12, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 35 (దారికోసం వెదుకుతున్న మెక్సికన్ అమెరికన్)

రెండవరోజున సాయంత్రం పూట అందరం ధ్యానంలో ఉండగా మిగేల్ అనే ఒకబ్బాయి వచ్చి మమ్మల్ని కలిశాడు.

అతనికి 21 ఏళ్ళు, కాథలిక్ క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చాడు. పేరెంట్స్ మెక్సికో నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడే గాంజెస్ లో ఉంటాడు. గ్రాండ్ రాపిడ్స్ కు రోజూ వెళ్లి చదువుకుంటూ ఉంటాడు. జీసస్ అన్నా మేరీ అన్నా భక్తి ఉంది. కానీ కృష్ణుడంటే చాలా భక్తి.

ఇతని తమ్ముడు ముందుగా కృష్ణభక్తుడయ్యాడు. ఇప్పుడితను. అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తూ ఉంటానని, ఈరోజు ఎందుకో ఇక్కడకు రావాలని బలంగా అనిపించిందని, వచ్చి చూస్తే మేమందరం ధ్యానంలో ఉండటం చూసి, ఇండియన్స్ అని అర్ధమై, మేము లేచాక మాట్లాడదామని వెయిట్ చేస్తున్నానని అన్నాడు.

ఇస్కాన్ వారి పాంప్లెట్ ఒకటి నాకివ్వబోయాడు.

నవ్వొచ్చింది.

'కృష్ణుడి గురించి నీకేం తెలుసుకోవాలని ఉందో చెప్పు' అన్నాను పాంప్లెట్ తీసుకోకుండా.

అతను ఆశ్చర్యంగా చూశాడు.

'మేమూ కృష్ణభక్తులమే. చిన్నప్పటినుంచీ ఆయన జీవితాన్ని చదువుతూ పెరిగాం.' అన్నాను అతని సందేహాన్ని గమనించి.

'కృష్ణుడిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు ఆయన జీవితం చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతో సంభ్రమానికి గురయ్యాను ఆయన గురించి తెలుసుకుని' అన్నాడు.

'కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే. సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడే తన పూర్తి శక్తితో కృష్ణుడుగా భూమికి దిగి వచ్చాడు. హిందూమతంలో 'అవతారం' అనే భావన ఉంది. దేవుడు అవతారం దాల్చి భూమికి వస్తాడని మేం నమ్ముతాం. ఈ భావన మీ మతాలకు తెలియదు. అటువంటి అవతారాలలో కృష్ణావతారం అత్యుత్తమమైనది, పరిపూర్ణమైనది. అటువంటి శక్తి ఇతర ఏ అవతారంలోనూ లేదు. మానవుడు ఊహించగలిగిన అత్యున్నతమైన దైవస్వరూపం కృష్ణుడే' అన్నాను.

అతను బిత్తరపోయాడు.

'ఇందాక నేను వచ్చినపుడు మీరేం చేస్తున్నారు? అడిగాడు.

'మేము ధ్యానంలో ఉన్నాము. ఇది యోగసాధనలో ఒక భాగం' అని చెప్పాను.

'నేను కొంత చదివాను. దీపక్ చోప్రా, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళ పుస్తకాలు కొన్ని చదివాను. అవి మంచివేనా?' అడిగాడు.

'పరవాలేదు. కానీ అసలైన హిందూమతం వారిలో లేదు. హిందూమతాన్ని గురించి, దాని తత్వశాస్త్రపు లోతుపాతులను గురించి తెలుసుకోవడానికి అవి కొంత ఉపయోగిస్తాయి. కానీ ఆ తరువాత, శ్రీ రామకృష్ణులను, వివేకానందులను, రమణమహర్షిని చదువు. అవి నీకు సరియైన అవగాహనను కలిగిస్తాయి' అన్నాను.

'వైల్డ్ వైల్డ్ కంట్రీ' చూశావా? అడిగాను.

'చూశాను. కానీ ఓషోను వాళ్ళు చాలా చెడుగా చూపించారు. అతనలాంటి వాడు కాదు. అతను చాలా మంచి విషయాలు చెప్పాడు. మంచివాడని నా ఉద్దేశ్యం' అన్నాడు.

'అవును. ఓషో పూర్తిగా చెడ్డవాడు కాదు. అతని చుట్టూ చేరిన తెల్లవాళ్ళవల్ల అతను భ్రష్టు పట్టాడు. చివరకు తనూ మునిగాడు, Krishna the man and his philosophy అని ఓషోది ఒక మంచి పుస్తకం ఉంది చదువు' అన్నాను.

'అందరూ మంచివాళ్ళే అని నా ఉద్దేశం' అన్నాడు మిగేల్ 

'అవును, అంతిమవిచారణలో చూస్తే, ముంచేవాడూ, మునిగేవాడూ, ఒడ్డునుంచి చూసేవాళ్ళూ,  అందరూ మంచివాళ్ళే' అన్నాను నవ్వుతూ.

అప్పుడప్పుడూ తను ఆకాశంలోకి చూస్తూ కూచుంటానని, అప్పుడు ఒక పోర్టల్ లాగా ఆకాశం తెరుచుకుని, జీసస్, మేరీ, ఇంకా ఎవరెవరో మహనీయుల రూపాలు వెలుగులో కనిపిస్తూ ఉంటాయని అతనన్నాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

'ఇండియాలో ఎందరో సెయింట్స్ పుట్టారని వారు కూడా జీసస్ లాంటివారే అని, జీసస్ చేసిన మహిమలలాగే వాళ్ళూ చేశారని విన్నాను, నిజమేనా?' అడిగాడు.

'జీసస్ లాంటి వాళ్ళు, ఆయనను మించిన వాళ్ళు ప్రతితరంలోనూ ఇండియాలో ఉన్నారు. వారు  చేసిన మహిమలలో జీసస్ కనీసం ఒక వంతుకూడా చేయలేడు. జీసస్ నేర్చుకున్నదంతా ఇండియాలోనే నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల నుంచీ ముప్పై ఏళ్ల వరకూ పద్దెనిమిదేళ్లపాటు ఆయనెక్కడున్నాడో ఎవరికీ తెలీదు. వాటిని మిస్సింగ్ ఇయర్స్ అంటారు. ఆ సమయంలో ఆయన ఇండియాలో, టిబెట్ లో ఉన్నాడు. యోగశాస్త్రం, బౌద్ధం నేర్చుకున్నాడు' అన్నాను నవ్వుతూ.

అతను మళ్ళీ నోరెళ్లబెట్టాడు. 'ఈ సంగతి నాకు తెలీదు' అన్నాడు.

'ఎలా తెలుస్తుంది? మీ పాస్టర్లు ఈ విషయాలు చెప్పరు. ఏదేదో చెత్తను మీకు నూరిపోస్తూ ఉంటారు. రీసెర్చి చెయ్యి. తెలుస్తుంది' అన్నాను.

'భవిష్యత్తులో ఒకసారైనా ఇండియా రావాలనుకుంటున్నాను' అన్నాడు చాలా సీరియస్ గా. 

'వెల్కం. వచ్చినపుడు మా ఆశ్రమంలో మా అతిధిగా ఉండు' అని, అతని ఫోన్ నంబర్ తీసుకోమని పంచవటి USA కమిటీ వారికి చెప్పాను.

'మన పుస్తకాలు కొన్ని ఇతనికి ఇద్దామా?' అని మావాళ్లడిగారు.

'వద్దు. మరీ మీద పడిపోయినట్లుగా ఉంటుంది. అతనికి అర్హతుంటే అతనే మన మార్గంలోకి వస్తాడు. వదిలెయ్యండి. మనం ఎవరినీ ఫోర్స్ చెయ్యకూడదు. ఊరకే మన టేస్ట్ చూపించాలి. వాళ్ళ అదృష్టం ఉంటే మన దారిలోకి వస్తారు. లేకపోతే రాలేరు' అని చెప్పాను.

