“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 29 (వేస్ట్ గురువు)

నవరాత్రులు అయిపోయాయి. డెట్రాయిట్లో చలికాలం వచ్చేసింది.

అటుమొన్న 22 డిగ్రీ నుండి మొన్న 12 డిగ్రీలకు, ఇవాళ 6 డిగ్రీలకు పడిపోయింది. రోజుకు పది డిగ్రీలు పడిపోతోంది ఉష్ణోగ్రత ఇక్కడ.

'ఇదేంటి బాబోయ్ ఇలా పెరిగిపోతోంది చలి?' అంటే, 'అప్పుడే ఏమైంది? ఇంకో నెలాగు. మైనస్ లోకి వెళ్లి మంచు కురుస్తుంది. అప్పుడుంటుంది అసలైన భజన' అంటున్నారు శిష్యులు.

మొన్న స్టోర్స్ కెళ్ళి జాకెట్లు కొనుక్కుందామని వాళ్లు ప్లాన్ చేశారు.

'ఛీ నేను జాకెట్టేంటి? చిన్నప్పుడెప్పుడో డ్రామాలో ఆడవేషం వేసినప్పుడు తొడిగా. ఇప్పుడొద్దు, బాగుండదు' అన్నా సీరియస్ గా.

'ఆ జాకెట్టు కాదు. ఎక్కువగా నటించకు. చిన్నప్పుడే కాదు. ఆఫీసర్ గా ఉన్నపుడు కూడా డ్రామాలో ఆడవేషం వేశావని మాకు తెలుసులే' అని అంతకంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చిందొక శిష్యురాలు. మా దగ్గరింతే. నా శిష్యులే నాకు వార్నింగులిస్తుంటారు.

'ఏం చేస్తాం అలవిగానిచోట అధికులమనరాదు' అన్న సుమతీ శతకం గుర్తుతెచ్చుకుని నోర్మూసుకున్నా. 'సుమతి కాదు నేను' అంటూ గుర్రుగా చూస్తున్నాడు వేమన్న.

ఈ చలిని చూస్తుంటే చిన్నప్పుడు తొమ్మిదో తరగతిలో, అంటే 1976 లో చదువుకున్న పద్యం గుర్తొచ్చింది. ఈ పద్యం పోయినసారి అమెరికా వచ్చినపుడు కూడా గుర్తొచ్చింది. అప్పుడు భలే పద్యాలు రాశి పడేశా. అదేంటో గాని, 'నిన్న ఏం తిన్నావు?' అంటే గుర్తుండదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చదివిన పద్యాలు గుర్తుంటాయి. ఇదేదైనా రోగమేమో? ఎవరైనా మంచి హోమియోపతి వైద్యుడిని కలవాలి.

కం|| అహములు సన్నములయ్యెను
దహనము హితమయ్యె దీర్ఘ దశలయ్యె నిశల్
బహుశీతోపేతంబయి
ఉఁహుహూ యని వడకె లోకముర్వీనాథా !

ఈ సారి కూడా కొన్ని పద్యాలు రాద్దామనుకున్నా. వెంటనే దూకాయి.

కం || జాకెట్టులు కొనగబోవ
పాకెట్టులు వెక్కిరించె పాదములలసెన్
చీకొట్టుట తప్పదింక
టీకొట్టే లేదు ఎంత తిరిగిన గానిన్

గ్రేట్ లేక్స్ మాల్ అన్నచోటకు తీసికెళ్లారు నన్ను. అందులోని షాపులన్నీ తిరగాలంటే రెండ్రోజులు పట్టేలా ఉంది. అదొక లోకం ! రెండుషాపులు తిరిగేసరికి మతిపోయింది, నీరసమొచ్చింది. మనకేమో షాపులు తిరగాలంటే మహాచిరాకు. మనదంతా టార్గెటెడ్ షాపింగ్. ఒకటో రెండో షాపులు చూడటం, మనక్కావలసింది కొనేసుకోవడం. వచ్చెయ్యడం. అంతే.

ఇక్కడేమో ఎక్కడ చూసినా డ్రస్సులు, షూస్, సెంట్లు, ఫర్నిచర్, ఫుడ్ కోర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. పిచ్చిపుట్టేలా ఉన్నాయి. ఇండియాలో చూసీ చూసీ ఇక్కడకొస్తే ఇక్కడకూడా అదే గోల ! ఇంకా పెద్ద ఎత్తున ఉందిక్కడ. ఆమ్మో భయమేసింది. కన్స్యూమరిజం అంతా ఇక్కడే ఉన్నట్టుంది.

తిందామని ఫుడ్ కోర్ట్ కొస్తే, అంతా చికెన్, మీట్ మయం. వెజ్ ఐటమే లేదు. చివరకు సలాడ్ గడ్డి, గార్లిక్ బ్రెడ్ ముక్కతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీ త్రాగుదామంటే ఒక్క టీకొట్టు కూడా లేదు. ఛీ ! మన ఇండియాలో అయితే, అడుక్కి నూరు టీ అంగళ్లుంటాయి. ఎంత స్వర్గమో అది !

ఎంతసేపూ కందాలేనా, ఆటవెలదీ రామ్మా కొంచెం !

