. కాలము అంటే ఏమిటి? మన భూమి వరకూ చూస్తె, సూర్యోదయం సూర్యాస్తమయం తో కలుగుతున్న రోజులు,నెలలు,ఋతువులు,సంవత్సరాలు వెరసి కాలం ముందుకు నడుస్తూ మానవుని ఆయుస్సు నశిస్తూ ఉంటుంది.ఇదే కాలం. 

భగవత్ గీతలో భగవంతుడు 'కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవ్రుద్దో' అంటూ లోకాన్ని నాశనం చేసే కాలాన్ని నేనే అంటాడు. ఆ భయంకర విశ్వరూపాన్ని చూడలేక భయభ్రాన్తుడై అర్జునుడు ఆ రూపాన్ని ఉపసంహరించి ఎప్పటిలాగే సుమనోహరమైన కృష్ణరూపంలో దర్శనం ఇమ్మని వేడుకుంటాడు.తెలిసిన వారు కాళియే కృష్ణుడు అని అంటారు.మా ఆమ్మగారు కూడా ఇదే చెప్పే వారు.రాజరాజేశ్వరి,శ్రీరాముడు ఒకటే అని కాళి కృష్ణుడూ ఒకటే అని అనేవారు.

కాని ఇంకొంచం లోతుగా పరిశీలిద్దాం. సూర్యోదయం సూర్యాస్తమయం ఇదేనా కాలం అంటే. ఒక వ్యక్తిని ఎండ చొరబడని, రాత్రో పగలో తెలియని ఒక గదిలో ఉంచితే అతనికి కాలం స్తంభించి పోతుందా? బాహ్య ప్రపంచాన్ని నడిపే కాలం అతనికి తెలియదు.కాని తన శరీరంలో జీవ రసాయనిక ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కణాలు మరణించి తిరిగి పుడుతూనే ఉంటాయి. కనుక అతనివరకూ కాలం అతని శరీరంలో నడుస్తూనే ఉంటుంది. దీన్ని బయలాజికల్ క్లాక్ అంటున్నారు. బాహ్య కాల ప్రక్రియకు అంతర కాల ప్రక్రియకు సమన్వయము ఉన్నంత వరకు మనిషి ఆరోగ్యం బాగుంటుంది. దీన్నే ప్రకృతిని అనుసరించే జీవనం అని నేటి యోగాచార్యులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది.

అదలా ఉంచితే, మీ ఊహా శక్తికి కొంత పని చెబుతాను. భూమిని వదలి కొన్ని వెల మైళ్ళు అంతరిక్షం లోకి పోయామని ఊహించుకోండి. అక్కడ చుట్టూ చీకటి. శూన్యంలో నిరాధారంగా మనం నిలబడి ఉన్నాం. చుట్టూ మిణుగురు పురుగుల మాదిరిగా నక్షత్రాల గుంపులు. అక్కడ కాలం ఉందా? లేదా? భూమికి సంబంధించిన కాలం అక్కడ లేదు. మనం ఏదైనా గ్రహం మీదకు పొతే, అక్కడ కాల మాన పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాని శూన్యంలో కాలం ఉందా? లేదా? ఉంది అనే చెప్పాలి.

ఏలాగంటే చూచే 'నేను' ఉన్నంత వరకు నావరకు కాలం పని చేస్తూనే ఉంటుంది. నేను అదృశ్యం అయిన స్థితిని చేరితే అక్కడ మాత్రమె కాలం అదృశ్యం అవుతుంది. అందుకే రెండు మూడు గంటలు ఒళ్లుతెలియని ధ్యానం లో ఉండి బయటకు ఒచ్చినపుడు ఒక్క క్షణం మాత్రమె జరిగిన అనుభూతి కలుగుతుంది.ఇప్పుడే కదా ధ్యానానికి కూర్చున్నాను అనిపిస్తుంది. కాని గడియారం చూస్తె గంటలు గడిచి ఉంటాయి.కనుక మొత్తం మీద తేలేదేమంటే,  'నేను' అన్న భావనే కాలం పని చెయ్యటానికి ఆధారం. అది ఉన్నంత వరకూ మనం కాలం అధీనంలో ఉండక తప్పదు.అంటే అందరూ కాళీమాత ఆధీనంలో ఉన్న వాళ్ళమే.వాళ్లు మహాపురుషులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు,అవతార పురుషులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు.కాలానికి అతీతులై ఎవరూ లేరు. అందుకే ఎంతటివారైనా అందరూ జగన్మాత బిడ్డలే అని చెప్పేది. 

