20, మార్చి 2017, సోమవారం

Yogi Adityanath horoscope analysis



ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియమితుడయ్యాడు. ఈయన జనన వివరాలు 5-6-1972; 11-50 am; Panchur; Pauri Garhwal (UP) 78E26; 29N57 గా లభ్యమౌతున్నాయి. ఈయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం.

ఈయన జాతకంలో కొన్ని విచిత్రమైన యోగాలున్నాయి. కుజ శుక్రులతో లాభస్థానంలో ఏర్పడిన ధర్మకర్మాధిపతి యోగం ఒక స్పష్టమైన రాజయోగం.అలాగే దశమంలో సూర్య బుధుల డిగ్రీ కంజంక్షన్, వీరితో శనీశ్వరుడు కలవడం కూడా రాజయోగమే. ఆరూ పన్నెండులలో ఉండటం రాహుకేతువులకు చాలా మంచి యోగకరమైన ప్లేస్ మెంట్ అని చెప్పాలి.

సప్తమంలో ద్వాదశాదిపతి  అయిన క్షీణ చంద్రుడు ఉండటం వివాహ నాశక యోగం.చంద్రుడు గురు నక్షత్రంలో ఉంటూ మతగురువు కావడం కోసం తన వివాహాన్ని ఈయన త్యాగం చేశాడని సూచిస్తున్నాడు. పంచమంలో గురువూ, చంద్రలగ్నాత్ పంచమంలో కుజశుక్రులూ ఉండటం మంచి ఆధ్యాత్మిక యోగాలు.కానీ గురువు వక్రత్వమూ, శుక్రుని వక్రత్వమూ, ఈ ఆధ్యాత్మికతకు లౌకికత కూడా తోడైందనీ, ఈయనది ప్రపంచాన్ని పట్టించుకోని ఆధ్యాత్మికత కాదనీ, లోకంతోనూ ప్రజలతోనూ బలమైన సంబంధాలు ఉండే ఆధ్యాత్మికత అనీ సూచిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో హిందువులకు ఎక్కడ ఏం కష్టం వచ్చిందని తెలిసినా అక్కడకు ఈయన తన అనుచరులతో వాలిపోతాడు.వారిని ఆదుకుంటాడు. తన గోరఖ్ నాద్ మఠంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ లక్షణాలే ఈయనకు విపరీతమైన ప్రజాభిమానాన్ని సంపాదించి పెట్టాయి.

నవాంశలో గురు చంద్రులు ఉచ్చస్థితిలో ఉండటం మంచి ఆధ్యాత్మికమైన యోగం. వీరిద్దరూ శనీశ్వరుని అర్గలం చేస్తున్నారు.కనుక ఈయన అంతరాంతరాలలో ప్రజాసమస్యలు తీర్చాలన్న తాపత్రయం బాగా ఉంటుంది. ఈయనలో ఆధ్యాత్మికతా ప్రజా సంబంధాలూ రెండూ కలగలసిన విచిత్రమైన యోగం ఉంటుంది. 

కారకాంశ వృషభం అవుతూ దశమంలో ఉన్న చంద్రుని నవాంశ ఉచ్చస్థితి వల్ల ప్రజాజీవితంతో పెనవేసుకుపోయి వారి అభిమానాన్ని సంపాదించిన నాయకుడిని సూచిస్తున్నది.

ఈయన గురు నక్షత్రంలో కుంభరాశిలో జన్మించాడు.కనుక ఒక గురువుగా ప్రజలకు మేలు చెయ్యాలన్న ఋణానుబంధంతో ఈయన ఈ జన్మలోకి వచ్చాడు. గణితంలో బీఎస్సీ పూర్తి చేసిన ఈయన తన 21 ఏట కుటుంబాన్ని వదిలిపెట్టి మహంత్ అవైద్యనాద్ శిష్యునిగా చేరాడు.ఆ సమయంలో 1992 ప్రాంతాలలో ఈయనకు శనిదశలో సూర్య అంతర్దశ జరిగింది. ఈయన జాతకంలో వీరిద్దరూ దశమకేంద్రంలో బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆ దశలో కన్నతండ్రిని వదిలి ఆధ్యాత్మిక తండ్రి అయిన గురువు దగ్గరకు చేరాడు. శనీశ్వరుడు సూర్యుని తనయుడే అన్న విషయమూ వీరిద్దరికీ ఎప్పుడూ ఎడబాటే నన్న విషయమూ జ్యోతిష్కులు గుర్తుంచుకోవాలి. అందుకే ఈ దశలో తండ్రి ఎడబాటు సంభవించింది.

1998 నుంచి ఈయన నాలుగు సార్లు వరుసగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ గా ఎన్నికౌతూ వస్తున్నాడు.అంటే శనిదశ చివరిభాగం, బుధదశ మొత్తం ఈయనకు బ్రహ్మాండంగా యోగిస్తూ వస్తున్నాయి. దానికి కారణం వీరిద్దరూ దశమంలో బలంగా ఉండటమే. చంద్రలగ్నాత్ ఈ యోగం చతుర్ధ కేంద్రంలో ఉండి దశమాన్ని బలంగా చూస్తున్నది. ఇప్పుడు బుధ మహర్దశలో చివరి ఘట్టం అయిన శని అంతర్దశ జరుగుతున్నది.అందులో మళ్ళీ సూర్య విదశ జరుగుతున్నది. బుధ, శని సూర్యులు దశమంలో ఉంటూ ఈయన్ను మన దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసారు.

ఈ ముగ్గురిలో లగ్నాధిపతిగా సూర్యుడు ఈయన్ను సూచిస్తే, తెలివైన వ్యూహవేత్తగా బుధుడు అమిత్ షానూ, ఖచ్చితమైన క్రమశిక్షణతో పనిచేసే తత్త్వం ఉన్న శనీశ్వరుడు మోడీనీ సూచిస్తున్నారు. వెరసి బుధ శనులు ఇద్దరూ కలసి సూర్యుడిని గద్దె నెక్కించారని మనం భావించాలి. అదే నిజం కూడా.

ఈయన జాతకంలో 2018 నుంచీ రాబోయే కేతుమహార్దశ ఏడు సంవత్సరాలుంటుంది. ఈ ఏడు సంవత్సరాలు నల్లేరు మీద నడక ఏమీ కాదు.మత కలహాలు సృష్టించడం ద్వారా ఈయన్ను ఇబ్బంది పెట్టాలని చూచేవాళ్ళు ఉంటారు. కనుక ఒడిదుడుకులు తప్పవు. ఈ ఒడిదుడుకులన్నీ కేతువు నుంచి శత్రుస్థానంలో ఉన్న గురువు వల్ల, అంటే, మతపరమైన విషయాల వల్ల సంభవిస్తాయి. కానీ ద్వాదశంలో ఉన్న కేతువు వల్ల వాటిని తన రహస్య ప్లానింగ్ తో ఎదుర్కొని గెలుపును సాధిస్తాడు.

ఈయన ప్రమాణ స్వీకారం 19-3-2017 నాడు 14.15 కి లక్నోలో జరిగింది.ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని గమనిద్దాం.

గోచారరీత్యా శనీశ్వరుడు జననకాల చంద్రునికి లాభస్థానంలోకి వచ్చి ఉన్నాడు. శని గోచారం గురించి గత పోస్టులో నేను వ్రాసిన ఫలితాలు ఈ జాతకంలో ఖఛ్చితంగా జరగడం గమనించండి. అలాగే సూర్య బుధులు కూడా జననకాల సూర్యబుధులకు లాభస్థానంలోకి వఛ్చి ఉండటం గమనించండి.అందుకే ఇతనికి ఈ లాభం దక్కింది.

లగ్నం మృదు స్వభావ రాశి అయిన కర్కాటకం అయింది. లగ్నాధిపతి చంద్రుని పంచమ నీచస్థితి కుజుని దశమ కేంద్రస్థితివల్ల భంగమై పోయింది.కనుక కొందరి భయాలను అపోహలను పటాపంచలు గావిస్తూ అందరికోసం సుపరిపాలన సాగుతుంది. 

అయితే అంతర్లీనంగా హిందూత్వ భావన తప్పకుండా ఉండే సూచనలున్నాయి.అది మంచిది కూడా. ఎందుకంటే నిజమైన హిందూత్వం ఎవరినీ ద్వేషించదు. అందరినీ కలుపుకుని పోవాలనే అది కోరుకుంటుంది.తొమ్మిదింట శుక్రుని ఉచ్చస్థితి ఆధ్యాత్మిక రంగానికి, పరిపాలనకూ మంచిది. అయితే బుధుని నీచస్థితివల్ల ముస్లిమ్స్ తో బాగున్నప్పటికీ హిందువులతోనే కొందరు మేధావులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. మొత్తం మీద దశమాదిపతి కుజుని దశమ స్థితివల్ల పరిపాలన బాగానే ఉంటుంది.చంద్ర బుధులతో సమస్యలు కన్పిస్తున్నాయి. ముస్లిమ్స్ తో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రామమందిరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయి.

ఈ రాజయోగి పరిపాలన ఉత్తరప్రదేశ్ లోని అందరికీ మంచి చెయ్యాలనీ, క్షీణిస్తున్న ధర్మాన్ని తిరిగి నిలబెట్టాలనీ ఆశిద్దాం.
read more " Yogi Adityanath horoscope analysis "

17, మార్చి 2017, శుక్రవారం

విజయనగరంలో ఒక వారం



మొన్నీ మధ్యన విజయనగరంలో ఒక వారం రోజులు ఉన్నాను. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి.