ఆ || ఎండ పేలగొట్టు ఎంతెంతొ కాంతిగా
చలికి పిచ్చి బుట్టు ఝల్లుమనుచు
ఏమి వెదరు బాబు? ఎన్నాళ్ళు ఈ లాగు?
జాకెటేయుమయ్య జాణవోలె !

ఆ || గ్రేటు లేక్సు మాలు రేట్లేమొ బెంబేలు
కాకిలెక్క దిరుగఁ కాళ్ళుబోయె
చికెను మీటు దప్ప సిద్ధాన్నమే లేదు
టీ కి దిక్కులేదు తిరిగి జూడ

'అదేంటి గురూజీ టీ మానేశానన్నారుగా' అని ఒకామె అడిగింది. నవ్వాను.

ఆ || ఇండియాల జెప్పు ఇచ్చకాలన్నియున్
ఫ్లయిటు ఎక్కువరకె పనికి వచ్చు
అమెరికాల కాలు అడ్డంబుగా బెట్ట
మాట మనసు రెండు మారిపోవు

ఆ || ఛాయి దాగుమన్న చక్కనౌ మాటేది?
బారు బీరు అనిన భాష దప్ప
ఆకులలములన్ని అడ్డంబుగా మెక్కి
ఇంటి దారి బడితి ఇస్సురనుచు

రెండ్రోజుల్లో గాంగెస్ రిట్రీట్ ఉంది. లేక్ మిషిగన్ ఒడ్డున. చలి మరీ వణికిస్తుందిట. అందుకని బందోబస్తుగా రమ్మన్నారు. అక్కడ ఉత్త టవల్ కట్టుకుని ఆరుబయట తిరగాలనుంది. తీరుతుందో లేదో? హిమాలయాల్లో మా అన్నలు గోచీతో తిరుగుతారు. నేను కనీసం టవల్తో అయినా తిరగకపోతే ఎలా?

'ఎందుకు గురువుగారు ఇలాంటి పోస్టులు రాసి మీ పరువు మీరే తీసుకుంటారు? మీ ఇమేజి ఎంత దెబ్బతింటుంది? ఇలాంటి పోస్టులు రాస్తే మేమేమైపోవాలి? మేమేమో మీ గురించి గొప్పగా చెప్పుకుంటాము. మీరేమో ఇలాంటి పోస్టులు రాసి చులకనైపోతున్నారు' అని శిష్యులు మొత్తుకుంటున్నారు.

'బోడి ఇమేజి ఎవడిక్కావాలి? నేనేమీ రెలిజియస్ బిజినెస్ లో లేనుకదా ఇమేజి బిల్డప్ చేసుకోడానికి? ఉన్న ఇమేజిని కూలగొట్టుకోవడమే నా జీవితాశయం !' అని చెప్పాను.

ఇంకా కావాలంటే, 'మా గురువుగారికి కొంచం పిచ్చుంది. మాక్కూడా ఉంది. అసలు కొద్దోగొప్పో పిచ్చి లేకుంటే మా గ్రూపులోకి ఎవరూ రాలేరు. వచ్చినా ఎక్కువకాలం బ్రతికి బట్టకట్టలేరు, మీ కోరికలకు అనుగుణంగా మా గురువుగారు ఉండరు. ఆయన్ని నమ్మవద్దని ఆయనే చెబుతూ ఉంటారు. అదే ఆయన ముఖ్యమైన బోధ' అని చెప్పమని మా వాళ్ళకి జ్ఞానబోధ గావించా.

ఆ || జనులు కోరినట్లు జరియించ నాకేల?
వారు కోరినట్లు వగలు బోవ
చిలకలూరిపేట చిత్రాంగి కానురా
నాదు గోల నాది; నమ్మబోకు;

అనే నేనూ చెప్పేది.

ఇదిలా ఉంటే, గాంగెస్ మాతాజీ చచ్చిపోయిందిట. ఈ చావుకబుర్ని అక్కడి స్వామీజీయే చల్లగా చెప్పాడు. అయిదేళ్లక్రితం వచ్చినపుడే అనుకున్నా. ఆమె ధోరణి చూసి, 'ఈ సారి మెమొచ్చేసరికి నువ్వుండవులే తల్లీ' అని. అలాగే అయింది. చూద్దాం ఆమె ఆత్మ ఏమైనా కనిపిస్తుందేమో అక్కడ? బ్రతికున్నపుడు చేయలేకపోయినా, ఇప్పుడైనా కొంచం సాయం చేద్దాం ఆమెకి.

ఇదొక ఖర్మ ఎక్కడికి పోయినా ఈ ఆత్మల గోల తప్పేటట్టు లేదు ! మామూలు మనుషులైతే సర్లే అనుకోవచ్చు. స్వామీజీలు మాతాజీలు కూడా ఆత్మలౌతుంటే ఎలా ఇంక?

ఏంటో పిచ్చిగోల ! డబ్బులొచ్చే మార్గం చెప్పరా గురువా అంటే అది తప్ప ఏదేదో చెబుతూ ఉంటాడు. ఛీ వేస్ట్ గురువు ! అంతేలే ! వేస్ట్ అవుతున్న జీవితాలను అలా వేస్ట్ చేసుకోవద్దని మొత్తుకునేవాడు వేస్ట్ గురువు కాక ఇంకేమౌతాడు మరి?