శ్రీ రామకృష్ణులు భక్త రాంప్రసాద్ వ్రాసిన ఒక గీతాన్ని చాలా సార్లు పాడేవారు. "అమ్మా. ప్రపంచం అనే సంతలో నీవు గాలిపటాలు ఎగుర వేస్తున్నావు. అవి రంగురంగులుగా ఉండి రకరకాల ఎత్తులలో ఎగురుతూ ఉన్నాయి. లక్షలో ఒకటోరెండో దారం తెంచుకొని గాలికి ఎగిరి కనపడని సీమలకు వెళ్ళి  పోతున్నాయి.వాటిని చూచి నీవు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నావు." అంటూ ఆ గీతం సాగుతుంది. ఈ గీతం మనం అనుకుంటున్న విషయాన్నే మార్మికంగాచెబుతున్నది.

ఈ సృష్టి జగన్మాత లీల. ఇదంతా ఒక ఆట. ఇందులోని కోట్లాది జీవులలో ఒకరో ఇద్దరో మాయా బంధాలు తెంపుకొని ఎగిరిమోక్షాన్ని చేరుకుంటున్నారు. అంటే ఇంద్రియాతీత, మనోతీత, గుణాతీతస్థితికి చేరుతున్నారు.వారే కాలానికి అతీతస్థితికి చేరుతున్నారు.అంటే కాళి వారికి తనదే అయిన ఇంకొక స్థితిని, అనగా నిశ్చల సమాధిలో నిమగ్నుడై త్రిగుణాతీతుడైన శివస్వరూపస్థితిని అనుగ్రహిస్తున్నది.అచలతత్వరూపంగా విరాజిల్లుతున్నది కూడా జగన్మాతయే గనుక ఆమె అనుగ్రహం లేనిదే అట్టి స్థితి ఎవరికీ అందదు.

దేవీసూక్తంలో ఒక అద్భుతమంత్రం ఉంది."అహమేవ స్వయమిదం వదామి జుష్టం. దేవేభిరుత మానుషేభిహి. యంకామయే తముగ్రం కృనోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం" అంటూ సాగే ఈమంత్రార్థం- "నేనే దీన్ని స్వయంగా చెబుతున్నాను. దేవతలుగాని మనుషులుగాని ఎవరిమీద నైతే నేను అనుగ్రహాన్ని చూపుతానో అతనిని ఉన్నతున్ని చేస్తాను,బ్రహ్మజ్ఞానిగా చేస్తాను,ఋషిగా చేస్తాను,చక్కని మేధస్సును ఇస్తాను" అంటుంది ఈ దేవీ సూక్తమంత్రం. కనుక ఏది సాధించాలన్నా శక్తి అనుగ్రహం తప్పనిసరి. ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగార్ని ఒకరడిగారు. "అమ్మా ఫలానా వాడికి ఏమి అర్హతలు ఉన్నాయని జీవితంలో అంత ఎత్తుకు ఎదిగాడు?"అని.దానికి అమ్మగారు- "చూడు నాయనా. అర్హతలు ఏమున్నాయో నాకు తెలుసు. ఏది ఇవ్వాలో నాకు తెలుసు" అని జవాబు చెప్పారు.