 

విజయనగరం మొత్తం గజపతి రాజాగారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజాగారంటే ఆ ఊరి ప్రజలకు ఇప్పటికీ మంచి భయభక్తులు ఎక్కువ.ఊరుకూడా పాతకొత్తల మేలుకలయికలా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సెంటర్లలో గంట స్థంభం సెంటర్ ఒకటి. అదే ఈ ఫోటో. గంట స్థంభం మీద ఆకాశంలో చంద్రుడిని చూడవచ్చు.

ఆటోల్లో ఊరంతా తిరిగేటప్పుడు ఆటోవాడితో మాటలు కలిపాను. రాజుగారంటే వీళ్లకు ఎంత భక్తో అప్పుడు తెలిసింది. 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న నేలంతా మా రాజుగారిదే. దానిని మిగతా రాజులకు దానం చేసేశారు అని అతను అంటుంటే నాకు నవ్వాగలేదు. పోనీలే అతని నమ్మకాన్ని మనమెందుకు చెడగొట్టాలి? అని మాట్లాడకుండా విన్నాను'. 





విజయనగరం మహారాజా కళాశాల చాలా పాతది.ఇది 1879 లో స్థాపించబడింది. ఇక్కడి రాజుల ఔదార్యం గొప్పది.తమ కోటలు భవనాలు అన్నిటినీ విద్యాలయాలుగా ఎప్పుడో ఇచ్ఛేశారు. ఇప్పుడు వాటిలో స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి.వారు చేసిన పని చాలా దూరదృష్టితో చేశారని నా ఉద్దేశ్యం.లేకుంటే ఆ కోటలన్నీ పాడుబడిపోయి ఉండేవి. ఈ కాలేజీలో చాలామంది పెద్దవాళ్ళు చదివారు. హెరిటేజ్ లుక్ తో అప్పటినుంచీ అలాగే మేనేజ్ చెయ్యబడుతూ వస్తున్నది.మనకు హెరిటేజ్ కట్టడాలంటే బాగా ఇష్టం గనుక దానిదగ్గర ఒక ఫోటో తీసుకోవడం జరిగింది.





గురజాడ అప్పారావు గారి ఇల్లు మంచి సెంటర్లో కోట దగ్గరగానే ఉంటుంది. దీనిని ఇప్పుడు గ్రంధాలయంగా మార్చారు. దీని దగ్గరలోనే కన్యాశుల్కం కధ అంతా జరిగిన సానివీధి ఉందని రత్న చెప్పింది. ఆ వీధి పేరు అలాగే ఉంటె బాగుండదని ఈ మధ్యనే దానిని శివాలయం వీధిగా మార్చారట. రోడ్ వైడెనింగ్ లో కూడా ఈ ఇంటిని కూల్చకుండా అలాగే ఉంచడం మునిసిపాలిటీ వారి ఔదార్యాన్ని చాటుతున్నది.ఈ ఇల్లు పాతకాలంలో లాగే ఉండి చిన్నప్పటి పల్లెటూళ్ళ స్మృతులను గుర్తుకు తెచ్చింది.



మా అమ్మాయి స్కూటర్ మీద రాత్రిపూట  విజయనగరంలో విహారం. ఊరు పెద్దదేమీ కాదు. ఒక రెండు గంటల్లో ఊరంతా తిరిగేయ్యచ్చు.కాసేపట్లో ఊరంతా అర్ధమై పోయింది. మేమున్న ఏరియా పేరు పూల్ బాగ్. పాతకాలంలో ఇది రాజుగారి ప్రియురాళ్లు ఉండే పూలతోట ఏరియా అట. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మూడులాంతర్ల సెంటర్. మా వెనుకగా పైడితల్లి ఆలయాన్ని చూడవచ్చు..


మేమున్న ఇంటి దగ్గరలోనే కుమారస్వామి ఆలయం ఉన్నది. అందులో ఉన్న పెద్ద విగ్రహం రాత్రిపూట ఇలా దర్శనమిస్తుంది.దీనిని మలేషియా కుమారస్వామి విగ్రహం మోడల్లో కట్టారు. 



మేము అక్కడ ఉన్న వారంలో రెండ్రోజులు మధ్యాన్నం నుంచి మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసింది. అప్పుడు మేఘావృతమై ఉన్న ఆకాశం ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. దూరంగా కనిపించేది రాజుగారి ఒకానొక కోట ఉన్న కొండ. రాజుగారి కుటుంబంలో ఎవరికో ఒకాయనకు కుష్టువ్యాధి వస్తే ఆయనకోసం దూరంగా కొండమీద ఒక కోట కట్టించి అందులో ఆయన్ను ఉంచారట. ఆ కొండే దూరంగా కనిపిస్తున్నది.దాని పక్కన రామతీర్ధం కొండా కనిపిస్తూ ఉంటుంది. 


రాత్రిపూట డాబామీద కూచుని పాలకోవా, బజ్జీలూ లాగిస్తూ వింటుంటే ఎక్కడో పెళ్లి ఆర్కెస్ట్రా పాటలు వినిపించాయి. మనవైపు అయితే అన్నీ లేటెస్ట్ సినిమా పాటలే వినిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం పాత సినిమాలలోని - 'కోటలోని మొనగాడా వేటకు వచ్చావా? ' , ' నెలవంక తొంగిచూచింది చలిగాలి మేను సోకింది' అనే పాటలు పాడుతున్నారు.వినసొంపుగా అనిపించింది.నేనూ వెళ్లి నాలుగు పాటలు పాడదామని అనుకున్నా గాని మనం అడుగు పెట్టి వాళ్ళ బిజినెస్ చెడగొట్టడం ఎందుకులే అని జాలేసి వదిలేశాను.




బయలుదేరే రోజున రైల్వే స్టేషన్లో సెండాఫ్.నాకోసం ఇంటినుంచి ఫ్లాస్క్ లో టీ తెచ్చింది రత్న.పాపం ఎంత శ్రద్ధగా తయారు చేసిందో? క్రిందటిరోజే మా అమ్మాయికి 'ఈరోజు నుంచీ టీ మానేస్తున్నాను' అని మాటిచ్చినప్పటికీ, రత్న ఎంత శ్రద్ధగా చేసుకుని తెచ్చిందో అన్న ఒక్క ఆలోచన వచ్చేసరికి ఆ ప్రామిస్ ని పక్కన పెట్టి చక్కగా 'టీ' లాగించేశాను. అదే నేను త్రాగిన ఆఖరు 'టీ'. గుర్రుగా చూచిన మా అమ్మాయికి ఇలా చెప్పాను. 'రూల్స్ ని పాటించడమే కాదు వాటిని ఎక్కడ రిలాక్స్ చెయ్యాలో కూడా మనకు తెలిసి ఉండాలి.నియమాలు పాటించడంలో మూర్ఖత్వం పనికిరాదు.మన నియమాల కోసం ఇతరులను బాధపెట్టకూడదు.'



దారిలో విశాఖపట్నం స్టేషన్లో వెంకటరాజుగారు కలిశారు. నేను జూలైలో అమెరికానుంచి తిరిగి వఛ్చిన తర్వాత విజయనగరంలో ఒక వారం ఉండి అక్కడ ఒక స్పిరిట్యువల్ రిట్రీట్ పెడదామని నిశ్చయించాం. అదే సమయంలో శ్రీకూర్మం, అరసవిల్లి, రామతీర్ధం, భీమిలీ మొదలైన ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకుని గుడ్ బై చెప్పుకున్నాం.


తిరుగు ప్రయాణంలో పై బెర్తెక్కి అది నిద్రా? ధ్యానమా? లేక పరధ్యానమా? అదిమాత్రం అడక్కండి.
read more " విజయనగరంలో ఒక వారం "

15, మార్చి 2017, బుధవారం

నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు

Cord around the neck of fetus
జ్యోతిష్యశాస్త్రంలో నాళీవేష్టిత జననాన్ని ఒక చెడు శకునంగా భావిస్తారు. నాళీవేష్టిత జననం అంటే బొడ్డుత్రాడును తన మెడ చుట్టూ వేసుకుని శిశువు పుట్టడం. కొంతమంది శిశువులలో ఇది ఉరిత్రాడులా మెడకు బిగుసుకుని శిశువు నీలంగా మారడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని మరీ చెడు శకునంగా భావిస్తారు.కొన్నిసార్లు బొడ్డుత్రాడును జంద్యంలాగా వేసుకుని మరీ శిశువు పుట్టడం జరుగుతుంది. ఇది కూడా దోషమేనని భావిస్తారు.

Cord as a thread around the body
సామాన్యంగా ఇలాంటి శిశువు పుట్టడం తండ్రికి మేనమామకు దోషంగా భావిస్తారు. దానికి దోష పరిహారాలు కూడా మన గ్రంధాలలో చెప్పబడ్డాయి. ఇవిగాక కొన్ని కొన్ని  కులాలలో కొన్ని రకాలైన వింత ఆచారాలు కూడా ఆచరణలో ఉన్నాయి. నవీనులు వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తున్నప్పటికీ, వీటి వెనుక మనకు తెలియని ఎంతో విజ్ఞానం దాగి ఉన్నదన్నమాట చాలా నిజం.

ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదు.ప్రకృతిలోని ప్రతి సంఘటనకూ, కనీసం ఒక పిట్ట అరిచినా సరే, దానికీ ఒక అర్ధం ఉంటుంది.ఈ అవగాహన నుంచీ పరిశీలన నుంచీ పుట్టినదే శకున శాస్త్రం. శకునాలు చాలామంది నమ్మరు కానీ అవి నిజాలే. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని తద్వారా మనం ప్రవర్తించడం నేర్చుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పుకోవచ్ఛు.

