నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, మార్చి 2017, సోమవారం

Yogi Adityanath horoscope analysis



ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియమితుడయ్యాడు. ఈయన జనన వివరాలు 5-6-1972; 11-50 am; Panchur; Pauri Garhwal (UP) 78E26; 29N57 గా లభ్యమౌతున్నాయి. ఈయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం.

ఈయన జాతకంలో కొన్ని విచిత్రమైన యోగాలున్నాయి. కుజ శుక్రులతో లాభస్థానంలో ఏర్పడిన ధర్మకర్మాధిపతి యోగం ఒక స్పష్టమైన రాజయోగం.అలాగే దశమంలో సూర్య బుధుల డిగ్రీ కంజంక్షన్, వీరితో శనీశ్వరుడు కలవడం కూడా రాజయోగమే. ఆరూ పన్నెండులలో ఉండటం రాహుకేతువులకు చాలా మంచి యోగకరమైన ప్లేస్ మెంట్ అని చెప్పాలి.

సప్తమంలో ద్వాదశాదిపతి  అయిన క్షీణ చంద్రుడు ఉండటం వివాహ నాశక యోగం.చంద్రుడు గురు నక్షత్రంలో ఉంటూ మతగురువు కావడం కోసం తన వివాహాన్ని ఈయన త్యాగం చేశాడని సూచిస్తున్నాడు. పంచమంలో గురువూ, చంద్రలగ్నాత్ పంచమంలో కుజశుక్రులూ ఉండటం మంచి ఆధ్యాత్మిక యోగాలు.కానీ గురువు వక్రత్వమూ, శుక్రుని వక్రత్వమూ, ఈ ఆధ్యాత్మికతకు లౌకికత కూడా తోడైందనీ, ఈయనది ప్రపంచాన్ని పట్టించుకోని ఆధ్యాత్మికత కాదనీ, లోకంతోనూ ప్రజలతోనూ బలమైన సంబంధాలు ఉండే ఆధ్యాత్మికత అనీ సూచిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో హిందువులకు ఎక్కడ ఏం కష్టం వచ్చిందని తెలిసినా అక్కడకు ఈయన తన అనుచరులతో వాలిపోతాడు.వారిని ఆదుకుంటాడు. తన గోరఖ్ నాద్ మఠంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ లక్షణాలే ఈయనకు విపరీతమైన ప్రజాభిమానాన్ని సంపాదించి పెట్టాయి.

నవాంశలో గురు చంద్రులు ఉచ్చస్థితిలో ఉండటం మంచి ఆధ్యాత్మికమైన యోగం. వీరిద్దరూ శనీశ్వరుని అర్గలం చేస్తున్నారు.కనుక ఈయన అంతరాంతరాలలో ప్రజాసమస్యలు తీర్చాలన్న తాపత్రయం బాగా ఉంటుంది. ఈయనలో ఆధ్యాత్మికతా ప్రజా సంబంధాలూ రెండూ కలగలసిన విచిత్రమైన యోగం ఉంటుంది. 

కారకాంశ వృషభం అవుతూ దశమంలో ఉన్న చంద్రుని నవాంశ ఉచ్చస్థితి వల్ల ప్రజాజీవితంతో పెనవేసుకుపోయి వారి అభిమానాన్ని సంపాదించిన నాయకుడిని సూచిస్తున్నది.

ఈయన గురు నక్షత్రంలో కుంభరాశిలో జన్మించాడు.కనుక ఒక గురువుగా ప్రజలకు మేలు చెయ్యాలన్న ఋణానుబంధంతో ఈయన ఈ జన్మలోకి వచ్చాడు. గణితంలో బీఎస్సీ పూర్తి చేసిన ఈయన తన 21 ఏట కుటుంబాన్ని వదిలిపెట్టి మహంత్ అవైద్యనాద్ శిష్యునిగా చేరాడు.ఆ సమయంలో 1992 ప్రాంతాలలో ఈయనకు శనిదశలో సూర్య అంతర్దశ జరిగింది. ఈయన జాతకంలో వీరిద్దరూ దశమకేంద్రంలో బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆ దశలో కన్నతండ్రిని వదిలి ఆధ్యాత్మిక తండ్రి అయిన గురువు దగ్గరకు చేరాడు. శనీశ్వరుడు సూర్యుని తనయుడే అన్న విషయమూ వీరిద్దరికీ ఎప్పుడూ ఎడబాటే నన్న విషయమూ జ్యోతిష్కులు గుర్తుంచుకోవాలి. అందుకే ఈ దశలో తండ్రి ఎడబాటు సంభవించింది.

