“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, మార్చి 2017, శుక్రవారం

విజయనగరంలో ఒక వారంమొన్నీ మధ్యన విజయనగరంలో ఒక వారం రోజులు ఉన్నాను. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి.


 

విజయనగరం మొత్తం గజపతి రాజాగారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజాగారంటే ఆ ఊరి ప్రజలకు ఇప్పటికీ మంచి భయభక్తులు ఎక్కువ.ఊరుకూడా పాతకొత్తల మేలుకలయికలా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సెంటర్లలో గంట స్థంభం సెంటర్ ఒకటి. అదే ఈ ఫోటో. గంట స్థంభం మీద ఆకాశంలో చంద్రుడిని చూడవచ్చు.

ఆటోల్లో ఊరంతా తిరిగేటప్పుడు ఆటోవాడితో మాటలు కలిపాను. రాజుగారంటే వీళ్లకు ఎంత భక్తో అప్పుడు తెలిసింది. 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న నేలంతా మా రాజుగారిదే. దానిని మిగతా రాజులకు దానం చేసేశారు అని అతను అంటుంటే నాకు నవ్వాగలేదు. పోనీలే అతని నమ్మకాన్ని మనమెందుకు చెడగొట్టాలి? అని మాట్లాడకుండా విన్నాను'. 

విజయనగరం మహారాజా కళాశాల చాలా పాతది.ఇది 1879 లో స్థాపించబడింది. ఇక్కడి రాజుల ఔదార్యం గొప్పది.తమ కోటలు భవనాలు అన్నిటినీ విద్యాలయాలుగా ఎప్పుడో ఇచ్ఛేశారు. ఇప్పుడు వాటిలో స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి.వారు చేసిన పని చాలా దూరదృష్టితో చేశారని నా ఉద్దేశ్యం.లేకుంటే ఆ కోటలన్నీ పాడుబడిపోయి ఉండేవి. ఈ కాలేజీలో చాలామంది పెద్దవాళ్ళు చదివారు. హెరిటేజ్ లుక్ తో అప్పటినుంచీ అలాగే మేనేజ్ చెయ్యబడుతూ వస్తున్నది.మనకు హెరిటేజ్ కట్టడాలంటే బాగా ఇష్టం గనుక దానిదగ్గర ఒక ఫోటో తీసుకోవడం జరిగింది.

గురజాడ అప్పారావు గారి ఇల్లు మంచి సెంటర్లో కోట దగ్గరగానే ఉంటుంది. దీనిని ఇప్పుడు గ్రంధాలయంగా మార్చారు. దీని దగ్గరలోనే కన్యాశుల్కం కధ అంతా జరిగిన సానివీధి ఉందని రత్న చెప్పింది. ఆ వీధి పేరు అలాగే ఉంటె బాగుండదని ఈ మధ్యనే దానిని శివాలయం వీధిగా మార్చారట. రోడ్ వైడెనింగ్ లో కూడా ఈ ఇంటిని కూల్చకుండా అలాగే ఉంచడం మునిసిపాలిటీ వారి ఔదార్యాన్ని చాటుతున్నది.ఈ ఇల్లు పాతకాలంలో లాగే ఉండి చిన్నప్పటి పల్లెటూళ్ళ స్మృతులను గుర్తుకు తెచ్చింది.మా అమ్మాయి స్కూటర్ మీద రాత్రిపూట  విజయనగరంలో విహారం. ఊరు పెద్దదేమీ కాదు. ఒక రెండు గంటల్లో ఊరంతా తిరిగేయ్యచ్చు.కాసేపట్లో ఊరంతా అర్ధమై పోయింది. మేమున్న ఏరియా పేరు పూల్ బాగ్. పాతకాలంలో ఇది రాజుగారి ప్రియురాళ్లు ఉండే పూలతోట ఏరియా అట. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మూడులాంతర్ల సెంటర్. మా వెనుకగా పైడితల్లి ఆలయాన్ని చూడవచ్చు..


