“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, డిసెంబర్ 2016, సోమవారం

నోట్ల కష్టాలు - నోటి పద్యాలు

అందరినీ అల్లాడిస్తున్న నోట్ల కష్టాల మీద ఆశుపద్యాలను వినండి మరి.

ఆ|| రెండువేల నోటు రంగులీనుచు నుండు
మార్చబోయినంత మూర్ఛ వచ్చు
చిల్లరంచు వెదుక చీకాకు గలిగించు
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| మందు షాపు లందు మనుషులే కరవైరి
విందు హోటలేమొ వెలిసి పోయె
అందమెల్ల దిద్దు అందాల పార్లర్లు
బోసిపోయి మిగుల బోర్డు దిప్పె

ఆ|| రెండువేల నోట్లు నిండు జేబున బెట్టి
పాని పూరి దినగ పరువు బోయె
చిన్న నోట్లు లేక చింతాయె బ్రతుకంత
వంద నోటులున్న వాడె రాజు

ఆ|| రెండు వేలు దెచ్చి నిండుగా పెట్రోలు
వెయ్యి రూప్యములకు పొయ్యమన్న
చిల్లరడిగినంత ఛీకొట్టి పొమ్మంచు
భాష మార్చివేసె బంకు వాడు

ఆ|| రెండు టీలు దెచ్చి రంజుగా ఇమ్మంచు
ఆర్డరేసి నంత అట్లె నిలిచి
చిల్లరివ్వ మంచు చేజాచి బెదిరించె
వెయిటరొక్కరుండు వింతగాను

ఆ|| మిరపకాయ బజ్జి మింగబోయిన యంత
చిల్లరడిగె బండి శీనుగాడు
ఛాటు బండివాడు నోటీసు అతికించె
పిల్ల నోట్ల వారె ప్రిన్సులనుచు

ఆ|| మంచి హోటలనుచు లంచి జేయగబోయి
పట్టి పట్టి యచటి ఫుడ్డు మెక్కి
కార్డు ఇచ్చినంత క్యాషివ్వమనె వాడు
క్లీను జెయ్యమనుచు కిచెను జూపె

ఆ|| బారు షాపులెల్ల భోరుభోరున యేడ్చె
కూర గాయలేమొ కొక్కిరించె
పెట్టురోలు బంకు పెనుశాపమాయెరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| అతి ఖర్చుల్ ఆవిరులై
మితిమీరిన ఎచ్చులెల్ల మిస్టున గలసెన్
ప్రతివాడున్ నేలకు దిగి
గతి ఏమని ఏడ్వసాగె గొల్లున సత్యా

కం|| సరదా లన్నియు మానిరి
జరభద్రం బనిరి; జనుల జావలు గారెన్
పొరపాటున యన్వాంటెడు
కొరఖర్చుల బెట్టకుండ గుమిలిరి ప్రజలే !!

కం|| సినిమా హాళ్ళకు ఈగలు
మినిమంలో బ్రతుకునట్లు మెయింటెనెన్సుల్
పనిపాటలు కరువాయెను
తినికూర్చొను వారి లైఫు తుక్కై పోయెన్

కం|| పొదుపే మరచిరి లోకులు
మదుపున్ జేయంగబోవ మని కనపడదే !
అదుపున బెట్టక ఖర్చుల
విదిలించగ డబ్బులన్ని వీధిన బడుగా !!

కం|| లేజీ లైఫుకు అలవడి
పోజులు కొట్టుట మరిగిన పోరంబోకుల్
ఈజీ మని కన్పించక
క్రేజీగా యనిరి మోడి క్రూరుండంచున్

ఆ|| క్రైము రేటు తగ్గె క్రీముపూతలు తగ్గె
నల్ల వర్తకములు డొల్ల బారె
కట్న కాన్క లిచ్చు కల్యాణములు తగ్గె
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| అన్ని కార్డు లిచట యాక్సెప్టు లౌనంచు
బార్ల ముందు పెద్ద బోర్డు లొచ్చె
మందుబాబు లెల్ల మంచిగా స్వైపింగు
చేయసాగిరంత చేష్ట లుడిగి

కం|| బ్యాలెట్టుల వెర్డిక్టున
వ్యాలెట్టుకు బొక్క బడగ వ్యాల్యూ తగ్గెన్
టూలెట్టుల బోర్డులవే
రోలెట్టుల యాక్టులౌచు రోడ్డుల వెలసెన్ 

కం|| ఐటీ దాడుల భయమున
పోటీ పడి మూసివేసి బిజినెసు హౌసుల్
కోటీశ్వర నల్ల దొరలు
నోటీసుల కందకుండ నక్కిరి ఎటనో ??

ఆ|| చిల్లరున్న వాడు చిట్వేలు యువరాజు
పెద్ద నోట్ల వాడు పేడివాడు
చిన్న పెద్దలందు చిక్కొచ్చి పడెనయా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| మోదీ వేసిన మందుకు
దీదీకే భేదులొచ్చి దిక్కులు మరచెన్
ఏదీ మునుపటి ధైర్యము?
మాదీఫల లేహ్యమింక మ్రింగక యున్నన్

కం|| యూపీ ఎన్నికలందున
పాపాలే బ్రద్దలౌను పంటలు బండున్
కోపపు పెద్దల యుద్ధము
పాపము ! పౌరుల బ్రతుకుల శాపంబయ్యెన్

కం|| ఏటీ ఎమ్ముల ముంగిట
మాటేసిన రాత్రి యంత మంచున బడుచున్
నోటే దక్కక పాయెను
వోటేసిన నమ్మకంబు వేస్టై పోయెన్

కం|| మోడీ కొట్టిన దెబ్బకు
కేడీలై కూలబడిరి కోటీశ్వరులే
ఏడీ మేనేజరుడని
లేడీలై పరుగులిడిరి లక్షల కొరకై

ఆ|| పెద్ద నోటులున్న పోతురాజౌ గాని
నూరు నోట్ల వాడు నూకరాజు
చిన్నచిన్న నోట్లు శ్రీమహాలక్ష్మిరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| తెల్ల డబ్బులన్ని నల్లడబ్బై పోయె
బ్యాంకు కొచ్చు నోట్లు మాయమాయె
కొత్త కొత్త నోట్లు కోట్లాదిగా మార్చి
పెద్ద పెద్ద వారి ఫేసు వెల్గె

ఆ|| లూపు హోలు బట్టి లూటింగు మాస్టరై 
బ్యాంకు బాబు జేసె బ్యాకు స్టాబు
మోడి ప్లాను జూడ ముక్కలై పోయెరా
దేశమెట్లు వెలుగు దొంగలున్న?

ఆ|| రెండువేల నోట్లు రద్దౌను ముందంచు
భయము మాని వినుడు బెస్టు ట్రూతు
ట్వెల్వు మంత్సు లోన తెల్ల పేపర్లుగా
మారునంట తిక్క దీరునంట !!