మనం మూఢ నమ్మకాలని భావించేవి నిజానికి ఎంతో పరిశీలన నుంచి పుట్టిన వాస్తవాలు.వాటిని అంత తేలికగా కొట్టి పారవెయ్యడానికి వీలులేదు.ప్రకృతిలో ఏదీ వేస్ట్ కాదు. మనకు అర్ధంకాని ప్రతిదానినీ మూఢనమ్మకం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇలాంటి జననం కలిగిన శిశువుల జాతకాలలో రాహుకేతువుల దోషాలు తప్పకుండా ఉంటాయి. సామాన్యంగా వారి వంశాలలో నాగదోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక సర్పం శిశువు మెడ చుట్టూ చుట్టుకుని బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లుగా ఇది ఉంటుంది. ఇదే నాగదోష ప్రభావానికి సూచన.

సూక్ష్మంగా గమనిస్తే ఇలాంటి శిశువులు పెరిగి పెద్దయే కొద్దీ వారికి వచ్ఛే రోగాలకూ, ఈ నాళీవేష్టిత జననానికి సంబంధాలు చక్కగా కనిపిస్తాయి. మోడరన్ మెడిసిన్ కూడా ఈ లింకులను ఇప్పుడు ఒప్పుకుంటున్నది.

శిశువు మెడచుట్టూ బొడ్డుత్రాడు గట్టిగా బిగుసుకున్నప్పుడు అమ్మ పొట్టలోని ఆ శిశువుకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి శ్వాస క్రియ లేకున్నప్పటికీ ఆ శిశువుకు ఊపిరాడనట్లు ఫీలింగ్ ఉంటుంది. అదొక ట్రామా కండిషన్ వంటిది. గర్భంలో ఉన్నప్పుడు గాని, లేదా డెలివరీ టైం లో గాని ఇలాంటి ట్రామా కండిషన్ ఎదుర్కొన్న శిశువులు సామాన్యంగా పెరిగి పెద్దయ్యాక ఆస్త్మా పేషంట్స్ గా, బీపీ పేషంట్స్ గా, హార్ట్ పేషంట్స్ గా మారతారు.ఏదైనా విపత్కర పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పుడు వారికి ఊపిరి అందదు. ఛాతీని చేత్తో పట్టుకుని కూచుండి పోతారు.లేదా ఎగశ్వాస పెడతారు. మెట్లెక్కేటప్పుడు కూడా ఇలాంటి వారికి ఆయాసం వస్తుంది.ఇది ఒకరకమైన హార్ట్ కండిషనే. దీనికంతా కారణం పుట్టుక సమయంలో వారికి కలిగిన ఊపిరాడని పరిస్థితే. ఆ జ్ఞాపకం వారి అంతచ్ఛేతనలో నిక్షిప్తమై పోయి ఇలాంటి పరిస్థితులను వారి భవిష్యత్ జీవితంలో కల్పిస్తుంది. ఏదైనా క్రైసిస్ వారి జీవితంలో వఛ్చినపుడు నేటల్ ట్రామా మెమరీ మళ్ళీ ట్రిగ్గర్ చెయ్యబడుతుంది. ఇదంతా "బొడ్డుత్రాటి ఉరి" ప్రభావమే.ఇదంతా నిజమేనని ఇప్పుడు మోడరన్ మెడిసిన్ కూడా ఒప్పుకుంటున్నది.ఇటువంటి రోగాలు రావడానికి కూడా జాతకంలోని నాగదోష ప్రభావమే కారణం.

మీకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నాను. ఇది యోగదృష్టి ఉన్నవారికి మాత్రమే అర్ధమయ్యే నిజం.

పుట్టుక సమయంలో బొడ్డుత్రాడు మెడచుట్టూ చుట్టుకొని నీలంగా మారి పుట్టిన పిల్లలు, గత జన్మలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నవారై ఉంటారు. ఇది వారి జాతకంలో స్పష్టంగా దర్శనమిస్తుంది.జాతకచక్రాన్ని సరిగ్గా డీకోడ్ చెయ్యడం చేతనైతే ఈ విషయాన్ని ఆయా జాతకాలలో స్పష్టంగా చూడవచ్చు.చనిపోయేటప్పుడు ఉన్న పరిస్థితే మళ్ళీ తిరిగి పుట్టే సమయంలో కూడా ఉంటుందనేది మన భగవద్గీతతో సహా ఎన్నో మార్మిక విజ్ఞానగ్రంధాలు చెబుతున్న వాస్తవం. అందుకనే, చనిపోయే సమయంలో ఉరితో ఊపిరాడక చనిపోయినవారు ఈ జన్మలో ఈ విధంగా బొడ్డుత్రాడు మెడచుట్టూ బిగింపబడి ఊపిరాడని పరిస్థితిలో పుడతారు. 

జీవియొక్క జన్మ పరంపరలలో ఏ అనుభవమూ ఎక్కడా మిస్ అవదు.గతజన్మ అనుభవాలే ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడా బ్రేక్ అనేది రాదు.ఇవన్నీ సూక్ష్మమైన మార్మిక కర్మరహస్యాలు.

మీరు దిమ్మెరపోయే ఇంకొక రహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతాను.


Surukuku Snake found in South America
ఇలా జన్మించి నీలంగా మారిన శిశువులకు హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు ఉన్నది. దానిని అతి కొద్దీ మోతాదులో వాడితే వెంటనే ఆ నీలం రంగు పోయి శిశువుకు ఊపిరంది దానికి పునర్జన్మ వస్తుంది. దానిపేరు 'లేకసిస్'. అసలైన విచిత్రం ఏమంటే, ఈ మందును బ్రెజిల్ లోని అత్యంత ప్రమాదకరమైన 'సురుకుకు' అనే పాము విషం నుంచి తయారు చేస్తారు.

నాగదోషంతో పుట్టిన పిల్లల జీవన్మరణ సమస్యకు సర్పవిషంతో తయారైన ఔషధమే జీవితాన్ని ప్రసాదించడం విచిత్రంగా లేదూ? ఇదే జ్యోతిష్యశాస్త్రానికి హోమియోపతికీ ఉన్న రహస్యమైన లింక్. ఈ రెండు శాస్త్రాలలో ఇలాంటి కర్మ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్ఛుకు ఒకటి మాత్రం మీకు పరిచయం చేశాను.

నాళీవేష్టిత జననం అనేది ఖఛ్చితంగా నాగదోషమే అందులో ఏమీ అనుమానం లేదు.తెలివిలేనివారు నమ్మకపోవచ్చుగాక. కానీ ఇది వాస్తవమే. ఇలాంటి పిల్లల జీవితాలు పరిశీలిస్తే,ముందు ముందు వారికి ఎదురయ్యే సమస్యలు గాని, వారికి వచ్ఛే రోగాలు గాని, దీనికి అనుగుణంగానే ఉంటాయి. ఇది నూటికి నూరు శాతం నిజం. సరిగ్గా గమనించడం చేతనైతే,  ఈ దోషాన్ని వీరి జీవితాలలో అనేక సందర్భాలలో మనం చూడవచ్చు. 

నాగదోషం అనేది నిజమే. ఇది మనిషిని ఎన్నో రకాలుగా వెంటాడుతుంది.నాస్తికులు హేతువాదులు నమ్మినా నమ్మకపోయినా ఇందులో నిజం ఉన్నది.మన దేశంలో మూలమూలలా ఉన్న నాగారాధన ఊరకే పనీపాటా లేనివాళ్ల సృష్టి కాదు. ఎన్నో వేల సంవత్సరాల పరిశీలనా పరిశోధనా దీనివెనుక ఉన్నాయన్నది వాస్తవం.

ఇలా వ్రాసినంత మాత్రం చేత నేను కుహనా జ్యోతిష్కుల మోసాలనూ, పల్లెల్లో నాగదోషం పేరు చెప్పి మోసగాళ్లు చేసే మోసాలనూ సమర్ధిస్తున్నానని అనుకోకండి. అలాంటి వేషాలను నేనస్సలు సమర్ధించను. అంతమాత్రం చేత నాగదోషం మూఢనమ్మకమంటే కూడా నేను ఒప్పుకోను. ఇది మూఢనమ్మకం కాదు.సూక్ష్మ పరిశీలనలో మాత్రమే అందే నిజం.

Disclaimer:-- ఈ పోస్ట్ చదివి, అప్పుడే పుట్టిన పిల్లలకు 'లేకసిస్' మందును పొరపాటున కూడా వెయ్యకండి. దీనిని అనుభవం ఉన్న వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఒకవేళ ఎవరైనా ఆ సాహసానికి ఒడిగడితే అప్పుడు జరిగే దుష్పరిణామాలకు నాకు బాధ్యత లేదని గమనించండి.

హోమియోపతి అనేది ఒక విశిష్ట వైద్య విధానం.ఇందులో ఈ రోగానికి ఈ మందు అని స్పెసిఫిక్స్ ఉండవు.రోగం ఒకటే అయినా మనిషిని బట్టి మందు మారిపోతుంది.కనుక ఈ కండిషన్ కు లేకసిస్ ఒక్కటే మందు అని భ్రమించకండి. 
read more " నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు "

13, మార్చి 2017, సోమవారం

బాలీవుడ్ స్టార్ రాజ్ కిరణ్ ఏమయ్యాడు?