1998 నుంచి ఈయన నాలుగు సార్లు వరుసగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ గా ఎన్నికౌతూ వస్తున్నాడు.అంటే శనిదశ చివరిభాగం, బుధదశ మొత్తం ఈయనకు బ్రహ్మాండంగా యోగిస్తూ వస్తున్నాయి. దానికి కారణం వీరిద్దరూ దశమంలో బలంగా ఉండటమే. చంద్రలగ్నాత్ ఈ యోగం చతుర్ధ కేంద్రంలో ఉండి దశమాన్ని బలంగా చూస్తున్నది. ఇప్పుడు బుధ మహర్దశలో చివరి ఘట్టం అయిన శని అంతర్దశ జరుగుతున్నది.అందులో మళ్ళీ సూర్య విదశ జరుగుతున్నది. బుధ, శని సూర్యులు దశమంలో ఉంటూ ఈయన్ను మన దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసారు.

ఈ ముగ్గురిలో లగ్నాధిపతిగా సూర్యుడు ఈయన్ను సూచిస్తే, తెలివైన వ్యూహవేత్తగా బుధుడు అమిత్ షానూ, ఖచ్చితమైన క్రమశిక్షణతో పనిచేసే తత్త్వం ఉన్న శనీశ్వరుడు మోడీనీ సూచిస్తున్నారు. వెరసి బుధ శనులు ఇద్దరూ కలసి సూర్యుడిని గద్దె నెక్కించారని మనం భావించాలి. అదే నిజం కూడా.

ఈయన జాతకంలో 2018 నుంచీ రాబోయే కేతుమహార్దశ ఏడు సంవత్సరాలుంటుంది. ఈ ఏడు సంవత్సరాలు నల్లేరు మీద నడక ఏమీ కాదు.మత కలహాలు సృష్టించడం ద్వారా ఈయన్ను ఇబ్బంది పెట్టాలని చూచేవాళ్ళు ఉంటారు. కనుక ఒడిదుడుకులు తప్పవు. ఈ ఒడిదుడుకులన్నీ కేతువు నుంచి శత్రుస్థానంలో ఉన్న గురువు వల్ల, అంటే, మతపరమైన విషయాల వల్ల సంభవిస్తాయి. కానీ ద్వాదశంలో ఉన్న కేతువు వల్ల వాటిని తన రహస్య ప్లానింగ్ తో ఎదుర్కొని గెలుపును సాధిస్తాడు.

ఈయన ప్రమాణ స్వీకారం 19-3-2017 నాడు 14.15 కి లక్నోలో జరిగింది.ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని గమనిద్దాం.

గోచారరీత్యా శనీశ్వరుడు జననకాల చంద్రునికి లాభస్థానంలోకి వచ్చి ఉన్నాడు. శని గోచారం గురించి గత పోస్టులో నేను వ్రాసిన ఫలితాలు ఈ జాతకంలో ఖఛ్చితంగా జరగడం గమనించండి. అలాగే సూర్య బుధులు కూడా జననకాల సూర్యబుధులకు లాభస్థానంలోకి వఛ్చి ఉండటం గమనించండి.అందుకే ఇతనికి ఈ లాభం దక్కింది.

లగ్నం మృదు స్వభావ రాశి అయిన కర్కాటకం అయింది. లగ్నాధిపతి చంద్రుని పంచమ నీచస్థితి కుజుని దశమ కేంద్రస్థితివల్ల భంగమై పోయింది.కనుక కొందరి భయాలను అపోహలను పటాపంచలు గావిస్తూ అందరికోసం సుపరిపాలన సాగుతుంది. 

అయితే అంతర్లీనంగా హిందూత్వ భావన తప్పకుండా ఉండే సూచనలున్నాయి.అది మంచిది కూడా. ఎందుకంటే నిజమైన హిందూత్వం ఎవరినీ ద్వేషించదు. అందరినీ కలుపుకుని పోవాలనే అది కోరుకుంటుంది.తొమ్మిదింట శుక్రుని ఉచ్చస్థితి ఆధ్యాత్మిక రంగానికి, పరిపాలనకూ మంచిది. అయితే బుధుని నీచస్థితివల్ల ముస్లిమ్స్ తో బాగున్నప్పటికీ హిందువులతోనే కొందరు మేధావులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. మొత్తం మీద దశమాదిపతి కుజుని దశమ స్థితివల్ల పరిపాలన బాగానే ఉంటుంది.చంద్ర బుధులతో సమస్యలు కన్పిస్తున్నాయి. ముస్లిమ్స్ తో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రామమందిరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయి.

ఈ రాజయోగి పరిపాలన ఉత్తరప్రదేశ్ లోని అందరికీ మంచి చెయ్యాలనీ, క్షీణిస్తున్న ధర్మాన్ని తిరిగి నిలబెట్టాలనీ ఆశిద్దాం.