“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జులై 2009, ఆదివారం

కామ్య కర్మలు-తంత్ర విద్య

బాహ్యమైన పనులు పూర్తి కావటానికి, అధర్మమైన కోరికలు తీర్చుకోటానికి తంత్రాన్నిఉపయోగించటం అంత మంచిదికాదు. కాని కొందరు సాధకులు ఇది సరియైనదే అంటారు.ఎందుకంటే పిల్లవాడు ఏది కావాలన్నా తల్లిని అడిగి తీసుకుంటాడు.కొందరు బాగా తెలివైన పిల్లలు మోక్షాన్ని కోరవచ్చు. అంత పరిపక్వత లేని ఇంకొందరు పిల్లలు రకరకాలైన లౌకికకోరికలు కోరవచ్చు.తప్పు లేదు.ఎదుటి వ్యక్తికి హాని చెయ్యనంత వరకు జగన్మాతను ఏదైనా కోరవచ్చు.

ఎదుటి వారికి హాని కలిగించే అభిచారము, వశీకరణం, విద్వేషణం, ఉచ్చాటనం,మారణం వంటి క్రియలు కూడా తంత్రంలో భాగాలే. కాని అవి చేసేవారు వారి జీవితంలో తీవ్రఫలితాలు ఎదుర్కొంటారు. వారి జీవితాలు అర్థాంతరంగా విషాదంగా ముగుస్తాయి. ఎందుకంటే చేసిన కర్మ తిరిగి చక్రవడ్డీతో సహా తీర్చడం సృష్టి ధర్మం. దీనికి ఎంతటివారైనా మినహాయింపు లేదు.


ఒరిస్సాకు చెందిన నా స్నేహితుడు ఒక జరిగిన సంఘటన చెప్పాడు. అతనికి తెలిసిన ఒక వ్యక్తి రంభాఊర్వశి సాధన చేసేవాడు. ఇటువంటివి తంత్రంలో తక్కువ తరగతికి చెందిన యక్షిణీ విద్యలు. ఇతనికి అందమైన భార్య ఉండేది. కాని ఇతనికి అప్సరసల సాంగత్యం మీద గొప్ప కోరిక ఉండేది. పల్లెటూరిలో అతని ఇల్లు ఖాళీ చేసి ఈ సాధన కోసం ఊరిబయట ఒక ఇంట్లో ఉండేవాడు. ఇటువంటి అప్సరసాసాధనలు చేసేవారికి కనిపించే మొదటి రుజువు ఏమిటంటే ఈసాధనలు మొదలుపెట్టిన కొద్ది కాలానికి అతని భార్య మరణిస్తుంది.పుష్పదేహ అప్సరసాసాధన కూడా ఇటువంటిదే.రంభా ఊర్వశుల కంటే కూడా పుష్పదేహ అప్సరస చాలా అందగత్తె. ఈ అప్సరసలు మానవలోకంలోని మిస్ వరల్డ్ ల కంటే ఎన్నో రేట్లు సంమోహనకరమైన అందాన్ని కలిగి ఉంటారు. మానవ సుందరీమణులు వీరి ముందు కోతుల్లా ఉంటారు.

సరే,ఈ సాధన మొదలుపెట్టిన కొన్నాళ్ళకు ఇతని భార్య హఠాత్తుగా మరణించింది. ఇతని సాధన ఫలించడం మొదలుపెట్టింది. ఇతను ఎప్పుడూ తలుపులు వేసుకొని ఉండేవాడు.ఆ ఇంట్లోకి ఎవ్వర్నీ రానిచ్చేవాడు కాదు. రాత్రిళ్ళు మాత్రం ఆ ఇంటిలోనుంచి ఎవరో అమ్మాయి కిలకిల నవ్వినట్లు శబ్దాలు, గజ్జెలు కట్టి ఎవరో నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు వచ్చేవి. ఇతను మాత్రం రోజురోజుకూ క్షీణించిపోతుండేవాడు.