డిన్నర్ టైం అవడంతో మాతోబాటు డిన్నర్ చెయ్యమని అతన్ని ఆహ్వానించాము. డిన్నర్ అయిపోయాక, కొంచం సేపు అవీ ఇవీ మాట్లాడాడు.

'ఇండియన్ కల్చర్ కూ, సౌత్ అమెరికన్ కల్చర్ కూ, చాలా పోలికలున్నాయి. సౌత్ అమెరికా లాటిన్ అమెరికాగా మారక ముందు, హిందూ సంస్కృతి అక్కడ ఉండేది. మీ మయుడు మా పురాణాలలో ఉన్నాడు. మాయన్ కల్చర్, అజ్టెక్ కల్చర్ ఇవన్నీ మా సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే, అతి ప్రాచీనకాలంలో సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంకలు కలిసే ఉండేవి. ఇండియానుండి ఇక్కడకు రాకపోకలుండేవి. మహాభారతంలో అనేక రాజభవనాలకు ప్లాన్ ఇచ్చింది, దగ్గరుండి కట్టించిందీ మీ మయుడే' అని చెప్పాను.

అతను మళ్ళీ నోరెళ్లబెట్టాడు.

'మెడిటేషన్ గురించి మా ఇండియన్ ఫ్రెండ్ ఒకడిని అడిగితే, అదంతా బుల్ షిట్ అని చెప్పాడు. వాడికేమీ తెలియదు. నాకెంతో ఆశ్చర్యమేసింది. ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఏమీ నేర్పడం లేదని అర్ధమైంది' అన్నాడు.

'యూ ఆర్ రైట్, ముందు వాళ్లకు తెలిస్తే కదా పిల్లలకు నేర్పేది? ప్రస్తుతపు ఇండియన్ పేరెంట్స్ కి  తెలిసింది డబ్బు డబ్బు అని కలవరించడం ఒక్కటే. అదే వాళ్ళ పిల్లలకు నూరిపోస్తున్నారు. ఇండియా యొక్క అసలైన సంపద ఏమిటో చాలామంది ఇండియన్స్ కే తెలీదు' అని చెప్పాను.

అతను వెళ్ళిపోయాక, ఆనంద్ ఇలా అన్నాడు, 'గురూజీ, నాకెప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉండేవాళ్లకు మీగురించి పెద్దగా తెలీదు. కానీ, దూరంగా ఎక్కడో ఉన్నవాళ్లు ఇలా హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మీతో కనెక్ట్ అయి చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. మీరు అమెరికాలో ఉంటున్నా, అమెరికాలో ఉన్న మనవాళ్ళు మిమ్మల్ని కలవలేకపోతున్నారు, ఎవరో క్రొత్తవాళ్ళు మాత్రం వచ్చి కలుస్తున్నారు.  ఇది చాలా వింతగా అనిపిస్తుంది' అన్నాడు.

నవ్వాను.

'నిజమే. ఆధ్యాత్మిక లోకపు రహస్యనియమాలు ఇలాగే ఉంటాయి. నిజమైన ఆకలి ఉన్నవాడికి భోజనం దొరుకుతుంది.  వాళ్ళైనా వెదుక్కుంటూ వస్తారు. అదైనా వారి దగ్గరకు వెళుతుంది. అదంతే. అంతా ఆకలిని బట్టి ఉంటుంది' అన్నాను.
read more " మూడవ అమెరికా యాత్ర - 35 (దారికోసం వెదుకుతున్న మెక్సికన్ అమెరికన్) "

11, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 34 ( మేమున్న కాటేజీ పరిసరాలు)


ఆకురాలు కాలం వచ్చేసింది. అందుకే చెట్ల ఆకులన్నీ రంగులు మారిపోతున్నాయి.  ఆకుపచ్చనుండి ఎరుపు, తరువాత పసుపు, ఆపైన రాలిపోవడం. మళ్ళీ చిగురించడం.. మనిషి జీవితం లాగే.




మేమున్న 'శారదా కుటీర్' బయట




ఈ తలుపు లోపలున్న హాల్లోనే ప్రతి ఉదయమూ యోగాభ్యాసం చేసింది.




ఇది ఆశ్రమం పంప్ హౌస్. ఒక మనిషి ఏకాంత సాధనకు ఇది చాలు.




శారదాకుటీర్ దగ్గరగా చెట్లల్లో కనిపించిన ఇంకొక మూడు కాటేజీలు


కుటీరం పరిధిలోని చిన్న ట్రెయిల్ వాక్




దయ, అభయ, భక్తి రిట్రీట్ కాటేజీలు 
read more " మూడవ అమెరికా యాత్ర - 34 ( మేమున్న కాటేజీ పరిసరాలు) "

మూడవ అమెరికా యాత్ర - 33 (స్వాధ్యాయం)

చిన్నప్పటినుంచీ నాకు స్నేహితులంటూ చాలా తక్కువ. కారణం? ప్రతి వయసులోనూ, ఆ వయసు పిల్లలు నాకు చాలా చీప్ గా అనిపించేవారు. నా భావజాలం వారికి చాలా ఎత్తులో ఉండేది. అందుకే నేను ప్రతి స్టేజీలోనూ ఏకాకిగానే ఉంటూ వచ్చాను. నేటికి కూడా, నాకు సరిపోయే స్థాయిలో ఉన్న స్నేహితులు ఒకరో ఇద్దరో తప్ప, లేరు.

ఇదే కారణం చేత నాకొచ్చే వందలాది మెయిల్స్ లో ఒకటో రెండో మాత్రమే నేను జవాబిస్తూ ఉంటాను. మిగతావన్నీ నాకు చాలా చీప్ గా అనిపిస్తూ ఉండటమే దానికి గల కారణం. అసలు చాలా మెయిల్స్ ని తెరిచి చూడను కూడా ! ఎంతసేపూ రోగాలు, సమస్యలు, డబ్బు, ఆస్తులు, అహాలు - ఈ చెత్త తప్ప ఉన్నతమైన విషయాలను మాట్లాడే మనిషే ఈ లోకంలో దొరకడం లేదు.

మనకు నచ్చిన మనుషులు దొరకనప్పుడు, ఉత్తమగ్రంధాలను మించిన స్నేహితులు ఎవరూ ఉండరు. ఆయా గ్రంధాలలో ఆయా రచయితలు మన కన్నుల ముందు ప్రత్యక్షమౌతారు. మనతో వారి భావాలను వెళ్లబోసుకుంటారు. మన ప్రక్కన కూచుని మనతో మాట్లాడతారు. అందుకే ఉత్తమగ్రంధాలను మించిన స్నేహితులు ఎవరూ ఉండరని నేనంటాను.

స్వామి అతులానంద గారని పాతతరం స్వామీజీ ఒకాయన రామకృష్ణమఠంలో ఉండేవారు. ఈయన డచ్ వాడు. ఈయన పేరు కార్నిలియా జొహాన్నెస్ హెబ్లామ్. యూరోప్ లో పుట్టిన ఈయన అమెరికాకు మకాం మార్చాడు. వివేకానందస్వామిని ఈయన అమెరికాలో కలిశాడు. తరువాత సాధువుగా మారి స్వామి అతులానంద అయ్యాడు. సాక్షాత్తు శారదామాత దగ్గర ఈయన మంత్రదీక్షను గ్రహించాడు. శ్రీ రామకృష్ణుల పదహారుమంది డైరెక్ట్ శిష్యులు ఈయనకు పరిచయం ఉండేది. ఈయన విదేశీయుడని కేదార్ నాధ్ ఆలయంలోకి రానివ్వకపోతే, బదరీనారాయణ ఆలయంలో శ్రీరామకృష్ణులవారే ప్రత్యక్షమై ఈయనను ఆలయంలోకి తీసుకెళ్లి అన్నీ చూపించారు.

ఈయనొక అద్భుతమైన మాటను అనేవాడు.

In life, what I love the most are just two things, a book and a nook. అంటే, మంచి పుస్తకం, ఏకాంతం ఉంటే మనిషి జీవితానికి చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అని అర్ధం.

