నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, మార్చి 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం

అమెరికా వెళ్ళొచ్చి ఏడాది అవుతున్నది.అందుకని వచ్చే ఆదివారం రాత్రి మళ్ళీ అమెరికాకు ప్రయాణం అవుతున్నాము. ఈ సారి మూడునెలలు అక్కడ మకాం. మళ్ళీ జూలైలో ఇండియాకు తిరిగి వస్తాము.

'అమ్మో మూడునెలలా?ఒక్క పదిహేను రోజులకే మాకు ఏమీ తోచక బోరుకొట్టి చచ్చాం అక్కడ. మీకు టైం పాస్ ఎలా?' అడిగాడు ఒకాయన.

'టైం ఎందుకు పాస్ అవదు? నువ్వు ఊరకే కూచున్నా టైం పాస్ అవుతూనే ఉంటుంది.కూచునే విద్య నీకు తెలియాలి.' అన్నా నవ్వుతూ.

'అదికాదు.అక్కడ ఏమీ తోచదు. బయటకు వెళ్ళలేము. విసుగు పుడుతుంది.' అన్నాడు. 

'బయటకు ఎందుకు పోవాలి అసలు?' అడిగాను నవ్వుతూ.

వింతగా చూచాడు.

'నీకు పదిహేను రోజులకే బోరు కొట్టింది.నాకు మూణ్నెల్లు చాలదు. అదే మీకూ నాకూ తేడా' చెప్పాను నవ్వుతూ.

'అదేంటి? బాగా ఊళ్లు తిరుగుతారా? అప్పుడైతే బోరు ఉండదు. లాస్ వెగాస్ చూడండి బాగుంటుంది. ' అన్నాడాయన.

'లాసూ వద్దు ఏ గ్యాసూ వద్దు. ఏముందక్కడ సోది, భ్రష్టు పట్టడం తప్ప? ఎక్కడికీ తిరగను. కనీసం టీవీ కూడా చూడను.కానీ నాకేం బోరు కొట్టదు.' అన్నాను.

'ఎలా సాధ్యం?' అడిగాడు.

'నాతో వచ్చి ఉండు ఎలా సాధ్యమో తెలుస్తుంది. కాకుంటే నాతో జీవితం ఒక్కరోజుకే నీకు తట్టుకోలేని బోరు కొట్టేస్తుంది. పారిపోతావ్! ' అన్నాను నవ్వుతూ.

'ఏమి చేస్తారు మూడు నెలలు?' అన్నాడు.

'ఏమీ చెయ్యను. నాలో నేనుంటాను. ఇక బోరెక్కడుంటుంది?' అడిగాను.

'ఆ మాత్రం దానికి అమెరికా పోవడం ఎందుకు? ఇక్కడే మీ ఇంట్లోనే కూచోవచ్చుగా?' అడిగాడు చనువుగా.

'కూచోవచ్చు. కానీ ఇక్కడే ఉంటానంటే మూడునెలల పాటు నాకెవరూ లీవ్ ఇవ్వరు. అదే అమెరికాకైతే పెట్టుకోవచ్చు. ఇస్తారు కూడా. అందుకే లీవు పెట్టి అమెరికాకు పోతున్నా' అన్నాను.

'లాస్ట్ టైం బాగా ఊళ్లు తిరిగారా?' అడిగాడు.

'తిరగవలసినవి తిరిగాను. చూడవలసినవి చూచాను. అయినా నేను నీలా తిరుగుబోతును కాను.' అన్నా నవ్వుతూ.

'సరే. పనుంది వస్తా' అంటూ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

చాలామంది ఇంతే. ఎక్కడెక్కడో తిరగాలని ఏవేవో చూడాలనీ అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఎంత తిరిగినా ఎన్ని చూచినా ఏముంది? ఎక్కడా ఏమీ లేదు. ఉన్నదంతా మనలోనే ఉంది.ఈ సత్యం బాగా అర్ధమైతే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. పోయిన సారీ ఇదే చెప్పాను. ఇప్పుడూ ఇదే చెబుతున్నాను.