జగ్జీత్ సింగ్ అభిమానులకు రాజ్ కిరణ్ పేరు తప్పకుండా గుర్తుంటుంది. ఎందుకంటే జగ్జీత్ సింగ్ పాడిన సోలో సినిమా పాటల్లో మరపురాని మధురగీతం 'తుమ్ ఇత్ న జో ముస్కురా రహేహో క్యా గం హై జిస్ కో చుపా రహే హో' లో షబానా అజ్మీతో బాటు నటించినది రాజ్ కిరణే గనుక. ఈ పాట Ardh అనే సినిమాలోది. ఆ సినిమాలో ఉన్న మూడు మరపురాని పాటలూ అతనిపైన తీసినవే.

అయితే, ప్రస్తుత విషయం అది కాదు. 1970-80 దశకంలో బాలీవుడ్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన రాజ్ కిరణ్ ప్రస్తుతం ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 1998 ప్రాంతంలో అతను హటాత్తుగా మాయమై పోయాడు. ప్రస్తుతం గత 15 ఏళ్ళుగా అమెరికాలోని అట్లాంటాలో ఒక పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్ గా ఉన్నాడని కొందరూ, లేదు న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకు గడుపుతున్నాడని కొందరూ అంటున్నారు. మొత్తం మీద దాదాపు గత పది ఏళ్ళు పైగా అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.

బాధాకరమైన విషయం అదొక్కటే కాదు.

ఇతను దివంగత సత్యసాయిబాబాకు వీరభక్తుడు. ఎన్నో అద్భుతాలు చేశానని కట్టుకధలు చెప్పుకునే బాబా ఇతన్ని ఏమీ రక్షించలేకపోయాడు. రాజ్ కిరణ్ 150 పైన సినిమాలలో నటించాడు.బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు.కానీ తన సంసారజీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. ఇతని మానసికపరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల భార్యాపిల్లలు ఇతనికి క్రమేణా దూరమయ్యారు.బాబా తనను రక్షిస్తాడన్న పిచ్చినమ్మకంతో ఇతను 1996 లో బెంగుళూరు వెళ్లి వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఉన్న బాబాను కలిశాడు. కానీ బాబా ఇతన్ని పట్టించుకోకుండా తన అనుచరుల చేత ఆశ్రమం బయటకు నెట్టించాడు.

అప్పటికే రాజ్ కిరణ్ కెరీర్ దెబ్బతిని ఉన్నది. బడాబడా వాళ్ళను మాత్రమే తన దగ్గరకు రానిచ్చే బాబాకు సినిమాలు లేని నటుడితో పనేముంటుంది? దాంతో ఇంకా మతి చలించిన రాజ్ కిరణ్ తను గుడ్డిగా నమ్మిన సాయిబాబాను ఎలాగైనా కలవాలన్న పిచ్చి ఉద్రేకంలో ఒక నిచ్చెన వేసుకుని ఆశ్రమం గోడను ఎక్కుతూ సెక్యూరిటీ వాళ్లకు దొరికిపోయాడు. సత్యసాయిబాబా మీద హత్యాప్రయత్నం చేస్తున్నాడన్న అభియోగం ఇతనిమీద మోపి ఇతన్ని 11-6-1996 న బెంగుళూరు సెంట్రల్ జైల్లో పెట్టారు. దీనివెనుక పుట్టపర్తి పెద్దల హస్తం ఉన్నదని తెలిసినవాళ్ళు అంటారు.

మతిస్థిమితం సరిగ్గా లేని స్థితిలో ఒక నెలరోజులు దయనీయమైన పరిస్థితిలో జైల్లో ఉన్న తర్వాత 11-7-1996 న ఇతని తండ్రి బాంబే నుంచి వచ్చి బెయిల్ ఇచ్చి కొడుకును జైలు నుంచి విడిపించుకుని తీసికెళ్ళాడు.

ఆ తర్వాత ఇతనికి కొన్ని నెలలపాటు బాంబేలో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ సమయంలో, బైకుల్లాలోని ఒక పిచ్చాసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు ఇతని స్నేహితులతో ఒకడు, ఇతని డైరెక్టర్ కూడా అయిన మహేష్ భట్ వెళ్లి ఇతన్ని పరామర్శించాడు. అక్కడా ఇతని పిచ్చి కుదరకపోవడంతో ఇతని అన్న ఇతన్ని అమెరికా తీసుకుపోయి అక్కడ పిచ్చాసుపత్రిలో చేర్చాడు. క్రమేణా పిచ్చి ఎక్కువై పోయి  న్యూయార్క్ లో ఒకనాడు ఎటో వెళ్లిపోయాడని అంటారు.

ఇతను నమ్మిన సాయిబాబా ఇతన్ని ఏ విధంగానూ ఆదుకోలేదు సరిగదా అబద్దపునేరం మోపి జైల్లో పెట్టించాడు. విచిత్రం ఏమంటే అదే సాయిబాబా తన చివరి రోజుల్లో తనూ దయనీయమైన పరిస్థితులలో చనిపోయాడు.పైగా తనే పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఉంచుకుని ! ఆ వివరాలు అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పనక్కర లేదు.

తనను గుడ్డిగా నమ్మిన అమాయకభక్తులను గాలికి ఒదిలేసి మోసం చేసిన నేరానికి బాబాకు భగవంతుడు విధించిన శిక్షేమో అది? సరే ఆయన సంగతి మనకెందుకు? ఆయన్ను అలా వదిలేసి మన కధలోకి వద్దాం.

దాదాపు పదిహేనేళ్ళ పాటు రాజ్ కిరణ్ ఏమై పోయాడో ఎవరికీ తెలియదు.చనిపోయాడని చాలామంది అనుకున్నారు. బాలీవుడ్ లో ఇతని అభిమానులు అందరూ గగ్గోలు పెట్టారు. స్టార్స్ లో ఇతని సహనటులూ మిత్రులైన దీప్తినావల్, రిషికపూర్ మొదలైన వాళ్ళు ఇతనెక్కడున్నాడా అని వాకబు చెయ్యడం మొదలెట్టారు.

2011 లో మరొక హిందీనటుడు రిషికపూర్ చెప్పినదానిని బట్టి, ఇతను అట్లాంటాలో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చబడ్డాడు. అప్పటినుంచీ అక్కడే దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నాడని కొందరి భావన. కానీ ఆ తరువాత, ఇతని కుటుంబం ఈ వార్తను ఖండించింది. ఆ ఆస్పత్రిలో వాకబు చేయగా, అక్కడెవరూ ఇలాంటివాళ్ళు లేరని వాళ్లకు తెలిసింది.

దీప్తినావల్ చెబుతున్న ప్రకారం అయితే, ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా ఇతను పనిచేస్తున్నాడు. అయితే, ఇతని గురించి ఖచ్చితమైన ఏ వివరమూ చెప్పడానికి ఇతని భార్యా కూతురూ ఏమాత్రమూ ఇష్టపడటం లేదు. 'అతనెక్కడున్నాడో మాకూ తెలియదు మేమూ అతని కోసం వెదుకుతున్నాం' అని మాత్రమే వారు చెబుతున్నారు. పైగా రిషికపూర్ కూ, దీప్తినావల్ కూ వాళ్ళు ఫోన్ చేసి - అనవసరంగా రాజ్ కిరణ్ కోసం వెదకొద్దు, అంతేకాదు మాకు అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వొద్దు. ఇదంతా మాకిష్టం లేదని తేల్చి చెప్పారట.

వచ్చే పోస్ట్ లో అతని జాతకాన్ని చూద్దాం.
read more " బాలీవుడ్ స్టార్ రాజ్ కిరణ్ ఏమయ్యాడు? "

30, జనవరి 2017, సోమవారం

'USA Panchawati' website ఈరోజు ప్రారంభం అయింది

గత ముప్పై ఏళ్ళుగా యోగ - వేదాంత - తంత్ర సాధనామార్గంలో నడచిన నేను ప్రత్యక్షంగా దర్శించిన సత్యాలను అనుభవాలను గుదిగుచ్చి నాదంటూ విభిన్నమైన సాధనా విధానాన్ని ఒకదాన్ని తయారు చేశాను. నా ఈ మార్గం నచ్చి దానిలో నడవాలని ఆరాటపడుతున్న వాళ్ళంతా కలసి "పంచవటి" అని ఒక ఫౌండేషన్ ప్రారంభించాం.ఈ దారిలో నడుస్తూ నన్ననుసరిస్తున్న వారు ఇండియాలోనూ అమెరికాలోనూ చాలామంది ఉన్నారు.

మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు రెండు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇండియా ఫౌండేషన్ కు ఒకటి. అమెరికా ఫౌండేషన్ కు ఒకటి. ఇండియా వెబ్ సైట్ చాలా కాలం నుంచీ ఉంది.నా ఇండియా శిష్యులు ఈ మధ్యనే దీనికి కొత్తగా మార్పులు చేర్పులు చేసి కొంగ్రొత్త రూపాన్నిచ్చారు.వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు.

మేమేం తక్కువ తిన్నామా అంటూ నా అమెరికా శిష్యులు శిష్యురాళ్ళు  కలసి USA Foundation Web Site ను చాలా కష్టపడి తయారు చేశారు. అది ఈరోజు ప్రారంభం చెయ్యబడింది. దీని వెనుక ఎంతో ప్లానింగ్, ఎంతో శ్రమా దాగి ఉన్నాయి.సైట్ డిజైన్, ఫీచర్స్ అన్నీ  చాలా బాగున్నాయి. ఈ పాజెక్ట్ లో పాలు పంచుకున్న USA Team Members అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మొదట్లో ఒకే వెబ్ సైట్ ఉంటె బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇండియా పౌండేషన్ కార్యక్రమాలు వేరు. అమెరికా ఫౌండేషన్ కార్యక్రమాలు వేరు, రెండింటి కార్యవర్గ సభ్యులు వేర్వేరు గనుక ప్రస్తుతానికి రెండు సైట్స్ గా ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు మేం చేస్తున్న కార్యక్రమాలు ఆయా సైట్స్ లో ఆడియో వీడియోలుగా ఫోటోలుగా ఉంచబడతాయి.