ఈయన గురించిన కొన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

అందుకని స్వాధ్యాయానికి ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అయితే, ఊరకే చదవడం కాకుండా, సాధన కూడా చెయ్యాలి. లేదంటే ఉత్త పాండిత్యం మాత్రమే మిగులుతుంది. అది వాంఛనీయం కాదు.

మొన్న గాంజెస్ లో ఉన్న నాలుగు రోజులలో దాదాపు ముప్పై పుస్తకాలను చదివేశాను.  కారణం? ఇండియాలో నాకు దొరకని కొన్ని ప్రాచీనగ్రంధాలు అమెరికా మారుమూల గాంజెస్ వివేకానంద రిట్రీట్ హోమ్ లైబ్రరీలో దొరికాయి. అందులో ముఖ్యమైనది ఆర్ధర్ ఎవలాన్ (సర్ జాన్ వుడ్రోఫ్) వ్రాసిన Principles of Tantra అనే వెయ్యిపేజీల పుస్తకం. ఇది 'తంత్రతత్వము' అనే బెంగాలీ మాతృకకు 1914 లో ఆయన చేసిన అనువాదం. విందుభోజనం ఎదురైనట్లు అనిపించింది నాకు. ఒక్కపూటలో ఆ పుస్తకం నమిలెయ్యబడింది.

రామకృష్ణామఠం వారు చాలా ఉదార స్వభావులు గనుక, వేదాలు, ఉపనిషత్తులు, వారి సాహిత్యం, ఇతర హిందూమత గ్రంధాలతో బాటు, క్రైస్తవం, యూదుమతం, ఇస్లాం, బహాయ్ మతం, జెన్ బౌద్ధం, తాంత్రికబౌద్ధం, జైనం, టావోయిజం,  షింటోయిజం, పాశ్చాత్య తత్త్వశాస్త్రం, అరవింద సాహిత్యం ఇలా ప్రపంచంలోని అన్ని మతాలు, తత్వశాస్త్రాల గ్రంధాలను అక్కడ సేకరించి ఉంచారు. ఇక్కడున్న కొన్ని గ్రంధాలు ఇండియాలో కూడా దొరకవు. ఉదాహరణకు వేదాలనన్నింటినీ ఒక్కచోటకు తెచ్చి ప్రచురించాడొక స్వామీజీ. ఆయన పుట్టుగ్రుడ్డి. అది ఆయన జీవితాశయం. అది చేసి, చనిపోయాడాయన. ఆ గ్రంధాలు ఇక్కడున్నాయి. అలాంటివే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. వాటిలో ఒక ముప్పైగ్రంధాలను ఈ నాలుగురోజులలో చదివాను. లైబ్రరీలో చదవడం సరిపోక, మాకిచ్చిన కాటేజీకి తీసికెళ్ళి అర్ధరాత్రి దాకా చదివేవాడిని.

ఒకరోజున అలా పుస్తకాలను తీసుకెళుతుంటే చూసి, హరిదాస్ 'ఎంతమందికి ఇవి?' అనడిగాడు. 

'నాకే' అని చెప్పాను.

అయోమయంగా చూశాడతను.

మర్నాడు పొద్దున్నే కలిసినప్పుడు, 'రాత్రి మీరు చూసిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో పెట్టేశాను' అని చెప్పాను. 

మళ్ళీ అయోమయంగా చూశాడతను.

సరే ఎవరి నమ్మకాలు వారివి, మనకెందుకు? ఒకళ్ళు నమ్మితే మనకెంత? నమ్మకపోతే మనకెంత?

అంతా బాగానే ఉన్నప్పటికీ, లైబ్రరీలో గాంధీ ఫోటోలు, ముఖ్యంగా ఆయన చనిపోయినప్పటి ఫోటో గోడకు వేలాడదీసి ఉన్నాయి. షాకయ్యాను. పాతతరం స్వామీజీలలో కొందరికి గాంధీ అంటే గౌరవం ఉండేది. దానికి కారణం ఆయన నిజస్వరూపం వారికి తెలియకపోవడమే. ఆయనొక సెయింట్ అని వాళ్ళనుకునేవారు. చివరకు మెహర్ బాబా కూడా ఆయన విషయంలో పొరపాటు పడ్డాడు.  మనకు ఒళ్ళు మండించే వ్యక్తులలో గాంధీ ప్రథమస్థానంలో ఉంటాడు గనుక, ఆ ఫోటోలు చూస్తే నాకు చాలా అసహ్యమేసింది. వాటిని తొలగించడం మంచిదని, ఆ ఫోటోలే ఈ సెంటర్ కు పట్టిన దరిద్రమని చెప్పి విజిటర్స్ బుక్ లో రాద్దామని చూస్తే ఆ బుక్ లేదు. చికాగో మఠానికి ప్రస్తుతం ఇన్ ఛార్జ్ గా స్వామి ఈశాత్మానంద గారున్నారు. ఆ విధంగా ఆయనకు ఈ మెయిల్ ఇవ్వమని పంచవటి USA వారికి చెప్పాను.


గాంజెస్ వివేకానంద రిట్రీట్ సెంటర్. ఎడమచేతి చివరలో డోమ్ లాగా కనిపిస్తున్నదే లైబ్రరీ. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది.


లైబ్రరీ మెట్లపైన




లైబ్రరీలో



నా వెనుకగా లైబ్రరీ చివరలో ఒక గది ఉంది. శ్రీమత్ స్వామి భూతేశానందగారు ఇక్కడకొచ్చినపుడు అక్కడ ఒక కుర్చీలో కూచున్నారు. ఆ కుర్చీని అక్కడే ఉంచి, జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు సెంటర్ వారు. 



లైబ్రరీలో కూడా చలి వణికిస్తోంది. అందుకే ఈ బందోబస్తు.




నా ప్రక్కనే డిస్టర్బ్ చెయ్యకుండా మౌనంగా ఉంటూ, గంటకొకసారి నాకు టీ ఇవ్వడం శిష్యుల పని.






1893 లో వివేకానందస్వామి వచ్చినపుడు చికాగో ఇలా ఉండేది





read more " మూడవ అమెరికా యాత్ర - 33 (స్వాధ్యాయం) "

10, అక్టోబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 32 (గాంజెస్ రిట్రీట్)

నాలుగు రోజుల గాంజెస్ రిట్రీట్ ముగిసింది. వచ్చినవారందరూ, క్రొత్త అనుభవాలతో, క్రొత్త అవగాహనలతో, వారి జీవితాలకు క్రొత్త దిశానిర్దేశాలతో వెనక్కు బయలుదేరి వారివారి ఊర్లకు చేరుకున్నారు.

గాంజెస్ అనేది మిషిగన్ రాష్ట్రంలో అల్లెగాన్ కౌంటీలో లేక్ మిషిగన్ ఒడ్డున ఉన్న ఒక టౌన్ షిప్. అడవులు, లేక్స్ మధ్యన ఉన్న ఈ టౌన్ షిప్ జనాభా కేవలం 2500 మాత్రమే. సిటీ లైఫ్ నుండి విసిరేసినట్లుగా దూరంగా ఉండే ఈ స్లీపింగ్  టౌన్ 1847 లో మొదలైంది.

1960 లలో స్వామి భాష్యానందగారు చికాగో వేదాంత సొసైటీ ఇంచార్జ్ స్వామిగా ఉండేవారు. ఈయన తెలుగాయనని విన్నాను. చిన్నతనం నుండి వైరాగ్యభావాలతో పెరిగిన ఈయన పెళ్లిచేసుకోకుండా రామకృష్ణ మఠంలో బ్రహ్మచారిగా చేరి తరువాత సన్యాసాన్ని స్వీకరించారు. ఈయన 1964 లో న్యూయార్క్ వేదాంత సొసైటీకి వచ్చారు. 1965 లో చికాగో మఠానికి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఉపన్యాసం ఇచ్చింది చికాగోలోనే కావడంతో రామకృష్ణ సాంప్రదాయంలో చికాగో సిటీకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడినుంచే వివేకానందస్వామికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. స్వామి భాష్యానంద గారి నాయకత్వంలో చికాగో రామకృష్ణమఠం (ఇక్కడ వీటిని వేదాంత సొసైటీ అంటారు) ఎంతో అభివృద్ధి చెందింది.