కాళి ఎందుకు నల్లగా ఉంటుంది? శ్రీ రామకృష్ణులు దీనికి చక్కని వివరణ ఇచ్చారు. నీవు దూరంగా ఉండిచూస్తె ఆమె నల్లగానే కనిపిస్తుంది.సముద్ర జలం దూరంనించి చూస్తె నీలంగా ఆకుపచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది.అదే దగ్గరికిపోయి చేతిలోకి తీసుకొని చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది. అలాగే ఆకాశం నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.కాని మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని దగ్గిరగా చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది.అలాగే కాళీమాత దూరం నుంచి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని దగ్గరగా చూస్తె, ఆమెకు ఏ రంగూ లేదు అని, అన్ని రంగులూ ఆమెవే అనీ తెలుస్తూంది. అంతే కాదు శక్తీ ఆమెయే, శివుడూ ఆమెయే అన్న సత్యజ్ఞానం కలుగుతుంది. సృష్టి లో అనంతమైన ప్రతిదీ నీలంగానో నల్లగానో ఉంటుంది. ఉదాహరణకు ఆకాశం, సముద్రం మొదలైనవి.అంటే ఈ రంగులు అనంతతత్వాన్ని,రహస్యమైన శక్తినీ చూపుతాయి. నేటి భౌతికశాస్త్రం కూడా సృష్టిలో అల్టిమేట్ ఎనర్జీని డార్క్ ఎనేర్జీ అని తలుస్తూ దానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. అందుకనే కాళిమాత నల్లని రంగులో ఉన్నట్లు తంత్రం దర్శించింది. 

కనుక ప్రపంచంలో సర్వ కార్యకలాపాలకు ఆధారమైన క్రియాశక్తి,చర్యాశక్తినే కాళి అని తంత్రం పిలుస్తుంది.ఎక్కడచలనం ఉన్నదో అక్కడ కాళీశక్తి పని చేస్తున్నది.చలనం లేని రాళ్ళు రప్పలలో కూడా అణువు దానిలో శక్తులు పనిచేస్తూ ఉన్నాయి.కనుక వాటిలో కూడా కాళీశక్తి ఉన్నది.అవీ కాలానికి లోబడే ఉన్నాయి.కనుక బాహ్యంగా,అంతరికంగా కాలానికి కాళీశక్తికి అతీతంగా ఎవరూ లేరు. సృష్టి ఉన్న ప్రతి చోటా కాళీశక్తి పని చేస్తూనే ఉన్నది.

ఒక్క శివుడే కాలానికి అతీతస్థితిలో ఉన్నాడు.ఇంకో విధంగా చెప్పాలంటే కాళియే తన ఇంకొక రూపమైన శివునిగా కాలాతీత స్థితిలో విరాజిల్లుతూ ఉంది.ఆ శివస్థితిని అందుకోవటమే జీవిత పరమార్థం.ఇది అందుకునే వరకూ జీవికి జన్మలు తప్పవు.అది అందుకోవటానికి జగన్మాత కటాక్షం తప్పనిసరి. అందుకే సాక్షాత్ భగవంతుని అవతారమూర్తులైన శ్రీ రామకృష్ణుడు మొదలైన వారు కూడా శక్తిని ఉపాసించారు.

తంత్రంలో ఒక అద్భుత శ్లోకముంది. 'త్వం స్త్రీ త్వం పుమానషి త్వం కుమారా ఉతవా కుమారీ, త్వం జీర్ణో దండేనవంచసి, త్వం జాతో భవసి విశ్వతోముఖ:' "నీవే స్త్రీవి. నీవే పురుషుడవు. నీవే కుమారునివి. నీవే కుమారివి. నీవే జీర్ణ దండముతో నడుస్తున్నావు. నీవే తిరిగిపుట్టి విశ్వతోముఖముగా విస్తరించి ఉన్నావు". 

కాలంలో బ్రతుకుతున్న జీవులు ఏది సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పకుండా కావలసి ఉంటుంది.చివరికి కాలాన్ని అధిగమించి మోక్షాన్ని సాధించాలన్నా కాళీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే జగన్మాతను భుక్తి ముక్తి ప్రదాయిని అని ప్రార్దిస్తాం.