మేమున్న ఇంటి దగ్గరలోనే కుమారస్వామి ఆలయం ఉన్నది. అందులో ఉన్న పెద్ద విగ్రహం రాత్రిపూట ఇలా దర్శనమిస్తుంది.దీనిని మలేషియా కుమారస్వామి విగ్రహం మోడల్లో కట్టారు. మేము అక్కడ ఉన్న వారంలో రెండ్రోజులు మధ్యాన్నం నుంచి మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసింది. అప్పుడు మేఘావృతమై ఉన్న ఆకాశం ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. దూరంగా కనిపించేది రాజుగారి ఒకానొక కోట ఉన్న కొండ. రాజుగారి కుటుంబంలో ఎవరికో ఒకాయనకు కుష్టువ్యాధి వస్తే ఆయనకోసం దూరంగా కొండమీద ఒక కోట కట్టించి అందులో ఆయన్ను ఉంచారట. ఆ కొండే దూరంగా కనిపిస్తున్నది.దాని పక్కన రామతీర్ధం కొండా కనిపిస్తూ ఉంటుంది. 


రాత్రిపూట డాబామీద కూచుని పాలకోవా, బజ్జీలూ లాగిస్తూ వింటుంటే ఎక్కడో పెళ్లి ఆర్కెస్ట్రా పాటలు వినిపించాయి. మనవైపు అయితే అన్నీ లేటెస్ట్ సినిమా పాటలే వినిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం పాత సినిమాలలోని - 'కోటలోని మొనగాడా వేటకు వచ్చావా? ' , ' నెలవంక తొంగిచూచింది చలిగాలి మేను సోకింది' అనే పాటలు పాడుతున్నారు.వినసొంపుగా అనిపించింది.నేనూ వెళ్లి నాలుగు పాటలు పాడదామని అనుకున్నా గాని మనం అడుగు పెట్టి వాళ్ళ బిజినెస్ చెడగొట్టడం ఎందుకులే అని జాలేసి వదిలేశాను.
బయలుదేరే రోజున రైల్వే స్టేషన్లో సెండాఫ్.నాకోసం ఇంటినుంచి ఫ్లాస్క్ లో టీ తెచ్చింది రత్న.పాపం ఎంత శ్రద్ధగా తయారు చేసిందో? క్రిందటిరోజే మా అమ్మాయికి 'ఈరోజు నుంచీ టీ మానేస్తున్నాను' అని మాటిచ్చినప్పటికీ, రత్న ఎంత శ్రద్ధగా చేసుకుని తెచ్చిందో అన్న ఒక్క ఆలోచన వచ్చేసరికి ఆ ప్రామిస్ ని పక్కన పెట్టి చక్కగా 'టీ' లాగించేశాను. అదే నేను త్రాగిన ఆఖరు 'టీ'. గుర్రుగా చూచిన మా అమ్మాయికి ఇలా చెప్పాను. 'రూల్స్ ని పాటించడమే కాదు వాటిని ఎక్కడ రిలాక్స్ చెయ్యాలో కూడా మనకు తెలిసి ఉండాలి.నియమాలు పాటించడంలో మూర్ఖత్వం పనికిరాదు.మన నియమాల కోసం ఇతరులను బాధపెట్టకూడదు.'దారిలో విశాఖపట్నం స్టేషన్లో వెంకటరాజుగారు కలిశారు. నేను జూలైలో అమెరికానుంచి తిరిగి వఛ్చిన తర్వాత విజయనగరంలో ఒక వారం ఉండి అక్కడ ఒక స్పిరిట్యువల్ రిట్రీట్ పెడదామని నిశ్చయించాం. అదే సమయంలో శ్రీకూర్మం, అరసవిల్లి, రామతీర్ధం, భీమిలీ మొదలైన ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకుని గుడ్ బై చెప్పుకున్నాం.


తిరుగు ప్రయాణంలో పై బెర్తెక్కి అది నిద్రా? ధ్యానమా? లేక పరధ్యానమా? అదిమాత్రం అడక్కండి.