1969 లో గాంజెస్ లో 100 ఎకరాల స్థలాన్ని కొని, వివేకానంద రిట్రీట్ సెంటర్ గా దానిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారాయన. 1971 లో ఈ రిట్రీట్ సెంటర్ మొదలయింది. అప్పటినుంచీ 1996 లో చికాగోలో ఆయన చనిపోయేవరకూ, గాంజెస్ రిట్రీట్ సెంటర్ ఎన్నో మైలురాళ్లను చూసింది.

సాక్షాత్తు శ్రీ శారదామాత వద్ద మంత్రదీక్ష తీసుకున్న స్వామి అశేషానందగారు, స్వామి రంగనాధానందగారు, ఇంకా ఎందరో పెద్దస్వామీజీలు గాంజెస్ లో జరిగిన రిట్రీట్స్ కి వచ్చారు. అమెరికా నాలుగు మూలలనుండి ఇక్కడకు వచ్చిన అనేకమంది హిందూ కుటుంబాలు, వారి పిల్లలు, భాష్యానంద గారి ప్రభావంతో భారతీయ యోగ, వేదాంత తత్వాలను అర్ధం చేసుకుని, ఉన్నతమైన జీవన విధానాలను అందుకున్నారు. పాత తరాలలోని ఎన్నో NRI కుటుంబాలు ఈ విధంగా ధార్మిక జీవనాన్ని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందుకున్నాయి. 

అలాంటి గాంజెస్ రిట్రీట్ సెంటర్ లో అక్టోబర్ 6 నుండి 9 వరకూ మేమున్నాం. 5 లేదా 6  డిగ్రీల సెంటీగ్రేడ్ చలి అక్కడుంది. రాత్రిపూట 3 డిగ్రీలకు కూడా పోయినట్లుంది.  సింపుల్ లివింగ్, యోగాభ్యాసం, ధ్యానం, చర్చలు, సందేహాలు సమాధానాలు, అడవిలో ట్రెయిల్ వాక్స్ కు వెళ్లడం, ఇక్కడున్న పెద్ద లైబ్రరీలో దొరికిన కొన్ని అరుదైన గ్రంధాలను అధ్యయనం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, ఇక్కడి అమెరికన్స్ తో మాట్లాడటం. మొదలైన టైం టేబుల్ తో  ఈ నాలుగు రోజులూ గడిచాయి.

ఈ నాలుగు రోజులూ ఈ నూరెకరాల అడవి మధ్యలో మేము కొద్దిమందిమే ఉన్నాం. అంత పెద్ద సెంటర్ని కూడా హరిదాస్ అనే ఒకే ఒక్క అమెరికన్ చూసుకుంటున్నాడు. అతను బ్రహ్మచారి, ఒక్కడే ఉంటూ ఉంటాడు. సెంటర్ మొత్తం మీద ఒక డజను ఇళ్లుంటాయి. అవి కూడా విసిరేసినట్లుగా అడవిలో అక్కడక్కడా ఉంటాయి. వాటికి తాళాలు ఉండవు. ఎవరూ ఉండరు. హరిదాస్ కూడా ఆ అడవిలో ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. సెల్ ఫోన్ లో దొరక్కపోతే అక్కడ అతన్ని పట్టుకోవడం అసాధ్యం. ఆ అడవిలో అతను తిరుగుతూ, రోజుకొక ఇంట్లో ఉంటూ ఉంటాడు. చాలా విచిత్రమైన ప్రదేశం ఇది.

ఈ రిట్రీట్ కు వచ్చిన పంచవటి USA సభ్యులకు, ఉన్నత ప్రాణసాధనలు, ఉన్నత యోగక్రియలు నేర్పించాను, ధారణ, ధ్యాన, సమాధులలో శిక్షణ ఇచ్చాను. ఉన్నత స్థాయికి చెందిన దీక్షలిచ్చాను. నా సాధనామార్గాన్ని కూలంకషంగా పరిచయం చేశాను. ఈ నాలుగు రోజులలో ఈ రిట్రీట్లో ఏర్పడిన బలమైన యోగతరంగాల వల్ల వారికి అనేక అనుభవాలు కలిగాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో వారికి డైరెక్ట్ గా అర్ధమైంది. నా సాధనా మార్గాన్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగారు. 

జీవితాలకు ఔన్నత్యాన్ని, ధన్యత్వాన్ని సంతరించుకుని, నాలుగు రోజుల సాధనా సమ్మేళనం తర్వాత అందరూ వెనుకకు బయలుదేరి, అమెరికాలో ఎవరి రాష్ట్రాలకు వారు చేరుకున్నారు.

ఈ విధంగా అమెరికా మారుమూల అడవీప్రాంతపు చలివాతావరణంలో మా నాలుగు రోజుల సాధనాసమ్మేళనం విజయవంతంగా ముగిసింది.

read more " మూడవ అమెరికా యాత్ర - 32 (గాంజెస్ రిట్రీట్) "

7, అక్టోబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 31 (మా క్రొత్త పుస్తకం 'కైవల్యోపనిషత్' విడుదల')



నిన్నటినుంచీ మిషిగన్ గాంజెస్ లోని 'వివేకానంద రిట్రీట్ సెంటర్' లో మా స్పిరిట్యువల్ రిట్రీట్ జరుగుతోంది. పోయినసారి అయిదేళ్లక్రితం 2017 లో ఇక్కడకొచ్చాము. ప్రస్తుతం మళ్ళీ వచ్చాము. అప్పుడు కొంచం ఎండాకాలంలో వచ్చాను. ఇప్పుడు  చలికాలం మొదలైపోయింది. ఈరోజున ఇక్కడ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది.  ఎండ ఉన్నప్పటికీ చలి వణికిస్తోంది.

ఇక్కడకొచ్చినందుకు గుర్తుగా ఇక్కడనుంచి ఒక పుస్తకాన్ని విడుదల చేద్దామని అనుకున్నాం. అందుకని 'కైవల్యోపనిషత్' అనే గ్రంధాన్ని ఈరోజున ఇక్కడనుండి విడుదల చేస్తున్నాను.

ఇది యజుర్వేదంలోనూ అధర్వణవేదంలోనూ మనకు లభిస్తున్నది. అశ్వలాయనుడనే ఋషి బ్రహ్మదేవుని నుండి పొందిన వేదాంతవిజ్ఞానమే ఈ గ్రంధం. అనేక ప్రాచీన ఉపనిషత్తుల సారమై, భక్తిజ్ఞానముల మేలుకలయికగా ఈ ఉపనిషత్తు గోచరిస్తున్నది. ఈ సంస్కృతగ్రంధానికి నా తెలుగు వ్యాఖ్యానాన్ని మీరిక్కడ చదువవచ్చు.

ఇది నా కలం నుండి వెలువడుతున్న 53 వ పుస్తకం. కేవలం 24 శ్లోకములలో వేదాంతసారమును వివరించడం దీని ప్రత్యేకత. నూరుపేజీలలోపు పుస్తకమే అయినప్పటికీ, భావవిస్తృతిలో చాలా విశాలమైనది, లోతైనది. 

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడునీడలుగా నిలిచిన సరళాదేవి, అఖిల, శ్రీలలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు నా కృతజ్ఞతలు ఆశీస్సులను తెలియజేస్తున్నాను. 

వేదాంత విజ్ఞానాభిలాషుల ప్రయోజనార్ధమై ఈ పుస్తకాన్ని ఉచిత పుస్తకంగా విడుదల చేస్తున్నాను.  కావలసిన వారు, Google Play Books నుండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

read more " మూడవ అమెరికా యాత్ర - 31 (మా క్రొత్త పుస్తకం 'కైవల్యోపనిషత్' విడుదల') "

5, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 30 (అసలైన క్రియాయోగం)

'మీకు క్రియాయోగం తెలుసా?' అని ఇండియాలో ఉండగా ఒక జిజ్ఞాసువు నన్నడిగారు.

'తెలీదు' అని చెప్పాను. 

