“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, జులై 2009, శనివారం

వీర విద్యలు-అభ్యాస విధానాలు


ప్రపంచంలోని ముఖ్యమైన వీర విద్యలన్నీ పరిశీలిస్తే కొన్ని ముఖ్య విషయాలు అన్నింటిలో ఒకటిగానే ఉంటాయి. స్వల్పమైన తేడాల వల్లే వేరు వేరు విద్యలుగా గుర్తించ బడుతున్నా, నిజానికి ఇవన్నీ వేర్వేరు కావు. అతి ప్రాచీన మైనకలారి పాయట్టు, మర్మ అడి, వజ్ర ముష్టి, ఇంకా చైనీస్ కుంగ్ ఫూ విద్యలలో ఓపెన్ హేండ్ మరియు వెపన్స్ రెండూకలిపి నేర్పే పద్ధతులు ఉండేవి. కాని తరువాత తరువాత టెక్నిక్స్ ను బట్టి వేరు వేరు విద్యలుగా చీలిపోయాయి.

ఉదాహరణకు-- మనిషిని ఎత్తి విసిరి పారవేసే బాడీ త్రోస్ ఎక్కువగా ఉండటం జూడో ప్రత్యేకత. అలాగే జాయింట్ లివరేజి టెక్నిక్స్ ఉపయోగించి కాళ్ళు చేతులు విరిచేయటం, మనిషిని కదలకుండా బంధించటం జుజుత్సు ప్రత్యేకత. ఇక కుంగ్ఫూ లోని విభిన్న శాఖలలో- ప్రత్యర్థిని హాని చేయకుండా కంట్రోల్ చేయటం నుంచి, ప్రాణాంతక టెక్నిక్స్ వరకూ అన్నిస్థాయిలు ఉన్నాయి. ప్రత్యర్థి బలాన్ని తిప్పి అతని మీదే ప్రయోగించి ఓడించటం అయికిడో ప్రత్యేకత. ఇక తాయిఛి విషయానికొస్తే అతి తేలికగా కనిపించే టెక్నిక్స్ తో ప్రాణశక్తిని ఉపయోగించి నాడీకేంద్రముల మీద ప్రత్యెకమైన దెబ్బలతో ప్రత్యర్థిని మట్టి కరిపించటం దీని లక్షణం. కరాటేలో మనిషిని భయంకరమైన ప్రాణాంతక దెబ్బలతో పడగొట్టటం ఉంటుంది.

కరాటే లోని విభిన్న స్టైల్స్ లో కొన్ని ఎక్కువ హేండ్ మూవ్మెంట్స్ కు మరికొన్ని స్టైల్స్ కిక్స్ కు ఎక్కువ గా ప్రాధాన్యతనిస్తాయి. సదరన్ షావులిన్ కుంగ్ ఫూ లో ఎక్కువగా హేండ్ టెక్నిక్స్ వాడకం ఉంటుంది. అదే నార్తర్న్ షావులిన్ కుంగ్ఫూ లో కిక్స్ కు ప్రాధాన్యత ఎక్కువ. ఒక్క కుంగ్ఫూ లో మాత్రమె 50 రకాల ఆయుధాలు వాడటం నేర్చుకోవచ్చు. జపనీస్ కరాటే స్టైల్స్ లో ఆయుధాలు ఉండవు. కరాటే అంటేనే ఎంప్టీ హేండ్ కనుక ఆయుధాల అభ్యాసానికి "కొబుడో" అనే జపనీస్ మార్షల్ ఆర్ట్ విడిగా ఉంది. దీనిలో నన్ చాకు, సాయి, టోంగ్ఫా, కాలి మొదలైన ఆయుధాల వాడకంనేర్చుకోవచ్చు.

అన్ని మార్షల్ ఆర్ట్స్ ను పరిశీలించిన మీదట నా సొంత స్టైల్ లో నేను ఈ క్రింది అభ్యాసాలు ముఖ్యంగా తీసుకున్నాను.

>>Body Conditioning: దీనిలో ఒంటిని దృడం గా చేసే అభ్యాసాలు, ఎటు కావాలంటే అటు విల్లులా వంచేఅభ్యాసాలు ముఖ్యమైనవి

(Strength and Flexibility Improving Exercises) ఇవి కాక శరీరంలోని పిడికిలిమొదలైన ముఖ్య సహజ ఆయుధాలను ఉక్కులా గట్టి పరిచే ప్రక్రియలు. కలారి పయట్టులోని "మైప్పత్తు" విభాగం లోనుంచి కొన్ని అభ్యాసాలు తీసుకున్నాను.

>>Offense Techniques: దీనిలో చేతి వెళ్ళు, కణుపులు, పిడికిలి, అరచెయ్యి, ముంజేయి, మోచేయి, భుజం, తల, ఉపయోగించి కొట్టే 24 రకాల దెబ్బలు ఉంటాయి. అలాగే మోకాలు, పాదం, మడమ, పాదం పక్కన కత్తి లాంటి భాగం ఉపయోగించి చేసే ముఖ్యమైన 12 రకాలైన కిక్స్ ఉన్నాయి. ఇవి కాక జాయింట్ లాక్స్, బాడిత్రోస్ తో బాటు నాడీకేంద్రాలను దెబ్బ తీసే ప్రాణాంతకమైన మర్మవిద్యా విధానాలు ఉంటాయి.

>>Defense Techniques: వీటిలో లాఘవంగా తప్పుకొనే విధానాలు, చేతులు కాళ్ళు ఉపయోగించి చేసే 24 రకాల బ్లాకింగ్ పద్ధతులు ఉన్నాయి.ఒకేసారిగా ఈ రెండు విభాగాలలో ఫుట్ వర్క్ కూడా కలిసే అభ్యాసం చేయటం జరుగుతుంది.ఎనిమిది రకాలైన ఫుట్ వర్క్ వాడటం దీనిలో ఉంటుంది.

>>Weapons: ముఖ్యమైన 6 రకాల ఆయుధాలు వాడే విధానాలు ఇందులో ఉంటాయి. ప్రాచీన కాలంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పుడు ఉపయోగపడవు. ఉదాహరణకు సమురాయి స్వోర్డ్ భుజానికి తగిలించుకుని తిరగటం ఈ రోజులలో నేరం. అందుకని లాంగ్ స్టిక్, డబుల్ షార్ట్ స్టిక్స్, శికిబో, చేతిలో ఇమిడిపోయే యావార స్టిక్, బెల్ట్ అండ్ టవల్, షార్ట్ నైఫ్-- మొదలైన ఆయుదాలకే ప్రాధాన్యత నిచ్చాను.
 
రెండునెలల క్రితం ఒకసారి ఆదోని కొండమీద రణమండల ఆంజనేయస్వామి గుడికి పోదామని కొండ ఒంటరిగా ఎక్కుతుంటే కొండముచ్చుల గుంపు ఎటాక్ చేసింది.అప్పుడు నడుముకున్న బెల్టుని బాణాకర్రలా తిప్పి వాటిని పారదోలటం జరిగింది.
 
>>Breathing and Meditation: వీర విద్యలకు అవసరమైన ప్రాణాయామ, ధ్యాన విధానాలు ఈ విభాగంలో పొందుపరచాను.

ఈ విధంగా ముఖ్యమైన అన్ని అభ్యాసాలు క్రోడీకరించి నా పర్సనల్ స్టైల్ ను ఒక పరిపూర్ణమైన విధానంగా తయారుచేశాను.