USA web site ను చూడటం కోసం ఇక్కడ నొక్కండి.
read more " 'USA Panchawati' website ఈరోజు ప్రారంభం అయింది "

24, జనవరి 2017, మంగళవారం

శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు

26-1-2017 గురువారం నాడు, పూర్వాషాఢ నక్షత్ర పరిధిలో మధ్యాన్నం 2 గంటల 07 నిముషాలకు శనీశ్వరుడు రెండున్నరేళ్ళుగా తానుంటున్న వృశ్చికరాశిని వదలిపెట్టి ధనూరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఈ రాశిమార్పు ఎందరి జీవితాలలోనో పెనుమార్పులు తీసుకు రాబోతున్నది. ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనిషి జీవితం మీద గ్రహప్రభావం ఉండటం నిజమే. దీనివల్ల మనిషి జీవితంలో అనేక మార్పులు చేర్పులు కలగడమూ నిజమే.

జ్యోతిశ్శాస్త్రంలో శనీశ్వరుని కర్మకారకునిగా భావిస్తారు. అంటే - సామాన్యంగా మనిషి చేసే రోజువారీ కర్మ గాని, అతను బ్రతకడం కోసం చేసే వృత్తి గాని ఈయన ఆధీనంలోనే ఉంటుంది. శనీశ్వరుని ప్రభావానికి గురికాని వ్యక్తి  ఈ భూమిమీద ఎవడూ ఉండడు.రాజులైనా బంటులైనా ఆయన చెప్పినట్లు వినవలసిన వారే.

జాతకంలో శనీశ్వరుని స్థితిని బట్టి ఆ జాతకుని వృత్తిలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా గ్రహించవచ్చు. ప్రస్తుతం 26 తేదీన జరుగబోతున్న ఈ గోచారం, ద్వాదశ రాశులను ఎలా ప్రభావితం చేస్తుందో స్థూలంగా చూద్దాం.

నక్షత్ర ఫలితం:--
నక్షత్రాధిపతి అయిన శుక్రుడు (వింశోత్తరీ దశా రీత్యా) కేతువుతో కలసి శనిరాశి అయిన కుంభంలో ఉన్నందువలన - అనేకమంది భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది.వీరిలో కొంతమంది విడాకులు తీసుకుంటారు.మరికొందరు అలా తీసుకోకుండానే విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. వీరు గాక ఇంకా ఎంతోమందికి అభిప్రాయ భేదాలు వచ్చి మానసికంగా వారిమధ్యన అగాధాలు ఏర్పడటం జరుగుతుంది. దీనికి నిదర్శనంగా ఎంతోమంది కుటుంబాలలో ఇప్పటికే గొడవలు తారాస్థాయికి చేరుతూ ఉండటాన్ని గమనించండి.

అలాగే - స్నేహితులు గాని, కుటుంబ సభ్యులుగాని,సంస్థలుగాని, మిత్రరాజ్యాలు గాని, చాలాకాలంగా కలిసున్నవారు - వారి మధ్యన విభేదాలు వచ్చి విడిపోవడం తప్పకుండా జరుగుతుంది.

వార ఫలితం :-- 
వారాధిపతి మరియు హోరాధిపతి అయిన గురువుపైన శుక్రోచ్చరాశియగు మీనం నుంచి కుజుని దృష్టి వల్ల,శని గోచారం జరుగుతున్న ధనుస్సు గురురాశి కూడా కావడం వల్ల - అనేకులలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోతుంది.కానీ అది ప్రాక్టికల్ గా శుద్ధంగా ఉండకుండా, ఉత్తగా గ్రంధాలు చదవడం,వాద ప్రతివాదాలు చేసుకోవడంతోనే అదంతా అంతమౌతుంది.అనవసర మాటలవల్లా,ఆడవారి వ్యవహారాల వల్లా,గురువులకు చెడ్డపేరు రావడం,వారిపైన విమర్శలు మేధోపరమైన దాడులు జరగడం చూస్తారు.గురువులకు ఖర్మ ఎక్కువౌతుంది.

ఈ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.గమనించండి.

మేషరాశి
దూరపు వ్యక్తులు దగ్గరౌతారు.దూరపు ప్రాంతాలకు బదిలీలు అవుతాయి.కొత్త ఉద్యోగాలు వస్తాయి.జీవితంలో కొత్త మలుపులు ఎదురౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.తండ్రికి, గురువుకు లేదా పెద్దలకు గండకాలం.

వృషభరాశి
అష్టమశని ప్రారంభం అవుతుంది.దీని ఫలితంగా మానసిక వత్తిడి, క్రుంగుబాటు, నలుగురితో విరోధం, అనవసర మాటలు ఎక్కువౌతాయి.అనేక కష్ట నష్టాలు చుట్టు ముడతాయి.

మిథునరాశి
దూరప్రాంతాలకు మార్పు ఉంటుంది. పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం జరుగుతుంది. విరక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోతారు.లేదా అలాంటి ఆలోచనలు కలుగుతాయి. చుట్టు పక్కల వారితో మాటా మంతీలో అభిప్రాయ భేదాలవల్ల పరస్పర సంబంధాలు దెబ్బ తింటాయి.

కర్కాటకరాశి
ఇంటిలో గొడవలు పెరుగుతాయి. చర్చలు జోరుగా జరుగుతాయి. శత్రుబాధ, పోరు మిక్కుటంగా ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి
రహస్య ప్రేమ వ్యవహారాలు,స్నేహాలు పెరుగుతాయి. ఇంకొందరిలో ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.నిర్లిప్తతా వైరాగ్యమూ పెరిగిపోతాయి.నెగటివ్ థింకింగ్ ఎక్కువై నీరస పడిపోతారు.ఏం చెయ్యాలో అర్ధంకాని సందిగ్ధ పరిస్థితి ఎదురౌతుంది.ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
అర్దాష్టమ శని మొదలౌతుంది.ఇష్టంలేని ఉద్యోగాలు చెయ్యవలసి వస్తుంది.చదువు లేదా ఉద్యోగ రీత్యా ప్రాంతపు మార్పు ఉంటుంది.ఇంటిలో మనశ్శాంతి కరువై పోతుంది. కుటుంబ వ్యవహారాలు చీకాకును సృష్టిస్తాయి.మనసు డిప్రెషన్ లో పడుతుంది.

తులారాశి
ఏడున్నరేళ్ళుగా వీరు పడుతున్న ఏలినాటి శని వదలి పోతుంది.కనుక వీరిని విజయాలు వరిస్తాయి.వెలుగు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనిపిస్తుంది.మాట చెల్లుబాటవుతుంది.తరచూ ప్రయాణాలు ఊపందుకుంటాయి. అయితే వాటిల్లో ప్రమాదాలు జరిగే సూచన కూడా ఉన్నది.

వృశ్చికరాశి
వీరికి ఏలినాటి శని మూడవ పాదం మొదలైంది. కనుక ఇంటివారితో, స్నేహితులతో అనవసర మాటల వల్ల గొడవలు అవుతాయి. ఒకటి చెబితే ఇంకొకటిగా అర్ధం చేసుకోబడుతుంది. ఇది మనస్పర్ధలకు దారితీస్తుంది.కంటి రోగాలు బాధిస్తాయి. డబ్బు నష్టపోతారు.

ధనూరాశి
అందరిలోకీ ఈ రాశివారు బాగా నష్టానికి గురౌతారు.ఎందుకంటే వీరికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతుంది.అన్ని రంగాలలో వీరిని దురదృష్టం మొదలౌతుంది.మానసికంగా క్రుంగిపోయి ఒంటరివారౌతారు.అనవసర ఊహల వల్ల వాస్తవానికి దూరంగా జరిగి అంతర్ముఖులౌతారు.దీనివల్ల సమాజంతో వీరి సంబంధాలు దెబ్బతింటాయి. స్వయంకృతాపరాధాలు ఎక్కువౌతాయి.

మకరరాశి
వీరికి ఏలినాటి శని మొదలౌతున్నది.కనుక కష్టాలు మొదలౌతాయి. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఎదురౌతుంది. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆస్పత్రి ఖర్చులతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ నేపధ్యంలో నష్టాలు కష్టాలు ఉంటాయి.మానసిక చింత వెంటాడుతుంది.ప్రేమ వ్యవహారాలలో, భార్యాభర్తల గొడవలలో మనసు చాలా డిప్రెషన్ కు గురౌతుంది.

కుంభరాశి
వీరికి అంతా లాభంగా ఉంటుంది.రహస్య ప్రేమ వ్యవహారాలు మొదలౌతాయి.స్నేహితులు ఎక్కువౌతారు.అయితే దీనివల్ల ఇంటిలో మనస్పర్ధలు గొడవలు జరుగుతాయి.జీవిత భాగస్వామితో మానసికంగా దూరం పెరుగుతుంది.వ్యాపారం కలిసి వస్తుంది.సంఘంలో మంచి పేరు వస్తుంది.ధనానికి లోటు ఉండదు.అంతా లాభసాటిగా ఉంటుంది.