'మరి తెలిసినట్టు రాస్తుంటారు కదా?' అన్నారు.

'అంటే, దాన్ని మించినది తెలుసు' అన్నాను.

'అదేంటి?'అడిగాడాయన.

'దాన్ని నిష్క్రియాయోగం అంటారు' చెప్పాను.

'అదెక్కడుంది?' అనుమానమొచ్చింది అడిగినాయనకు.

'మీకు తెలీనంత మాత్రాన లేదని అనుకోకండి' అన్నాను.

'దాని మూలపురుషుడెవరు?' అడిగాడు విక్రమార్కుడు.

'ప్రస్తుతానికి నేనే' అన్నాను తాపీగా.

ఎగాదిగా చూసి మాయమైన విక్రమార్కుడు మళ్ళీ కనిపించలేదు.

నవ్వుకున్నాను.

నవ్వెందుకంటే, క్రియాయోగం పేరుమీద గ్లోబల్ గా జరుగున్న వ్యాపారాన్ని చూచి.

ఎప్పుడో నూరేళ్లక్రితం లాహిరీ మహాశయులు హిమాలయాల్లో బాబాజీ దగ్గర కొన్ని యోగక్రియలు నేర్చుకున్నాడు. దానిని కొంతమందికి నేర్పించాడు. అదే ఆయన చేసిన తప్పు. 

ఇక క్రియాయోగం బిజినెస్ మొదలైంది. ఆ బిజినెస్ ని గ్లోబల్ బిజినెస్ గా మార్చింది యోగానందగారి పుస్తకం.

కరార్ ఆశ్రమం పెట్టిన యుక్తేశ్వర్ గారు- అసలైన క్రియ మాదేనంటారు.

ఆయన మాట వినకుండా అమెరికా వెళ్లి అక్కడ క్రియాయోగాన్ని తెల్లవాళ్ళకు నేర్పిన యోగానంద, 'నాదే అసలైన క్రియ' అంటాడు.

అసలైన క్రియాయోగాన్ని ఆయన చాలా మార్చిపారేశాడని, అమెరికా శిష్యులకోసం దాని రూపురేఖలే మార్చేశాడని లాహిరీగారి శిష్యులంటారు.

యోగానంద గారి శిష్యులలో కూడా చీలికలొచ్చాయి.

స్వామి క్రియానంద అనే అమెరికన్ SRF నుండి విడిపోయి, ఒక వేరు కుంపటి పెట్టి 'నాదే అసలైన క్రియ' అన్నాడు. ఇంకా చాలామంది అన్నారు.

ఇక లాహిరీ గారి శిష్యుల్లో నూరు కుంపట్లున్నాయి.

ఆయన సంతానమైన తింకోరీ, దుకోరీలు, మనవళ్లు మాదే అసలైన క్రియాయోగమంటారు.

పంచానన్ భట్టాచార్య 'నాదే అసలైన క్రియ' అంటాడు.

అశోక్ కుమార్ భట్టాచార్య, 'అసలైన క్రియ నాదగ్గరుంది' అంటాడు.

వీళ్ళందరూ తప్పని, అసలైన క్రియాయోగం నాదగ్గరుందని హరిహరానంద గిరి గారంటారు.

ఈ గోలంతా చూసి విసిగిపోయిన 'ఎన్నియో నిమిస్' అనే యూరోపియన్ వనిత క్రియాయోగ టెక్నీక్స్ అన్నీ ఒక పుస్తకంలో రాసేసి ఫ్రీ బుక్ గా నెట్లో పెట్టేసింది.

శ్రీ M గారు 'నాదే అసలైన క్రియ' అంటారు.

ఈ మధ్యన జగ్గీ కూడా క్రియాయోగా పాట పాడుతున్నాడు. అది లాభసాటిగా ఉన్నట్లుంది. అవున్లే SSY ఎంతసేపని నేర్పిస్తాడు పాపం !

బెంగుళూరు, హైద్రాబాద్ లలో అయితే, ప్రతి ఇంట్లోనూ క్రియాయోగా గురువులున్నారు. వీళ్లంతా ఆన్లైన్ క్లాసులు పెట్టి, నెట్లోనే క్రియాయోగ దీక్షలిచ్చేస్తున్నారు. సంసారాలు చేస్తూ పిల్లాపాపలున్న ఆడాళ్ళు కూడా ఆత్మానంద, బ్రహ్మానంద మొదలైన పేర్లు పెట్టేసుకుని క్రియాయోగ గురువులౌతున్నారు. మొగుళ్ళు ఆఫీసుకెళ్లి వచ్చేలోపు ఒక సైడు బిజినెస్ గా బాగుంటుంది కదా ! ఆన్లైన్ బకరాలకు క్రియాయోగా అంటూ నాలుగు మాయమాటలు చెబితే సరిపోతుంది. డబ్బులు బాగానే వస్తాయి. పేరుకు పేరూ వస్తుంది. బాబాజీని అడ్డుపెట్టుకుని బాగా డబ్బులు దండుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా?

ఎంత కామెడీనో?

వీళ్ళందరూ బాబాజీని చూశామంటారు. ఆయనే మాకు ఇలా చెయ్యమని చెప్పాడంటారు. కాపీ రైట్ లేకపోతే చాలు, ఎలా వాడేస్తారో జనం !!

ఇక అమెరికాలో, ముఖ్యంగా కాలిఫోర్నియా వైపు అయితే, ఎన్నున్నాయో క్రియాయోగా సెంటర్లు, స్కూళ్ళు లెక్కే లేదు. ప్రతివాడూ 'నాదే అసలైన క్రియాయోగం' అంటాడు. టెన్ మినిట్స్ క్రితమే బాబాజీ మా ఇంటికొచ్చి వెళ్ళాడంటాడు.

వెరసి కోట్లాది డాలర్ల వ్యాపారం క్రియాయోగా మీద జరుగుతోంది. వీళ్ళలో ఎవరికీ అసలైన క్రియాయోగా తెలీదు.

ఈ గ్లోబల్ ఫ్రాడ్ లో వెర్రివెంగళప్ప అయింది పాపం - బాబాజీనే.

వీళ్ళందర్నీ చూసి, బాబాజీకే పిచ్చెక్కి, హిమాలయాలలో తన గుహని వదిలేసి, ఇంకా లోలోపలి ప్రాంతాలకు పారిపోయాడని నేనంటాను. ఎందుకంటే, తీర్ధయాత్రలకెళ్లినట్టు ఆయన గుహకు కూడా వెళ్లి జనాలు అక్కడంతా పాడుచేస్తున్నారట ఈ మధ్య.

'నీకెలా తెలుసు?' అంటారా?

నాకూ బాబాజీనే చెప్పాడు.

'పొరపాటున లాహిరీకి నేర్పించాను. ఇంతగా భ్రష్టు పట్టిస్తారని నేనూహించలేదు. తప్పుచేశాను. అందరూ నా గుహకు వచ్చేస్తున్నారు. అక్కడ ప్రశాంతత ఎప్పుడో పోయింది. అందుకే హిమాలయాలలో ఇంకా లోపలి ప్రాంతాలకు పారిపోయి దాక్కుంటున్నాను' అని నాతో అన్నాడు.

ఏం? ఇంతమందికి కనిపించినాయన నాకు కనిపించకూడదా? తన బాధను నాతో చెప్పుకోకూడదా? ఉన్న నిజాన్ని చెబితే తప్పేంటి?

'నువ్వు అమెరికాలో ఉన్నావు బాబాజీ హిమాలయాలలో ఉంటాడు. మరి నీకెలా కనిపించాడు?' అనే చచ్చు సందేహం మీకు రాకూడదు.

యోగా ట్రెడిషన్ తో అస్సలంటూ సంబంధమే లేని జీసస్ కే బాబాజీ క్రియాయోగ దీక్షనిచ్చాడని యోగానంద వ్రాస్తే మీరు నమ్మేశారు. నేను నిజాలు చెబుతుంటే మాత్రం నమ్మరు ! భలే ! అలాంటి బాబాజీ అమెరికాకు రాలేడా నాకు కనిపించలేడా? నమ్మలేరా? 

