“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, జులై 2009, సోమవారం

భయాన్ని జయించటం ఎలా?

భయం లేని మనిషి ఉండడు. ఏదో ఒక రకమైన భయం ప్రతి వానిని వెంటాడుతూ ఉంటుంది. భయం లేకపోతే మృత్యు భయం ఉండనే ఉంటుంది. నాకు చావంటే భయం లేదు అని బీరాలు పలికే వారు చివరి దశలో గజ గజా వణికి పోవటం నేను చూచాను. అలాగే, అతి మామూలు మనుషులు అని లోకం దృష్టిలో కనిపించేవాళ్ళు ఇంకో పది నిమిషాల్లో చనిపోతున్నాను అని తెలిసినా, ధైర్యంగా నవ్వుతూ పోవటమూ చూచాను.

భయం పోవటానికి నాకు తెలిసిన ప్రక్రియ చెబుతాను. మనకు భయాన్ని కలిగించే పరిస్థితిని తప్పించుకోవటానికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నం చెయ్యరాదు. పరిస్తితిలోనే ఉండి భయం ఎందుకు కలుగుతున్నది, ఎక్కణ్ణించి వస్తున్నది గమనించాలి. ఒక ఉదాహరణతో చెప్తాను. నాకు చీకటిగా ఉన్న ఇంటిలో ఒక్కడినే ఉండాలి అంటే భయం అనుకుందాం. అటువంటప్పుడు ఎవరినో తోడూ తెచ్చుకోవటం లేదా చుట్టాల ఇంటికిపోయి రాత్రికి అక్కడ పడుకోవటం మొదలైన పనులు చెయ్యరాదు. ఒక్కడే అదే ఇంటిలో ఉండాలి. మనసు పీచు పీచు మంటున్నా మొండిగా ఉండాలి. భయం ఎందుకు, ఎలా, ఎక్కణ్ణించి మనసులో తలెత్తుతున్నదో గమనిస్తూ తనను తానె తరచి చూచుకుంటూ అవసరమైతే రాత్రంతా గడపాలి. ఇలా ఒక్క సారి చెయ్య గలిగితే భయం పటాపంచలౌతుంది. చెయ్యలేకపోతే జీవితాంతం భయం వెంటాడుతూనే ఉంటుంది.

కొందరికి కుక్కలంటే, ఇంకొందరికి చీకటంటే, దయ్యాలంటే, కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే, ఇంకొందరికి ఒంటరిగా బయటకు పోవటం అంటే, కొందరికి స్టేజి మీద ఉపన్యాసం చెప్పాలంటే, ఇంకొందరికి పరీక్షలంటే ఇలా రకరకాల భయాలుంటాయి. వీటన్నిటికీ ఇదొక్కటే మందు. బుద్ధుడు ఆరేళ్ళపాటు ఒంటరిగా సాధన చేసాడు. అప్పుడు అడవులలో ఒక్కడే తిరిగేవాడు. సమయంలో తనలో కలిగిన భయాన్ని గురించి దానిని తాను ఎలా అధిగామించాడనే దాని గురించి తరువాతి వివరం గా చెప్పాడు. అడవిలో రాత్రిపూట ఒంటరిగా తిరిగేటప్పుడు ఒక్కొక్క ప్రదేశం లో ఒళ్ళు జల్లుమని భయం పుడుతుంది. అప్పుడు అదే చోట నిలిచి ఎందుకు భయం కలుగుతున్నది, అసలు మనసులోకి ఎలా ప్రవేశిస్తున్నది, కారణం ఏమిటి అని ధ్యానిస్తూ భయం పోయేవరకూ అక్కడే ఉండేవాడుట. విధంగా తాను భయాన్ని జయించానని ఆనందునితో సంభాషణల లో చెప్తాడు.

చాలా మందికి చీకటిలో ఒంటరిగా నడిచేటప్పుడు, ముఖ్యం గా నిర్మానుష్య మైన ప్రదేశాలలో, ఉన్నట్టుండి ఒళ్ళు ఝల్లు మన్నట్లు అనిపిస్తుంది. మన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. తల తిప్పి చూద్దామన్నా ధైర్యం చాలదు. ఇట్టి పరిస్తితి నాకూ చాలా సార్లు ఎదురైంది. అప్పుడు బుద్ధుని మాటలు గుర్తు తెచ్చుకొని అదే ప్రదేశం లో నిలిచి ధ్యానించేవాడిని. ఎక్కడైతే భయం కలుగుతున్నదో అక్కడే మొండిగా నిలిచి, వీలైతే కూర్చొని ధ్యానం చేసేవాడిని. కొద్ది సేపటికి భయం పటాపంచలయ్యేది. నా స్థితికి నాకే నవ్వొచ్చేది. మళ్ళీ బుద్ధ భగవానుని తలచి ప్రణామాలు అర్పించి ముందుకు పోయేవాడిని.

