“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జులై 2009, శనివారం

ఉత్తర కాలామృతం-ఇందులగ్నం

ధన మూల మిదం జగత్. ప్రపంచం డబ్బుతో నడుస్తున్నది. ప్రతివారికీ తనకెంత ధనయోగం ఉందో తెలుసుకోవాలనిఉంటుంది. జీవితంలో తనకు ధనయోగం ఉందా లేదా తెలుసుకోవాలని ఉంటుంది. ఇది తెలియాలంటే,ధనయోగాలు జాతకంలో ఉన్నవా లేవా చూడటం ఒక పధ్ధతి.

అయితే, కాళిదాసు తన ఉత్తర కాలామృతం గ్రంధం లో నాలుగోఅధ్యాయం లో ఇరవై ఏడవ శ్లోకంలో ఇందు లగ్నం అనే ఒక కొత్త పద్ధతిని ఇచ్చి ఉన్నాడు.
ఈ విశేష విధానం ఇతర గ్రంధాలలో కనిపించదు. దీని ద్వారా ధనయోగం ఉందా లేదా? ఉంటే దశలో అది ఫలిస్తుంది? అనేది తెలుసుకోవచ్చు. తద్వారా సమయంలో ప్రయత్నాలు బలం గా చెయ్యటం ద్వారా ధన సంపాదన చెయ్య వచ్చు.

శ్లోకం||అర్కాన్నాగ చటస్తనుర్జన నట ఖేటాయనం స్యుస్తనో||శ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టంవిదోర్యద్గృహం||
తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే ||చేత్ పాపేతు సహస్రశః ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం||

అర్థం|| అర్కాత్= సూర్యుడు మొదలు; నాగ=30; చట=16; తను=6; జన=8; నట=10; ఖేట=12; అయనం=1; స్యు= అగుచున్నవి.
స్తనోశ్చంద్రా ద్భాగ్యపయో కలైక్య మిన హ్రుచ్చిష్టం విదోర్యద్గృహం= లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతులకళలను పన్నెండుచే భాగించి, మిగిలిన సంఖ్య చంద్రునినుంచి ఎన్నవ రాశియగునో; తద్రాశౌతు విపాప శోభన ఖగే కోటీశ్వరం తన్వతే= రాశి పాపుల స్పర్శ లేక శుభ గ్రహముల తో కలసి ఉంటే కోటీశ్వరుడగును. పాపేతు సహస్రశః= పాప గ్రహ మున్నను వేలాదికారిని చేయును. ఖల ఖగే తుంగేతు కోటీశ్వరం= పాప గ్రహమైనను ఉచ్చ స్థితి యందున్న యెడల కోటీశ్వరుడగును.

అనగా, రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులకు వరుసగా 30,16,6,8,10,12,1 అనే (Units) కళలున్నవి. మనకుకావలసింది భాగ్య భావ విషయం కాబట్టి లగ్న చంద్రులనుంచి భాగ్యాదిపతుల కళలను కూడి పన్నెండుచే భాగించివచ్చిన సంఖ్యా ప్రమాణ రాశి చంద్రుని నుంచి లెక్కించగా రాశి లేదా రాశ్యాదిపతి స్థితిని బట్టి ధన యోగం ఊహించమని శ్లోకార్థం.

ఉదాహరణకు మధ్యనే వ్రాసిన NTR జాతకం తో చూద్దాం. ఈయనకు లగ్నం చంద్ర లగ్నం రెండూ తుల కనుక భాగ్యభావం మిథునం అధిపతి బుధుడు అవుతాడు. బుధుని కళ 8+8=16/12=4 శేషం. కనుక చంద్రుని నుంచి నాలుగుఅయిన మకరం అధిపతి శని. శని భగవానుడు దశామ్షలో ఉచ్చ స్థితి లో ఉండటంతో. లాభ స్థానం లో రాహువుతోకలిశి ఉండటంతో, శని దశలో విపరీత భాగ్య వృద్ధి ఉంది అని చెప్ప వచ్చు. తరువాత వచ్చిన బుధ దశ భాగ్యదిపతి దశకనుక ఇదీ యోగిస్తుంది అని చెప్ప వచ్చు. నిజంగా జరిగింది కూడా ఇదే కదా. ఈయనకు శని దశ, బుధ దశలలోవిపరీత ధన యోగం కలిగింది.

ఈ విధానం ప్రపంచంలో గొప్ప కోటీశ్వరులైన బిల్ గేట్స్, అంబానీ సోదరులు, వారెన్ బఫెట్, లక్ష్మి మిట్టల్ మొదలైన వారి జాతకాలలో పరీక్షించగా ఆశ్చర్య కరమైన ఫలితాలు కనిపించాయి.

ఇంకొక జాతకానికి లగ్నం మకరం, చంద్ర లగ్నం మీనం. కనుక భాగ్యదిపతులు వరుసగా బుధుడు, కుజుడు అవుతారు. వీరితో లెక్క వేయగా,8+6=14/12=2 శేషం అవుతుంది. కనుక మీనాత్ రెండు అయిన మేషం. మేషం లో ఎవరూ లేరు. కాని కుజుడు సింహ రాశిలో బలంగా ఉన్నాడు. కనుక 2017 నుంచి మొదలయ్యే కుజ దశ ధన పరంగా బాగాయోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇంకొక జాతకానికి లగ్నం వృషభం, చంద్ర లగ్నం ధనుస్సు. భాగ్యాదిపతులు వరుసగా శని, రావులు. కనుక లెక్కించగా 1+30=31/12=7
కనుక ధనుస్సు నుంచి ఏడవది మిథునం. బుధుడు గురువు తో కలిశి మేషంలో చంద్ర లగ్నాత్పంచమంలో ఉన్నందున 2013 నుంచి వచ్చే గురు దశ ధన పరంగా యోగిస్తుంది అని చెప్ప వచ్చు.

ఇలా లగ్న చంద్ర లగ్నాల వల్ల ధన యోగాన్ని లెక్కించే విధానం కాళిదాసు మనకు ఇచ్చాడు. ఇది జాతకంలోచూచినా సరిగా సరిపోయే ఒక ఖచ్చితమైన పద్దతి. ఆధారంతో గ్రహాలకు కళలు (Units) కేటాయించారోమనకు తెలియదు. కాని దీనికి తప్పక ఒక లెక్క ఉండే ఉంటుంది. ఆయా గ్రంధాలు ధ్వంసం అవటం వల్ల అనేక missing links
ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనం ఊహించవలసిందే. చంద్రునికి కళలు పదహారు అని అంటారు కదా. బహుశా అందుకనే ఇక్కడ పదహారు కళలు ఇచ్చి ఉండవచ్చు. శుభ ఫలితాలు ఇచ్చే రీత్యా ఈ కళలు కేటాయించారు అనిపిస్తుంది. అందుకనే రవికి 30 మరియు శనికి 1 ఇచ్చినట్లుంది. మొత్తంమీద కళలు ఎలా కేటాయించారో తెలియనప్పటికీ విధానం విశ్లేషణలో చక్కగా పని చేస్తుంది. జ్యోతిర్విజ్ఞానం లో పరిశ్రమ చేస్తున్నమిత్రులు పరీక్షించి చూడండి.