అవున్లే ! అబద్దాలు రుచించినట్లుగా నిజాలు రుచించవు. అంతే కదూ?

'అయితే ఇప్పుడేంటి? అసలైన క్రియాయోగా నా దగ్గరుంది' అంటావు నువ్వు, అంతేకదా?' అంటారు మీరు.

'చ చ నేనలా ఎందుకంటాను? నాకు క్రియాయోగా ఏమీ తెలీదు. నిష్క్రియా యోగా మాత్రమే తెలుసు' అంటాను.

'ఏంటీ దాన్ని నేర్పాలా? ఓరి పిచ్చోళ్లారా ! సరిగ్గా చదవండి. దానిపేరే నిష్క్రియ. దానినెలా నేర్పిస్తారు? అస్సలు కుదరదు, దానితో బిజినెస్ అస్సలు కుదరదు' అనికూడా అంటాను.

అలాంటి కొత్త బిజినెస్ ఛాన్స్ లోకానికి ఎవరైనా ఎందుకిస్తారు? అందుకే బాబాజీ కూడా నిష్క్రియా యోగా ను ఎవరికీ నేర్పలేదు. పైపైన రెండు మూడు టెక్నీక్స్ లాహిరీకి చెప్పి "ఇదే క్రియాయోగా పో" అన్నాడు. దానిని MNC గురువులు వాడుకుంటూ, వాళ్ళ తెలివితేటలతో దానికి అవీఇవీ కలిపి పెంచి పారేశారు. బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నారు. అంతే.

కాబట్టి, 'అసలైన క్రియాయోగా ఇదే' అని ఎవరైనా చెబితే నమ్మకండి. అదెవరికీ తెలీదు. కారణమేంటో చెప్పనా?

'అసలైన క్రియాయోగా' అనేది అసలు లేనేలేదు. ఆ మాటొక పెద్ద బూటకం.

ఇది పచ్చినిజం, నమ్మితే మీ అదృష్టం. నమ్మకపోతే మీ ఖర్మ !

read more " మూడవ అమెరికా యాత్ర - 30 (అసలైన క్రియాయోగం) "

మూడవ అమెరికా యాత్ర - 29 (వేస్ట్ గురువు)

నవరాత్రులు అయిపోయాయి. డెట్రాయిట్లో చలికాలం వచ్చేసింది.

అటుమొన్న 22 డిగ్రీ నుండి మొన్న 12 డిగ్రీలకు, ఇవాళ 6 డిగ్రీలకు పడిపోయింది. రోజుకు పది డిగ్రీలు పడిపోతోంది ఉష్ణోగ్రత ఇక్కడ.

'ఇదేంటి బాబోయ్ ఇలా పెరిగిపోతోంది చలి?' అంటే, 'అప్పుడే ఏమైంది? ఇంకో నెలాగు. మైనస్ లోకి వెళ్లి మంచు కురుస్తుంది. అప్పుడుంటుంది అసలైన భజన' అంటున్నారు శిష్యులు.

మొన్న స్టోర్స్ కెళ్ళి జాకెట్లు కొనుక్కుందామని వాళ్లు ప్లాన్ చేశారు.

'ఛీ నేను జాకెట్టేంటి? చిన్నప్పుడెప్పుడో డ్రామాలో ఆడవేషం వేసినప్పుడు తొడిగా. ఇప్పుడొద్దు, బాగుండదు' అన్నా సీరియస్ గా.

'ఆ జాకెట్టు కాదు. ఎక్కువగా నటించకు. చిన్నప్పుడే కాదు. ఆఫీసర్ గా ఉన్నపుడు కూడా డ్రామాలో ఆడవేషం వేశావని మాకు తెలుసులే' అని అంతకంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చిందొక శిష్యురాలు. మా దగ్గరింతే. నా శిష్యులే నాకు వార్నింగులిస్తుంటారు.

'ఏం చేస్తాం అలవిగానిచోట అధికులమనరాదు' అన్న సుమతీ శతకం గుర్తుతెచ్చుకుని నోర్మూసుకున్నా. 'సుమతి కాదు నేను' అంటూ గుర్రుగా చూస్తున్నాడు వేమన్న.

ఈ చలిని చూస్తుంటే చిన్నప్పుడు తొమ్మిదో తరగతిలో, అంటే 1976 లో చదువుకున్న పద్యం గుర్తొచ్చింది. ఈ పద్యం పోయినసారి అమెరికా వచ్చినపుడు కూడా గుర్తొచ్చింది. అప్పుడు భలే పద్యాలు రాశి పడేశా. అదేంటో గాని, 'నిన్న ఏం తిన్నావు?' అంటే గుర్తుండదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చదివిన పద్యాలు గుర్తుంటాయి. ఇదేదైనా రోగమేమో? ఎవరైనా మంచి హోమియోపతి వైద్యుడిని కలవాలి.

కం|| అహములు సన్నములయ్యెను
దహనము హితమయ్యె దీర్ఘ దశలయ్యె నిశల్
బహుశీతోపేతంబయి
ఉఁహుహూ యని వడకె లోకముర్వీనాథా !

ఈ సారి కూడా కొన్ని పద్యాలు రాద్దామనుకున్నా. వెంటనే దూకాయి.

కం || జాకెట్టులు కొనగబోవ
పాకెట్టులు వెక్కిరించె పాదములలసెన్
చీకొట్టుట తప్పదింక
టీకొట్టే లేదు ఎంత తిరిగిన గానిన్

గ్రేట్ లేక్స్ మాల్ అన్నచోటకు తీసికెళ్లారు నన్ను. అందులోని షాపులన్నీ తిరగాలంటే రెండ్రోజులు పట్టేలా ఉంది. అదొక లోకం ! రెండుషాపులు తిరిగేసరికి మతిపోయింది, నీరసమొచ్చింది. మనకేమో షాపులు తిరగాలంటే మహాచిరాకు. మనదంతా టార్గెటెడ్ షాపింగ్. ఒకటో రెండో షాపులు చూడటం, మనక్కావలసింది కొనేసుకోవడం. వచ్చెయ్యడం. అంతే.

ఇక్కడేమో ఎక్కడ చూసినా డ్రస్సులు, షూస్, సెంట్లు, ఫర్నిచర్, ఫుడ్ కోర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. పిచ్చిపుట్టేలా ఉన్నాయి. ఇండియాలో చూసీ చూసీ ఇక్కడకొస్తే ఇక్కడకూడా అదే గోల ! ఇంకా పెద్ద ఎత్తున ఉందిక్కడ. ఆమ్మో భయమేసింది. కన్స్యూమరిజం అంతా ఇక్కడే ఉన్నట్టుంది.

తిందామని ఫుడ్ కోర్ట్ కొస్తే, అంతా చికెన్, మీట్ మయం. వెజ్ ఐటమే లేదు. చివరకు సలాడ్ గడ్డి, గార్లిక్ బ్రెడ్ ముక్కతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీ త్రాగుదామంటే ఒక్క టీకొట్టు కూడా లేదు. ఛీ ! మన ఇండియాలో అయితే, అడుక్కి నూరు టీ అంగళ్లుంటాయి. ఎంత స్వర్గమో అది !

ఎంతసేపూ కందాలేనా, ఆటవెలదీ రామ్మా కొంచెం !

ఆ || ఎండ పేలగొట్టు ఎంతెంతొ కాంతిగా
చలికి పిచ్చి బుట్టు ఝల్లుమనుచు
ఏమి వెదరు బాబు? ఎన్నాళ్ళు ఈ లాగు?
జాకెటేయుమయ్య జాణవోలె !

ఆ || గ్రేటు లేక్సు మాలు రేట్లేమొ బెంబేలు
కాకిలెక్క దిరుగఁ కాళ్ళుబోయె
చికెను మీటు దప్ప సిద్ధాన్నమే లేదు
టీ కి దిక్కులేదు తిరిగి జూడ

'అదేంటి గురూజీ టీ మానేశానన్నారుగా' అని ఒకామె అడిగింది. నవ్వాను.