ఇలా ఒరిస్సా మంత్రతంత్రాల సాధనవల్ల క్రమేణా ఇతను చిక్కిశల్యమై  అస్థిపంజరంలా తయారయ్యాడు.కాని చాలా ఆనందంగా ఉల్లాసంగాఉండేవాడు.మంచి బట్టలు వేసుకొని సెంటు పూసుకొని ఎప్పుడు చూసినా జల్సాగా తిరిగేవాడు.ఒకరోజు తన స్నేహితునితో కలిసి మోటారుసైకిలు మీద దగ్గిరిలో ఉన్న 'బెరహంపూర్' అనే ఊరికి పోతుండగా ఎవరో విసిరేసినట్టు ఉన్నట్టుండి మోటారు సైకిల్ ఎగిరి రోడ్డు పక్కనపడి ఇతడు, ఇతని స్నేహితుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. తరువాత ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తె అతనిగదిలో ఒక మంచి జీవకళగా ఉన్న ఊర్వశి విగ్రహం పూజలో ఉంది.

అతను కంసాలి కులానికి చెందినవాడు కనుక తానే విగ్రహాన్ని తయారుచేసుకొని ఎవరి దగ్గరో ఈమంత్రాన్ని నేర్చుకొని ఈ సాధన చేసేవాడు. ఆ ఇంటిలో ఏమి జరిగి ఉంటుందో నేను వ్రాయను.మీ ఊహకే వదలి వేస్తున్నాను. ఇటువంటి సాధనలు ఎంతమాత్రం మంచివి కావు. అప్సరసల మీద మోజుతో కట్టుకున్న భార్యను బలిచేసుకునే ఇలాంటి మూర్ఖులు ఉంటారు. పరాయిఆడదాని మోజులో భార్యను అన్యాయం చేసేవాళ్ళు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నట్టే వీళ్ళూఉంటారు.

తంత్రం లౌకిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. పారమార్థిక ప్రయోజనాలకూ పనికొస్తుంది. అది ఒక బలీయమైన శక్తి. దానిని వాడుకోవటం మన విచక్షణను బట్టి ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు అనుభవించవలసివస్తుంది.గుంటూరుకు చెందిన ఒక మాంత్రికుడు ఈ మధ్యనే కొండవీటికొండల్లో ఉన్న నిధులమీద మోజుతో జరిగిన ప్రయోగాలలో కేరళమాంత్రికులు చేసిన ఎదురు ప్రయోగంలో మరణించాడు. ఇది జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుందేమో. 

చాలామంది నమ్మక పోవచ్చు కాని ఇది నిజంగా జరిగింది. ఆయన చేసిన మహత్యాలు బాహాటంగా చూచినవారు చాలామంది ఉన్నారు.మా ఇంటి పక్కనే ఉన్న ఆయన స్నేహితుని ఇంటికి చాలాసార్లు వచ్చేవాడు. తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫెన్ ఆయన ఆగమంటే ఆగిపోయేది. చూస్తే కరెంటు బాగానే ఉండేది. మళ్ళీ తిరగమంటే తిరగడం మొదలు పెట్టేది. ఈ మిరకిల్ ను ఆయన్ను చాలెంజ్ చేసిన నాస్తికుల ఎదుట కూడా ప్రయోగించి చూపించాడు.వాళ్ళు బిత్తరపోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన దేవీ ఉపాసకుడు అయి ఉండి కూడా ఇటువంటి కార్యకలాపాలలో తలదూర్చి అనవసరంగా మరణాన్ని కొనితెచ్చుకున్నాడు.

ఈయనా,ప్రస్తుతం స్వాములవారైన ఇంకోకాయనా స్నేహితులు. వీరిద్దరూ  కలిసి ఇలాంటి కొన్నిశక్తుల సాధనకు క్షుద్రపూజలు చేసి కోళ్ళు బలి ఇచ్చేవారు. తర్వాత కొన్నాళ్ళకి ఈ రెండోవ్యక్తీ (ప్రస్తుతం స్వామీజీ అవతారం ఎత్తాడు)ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి దర్శనానికి వెళితే అమ్మ ఇతన్ని చూస్తూనే 'ఎందుకురా ఆ మూగజీవాల ఉసురు తీస్తారు మీరు?' అని ప్రశ్నించింది.ఆయనతో వచ్చినవారికీ చుట్టుపక్కల ఉన్నవారికీ ఈ మాటలు అర్ధం కాలేదు.బహుశా ఆయనక్కూడా అర్ధం అయ్యాయో లేదో తెలియదు.ఎందుకంటే ఆయనకు ఈ మహిమల పిచ్చి ఇప్పటికీ తగ్గలేదు మరి. ఏం చేస్తాం ఎవరి ఖర్మ వారనుభవించక తప్పదు కదా?