అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

4, డిసెంబర్ 2025, గురువారం

మనుషులుగా పుట్టే అవకాశం

చాలాకాలం నుంచీ ఈ మనుషులను, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే నాకు నవ్వు, జాలి ఈ రెండే కలుగుతూ ఉండేవి . ఇప్పుడు అసహ్యం కూడా అనిపిస్తోంది. కారణం? సివిక్ సెన్సు, కామన్ సెన్సు, అసలు ఏ విధమైన సెన్సూ లేనివాళ్లు కూడా చాలామంది మనిషిజన్మ ఎత్తుతూ ఉండటమే.  

మొన్నీమధ్యన ఒంగోలునుంచి కొందరువ్యక్తులు ఆశ్రమానికి వచ్చారు. వచ్చినది మధ్యాన్నం రెండుగంటలకు. అదికూడా చెప్పాపెట్టకుండా అత్తగారింటికి వచ్చినట్లు వచ్చారు. ఇక్కడ దగ్గరలోని ఏదో గుడికి వచ్చి, దగ్గరేకదా అని మిమ్మల్ని కూడా చూచిపోదామని వచ్చామన్నారు.

ఇంకా నయం 'మీకు మోక్షం ఇద్దామ'ని వచ్చామనలేదు. అంతవరకూ సంతోషం కలిగింది.

'ఇది ఆశ్రమమా?' అన్నాడు వారిలో ఒకాయన కూచుంటూ.

అంటే, ఎక్కడికొచ్చారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారన్నమాట !

నేనేమీ మాట్లాడలేదు.

'ఏం చేస్తారిక్కడ?' మరొకామె అడిగింది అనుమానంగా చూస్తూ.

'చెప్పినా మీరర్ధం చేసుకోలేరు ' అన్నాను.

'ఇంతదూరం వచ్చి ఉంటున్నారేంటి?' మళ్ళీ అతని ప్రశ్న.

'మీ స్వగ్రామం ఎక్కడ?' అడిగాను.

' హైద్రాబాద్ ' అన్నాడు.

'నువ్వెందుకు ఇంతదూరం వచ్చి ఒంగోల్లో ఉంటున్నావు?' అడిగాను.

అదేమీ పట్టించుకోకుండా, 'మీ జ్యోతిష్యపుస్తకాలను ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్ లో కొన్నాము. మా జాతకాలు చూస్తారా?' అడిగాడు.

'చూడను. నాకు జ్యోతిషం మీద నమ్మకం లేదు' అన్నాను.

'మరి బుక్స్ రాశారుగా' అన్నాడు.

'రాసింది నమ్మేవాళ్ళకోసం. నాకోసం కాదు' అన్నాను.

'ఒంగోలు వస్తుంటారా అప్పుడప్పుడు?' అడిగింది ఆమె.

'తక్కువ. ఎప్పుడైనా వస్తుంటాను' అన్నాను.

'ఈసారి వచ్చినపుడు నాకు ఫోన్ చేయండి. నేనొచ్చి కలుస్తాను' అన్నాడతగాడు.

'నేను కలవను' అన్నాను.

'అదేంటి సార్? ఊరకే జస్ట్ కలుస్తాము. అంతే' అన్నాడాయన.

' అందుకే కలవనంటున్నాను. ముచ్చట్లకు నాకు టైం ఉండదు ' అన్నాను.

'ఈ ల్యాండ్ అంతా మీదేనా?' అడిగింది ఆమె చుట్టూ చూస్తూ.

'కాదు వేరేవాళ్లది. కబ్జా చేశాను' అన్నాను సీరియస్ గా.

'ఎంతకి కొన్నారు?' అడిగాడొకడు నేను చెబుతున్నది వినకుండా.

' ఎకరం పదిరూపాయలు ' అన్నాను.

వాళ్ళు ఆమాట కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు.

'మరిక్కడ అన్నీ దొరుకుతాయా?' అడిగిందామె.

' ఏవీ దొరకవు ' అన్నాను.

' మరెలా?' అన్నది.

' ఎందుకు దొరకాలి? ' అన్నాను.

'మీ పుస్తకాలు ఇంకా ఏవైనా ఉంటే చూపిస్తారా?' అడిగాడు.

' ఇక్కడుండవు' అన్నాను.

' అదేంటి?' అతనికి సందేహం వచ్చింది.

'రాసేది నేను చదువుకోవడానికి కాదు' అన్నాను.

'ఇక్కడ గుడేమీ లేదా? ' అన్నాడు అతనే మళ్ళీ.

'ఇప్పుడే బయటకెళ్ళింది. సాయంత్రం వస్తుంది ' అన్నాను.

'సరేనండి వెళ్లొస్తాం. మీలాంటి పెద్దవాళ్ళని కలవడం మా అదృష్టం' అన్నాడతను లేస్తూ.

'గురువుగారు లేచాక చెప్తాలెండి మీరొచ్చి వెళ్లారని ' అన్నాను  నేనూ లేస్తూ.

వాళ్ళది కూడా వినిపించుకోలేదు. వాహనం ఎక్కి వెళ్లిపోయారు. అసలెందుకొచ్చారో ఎందుకు వెళ్లారో వారికన్నా తెలుసా? అనే అనుమానం కలిగింది.

నాకీసారి దేవుడిపైనే జాలి కలిగింది. అన్నిజీవులకూ మనుషులుగా పుట్టే సమాన అవకాశం ఇస్తున్నందుకు.

read more " మనుషులుగా పుట్టే అవకాశం "