“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జులై 2009, బుధవారం

ఒక మంచి మాట


గ్రంధం లోదో తెలీని శ్లోకం ఒకటి విన్నాను . చక్కటి అర్థాన్ని కలిగి ఉండి, ఒక మంచి సత్యాన్ని నాలుగు మాటలలోచెప్పింది.

శ్లో||అమంత్రం అక్షరం నాస్తి
నాస్తి మూలం అనౌషధం
అయోగ్యః పురుషో నాస్తి
యోజకా తత్ర దుర్లభా||

అర్థం|| మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు.

అక్షరాలు అన్నీ మంత్రాలే. వాటిని సాధన చేసే ప్రయత్న శీలురు కావాలి. సామాన్య మైన " రామ" అనే మంత్రాన్నిజపించి బోయవాడు వాల్మీకి మహర్షి గా మారాడు. మాటలలో మహత్తరమైన శక్తి ఉంది. ఒక మంచి మాట వింటేమనస్సు ఆనంద పడుతుంది. ఇంకొక చెడ్డ మాట వింటే మనస్సుకు బాధ కలుగుతుంది. ఇక్కడ ఉన్న మనసు, మాట-- ఈ రెంటిలో దేనికీ రూపం లెదు. మనసునూ రుజువు చెయ్యలేము, మాటనూ రుజువు చెయ్యలేము. మనసుకు రూపం లెదు. మాటకు శబ్దం ఉంది. కాని క్షణంలో అంతరిస్తుంది.మరి ఇవి చూపే ప్రభావాలు మాత్రంఅనూహ్యం గా ఉంటాయి. 

మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి. మనసులు కలిస్తే జీవితాలు ఆనందమయంగా మారుతాయి. మనసు విరిగితే జీవితాలు చెదిరి పోతాయి. మామూలు గా కనిపించే మాటనే మంత్రం గా సాధన చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఇక బీజాక్షర సంయుక్తం అయిన మహా మంత్రముల మహిమ వేరే చెప్ప వలసిన పని లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటారు. నిజమే. అది మామూలుగా పుస్తకంలో ఉన్న మంత్రం చదివి పరీక్షించిన వాని సంగతి. మంత్ర సిద్ధి ఉన్న వానికైతే చింత కాయలు రాలుతాయి. ఇంకా అద్భుతాలు కూడా జరుగుతాయి. ఆ మంత్ర సిద్ధి కలగాలంటే ఏళ్ళ కెళ్ళు సాధన చేసి చూడాలి. మంత్రాలు ఉన్నాయి. అలా సాధన చేసే వారే లేరు.

ఇక చెట్ల సంగతి కొస్తే, ప్రతి మొక్కలోనూ ఔషధ లక్షణాలు ఉన్నాయి. కాని దానిని పట్టుదలగా పరిశీలించి కనుగొనే నాదుడే లేదు. బుద్ధుని వ్యక్తిగత వైద్యుడైన జీవకుని గురించి ఒక గాధ ప్రచారం లో ఉంది. ఇదే కథ చరకుని గురించి కూడా చెప్తారు. వైద్య శాస్త్రాన్ని బాగా అభ్యసించిన తరువాత ఈయనకు గురువు గారు ఒక పరీక్ష పెట్టారు. ఒక ఏడాది పాటు దేశమంతా తిరిగి అన్ని మొక్కలనూ పరిశీలించి, వైద్యానికి పనికి రాని మొక్కను ఒక దాన్ని కనుగొని దాన్ని తెచ్చి ఇమ్మని గురువు చెబుతాడు.

జీవకుడు అలాగే సంవత్సరం పాటు పరిశీలించి తిరిగి ఉత్త చేతులతో వస్తాడు. ప్రశ్నార్థకం గా చూచిన గురువుతో- వైద్యానికి పనికి రాని మొక్క తనకు కనిపించలేదని చెబుతాడు. అప్పుడు మాత్రమె ఆయనకు వైద్య శాస్త్రం లో పరిపూర్ణత కలిగినట్లు గురువు భావించి ఇక నీవు వైద్యం చెయ్యటం ప్రారంభం చేయ వచ్చు అని అనుమతి ఇస్తాడు. ఇట్టి పరిశీలన, అధ్యయనం చేసాడు కనుకనే జీవకుడు ఈనాడు కొన్ని బౌద్ధ శాఖలలోవైద్యానికి Patron Saint గా పరిగణించ బడుతున్నాడు.

అదే విధం గా పనికి రాని మనిషి కూడా ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా పరిశ్రమ తో గొప్ప వారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు. కాని వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి తనాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు. ఎన్నెన్నో విద్యలు మానవుని కోసంఎదురు చూస్తూ చీకటిలో ఉన్నాయి. వాటిని అందుకునే వారు, సాధించే వారే లేరు.

ఇంద్రియ వ్యామోహం తో కొందరు, దురహంకారం తో ఇంకొందరు, బద్ధకంతో ఇంకొందరు, పిరికి తనం తో మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు-- ఇలా రకరకాలుగా ఏమీ సాధించలేని అప్రయోజకులుగా మారుతారు. వీటిని వదిలించుకో గలిగితే మనిషిని విజయ లక్ష్మి ఏదో నాటికి వరిస్తుంది. యోగ వాశిష్టం లో ఒక గొప్ప శ్లోకం ఉంది. దాని అర్థ భాగమే గొప్పఉత్తేజాన్ని కలిగిస్తుంది. "దైవం నిహత్య కురు పౌరుష మాత్మ శక్త్యా" అని శ్రీ రామునికి గురువైన వశిష్ట మహర్షిచెబుతాడు. శ్రీ రామా, పురుష ప్రయత్నానికి మించిన ఉపాయం లేదు. కావున పౌరుషం తోనూ, ఆత్మ శక్తి తోనూ విధిని జయించు. అని ప్రబోధిస్తాడు. 

ఈ విధం గా ఉత్సాహంతో ప్రయత్నం చేసే వారికి ప్రకృతిలో అన్నీలభిస్తాయి. అది బాహ్యం గా కావచ్చు, అంతరికంగా కావచ్చు. ప్రయత్నశీలుడు ఏదోనాటికి తప్పక విజయాన్నిపొందగలడు.ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటిని అందుకునే వారే అరుదు. ఇంకొక్క మాట. ఈనాడు మనం Positive Thinking అని పేరు పెట్టి విదేశీయుల సాహిత్యాన్ని కాపీకొట్టి ఏదో సాధించి నట్టు చెప్పు కుంటున్నాం.నిజమైన Positive Thinking యొక్క మూలాలు యోగ వాసిష్టాది ప్రాచీన గ్రంధాలలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈ అర్థ శ్లోకం ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.మనం విదేశీయులను కాపీ కొట్ట నక్కర లేదు. మన పెద్దల వారసత్వాన్ని సరిగ్గా అందుకోగలిగితే అదే చాలు. దానిని మించిన సంపద ఈ ప్రపంచం లో మరే దేశంలోనూ లేదు.