మీనరాశి
వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది.అయితే 'ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే' అనే ఒక విధమైన నిర్లిప్త ధోరణి ఎక్కువౌతుంది.ఇంటిలోనూ వృత్తిపరంగానూ అనేక మార్పులను చూస్తారు.ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇంటిని వదలి దూర ప్రాంతాలకు పోవలసి వస్తుంది.తనవారితో విరోధం కలుగుతుంది.వృత్తి పరంగా మార్పులు ఉంటాయి.
---------------------------------------
ఇవన్నీ స్థూలఫలితాలు మాత్రమే.ఎందుకంటే ప్రపంచ జనాభాను పన్నెండు రాశులుగా విభజిస్తూ ఈ ఫలితాలను అంచనా వెయ్యడం జరుగుతుంది.కనుక ఇవి బ్రాడ్ ఇండికేషన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకాలతో సమన్వయం చేసుకుని గోచార ఫలితాలను అర్ధం చేసుకోవాలి.

దానిని బట్టి తగిన రెమెడీస్ పాటించడం వల్ల చెడు ఫలితాలను నివారించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
read more " శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు "

19, జనవరి 2017, గురువారం

Donald Trump Oath taking Chart - Predictions

మీడియా వార్తల ప్రకారం రేపు మధ్యాన్నం పన్నెండు గంటల సమయంలో,వాషింగ్టన్ డీసీ లో,డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. ప్రెసిడెంట్ కుర్చీలో కూచున్నాక ఈయన తీసుకోబోయే నిర్ణయాల వల్ల ముందు ముందు ఎలా ఉంటుందో అని ఎందరికో అనేక భయాలున్నాయి.

ఈ ముహూర్త సమయ కుండలి ప్రకారం ఈయన ఏలబోయే రాజ్యం ఎలా ఉండబోతున్నదో,అసలు ఈయన చెప్పినవన్నీ చెయ్యగలడా, లేడా,మొదలైన విషయాలను గమనిద్దాం.

ఈ ముహూర్తం జ్యోతిష్యం వచ్చినవారు నిర్ణయించినదే అని తెలుస్తున్నది. ఎందుకంటే - సూర్యుడిని దశమంలో ఉంచుతూ మిట్టమధ్యాన్నపు అభిజిత్ లగ్నాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. దీనినే మన పల్లెల్లో "గడ్డపార ముహూర్తం" లేదా "పలుగు ముహూర్తం" అంటారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చాడా లేదా అనేది చూడటానికి ఒక పలుగును భూమిలో పాతి దాని నీడ పూర్తిగా మాయం అయినప్పుడు ముహూర్తంగా నిర్ణయిస్తారు.ఈ ముహూర్తం కూడా అదే.

అయితే సూర్యుడు ఊరకే దశమంలో ఉంటే సరిపోదు.ఆయన మంచి బలంగా కూడా ఉండాలి. అది లేనప్పుడు ఏదో అరకొర ఫలితాలే లభిస్తాయి.

ఈ చార్టులో సూర్యుని పరిస్థితి గందరగోళంగా ఉన్నది. గురుదృష్టి సూర్యునికి బలాన్నిస్తున్నప్పటికీ, శని దృష్టి దానిని బలహీనం చేస్తున్నది. సూర్యునికి రెండింట ఉన్న శుక్ర కేతువుల వల్ల అనేక రకాలైన స్కాండల్స్ కనిపిస్తున్నాయి. ద్వాదశంలో ఉన్న బుధునివల్ల రహస్య అజెండాలు దర్శనమిస్తున్నాయి.అష్టమంలోని రాహువు వల్ల ముస్లిం దేశాలతో శత్రుత్వం, నష్టం కనిపిస్తున్నాయి.

ఈ చార్టులో కనిపిస్తున్న మాలికాయోగం కూడా -- ఈయన పాలన అనేక ఎగుడు దిగుడులతో సాగుతుందని సూచిస్తోంది.

ఇప్పుడు ఫలితాలను గమనిద్దాం.

ఈరోజు పుష్య కృష్ణనవమి, శుక్రవారం, స్వాతీ నక్షత్రం అయింది. వార నక్షత్రాదిపతులైన శుక్ర, రాహువులను బట్టి ఈయన పాలసీ అంతా - ముస్లిమ్స్ ని అమెరికాలోకి రాకుండా కంట్రోల్ చెయ్యడం,సుఖవంతమైన జీవితం కోసం బ్రెజిల్ మొదలైన ఇతరదేశాలనుంచి అమెరికాలోకి వస్తున్న వలసదారులను కంట్రోల్ చెయ్యడం మొదలైన పనుల మీద ఉంటుందని ఊహించవచ్చు.

1.లగ్నాధిపతి కుజుని సున్నా డిగ్రీల బలహీన గండాంతస్థితివల్ల --  ఈయన టర్మ్ అనుకున్నంత సాఫీగా ఎదురులేకుండా ఏమీ ఉండదని తెలుస్తున్నది.కుర్చీలో కూచున్న తర్వాత ఈయనను అనేక సంకట పరిస్థితులు చుట్టుముడతాయి. తను చెప్పినవి అన్నీ చెయ్యడానికి అనేక అడ్డంకులు ఈయనకు ఎదురు వస్తాయి. కాకపోతే లోపల్లోపల తన ఎజెండాకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాడు.కానీ ఆ నిర్ణయాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. చెప్పినవన్నీ చెయ్యడం అంత సులువు కాదని ఈయనకు బాగా తెలిసి వస్తుంది.

2. చంద్రుని స్థితివల్ల -- ఈయనకు ప్రజాభిమానం ఊహించినంత ఉండదు. అభిమానం కంటే వ్యతిరేకతే ప్రజలలో ఈయనకు ఎక్కువగా ఉంటుంది.

3. రాహువు స్థితివల్ల -- అహంకారపూరితమైన నిర్ణయాలు విధానపరంగా తీసుకోవడం జరుగుతుంది. తను అనుకున్నదే కరెక్ట్ అనే దూకుడు ధోరణివల్ల నష్టపోవడం ఉంటుంది.ఈ ధోరణి వల్ల సన్నిహితులు కూడా క్రమేణా దూరం అవుతారు. ముస్లిం తీవ్రవాదులతో బద్ధవైరం ఉంటుంది. ఈయన పాలసీలన్నీ వాళ్ళను ఎలా కట్టడి చెయ్యాలి అన్నదాని మీదే కేంద్రీకృతం అవుతాయి.

4. గురువు స్థితివల్ల -- దూరదేశాలతో శత్రుత్వం ఎక్కువౌతుంది. మతపరంగా వివిధ వర్గాలతో విభేదాలు ఎక్కువౌతాయి.అయితే -- విపరీత రాజయోగం వల్ల వీటిల్లో కొంత మంచి కూడా చివరకు ప్రాప్తిస్తుంది.

5. శని స్థితివల్ల -- విధానపరమైన నిర్ణయాలవల్ల, శ్రామిక వర్గంతోనూ, పేదప్రజలతోనూ ముఖ్యంగా బ్లాక్స్ తోనూ ఇతనికి కుదరక, చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ కు సూచిక అయిన చైనాతో, ఇతర శ్రామిక కమ్యూనిస్టు దేశాలతో బద్ధ విరోధం ఏర్పడుతుంది. దశాంశలో శనీశ్వరుని నీచస్థితీ, ఆయనతో కలసిన బుధుని స్థితీ దీనినే సూచిస్తున్నది.

6. బుధుని స్థితివల్ల -- ఈయన ఇచ్చే స్టేట్ మెంట్స్ గాని, ఈయన కమ్యూనికేషన్ గాని అంతా గందరగోళంగా,రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. కొంతసేపు నిరంకుశంగా కొంతసేపు ప్రజారంజకంగా ఇలా ద్వంద్వ వైఖరితో సాగుతుంది.

7. సూర్యుని స్థితి వల్ల -- మన దేశానికి ఈయన పాలసీల వల్ల మేలూ కీడూ రెండూ జరుగుతాయి.అయితే మనం భయపడుతున్నంత తీవ్రమైన చెడు ఉండదు.క్వాలిటీ ఉన్న మన వర్క్ ఫోర్స్ కు ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల భయం ఉండవలసిన అవసరం ఏమీ లేదు.

8. కేతు శుక్రుల వల్ల -- ఇంటా బయటా ఈయనకు విభేదాలు ఎక్కువై తనవారితోనే క్రమేణా విడిపోవడాలు జరుగుతాయి. ఆడవాళ్ళతో స్కాండల్స్ వల్ల ఈయనకూ ఈయన అనుచరులకూ చెడ్డపేరు వస్తుంది. దశాంశలో నీచశుక్రుని స్థితికూడా దీనినే సూచిస్తున్నది. రాహు కేతు యాక్సిస్ యొక్క స్థితిని బట్టి, శుక్ర కేతువుల బాధకరాశి స్థితిని బట్టి, ముస్లిం తీవ్రవాదులతో అమెరికాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు.

9. నవాంశచక్రం ఎప్పుడూ రాశిచక్రం కంటే బలమైనది. దీనిలో ఒక ముఖ్యమైన సూచన ఉన్నది.కర్కాటకంలో ఉన్న నీచకుజ,బుధ,రాహువులను బట్టి అమెరికా ప్రజలలో దురహంకార ధోరణులు జాత్యహంకార ధోరణులు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతాయని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.