ఆ || ఇండియాల జెప్పు ఇచ్చకాలన్నియున్
ఫ్లయిటు ఎక్కువరకె పనికి వచ్చు
అమెరికాల కాలు అడ్డంబుగా బెట్ట
మాట మనసు రెండు మారిపోవు

ఆ || ఛాయి దాగుమన్న చక్కనౌ మాటేది?
బారు బీరు అనిన భాష దప్ప
ఆకులలములన్ని అడ్డంబుగా మెక్కి
ఇంటి దారి బడితి ఇస్సురనుచు

రెండ్రోజుల్లో గాంగెస్ రిట్రీట్ ఉంది. లేక్ మిషిగన్ ఒడ్డున. చలి మరీ వణికిస్తుందిట. అందుకని బందోబస్తుగా రమ్మన్నారు. అక్కడ ఉత్త టవల్ కట్టుకుని ఆరుబయట తిరగాలనుంది. తీరుతుందో లేదో? హిమాలయాల్లో మా అన్నలు గోచీతో తిరుగుతారు. నేను కనీసం టవల్తో అయినా తిరగకపోతే ఎలా?

'ఎందుకు గురువుగారు ఇలాంటి పోస్టులు రాసి మీ పరువు మీరే తీసుకుంటారు? మీ ఇమేజి ఎంత దెబ్బతింటుంది? ఇలాంటి పోస్టులు రాస్తే మేమేమైపోవాలి? మేమేమో మీ గురించి గొప్పగా చెప్పుకుంటాము. మీరేమో ఇలాంటి పోస్టులు రాసి చులకనైపోతున్నారు' అని శిష్యులు మొత్తుకుంటున్నారు.

'బోడి ఇమేజి ఎవడిక్కావాలి? నేనేమీ రెలిజియస్ బిజినెస్ లో లేనుకదా ఇమేజి బిల్డప్ చేసుకోడానికి? ఉన్న ఇమేజిని కూలగొట్టుకోవడమే నా జీవితాశయం !' అని చెప్పాను.

ఇంకా కావాలంటే, 'మా గురువుగారికి కొంచం పిచ్చుంది. మాక్కూడా ఉంది. అసలు కొద్దోగొప్పో పిచ్చి లేకుంటే మా గ్రూపులోకి ఎవరూ రాలేరు. వచ్చినా ఎక్కువకాలం బ్రతికి బట్టకట్టలేరు, మీ కోరికలకు అనుగుణంగా మా గురువుగారు ఉండరు. ఆయన్ని నమ్మవద్దని ఆయనే చెబుతూ ఉంటారు. అదే ఆయన ముఖ్యమైన బోధ' అని చెప్పమని మా వాళ్ళకి జ్ఞానబోధ గావించా.

ఆ || జనులు కోరినట్లు జరియించ నాకేల?
వారు కోరినట్లు వగలు బోవ
చిలకలూరిపేట చిత్రాంగి కానురా
నాదు గోల నాది; నమ్మబోకు;

అనే నేనూ చెప్పేది.

ఇదిలా ఉంటే, గాంగెస్ మాతాజీ చచ్చిపోయిందిట. ఈ చావుకబుర్ని అక్కడి స్వామీజీయే చల్లగా చెప్పాడు. అయిదేళ్లక్రితం వచ్చినపుడే అనుకున్నా. ఆమె ధోరణి చూసి, 'ఈ సారి మెమొచ్చేసరికి నువ్వుండవులే తల్లీ' అని. అలాగే అయింది. చూద్దాం ఆమె ఆత్మ ఏమైనా కనిపిస్తుందేమో అక్కడ? బ్రతికున్నపుడు చేయలేకపోయినా, ఇప్పుడైనా కొంచం సాయం చేద్దాం ఆమెకి.

ఇదొక ఖర్మ ఎక్కడికి పోయినా ఈ ఆత్మల గోల తప్పేటట్టు లేదు ! మామూలు మనుషులైతే సర్లే అనుకోవచ్చు. స్వామీజీలు మాతాజీలు కూడా ఆత్మలౌతుంటే ఎలా ఇంక?

ఏంటో పిచ్చిగోల ! డబ్బులొచ్చే మార్గం చెప్పరా గురువా అంటే అది తప్ప ఏదేదో చెబుతూ ఉంటాడు. ఛీ వేస్ట్ గురువు ! అంతేలే ! వేస్ట్ అవుతున్న జీవితాలను అలా వేస్ట్ చేసుకోవద్దని మొత్తుకునేవాడు వేస్ట్ గురువు కాక ఇంకేమౌతాడు మరి?
read more " మూడవ అమెరికా యాత్ర - 29 (వేస్ట్ గురువు) "

2, అక్టోబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 28 (బాధ్యతలు - ఆశలు)

బాధ్యతగా ఫీలయ్యేవాడు

బాధలతో పోతాడు

అనుభవాలు కోరేవాడు

ఆశలతో పోతాడు


బాధ్యతలు ఎన్నటికీ తీరవు

ఆశలు ఎన్నటికీ ఆరవు

మనిషి ప్రయాణం ఆగదు 

అతని జీవనశైలి మారదు


మారాలని కోరుకుంటూ

మారలేకపోవడం

అలా ఉండాలనుకుంటూ

ఉండలేకపోవడం

ఇదేగా జీవితం !


అంతులేని ఈ చిక్కుముడికి

పరిష్కారమేంటని

ఎవరో నన్నడిగారు

వారితో ఇలా అన్నాను


చేతనైతే నడువు, లేదంటే కూచో

ఎలాగైనా గమ్యం చేరతావు 

కొంచెం ముందూ, కొంచెం వెనుకా

అంతే తేడా !


ఈ ప్రయాణం విచిత్రమైనది

సరిగా కూచోవడం చేతనైతే

నడిచేవాడికంటే, పరిగెత్తేవాడికంటే

నువ్వే ముందు చేరుకుంటావు


ముందు నడిస్తే వెనక్కొచ్చి

నడక నేర్పిస్తావు

వెనుక నడుస్తూ ఉంటే

నడుస్తూ ఉంటావు


నడవడమూ కష్టమే

కూచోవడమూ కష్టమే

మాట్లాడటమూ కష్టమే

మౌనంగా ఉండటమూ కష్టమే


బరువును మోస్తూనే

బరువనుకోకుండా ఉండాలి

ప్రయత్నాలు చేస్తూనే

ఫలితాల ఆశ లేకుండా ఉండాలి


బాధ్యతల బరువులను

దించుకున్నవాడెవడు?

ఆశల అగ్నులను

ఆర్పుకున్నవాడెవడు?


సత్యం ఇలా అంటున్నాడు


మాటలలోనే జీవితం ఆవిరైపోతుంది

ఆటలలోనే అవకాశం చేజారిపోతుంది

ఒడ్డెక్కినవాడెవడో చెప్పనా నేస్తం?

బాధ్యతలు, ఆశలు రెండూ లేనివాడే !

read more " మూడవ అమెరికా యాత్ర - 28 (బాధ్యతలు - ఆశలు) "

మూడవ అమెరికా యాత్ర - 27 (మా క్రొత్త పుస్తకం 'వేదాంత సారము' విడుదలైంది)

నా కలం నుండి వెలువడుతున్న 52 వ పుస్తకంగా అద్వైతవేదాంతమునకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిదైన 'వేదాంతసారము' నేడు వెలువడుతున్నది.

ఇది 15 వ శతాబ్దమునకు చెందిన శృంగేరీ శంకరాచార్యులైన సదానంద యోగేంద్ర సరస్వతీస్వామి వారి సంస్కృతమాతృకకు నా తెలుగువ్యాఖ్యానము. డెట్రాయిట్ (అమెరికా) నుండి ఈ గ్రంధమును విడుదల చేస్తున్నాను.

అమెరికా వెళ్లి ఏం చేస్తున్నారని నా శిష్యులు కొంతమంది అడుగుతున్నారు. ఇదుగో ఇదే చేస్తున్నాను. భోగభూమిలో ఉంటూ వేదాంతం వ్రాస్తున్నాను. అర్హులకు యోగాన్ని నేర్పిస్తున్నాను.