ఒకసారి దెయ్యాల కొంపగా పేరు పడ్డ ఒక పాడుబడిన ఇంట్లో రాత్రి పదకొండు గంటల సమయంలో ధ్యానం చేశాను. శరీరం మనసు రెండూ బలవంతంగా వ్యతిరేకిస్తున్నాయి.లేచి బయటకు పారిపోదామని బలంగా అనిపిస్తున్నది. గుండె పీచు పీచు మంటున్నది. చెమటలు పడుతున్నాయి. నా మనస్సు రెండుగా చీలిపోయి ఒక భాగం ఉండు అని ఒక భాగం లేచి పారిపో అని చెబుతున్నాయి. అయినా మొండిగా అలాగే కూర్చొని ఒక గంటసేపు ధ్యానం చేశాను. ఏం జరుగుతుంది మహా అయితే ప్రాణం పోతుంది. అంతేగా. అదీ చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటూ కూచున్నాను. నాకు ఏమీ దెయ్యాలు కనిపించలేదు. మన మనస్సులో ఎప్పుడో విన్న కథలు, చదివిన పుస్తకాలు, చూచిన సినిమాలే జ్ఞాపకాలుగా గుర్తొచ్చి భయపెడతాయి తప్ప ఇంకేమీ లేదు. దయ్యాలు లేవా అంటే అది వేరే సబ్జెక్టు. ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మాత్రం అనుమానం లేదు. కాని నూటికి తొంభై శాతం మన మనసే మనలను భయపెడుతుంది.

భయాన్ని అనేక విధాలుగా జయించవచ్చు. కొందరు తమ ఇష్ట దైవం మీద విశ్వాస బలంతోనూ, ఇంకొందరు నామ జపం లేదా మంత్ర జపం తోనూ, ఇంకొందరు మనో బలం తోనూ, ఇంకొందరు బుద్ధుని మార్గమైన విపస్సాన విధానంతోనూ అధిగమించ వచ్చు. వీటిలో బుద్ధుని మార్గం కష్టతరమైనది. ఎందుకంటే దీనిలో దేవుని వంటి బాహ్యమైన ఇంకొకరిపైన ఆధార పడటం ఉండదు. ఉన్న సమస్యను లోతుగా తరచి చూచి దాని మెకానిజం అర్థం చేసుకొని, మనస్సులో మార్పులు ఎలా కలుగుతున్నవో లోతుగా గమనించి చూచి సమస్యను అధిగమించటం ఉంటుంది. కాని చెయ్యగలిగితే ఇది అద్భుతమైన విధానం. దీనిని మించిన పధ్ధతి లేదు అని చెప్పవచ్చు. కాని సాహసం ధైర్యం ఉన్నవారే దీనిని అమలులో పెట్ట గలుగుతారు. ధైర్యం లేని వారికి ఇది కష్టం గా ఉంటుంది.

ఉపనిషత్తుల ముఖ్యమైన బోధన ఏమిటి అని ఒకరు మహాయోగి, మహా జ్ఞాని అయిన వివేకానంద స్వామిని అడిగారు. ఆయన దానికి సమాధానమిస్తూ. అభీహి, అభీహి ( భయ రహితుడవై ఉండు, భయ రహితుడవై ఉండు) అనేదే ఉపనిషత్తుల ముఖ్య బోధన అని చెప్పారు. తనను అనుసరించే వారికి కూడా ఉండవలసిన ముఖ్య లక్షణం ఇదే అని ఆయన నొక్కి చెప్పారు. తనను అన్ని జీవులలోను, అన్ని జీవులను తనలోను చూస్తున్న వానికి భయమేక్కడిది? అసహ్య మేక్కడిది? అని చెప్పే మంత్రాలు ఉపనిషత్తులలోను భగవత్ గీతలోను ఉన్నాయి. ఇట్టి స్థితి ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నత భూమిక అయిన బ్రాహ్మీ భూత స్థితి. మనకు స్థాయి లేకపోయినా, మన చేతనైనంతలో ధైర్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం. నిర్భయత్వం అనేది సాధనా మార్గంలో సాధించ వలసిన ఒక ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాధన చేసే వారు తనలోని భయాలను గుర్తించి వాటిని అధిగమించవలసి ఉంటుంది. దానిని సాధించటంలో బుద్ధుని విపస్సాన ధ్యాన మార్గం అత్యుత్తమం.