10. మీనంలో ఉన్న శని సూర్య యోగం -- ప్రజలకూ పాలకులకూ ఎప్పుడూ ఉండే అభిప్రాయ భేదాలనూ గొడవలనూ సూచిస్తున్నది.చతుర్ధమైన కర్కాటకం నుంచి దశమమైన మకరంవైపు ఉన్న రాహుకేతు ఇరుసు కూడా దీనినే సూచిస్తున్నది. కన్యనుంచి గురుదృష్టి అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే బలమైన రిపబ్లికన్ సపోర్ట్ ను  సూచిస్తే, ఉత్తర పశ్చిమ రాష్ట్రాలనుంచి ఉన్న డెమొక్రాటిక్ అసమ్మతిని కుంభంలోని చంద్రుడూ మీనంలోని శనీశ్వరుడూ సూచిస్తున్నారు. వెరసి ట్రంప్ పరిపాలన ఒక మిక్సెడ్ బ్యాగ్ కాబోతున్నదని ఈ యోగాలవల్ల తెలుస్తున్నది.

అమెరికా దేశపు సహజలగ్నం మిథునమనీ, ధనుస్సనీ అభిప్రాయ భేదాలున్నాయి. ఈ రెంటిలో ఏదైనా కూడా కొన్ని రోజుల్లో జరుగబోతున్న శనీశ్వరుని గోచారమార్పు ఈ రెంటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల రాబోయే రెండున్నరేళ్ళలో అమెరికాతో విదేశాల సంబంధాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే --అమెరికా ఫారిన్ పాలసీ విధానాలు ఇప్పటిదాకా ఉన్నదానికి విభిన్నంగా తీవ్రమైన మార్పుకు గురౌతాయి.

ఆ తర్వాత శనీశ్వరుడు మకరరాశిలో సంచరించే రెండున్నరేళ్లలో అమెరికా చాలా గడ్డుకాలాన్ని చవిచూస్తుంది. అది ఇంటా బయటా కూడా ట్రంప్ కు గడ్డు కాలమే. అంటే -- ఈయన టర్మ్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పేలవంగా ఉంటుందని ఆ సమయంలో అనేక సమస్యలను ఈయన ఎదుర్కోవలసి ఉంటుందని గోచారం చెబుతున్నది.
read more " Donald Trump Oath taking Chart - Predictions "

19, డిసెంబర్ 2016, సోమవారం

నోట్ల కష్టాలు - నోటి పద్యాలు

అందరినీ అల్లాడిస్తున్న నోట్ల కష్టాల మీద ఆశుపద్యాలను వినండి మరి.

ఆ|| రెండువేల నోటు రంగులీనుచు నుండు
మార్చబోయినంత మూర్ఛ వచ్చు
చిల్లరంచు వెదుక చీకాకు గలిగించు
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| మందు షాపు లందు మనుషులే కరవైరి
విందు హోటలేమొ వెలిసి పోయె
అందమెల్ల దిద్దు అందాల పార్లర్లు
బోసిపోయి మిగుల బోర్డు దిప్పె

ఆ|| రెండువేల నోట్లు నిండు జేబున బెట్టి
పాని పూరి దినగ పరువు బోయె
చిన్న నోట్లు లేక చింతాయె బ్రతుకంత
వంద నోటులున్న వాడె రాజు

ఆ|| రెండు వేలు దెచ్చి నిండుగా పెట్రోలు
వెయ్యి రూప్యములకు పొయ్యమన్న
చిల్లరడిగినంత ఛీకొట్టి పొమ్మంచు
భాష మార్చివేసె బంకు వాడు

ఆ|| రెండు టీలు దెచ్చి రంజుగా ఇమ్మంచు
ఆర్డరేసి నంత అట్లె నిలిచి
చిల్లరివ్వ మంచు చేజాచి బెదిరించె
వెయిటరొక్కరుండు వింతగాను

ఆ|| మిరపకాయ బజ్జి మింగబోయిన యంత
చిల్లరడిగె బండి శీనుగాడు
ఛాటు బండివాడు నోటీసు అతికించె
పిల్ల నోట్ల వారె ప్రిన్సులనుచు

ఆ|| మంచి హోటలనుచు లంచి జేయగబోయి
పట్టి పట్టి యచటి ఫుడ్డు మెక్కి
కార్డు ఇచ్చినంత క్యాషివ్వమనె వాడు
క్లీను జెయ్యమనుచు కిచెను జూపె

ఆ|| బారు షాపులెల్ల భోరుభోరున యేడ్చె
కూర గాయలేమొ కొక్కిరించె
పెట్టురోలు బంకు పెనుశాపమాయెరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| అతి ఖర్చుల్ ఆవిరులై
మితిమీరిన ఎచ్చులెల్ల మిస్టున గలసెన్
ప్రతివాడున్ నేలకు దిగి
గతి ఏమని ఏడ్వసాగె గొల్లున సత్యా

కం|| సరదా లన్నియు మానిరి
జరభద్రం బనిరి; జనుల జావలు గారెన్
పొరపాటున యన్వాంటెడు
కొరఖర్చుల బెట్టకుండ గుమిలిరి ప్రజలే !!

కం|| సినిమా హాళ్ళకు ఈగలు
మినిమంలో బ్రతుకునట్లు మెయింటెనెన్సుల్
పనిపాటలు కరువాయెను
తినికూర్చొను వారి లైఫు తుక్కై పోయెన్

కం|| పొదుపే మరచిరి లోకులు
మదుపున్ జేయంగబోవ మని కనపడదే !
అదుపున బెట్టక ఖర్చుల
విదిలించగ డబ్బులన్ని వీధిన బడుగా !!

కం|| లేజీ లైఫుకు అలవడి
పోజులు కొట్టుట మరిగిన పోరంబోకుల్
ఈజీ మని కన్పించక
క్రేజీగా యనిరి మోడి క్రూరుండంచున్

ఆ|| క్రైము రేటు తగ్గె క్రీముపూతలు తగ్గె
నల్ల వర్తకములు డొల్ల బారె
కట్న కాన్క లిచ్చు కల్యాణములు తగ్గె
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| అన్ని కార్డు లిచట యాక్సెప్టు లౌనంచు
బార్ల ముందు పెద్ద బోర్డు లొచ్చె
మందుబాబు లెల్ల మంచిగా స్వైపింగు
చేయసాగిరంత చేష్ట లుడిగి

కం|| బ్యాలెట్టుల వెర్డిక్టున
వ్యాలెట్టుకు బొక్క బడగ వ్యాల్యూ తగ్గెన్
టూలెట్టుల బోర్డులవే
రోలెట్టుల యాక్టులౌచు రోడ్డుల వెలసెన్ 

కం|| ఐటీ దాడుల భయమున
పోటీ పడి మూసివేసి బిజినెసు హౌసుల్
కోటీశ్వర నల్ల దొరలు
నోటీసుల కందకుండ నక్కిరి ఎటనో ??

ఆ|| చిల్లరున్న వాడు చిట్వేలు యువరాజు
పెద్ద నోట్ల వాడు పేడివాడు
చిన్న పెద్దలందు చిక్కొచ్చి పడెనయా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| మోదీ వేసిన మందుకు
దీదీకే భేదులొచ్చి దిక్కులు మరచెన్
ఏదీ మునుపటి ధైర్యము?
మాదీఫల లేహ్యమింక మ్రింగక యున్నన్

కం|| యూపీ ఎన్నికలందున
పాపాలే బ్రద్దలౌను పంటలు బండున్
కోపపు పెద్దల యుద్ధము
పాపము ! పౌరుల బ్రతుకుల శాపంబయ్యెన్

కం|| ఏటీ ఎమ్ముల ముంగిట
మాటేసిన రాత్రి యంత మంచున బడుచున్
నోటే దక్కక పాయెను
వోటేసిన నమ్మకంబు వేస్టై పోయెన్

కం|| మోడీ కొట్టిన దెబ్బకు
కేడీలై కూలబడిరి కోటీశ్వరులే
ఏడీ మేనేజరుడని
లేడీలై పరుగులిడిరి లక్షల కొరకై

ఆ|| పెద్ద నోటులున్న పోతురాజౌ గాని
నూరు నోట్ల వాడు నూకరాజు
చిన్నచిన్న నోట్లు శ్రీమహాలక్ష్మిరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| తెల్ల డబ్బులన్ని నల్లడబ్బై పోయె
బ్యాంకు కొచ్చు నోట్లు మాయమాయె
కొత్త కొత్త నోట్లు కోట్లాదిగా మార్చి
పెద్ద పెద్ద వారి ఫేసు వెల్గె

ఆ|| లూపు హోలు బట్టి లూటింగు మాస్టరై 
బ్యాంకు బాబు జేసె బ్యాకు స్టాబు
మోడి ప్లాను జూడ ముక్కలై పోయెరా
దేశమెట్లు వెలుగు దొంగలున్న?