వేదాంతమంటే సాధారణంగా అద్వైతవేదాంతమనే భావన లోకంలో వాడుకలో ఉంది. ద్వైతము, విశిష్టాద్వైతములు కూడా వేదాంతములే. అయినప్పటికీ, 'వేదాంతము' అంటే అద్వైతమనే భావన లోకంలో స్థిరపడి పోయింది. దానికి కారణం అది తాత్విక చింతనలలో అన్నింటిలోకీ అత్యున్నతమైన శిఖరం కావడమే కావచ్చు.

అద్వైతవేదాంతమును వివరిస్తూ వ్రాయబడిన గ్రంధములు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీ సదానంద యోగేంద్ర సరస్వతీస్వామి వ్రాసిన 'వేదాంతసారమ'నే ఈ గ్రంధమునకు పండితలోకంలో చాలా విలువ ఉన్నది. అద్వైతవేదాంతమును అధ్యయనం చేయాలనుకునే వారికి ఇదొక టెక్స్ట్ బుక్ వంటిది. అందుకే దీనిని ప్రకరణ గ్రంధాలలో ఒకటిగా భావిస్తారు.

శ్రీసదానంద యోగేంద్ర సరస్వతీస్వామి, శృంగేరీ సాంప్రదాయమునకు చెందిన అద్వైతాచార్యుడు. 15 వ శతాబ్దంలో ఈయన నివసించిట్లు ఆధారాలున్నాయి. ఈయన 'వేదాంత సిద్ధాంత సారసంగ్రహము', 'బ్రహ్మసూత్ర తాత్పర్య ప్రకాశము'లనే ఇతర గ్రంధాలను రచించినట్లుగా తెలుస్తున్నది. భగవద్గీతపైన ఈయన వ్రాసిన వ్యాఖ్యానము 'భావప్రకాశమ'నే పేరుతో ప్రసిద్ధి కెక్కింది. ఈయన తండ్రిగారు అనంతదేవుడని, గురువుగారు అద్వయానంద సరస్వతీస్వామి యని తెలుస్తున్నది.

వీరి రచనలలో ఆదిశంకరుల వారిని, సురేశ్వరాచార్యులవారిని, విద్యారణ్యస్వామివారిని భక్తితో స్మరిస్తూ, వారి గ్రంథముల నుండి శ్లోకములను ఉటంకిస్తూ తమ రచనను సాగించారు. చాలా చిక్కని అద్వైతమును సూటిభాషలో వివరించారు.

ప్రస్తుత గ్రంధములో, అద్వైత వేదాంతాధ్యయనమునకు అధికారి ఎవరు?, అతనికి ఉండవలసిన లక్షణములేమిటి?, ఈ శాస్త్రము యొక్క ప్రయోజనమేమిటి? దీనిచేత పొందబడే సిద్ధి ఎలా ఉంటుంది? అనే విషయములతో మొదలుపెట్టి, వ్యష్టి, సమష్టి, పంచకోశములు, అజ్ఞానము, జ్ఞానము, జీవుడు, మాయ, ఈశ్వరుడు, మహావాక్యముల వివరణ, బ్రహ్మానుభవము, దానికి చేయవలసిన సాధనామార్గము, దానిలోని మెట్లు, జీవన్ముక్తుని స్థితి, అతని జీవనవిధానము, విదేహముక్తి మొదలైన వివరములు చాలా చక్కని  ప్రణాళిక ప్రకారం వరుసగా వివరింపబడినాయి.

ఈ గ్రంధము మధ్యలో మహావాక్యముల వివరణాభాగంలో వివరింపబడిన తర్కభాగం చాలా జటిలమైనది. దానిని అర్ధం చేసుకోవాలంటే అతి తీక్షణమైన బుద్ధికుశలత ఉండాలి. లేదంటే గందరగోళంగా అనిపిస్తుంది. అర్ధం కాదు. ఔత్సాహికులు ప్రయత్నించి చూడండి.

నాకు దాదాపుగా ఇరవై ఏళ్ల వయసులో ఈ గ్రంధమును నేను మొదటిసారిగా చదవడం జరిగింది. అద్వైతవేదాంతము పైన నాకు బాగా నచ్చిన ప్రాచీన గ్రంధములలో ఇది ఒకటి. ఇన్నేళ్లకు ఈ గ్రంధానికి నాదైన వ్యాఖ్యానమును వ్రాయడం సాధ్యపడింది.

ఈ గ్రంధమును వ్రాయడంలో నాకు ఎంతో సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, ప్రూఫ్ రీడింగ్, టైప్ సెట్టింగ్, బుక్ ఫార్మాటింగ్ పనులు చేసిన అఖిల, కవర్ పేజీని డిజైన్ చేసిన ప్రవీణ్, పబ్లిషింగ్ పనులు చూచుకున్న శ్రీనివాస్ చావలిలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు.

ఈ నా వ్యాఖ్యానము, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు నచ్చుతుందని, వారికి ఆనందాన్ని కలిగిస్తుందని, అద్వైతవేదాంతమును అర్ధం చేసుకోవడంలో వారికి ఇతోధికంగా సహాయపడుతుందని నమ్ముతున్నాను.

ఈ గ్రంధం కూడా ప్రస్తుతానికి ఈ బుక్ గా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. సాధన చేయలేకపోతే మానె, కనీసం అద్వైతాన్ని అర్ధం చేసుకోండి. భారతీయ తాత్విక చింతనా శిఖరాలు ఎలా ఉంటాయో  కనీసం గ్రహించండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 27 (మా క్రొత్త పుస్తకం 'వేదాంత సారము' విడుదలైంది) "

1, అక్టోబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 26 (పాపం బాబాజీ)

నాకు బాబాజీని చూస్తే చాలా జాలేస్తోంది.

అందరి బిజినెస్ కూ ఒక మార్కెటింగ్ టూల్ అయిపోయాడు పాపం !

ప్రతివాడూ బాబాజీని చూశామంటారు.

కొంతమంది చిన్నప్పుడే చూశామంటారు, కొంతమంది ఈ మధ్యనే చూచామంటారు. మరికొందరు ఇంకొక్క అడుగు ముందుకేసి, ఎప్పుడూ చూస్తూనే ఉన్నామంటున్నారు.

ఇక్కడ అమెరికాలో కూడా, బాబాజీని చూశామని చెప్పి మంచి బిజినెస్ చేసుకుంటున్న అమెరికన్స్ చాలా మంది ఉన్నారు.

యోగానందగారేమో అమెరికా ఆర్టిస్ట్ చేత బొమ్మ గీయిస్తే అది అమెరికా వాడిలాగా వచ్చింది. 'ఛీ ఆయనలా ఉండడు, పక్కా ఇండియా వాడిలాగా ఉంటాడు, ఇదుగో ఇలా ఉంటాడు' అంటూ ఇండియావాళ్లు మళ్ళీ ఇంకో బొమ్మ గీసుకున్నారు.

యోగులు చూశామంటారు. స్వాములు చూశామంటారు. యూ ట్యూబర్లు చూశామంటారు. చివరికి అతిచేష్టలు చేసే రజనీకాంత్ కూడా చూశానని సినిమానే తీసేసి చేతులు కాల్చుకున్నాడు పాపం !

ఇంతా చేస్తే, అందరూ నమ్మే ఆ బాబాజీ ఆసలున్నాడో లేక కల్పితమో ఎవరికీ తెలీదు.

పాపం బాబాజీని చూస్తే జాలేస్తోంది.

ఎంతమందికి బిజినెస్ మెటీరియల్ అయ్యాడో ఆయన !

జాలెయ్యదూ మరి !

దేన్నైనా వ్యాపారంగా మార్చడం మనుషులకిష్టం.

దేన్నైనా రోడ్డుమీద నిలబెట్టి అమ్మెయ్యడం వారికి మహా ఇష్టం !

బాబాజీ కూడా దీనికి కాదు అతీతం !

ఏమంటారు?

read more " మూడవ అమెరికా యాత్ర - 26 (పాపం బాబాజీ) "