మనిషి చెయ్యవలసిన పని అంతా నిజానికి లోలోపల ఉన్నది. దానిని సక్రమంగా చేస్తే చాలు.అప్పుడు బోరూ ఉండదు.ఏమీ ఉండదు.

ఈసారి అమెరికాలో గడపబోయే మూణ్ణెల్లలో నాకు చాలా పనులున్నాయి.

శ్రీవిద్యా రహస్యం ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చెయ్యాలి. తారాస్తోత్రం ఈ-బుక్ రిలీజ్ చెయ్యాలి.లలితాసహస్రనామ భాష్యం తెలుగు+ఇంగ్లీషు పుస్తకాలు విడుదల చెయ్యాలి. ఇవి గాక 300 live charts Astro analysis పుస్తకం రెడీ చెయ్యాలి.ఇవి గాక ఇంకా కొన్ని పుస్తకాలు వ్రాయాలి.

పరాశక్తి ఆలయంలోనూ, కొన్ని స్పిరిట్యువల్ రిట్రీట్స్ లోనూ మళ్ళీ ఉపన్యాసాలు ఇవ్వాలి. పరాశక్తి ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూచుని నా సాధనలు చేసుకోవాలి.

వీలు చిక్కితే గాంగెస్ ఆశ్రమం, చికాగో, టెక్సాస్, సెడోనాలను దర్శించాలి. అక్కడ శిష్యులతో స్పిరిట్యువల్ రిట్రీట్స్ చెయ్యాలి. గాంగెస్ లో మా ఆశ్రమం లాండ్ పనులు చూడాలి.

ఇవిగాక,నా రోజువారీ మంత్రధ్యాన సాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, యోగాభ్యాసమూ,పాటలూ,జ్యోతిష్యపరిశ్రమా, నాతో నివసించే శిష్యులతో సంభాషణలూ, హోమియోపతీ ,అక్కల్టూ మొదలైనవన్నీ యధావిధిగా సాగుతూనే ఉంటాయి.ఈసారి ట్రిప్ లో క్లాసులు పెట్టి ఇవన్నీ నా శిష్యులకు నేర్పించబోతున్నాను. నా శిష్యులను ఈ విద్యలలో నా అంతవారిని చెయ్యడం నా లక్ష్యాలలో ఒకటి.

పోయినసారి మొదటి లెవల్ దీక్ష తీసుకున్న నా అమెరికా శిష్యులకు ఈ సారి రెండవ లెవల్ దీక్ష ఇవ్వబోతున్నాను.

అన్నింటినీ మించి, నేను ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న కొన్ని రహస్య తంత్రసాధనలను ఈసారి పూర్తి చెయ్యాలి. దానికి పూర్తి ఏకాంతవాసమూ కొన్ని ప్రత్యేక పరిస్థితులూ అవసరం అవుతాయి.ఈసారి మూడునెలలలో పైన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ నా తంత్రసాధనలను తీవ్రస్థాయిలో చెయ్యబోతున్నాను.ఇవన్నీ చెబితే ఎవడికి అర్ధమౌతుంది? అందుకనే ఇవన్నీ చెప్పకుండా, మూడునెలలు ఏమాత్రం చాలదని సింపుల్ గా మా కొలీగ్ కి చెప్పాను.

పైగా - మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎక్కడుంటే అదే మన ప్రపంచం అవుతుంది.నాకలాంటి వాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు.

ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే, తపస్సు కోసం అమెరికాకు వెళుతున్నాను.నన్ను ప్రేమించే నా మనుషులకోసం అక్కడకు వెళుతున్నాను.బార్లూ క్యాసినోలూ చూడటం కోసం కాదు.అవి ఇక్కడా ఉన్నాయి. వాటి కోసమే అయితే అంత దూరం పోవలసిన పని లేనేలేదు.

పిచ్చిజనం, పిచ్చిప్రపంచం! ఎలా చెబితే వీళ్లకు అర్ధమౌతుందో?