ఆ|| రెండువేల నోట్లు రద్దౌను ముందంచు
భయము మాని వినుడు బెస్టు ట్రూతు
ట్వెల్వు మంత్సు లోన తెల్ల పేపర్లుగా
మారునంట తిక్క దీరునంట !!
read more " నోట్ల కష్టాలు - నోటి పద్యాలు "

18, డిసెంబర్ 2016, ఆదివారం

ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు

అధికారంలో ఉంటూ పదేళ్ళ పాటు నల్లధనం సంపాదిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఒక్క రాత్రిలో ఆ మొత్తం చిత్తు కాగితాలుగా మారిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

దేశాన్ని బాగు చెయ్యాలని కంకణం కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బ్యాంకర్ల రూపంలో పిశాచాలుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని పార్లమెంట్లో రచ్చ చేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
పీఎం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయిన ప్రతివారినీ ఏటీఎం క్యూలో పోయారని పేపర్లో చూపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
స్మశానాలలో కూడా "ఈ - పోస్" మిషన్లు వచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

బిచ్చగాడి ఎకౌంట్లో కూడా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మూడ్రోజులలో మళ్ళీ నిల్ బేలెన్స్ అయిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

శ్రీవారి సొమ్ముతో బంగారం గోడల ఇల్లు కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఐటీ వాళ్లోచ్చి అదంతా పట్టుకుపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయి ఇరవైరోజులైనా ఆమె ఆరోగ్యం భేషని టీవీలో న్యూసొస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాడీకి కాళ్ళు లేవన్న విషయం జనానికి తెలిసిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండి అన్నీ అనుభవిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రాణం పోయి ఇరవై రోజులైన శవానికి ఇంకా ఇంజక్షన్లు చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

దేశం చాలా ముందుకెల్తోందని మన చంకలు మనమే చరుచుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
రాజధానిలో ప్రతిరోజూ రేపులమీద రేపులు జరుగుతూనే ఉంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపామని పండగ చేసుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
దేశం నిండా అవినీతి శనిగ్రహాలే అయితే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ప్రెసిడెంట్ గా గెలిచానని సంబరపడి గంతులేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రతివాడూ "ఛీ" నువ్వు మా ప్రెసిడెంట్ వి కావు అంటుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

అధ్యక్ష ఎన్నికలు ఎంతో పకడ్బందీగా చేసామని ఎగురుతుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎలక్షన్ ప్రక్రియను రష్యా హైజాక్ చేసిందని తెల్సిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

సెక్రెటరీ అయ్యానని సంబర పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మెంబర్స్ మీద అలిగి తనే బయటకు వెళ్ళిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఏళ్ళకేళ్ళు కష్టపడి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అన్నీ అయిపోయాక తీరిగ్గా విశ్లేషణ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నలభై రోజులు నల్ల డ్రస్సు వేసుకుని డబ్బా ఫోజులు కొడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
కొండ దిగీ దిగకముందే మందు బాటిలు ఓపన్ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఫేస్ బుక్ ఫోటో చూసి లవ్వులో మునిగిపోతే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అది ముప్పై ఏళ్ళ క్రితం ఫోటో అని తీరిగ్గా తెలిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

జుట్టుకి రంగేసుకుని కుర్ర వేషాలేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఆ కెమికల్స్ బాడీలోకి ఇంకి కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

అందరికీ అల్లోపతీ ఇచ్చే డబల్ ఎండీకి సంఘంలో
ఎంతో .....బాగుంటుంది
కానీ
తనింట్లో మాత్రం హోమియోపతీ వాడుతుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆఫీసు యూ ట్యూబులో సెక్స్ సినిమాలు చూస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాసు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రోజున
ఏమీ .....ఉపయోగం ఉండదు

అమెరికా సంబంధం అని ఎగురుకుంటూ పెళ్లి చేసి పంపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
నెల తిరక్కుండానే 'నీ అల్లుడు సంసారానికి పనికిరాడని' పిల్ల వెనక్కొచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

"గో క్యాష్ లెస్" అన్న నినాదాన్ని విన్న రోజున
ఎంతో .....బాగుంటుంది
కానీ
హోటల్లో బాగా తిని కార్డిస్తే - 'ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్' అంటూ వాళ్ళు పిండి రుబ్బిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నల్ల డబ్బు నిర్మూలనం ఐపోయిందని సంబరపడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మర్నాడే పాకిస్తాన్ తీవ్రవాదుల దగ్గర మన కొత్త కరెన్సీ ప్రత్యక్షమైతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

రెండువేల నోట్లు జేబు నిండా ఉన్నాయని గంతులేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎక్కడికి పోయినా 'నో చేంజ్' అని వినిపిస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు
read more " ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు "

7, డిసెంబర్ 2016, బుధవారం

సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు

ప్రస్తుతం వరుసగా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయి. వీటి వెనుక గల జ్యోతిష్య కారణం వృశ్చికరాశిలో ఉన్న శనిసూర్య సంయోగమే. దీనిగురించి కొంత చూద్దాం.

శనీశ్వరుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్న ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని గతంలో ఎంతోముందే వ్రాశాను.దానికి కారణాలు కూడా వివరించాను.ఇప్పుడు గోచార సూర్యుడు శనీశ్వరునితో కలసిన ఈ నెల సమయంలో ముఖ్యంగా ప్రముఖుల మరణాలు, వాయుయాన ప్రమాదాలు, రసాయన పేలుళ్లు జరుగుతున్నాయి.

కాకపోతే ఈసారి సాయన సూర్య సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సాయన సిద్ధాంత రీత్యా ప్రస్తుతం సూర్య శనులిద్దరూ ధనూరాశిలో ఉన్నారు. ఎందుకంటే - సాాయన సిద్ధాంత రీత్యా నవంబర్ 22 న సూర్యుడు వృశ్చిక రాశినుంచి ధనూరాశిలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న శనీశ్వరుని పరిధిలోకి వచ్చాడు.

సూర్యుడు అధికారులకు, ప్రముఖులకు సూచకుడని జ్యోతిశ్శాస్త్రం వచ్చినవారికి బాగా తెలిసిన విషయమే.మరణానికి కారకుడైన శనీశ్వరునితో ఈయన కలసినప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.

>>బాల మురళీకృష్ణ మరణం
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సరిగా అదే 22-11-2016 న మరణించాడు.

>>జయలలిత మరణం
దీనికి సరిగ్గా రెండు నెలల ముందు (ఆ నెలలో సాయన సంక్రమణానికి ఒకరోజు ముందు) 22-9-2016 రోజున జయలలిత సింపుల్ అనారోగ్యం(fever and dehydration) తో ఆస్పత్రిలో చేరింది.కానీ క్రమేణా ఈ అనారోగ్యం ముదురుతూ పోయింది.విదేశాల నుంచి డాక్టర్ని రప్పించి మరీ చికిత్స మొదలు పెట్టారు.తులారాశిలోకి వఛ్చిన ఈ సంక్రమణం సూర్యునికి నీచత్వాన్ని ఆపాదిస్తుంది.కనుకనే సింపుల్ ఫీవర్ అండ్ డీ హైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరిన ఆమెను ట్రీట్ చెయ్యడానికి విదేశీ డాక్టర్లు అవసరం అయినారు.

22-10-2016 వృశ్చిక సంక్రమణానికి ఒకరోజు ముందు "కోలుకుంటున్నది" అని ప్రకటించబడిన ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలైంది.

నవంబర్ 19 న "ఆమె పూర్తిగా కోలుకుంది" అని చెప్పిన డాక్టర్లు ఆమెను క్రిటికల్ కేర్ నుంచి మామూలు రూముకు మార్చారు.

కానీ నవంబర్ 22 తర్వాత ఆమె ఆరోగ్యం మళ్ళీ వేగంగా క్షీణించింది.ఇదే రోజున బాలమురళీ కృష్ణ కన్ను మూశాడు. డిసెంబర్ ఐదున హార్ట్ ఎటాక్ తో ఆమె చనిపోయింది.

దీర్ఘరోగాలతో బాధపడేవారు చాలామంది, అమావాస్యకూ పౌర్ణమికీ, నెలనెలా సూర్యుడు రాశి మారే సమయంలోనూ, మళ్ళీమళ్ళీ ఆస్పత్రిలో చేరుతూ ఉంటారు.దీనిని చాలామంది జీవితాలలో గమనించవచ్చు.ఈ విధంగా వెంటవెంటనే జరుగుతూ ఉంటే - వారి ప్రాణశక్తి పని అయిపోయిందనీ అవి ఆఖరు రోజులనీ అర్ధం చేసుకోవచ్చు.ఎంతమంది డాక్టర్లు ట్రీట్ చేసినా "ప్రాణం" సహకరించనిదే వాళ్ళు ఏమీ చెయ్యలేరు. 

>>నేడు - అంటే - 7-12-2016 న - తమిళ ప్రముఖుడైన "చో రామస్వామి" (శ్రీనివాసయ్యర్ రామస్వామి) చెన్నైలో మరణించాడు.

ప్రముఖులే కాదు, మామూలు మనుషులలో కూడా, సామాన్యస్థితి నుంచి ఎదిగి ఉన్నతస్థితికి వచ్చిన వారిలో వృద్ధులు చాలామంది ఈ నెలలో పరలోక ప్రయాణం కట్టక తప్పదు. ఎందుకంటే వారివారి జీవితాలలో వారూ ప్రముఖులే కాబట్టి.

సాయన సూర్యుడు ధనూరాశిని వదలి మకరరాశిలోకి ఈ నెల 22 న ప్రవేశిస్తాడు. అంటే ఇంకా 15 రోజులుంది. చూద్దాం ఈలోపల ఇంకా ఎంతమంది లేచిపోతారో??

సాయనానికీ నిరయనానికీ అయనాంశ ఒక్కటే తేడా కాదు. సూక్ష్మమైన తేడాలు చాలా ఉన్నాయి.అయితే అవన్నీ వివరించి చెప్పడమూ, మనిషి జీవితాన్ని అవెలా ప్రభావితం చేస్తాయో భూతద్దంలో చూపిస్తూ చక్కగా వివరించడమూ నేను ఇక్కడ చెయ్యదలుచుకోలేదు.వాటిని తెలుసుకోవడానికి ఎవరికి అర్హత ఉన్నదో వారికి మాత్రమే నేర్పిస్తాను.

జ్యోతిశ్శాస్త్రం పైకి కనిపించేటంత సింపుల్ సైన్స్ కాదు. దీనిలో చాలా అర్ధంకాని లోతులున్నాయి.సాయన సూర్య సంక్రమణం కూడా ప్రముఖుల జీవితాలను ఎలా ప్రభావితం గావిస్తుందో చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం.
read more " సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు "